Telugu Special Stories

ఉపవాసాలకుఅనువైన మాసం.కార్తీకం.!

తెలుగు మాసాల్లో కార్తీకమాసం అన్ని మాసాలలోకెల్లా ప్రత్యేకమైనది. త్రిమూర్తులంతటి వారి మెప్పు పొందిన ఈ గొప్ప మాసంలో ఎటువంటి పనులు చేస్తే మేలు జరుగుతుంది, ఈ మాసం విశిష్టతల గురుంచి మనం తెలుసుకుందాం…

మన హిందూ సనాతనధర్మంలో కార్తీకమాసంలో విధిగా పాటించే తులసిపూజకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజూ తులసిపూజ చేయడం, తులసి చెట్టు ముందు దీపం వెలిగించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందట. 

పూర్వం ఈ మాసంలో గంగా, యమునా వంటి పుణ్యనదుల్లో స్నానం తప్పక ఆచరించేవారట. ఇలా నదీస్నానం చేయడం వల్ల శారీరక రుగ్మతల నుంచి ఉపశమనం పొందడమే కాక, ఇంటిల్లిపాదికి శుభం కలుగుతుందని పెద్దలు చెబుతారు. ఒకవేళ  గంగాస్నానానికి వెళ్లలేకపోతే, స్నానం చేసే నీటిలో గంగాజలం కలిపి, ఇంట్లోనే నదీస్నానం చేయవచ్చు.

ప్రతి శుక్రవారం అష్టలక్ష్మిని పూజించడం వల్ల

అపారమైన సంపద, సంతానం కలుగుతాయట. 

కార్తీకమాసంలో గంగా లేదా ఇతర పవిత్ర నదుల్లో సాయంత్రం దీపాలను వదలడం చాలా పవిత్రం. 

సంతోషం, సౌభాగ్యం, కీర్తి కోసం కార్తీకమాసంలో అన్నదానంతో పాటు పాలు, పండ్లు, నువ్వులు, జామకాయలు వంటివి దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఈ మాసంలో బ్రాహ్మణులకు, అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్లకు బట్టలు పెట్టడం, కానుకలు ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. 

ఇలా ఈ మాసమంతా.. దీపదానాలు, కార్తీక స్నానాలు, ఉపవాసాలతో నిత్యం దేవాలయాలను సందర్శించడం, ఇంటిల్లిపాది దైవారాధనలో పాల్గొనడం వల్ల ఇంట్లో శాంతి, ప్రశాంతత చేకూరతాయి. 

ఇకపోతే ఈ మాసంలోని ప్రతి సోమవారంనాడూ పాటించే ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సోమవారం అంటే శివయ్యను ఆరాధిస్తాం. అలాంటిది ఆయనకు ఎంతో ఇష్టమైన ఈ కార్తీకమాసంలో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠలతో.. ఉపవాసం ఆచరించడం వల్ల మనసంతా శివోహం చెంది, తనువు సైతం ఆరోగ్యంగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. 

కార్తీకమాసం ముగిసేవరకూ ప్రతిరోజూ సాయంత్రం వేళ దీపాలు వెలిగించి, సంరంభం చేస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ నెల అంతా కార్తీక మహా పురాణాన్ని పారాయణం చేస్తారు. దేవాలయాల్లో కార్తీక పురాణ శ్రవణం ఏర్పాటు చేస్తారు.

మహాభారత కథానుసారం.. కుమార కార్తికేయ ఈ మాసంలో తారకాసురుడిని సంహరించినట్లు చెబుతారు. కుమార కార్తికేయ ధైర్యసాహసాలను చూసి, తాను తలచిన మంచి పనిని గుర్తుచేసుకోవడానికి ఈ మాసానికి కార్తీక అని పేరు పెట్టారు. ఆ విధంగా కార్తికేయుడు తారకాసురుడ్ని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమిగా విరాజిల్లింది. ప్రజలను నానారకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభసందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి అటు శివుడికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈరోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే, గతంలో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయట. కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం ప్రత్యేకించి చేయిస్తారు.

ఈ విశిష్ట రోజున సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠం. ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నానజపాలు ముగించి ఆలయానికి వెళ్ళి, దేవుడ్ని సందర్శించుకుని.. ప్రత్యేక పూజల్లో పాల్గొనవచ్చు. రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవుడిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు.

కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది మరీ. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలతో పాటు పరలోకంలో ముక్తి లభిస్తాయి.

కార్తీక పౌర్ణమి జైనులు, పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినంగా భావింపబడుతుంది. గురునానక్ జయంతి కూడా ఈరోజే. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు.

