Telugu Special Stories

ఒలంపిక్ చరిత్రలో తొలి పతకాన్ని అందుకున్న తొలి భారతీయ మహిళ: కరణం మల్లీశ్వరి

కరణం మల్లీశ్వరి… భారత క్రీడా రంగంలో పరిచయం అక్కర్లేని పేరు. ఒలంపిక్ చరిత్రలో మన దేశానికి పతకం అందించిన తొలి క్రీడాకారిణి ఈమె. వెయిట్ లిఫ్టింగ్‌లో ఆమె అధిరోహించని శిఖరాలు లేవు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలను తన ఖాతాలో వేసుకుంది. ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టి, అంతర్జాతీయ క్రీడా వేదికలపై సత్తా చాటిన ఈ క్రీడాదిగ్గజం పుట్టిన(జూన్ 1న)రోజు. ఈ సందర్బంగా ఆమె జీవిత, క్రీడా విశేషాలను ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం:

బాల్యం

1975 జూన్ 1న, చిత్తూరు జిల్లాలోని ఆమదాలవలసలోని వూసవానిపేటలో శ్రీమనోహర్, శ్యామల దంపతులకు జన్మించింది కరణం మల్లీశ్వరి. తండ్రి ఆర్ పిఎఫ్ లో కానిస్టేబుల్. నర్సమ్మ, మాధవి, కృష్ణకుమారిలు అక్కాచెల్లెళ్ళు కాగా రవీంద్ర కుమార్ అనే సోదరుడున్నాడు. నలుగురు అమ్మాయిల్లో ముగ్గురు ఇదే రంగాన్ని ఎంచుకోవడం విశేషం. పనెండేళ్లప్పుడే వెయిట్ లిఫ్టింగ్‌పై ఎక్కువ మక్కువ పెంచుకున్న మల్లీశ్వరి, తన సోదరి అయిన నరసమ్మ కూడా అప్పటికే వెయిట్ లిఫ్టింగ్‌లో ఉండటమే కాదు..

పతకాలు సాధించడంతో ఆమెను స్ఫూర్తిగా తీసుకుంది. వెయిట్ లిఫ్టింగ్‌పై మల్లీశ్వరి ఆసక్తిని గమనించిన కోచ్ నీలంశెట్టి అప్పన్న, తనకూ శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. తర్వాత అదనపు శిక్షణ పొందేందుకనీ ఢిల్లీలోని తన అక్క దగ్గరకు వెళ్ళింది. అక్కడే స్పోర్ట్స్ అథారిటీ వారి ఇండియా దృష్టిలో పడింది. 1990లో శాయ్ ఆధ్వర్యంలో జాతీయ క్యాంపులో పాల్గొని, ఆ తర్వాత పూర్తిస్థాయి శిక్షణ తీసుకోవడంతో అంతర్జాతీయ స్థాయి పోటీలవరకు చేరుకుంది. తొలుత 54 కేజీల విభాగంలో పాల్గొన్న మల్లీశ్వరి, 1994, 95ల్లో ప్రపంచ ఛాంపియన్ షిప్ ను సైతం కైవసం చేసుకుంది.

ఒలంపిక్ లో తొలి పతకం 

అది 2000 సంవత్సరం.. ఆ యేడు ఒలింపిక్స్ లోనే తొలిసారి మహిళలకు వెయిట్ లిఫ్టింగ్‌ను ప్రవేశపెట్టడం జరిగింది. అంతకుముందు వరకు కూడా మల్లీశ్వరి అంతర్జాతీయ స్థాయిలో 54 కిలోల కేటగిరీలో పాల్గొని పతకాలు సాధించింది. ఆ తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో స్వర్ణం కూడా ఇదే కేటగిరీలో వచ్చింది. కానీ సిడ్నీ వేదికగా ఒలింపిక్స్‌లో మాత్రం 69 కేజీల విభాగంలో పోటీ పడాల్సి వచ్చింది. ఈ కేటగిరీలో ఆమెకు ఇదే తొలి అంతర్జాతీయ ఈవెంట్. స్నాచ్‌లో మూడో ప్రయత్నంలో 110 కేజీలు స్కోర్ చేసింది. క్లీన్ అండ్ జర్క్‌లో తొలి రెండు ప్రయత్నాల్లో 125, 130 కిలోలు ఎత్తగలిగింది. మూడో ప్రయత్నంలో, 132.5 కిలోలు ఎత్తగలిగితే స్వర్ణం లభించేది. కానీ కోచ్‌లు లెక్కల్లో చేసిన చిన్న పొరపాటు వల్ల స్వర్ణం కోల్పోయింది.

