పుణ్యభూమి భారత్‌కు పరాయి పాలన నుంచి విముక్తి లభించడం మాత్రమే కాకుండా స్వేచ్ఛా భారతం నిండా పరిశుభ్రతతో, సమ్మిళిత సమగ్రాభివృద్ధి చెందిన దేశంగా కూడా మార్చాలని మహాత్మాగాంధీ కలలు కన్నారు. “స్వాతంత్ర్యం కన్న పారిశుద్ధ్యమే మిన్న” అని గాంధీ ఉద్భోదించారు. పరిశుభ్రతే సరైన దైవభక్తి అని గట్టిగా నమ్మారు. పరిశుభ్రతే ఆరోగ్యమని, ఆరోగ్యమే మహాభాగ్యమని మనకు తెలిపారు. స్వాతంత్ర్యం సిద్ధించిందని, మన దేశ పరిశుభ్రత, పచ్చదనం కూడా సత్వరమే సిధించాలని దేశ ప్రజలను కోరారు.
స్వచ్ఛత వైపు మరో అడుగు:
మహాత్ముని కలలను సాకారం చేయడానికి, స్వచ్ఛత వైపు మరో అడుగు వేయడానికి కేంద్ర గ్రామీణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖలు 2014లో ‘స్వచ్ఛ భారత్ అభియాన్ లేదా స్వచ్ఛ భారత్ మిషన్ (క్లీన్ ఇండియా మిషన్)’ అనబడే ప్రతిష్టాత్మకమైన జాతీయ పథకాన్ని తీసుకువచ్చారు. స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా 2014-2019 పంచవర్ష కాలంలో 62,009 కోట్ల నిధులతో 4041 పట్టణాల వీధులు, రోడ్ల శుభ్రతతో పాటు పలు మౌళిక వసతులను కల్పించ తలపెట్టారు. 02 అక్టోబర్ 2014న 145వ గాంధీ జయంతి రోజున ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన కార్యక్రమంలో చీపురు పట్టి రోడ్డును ఊడ్చి దేశ స్వచ్ఛతకు శంఖారావం పూరించారు. స్వచ్ఛ భారత్ అభియాన్‌లో పరిసరాల పరిశుభ్రత, ప్లాక్టిక్ వాడకాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని కట్టడి చేసే ప్రయత్నాలు చేయడం జరిగింది.
మౌళిక వసతుల కల్పన:
స్వచ్ఛ భారత్ పథకం ద్వారా వ్యక్తిగత, వీధి, సామాజిక టాయిలెట్లు నిర్మించ తలపెట్టారు. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జనతో ప్రజారోగ్యం ప్రభావితం కావడం ద్వారా రోగాలు, చివరకు పిల్లల మరణాలు కూడా కలుగవచ్చు. ల్యాట్రిన్‌ల నిర్మాణమే కాకుండా వాటి పర్యవేక్షణ కూడా తీసుకోవడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు 5 ఏండ్లలో భారత్‌ను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత (ఓపెన్ డిఫెకేషన్-ఫ్రీ, ఓడియఫ్) దేశంగా మార్చాలని భావించి 2019లో సఫలీకృతం అయ్యారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పట్ల దేశవాసులకు పూర్తి అవగాహన కల్పించడానికి పథక రచన చేశారు.
ప్రతి ఒక్కరు ఏడాదికి 100 గంటలు స్వచ్ఛ భారత సిద్ధికి సమయం వెచ్చించాలని కోరారు. గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను నియంత్రించుటతో గ్రామీణ భారతం స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంటుందని అంచనా వేశారు. 2019 వరకు అన్ని గ్రామీణ కుటుంబాలకు సురక్షిత నీరు, టాయిలెట్స్ వసతులు, అన్ని పాఠశాలలు/అంగన్‌వాడీలకు టాయిలెట్స్ వసతులు కల్పించనా పథక రచన చేశారు. పట్టణ స్వచ్ఛ భారత్ మిషన్ పథకంలో భాగంగా 1.04 లక్ష గృహాలు, 2.5 లక్షల కమ్యునిటీలకు టాయిలెట్లు, 2.6 లక్షల పబ్లిక్ టాయిలెట్లు, ఘన వ్యర్థాల నిర్వహణలు సిటీల్లో చేపట్టారు. బహిరంగ మలమూత్ర విలర్జనను నివారించడం, సాధారణ లాయిలెట్లను ఫ్లష్ టాయిలెట్లుగా మార్చడం, అమానవీయ స్కావెంజర్ వ్యవస్థను రద్దు చేయడం లాంటి లక్ష్యాలను చేరేందుకు కృషి చేస్తున్నారు.
స్వచ్ఛ భారత్ సాఫల్యతలు:
2014-19 మధ్య అమలు చేయబడిన స్వచ్ఛ భారత్ ఫలితంగా పిల్లల డయేరియా సమస్యలు తగ్గాయి. స్వచ్ఛ భారత్ అమలైన 4,372 పట్టణాల్లో 4,340 నగరాలు (99 శాతం) ఓడియఫ్‌గా ప్రకటించబడ్డాయి. ఈ పథకం ద్వారా 66.72 లక్షల పబ్లిక్/కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించబడ్డాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ద్వారా దేశంలో అత్యుత్తమ క్లీన్ సిటీలను ఎంపిక చేశారు. స్వచ్ఛ భారత్ అమలుతో 10 కోట్ల కుటుంబాలకు టాయిలెట్స్ నిర్మాణం, 6 లక్షల గ్రామాలను ఓడియఫ్‌గా మార్చారు. 02 అక్టోబర్ 2014న 38.7 శాతం గృహాలకు టాయిలెట్స్ ఉండగా, 02 అక్టోబర్ 2019 నాటికి 100 శాతం టాయిలెట్ వసతులు కల్పించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ఫేజ్-1 పథకాన్ని 2014 నుంచి 2019 వరకు నిర్వహించారు. 2020-21 నుంచి 2024-25 వరకు ఫేజ్-2 తీసుకున్నారు.
స్వచ్ఛ భారతమే సురక్ష భారతి, ఆయురారోగ్య ప్రదాయిని అని ప్రస్తుతించాల్సిందే. సువిశాల భారతంలో నెలకొన్న జనాభా విస్పొటనం, నిరుద్యోగ పర్వం, నిరక్షరాస్యత నెలవులుగా మారడంతో స్వచ్ఛ భారత సాధన కష్టమే అని తెలుస్తున్నది. పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుద్ధత లాంటివి ప్రజా అవగాహనతోనే పరిపూర్ణం అవుతాయని తెలుసుకుందాం. మన ఆరోగ్యం కోసం మనమే నడుం బిగిద్దాం, పరిశుభ్ర ఆరోగ్య భారత స్వప్నాలను సాకారం చేసుకుందాం.