వృత్తాంతాలు..

పురాణాల ప్రకారం, విష్ణువు ఈ మాసంలోనే నారాయణుడి రూపంలో నీటిలో కొలువై ఉంటాడనీ అంటారు. కాబట్టి కార్తీక కృష్ణ ప్రతి పదం నుంచి కార్తీక అమావాస్య వరకు సూర్యోదయానికి ముందు నదిలో లేదా చెరువులో క్రమం తప్పకుండా స్నానం ఆచరించడం అక్షయ పుణ్యాన్ని కలిగిస్తుందంటారు. కార్తీక మాసంలో నిత్యం భగవద్గీత పారాయణం చేసిన వ్యక్తికి అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గీతలోని ఒక అధ్యాయాన్ని పఠించడం వల్ల దుష్టనరకం నుంచి విముక్తి పొందుతారట. స్కంద పురాణం ప్రకారం ఈ మాసంలో అన్నదానం చేయడం వల్ల పాపాలు పూర్తిగా నశిస్తాయి. 

విష్ణు ఆరాధన..

పురాణాల ప్రకారం, శంఖాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దేవుడు నుంచి వేదాలను దొంగిలించి పారిపోయాడు. వేదాలు అతడి చేతిలో నుంచి జారి సముద్రంలో పడ్డాయి. దేవతలు వేదాలను తిరిగి తీసుకురమ్మని విష్ణువును వేడుకుంటారు. అప్పుడు విష్ణువు మత్స్యావతారం అంటే చేపగా మారి, వేదాలను రక్షించడానికి నీటిలోనే ఉన్నాడు. అందుకే కార్తీక మాసంలో పవిత్ర నదిలో, చెరువులో స్నానం ఆచరించే ఆచారం ఉంది. ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజించిన వ్యక్తి మరణానంతరం వైకుంఠాన్ని పొందుతాడు.

గని కథ..

కార్తీక మాసం విశిష్టతను చూసి, గనిక తన మరణం గురించి, మరణించిన రోజుల గురించి ఆందోళన చెందింది. ఒకరోజు ఆమె ఒక మహర్షి వద్దకు వెళ్లి తన మోక్షానికి పరిష్కారం కోరింది. రుషులు ఆమెకు కార్తీక స్నానం ప్రాముఖ్యతను చెప్పారు. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు స్నానం చేసి, ఒడ్డున దీపం వెలిగించి, విష్ణువు, సూర్య భగవానుడ్ని పూజించడం ప్రారంభించింది. ఈ పుణ్య ప్రభావానికి లోనైన ఆమె ఆత్మ తన శరీరాన్ని బాధ లేకుండా విడిచి వైకుంఠాన్ని చేరింది.

రుక్మిణి కథ..

కార్తీక మాస మహిమను వివరించే రుక్మిణీ దేవి కథ కూడా ఉంది. పద్మ పురాణం ప్రకారం, రుక్మిణి తన పూర్వ జన్మలో గంగానది ఒడ్డున నివసించిన వితంతు బ్రాహ్మణ స్త్రీ. ఆమె నిత్యం గంగాస్నానం చేసి, తులసి పూజ చేసి, విష్ణుమూర్తిని ధ్యానించింది. కార్తీకమాసంలోని చలిలో ఒకరోజు స్నానం చేసి పూజ చేస్తుండగా ఆమె శరీరం నుంచి ఆత్మవిముక్తి పొందింది. ఆమె ఆత్మ పుణ్యంలో చాలా గొప్పది. ఆమె లక్ష్మీదేవితో సమానమైన స్థానాన్ని పొందింది. ఈ పుణ్య ప్రభావం వల్ల ఆమె తదుపరి జన్మలో శ్రీకృష్ణుడి భార్య అయింది.

ఒక నిజమైన కథ..

కార్తీకం విశిష్టతను వివరిస్తూ, శ్రీకృష్ణుడు సత్యభామకు తన పూర్వ జన్మలో శ్రీ మహావిష్ణువును పూజించినట్లు చెప్పాడు. ఆమె జీవితమంతా కార్తీకమాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేసి తులసి దీపం వెలిగించింది. ఈ పుణ్యం వల్లే సత్యభామ శ్రీకృష్ణుని భార్య అయింది. అన్ని మాసాల కంటే కార్తీక మాసం నాకు అత్యంత ప్రీతికరమైనదని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ మాసంలో అన్నదానం, దీపదానం చేసేవారికి కుబేర మహారాజు తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడని ప్రతీతి.

Show More
Back to top button