నిజానికి మూడో ప్రయత్నంలో 137.5 కిలోల బరువు ఎత్తే విధంగా లక్ష్యం పెట్టుకుందట మల్లీశ్వరి. కానీ సాధించలేకపోయింది. మొత్తంగా 110, 130 కలిపి 240 కేజీలతో కాంస్య పతకాన్ని గెలిచింది. స్వర్ణం రాకపోతేనేం, ఒలంపిక్ లో భారత్ తరపున తొలి పతకం అందుకున్న తొలి మహిళగా గొప్ప  రికార్డులకెక్కింది. దీంతో ఒలింపిక్స్‌లో స్వర్ణం కోల్పోయినా, ఏథెన్స్ లో స్వర్ణం సాధించడమే లక్ష్యంగా, శారీరకంగా బరువు తగ్గింది. వెయిట్ కేటగిరీ 69 కేజీలనుంచి 63 కేజీలకు మారింది. ఎంత సాధన చేసినప్పటికీ, స్నాచ్‌లో మొదటి ప్రయత్నంలో బరువు ఎత్తే సమయంలోనే ఆమెకు వెన్నుపూస పట్టేసింది. దాంతో పోటీనుంచి ఒక్కసారిగా తప్పుకోవాల్సి వచ్చింది. నిజానికి ఈ వెన్ను గాయం ఆమెను గతం నుంచి బాధిస్తోంది.  చికిత్స తీసుకుంటూనే ప్రాక్టీస్ చేసింది. ఆ తర్వాత మళ్లీ లిఫ్టింగ్ చేస్తే మరిన్ని అనారోగ్య సమస్యలు రావచ్చని డాక్టర్లు హెచ్చరించడంతో ఆమె ఆటకు ముగింపు పలికింది. ఏథెన్స్ తర్వాత ఏ పోటీల్లోనూ పాల్గొనలేదు. 

వివాహం

కర్ణం మల్లీశ్వరి తన సహచర వెయిట్ లిఫ్టర్ రాజేష్ త్యాగిని 1997లో వివాహం చేసుకుంది.

అతను వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి. వీరికి ఇద్దరు కొడుకులు.

పెద్ద అబ్బాయి శరద్ త్యాగి, ఎయిర్ రైఫిల్ విభాగంలో శిక్షణ తీసుకుంటుండగా, రెండో అబ్బాయి అంగద్ త్యాగి.

గుర్తింపు

*1993 మెల్‌బోర్న్ లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 54 కిలోల విభాగంలో కాంస్యం,

*1994 ఇస్తాంబుల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 54 కిలోల విభాగంలో స్వర్ణం,

*1994 హిరోషిమాలో జరిగిన ఆసియా క్రీడలలో 54 కిలోల విభాగంలో రజతం,

*1995 గ్వాంగ్‌జౌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 54 కిలోల విభాగంలో స్వర్ణం,

*1996 గ్వాంగ్‌జౌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 54 కిలోల విభాగంలో కాంస్యం,

*1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో 63 కిలోల విభాగంలో రజతం,

*1992-98 వరకు జాతీయ ఛాంపియన్ షిప్ కొనసాగిస్తూనే,

*2000 సిడ్నీలో ఒలింపిక్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్‌లో 69 కిలోల విభాగంలో కాంస్యం,

ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యే సమయానికి, మొత్తంగా 29 అంతర్జాతీయ పతకాలను గెలుచుకుంది. వాటిలో 11 స్వర్ణాలున్నాయి.

*2002లో కామన్ వెల్త్ గేమ్స్ ద్వారా మళ్లీ వెయిట్ లిఫ్టింగ్ బరిలోకి దిగాలనుకుని, మళ్ళీ ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. ఆ తర్వాత ఆమె స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకున్నారు. రిటైర్మెంట్ తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌కు సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొంది. సాయ్‌లో గౌరవ హోదాలో అనేక బాధ్యతలు నిర్వహించింది. అర్జున అవార్డులు వంటి తదితర కమిటీల్లో భాగస్వామిగానూ కొనసాగింది. నేరుగా కోచ్‌గా ఎప్పుడూ పూర్తిస్థాయిలో వ్యవహరించలేదు. ప్రస్తుతం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగినిగా తన విధులు నిర్వహిస్తూ, ఘజియాబాద్‌లో తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది మల్లీశ్వరి. అయితే, తాను పుట్టి, పెరిగిన శ్రీకాకుళం జిల్లాలో అకాడమీ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేసింది. 

అవార్డులు

*1994-95లో అర్జున అవార్డు,

*1995-96లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు,

*1999లో పద్మశ్రీ అందుకున్నారు.

ఇతరాంశాలు

*2002లో తండ్రి మరణించడంతో, కామన్ వెల్త్ పోటీ నుంచి తప్పుకుంది.  

*మెల్‌బోర్న్, ఇస్తాంబుల్‌ ‌చైనా, హిరోషిమా, బ్యాంకాక్‌, ‌సిడ్నీలలో… ఆసియా, ప్రపంచ, ఒలింపిక్‌ ‌స్థాయి పోటీల్లో పాల్గొంది.

*దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి మల్లీశ్వరిని ‘భరతమాత ముద్దు బిడ్డ(భారత్ కి భేటీ)’ అని కొనియాడారు.

*కరణం మల్లీశ్వరి జీవిత కథ ఆధారంగా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ బయోపిక్ రానుంది. 

Show More
Back to top button