
ప్రజలను ఏకం చేసే బలమైన సాధనం భాష మాత్రమే. ప్రపంచ ప్రజలను ఏకం చేస్తూ, ప్రజలతో విడదీయరాని బంధాన్ని భాష పెనవేసుకున్నది. భాష ఆ ప్రాంత సంస్కృతికి అద్దం పడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా 8,324 భాషలు ఉన్నాయని, అందులో 7,000 భాషలు నేటికీ వినియోగంలో ఉన్నాయని యునెస్కో అధ్యయనం వెల్లడించింది. వీటిలో దాదాపు 43 శాతం భాషలు అంతరించే స్థితిలో, 40 శాతం భాషసల్లో విద్యాబోధన జరగడం లేదు, కొన్నింటికి లిపి కూడా లేకపోవడం గమనార్హం. సువిశాల భారతంలో రాజ్యాంగ పరంగా 22 అధికార భాషలు ఉండగా, మాట్లాడే భాషలు/యాసలు 1,600ల వరకు ఉన్నాయి. ఇలాంటి భాషా వైవిధ్యత కు పుట్టినిల్లుగా ఉన్న భారతం భాషా వారసత్వ కేంద్రంగా భాసిల్లుతున్నది. ప్రతి రెండు వారాలకు ఒక భాష అంతరించిపోతున్నట్లు యునెస్కో వెల్లడించడం విచారకరం. ప్రతి మాతృ భాషను తల్లిలా కాపాడుకోవడం మన కనీస ధర్మం.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం-2025:
ప్రపంచ భాషలను కాపాడుకోవడం, వినియోగంలోకి తేవడం, అంతరించిపోకుండా చూసుకోవడం లాంటి లక్ష్యాలతో ప్రతి ఏటా ఫిబ్రవరి 21న ఐరాస సభ్య దేశాలు “అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే” పాటించడం 1999 నుంచి ఆనవాయితీగా మారింది. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం-2025 ఇతివృత్తంగా “అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సిర్వర్ జుబ్లీ వేడుకులు” అనే అంశాన్ని తీసుకొని విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. భాషా వైవిధ్యం, బహు భాషావాదాన్ని ప్రోత్సహించడం లాంటి ప్రాధాన్యతలతో గత 25 ఏండ్లుగా ఐరాస నాయకత్వంలో భాషా పరిరక్షణ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రపంచ భాషా పరిరక్షణ చర్యల్లో భాగంగా 2022-32 దశాబ్దాన్ని “అంతర్జాతీయ స్వదేశీ (గిరిజన) భాషల దశాబ్దం”గా ప్రకటించిన పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నది ఐరాస.
బంగ్లాదేశ్‌లో మాతృభాష ఉద్యమం-1952 :
1947లో సువిశాల భారత విభజన సమయంలో వెస్ట్ (బంగ్లాదేశ్) పాకిస్థాన్, ఈస్ట్ పాకిస్థాన్‌లు విడిపోయి ఒకే పాకిస్థాన్‌గా ఏర్పడ్డ విషయం మనకు తెలిసిందే. నాటి పాక్ ప్రభుత్వం రెండు ప్రాంతాలకు ఉర్దూ ఏకైక అధికారిక భాషగా నిర్ణయించడంతో బంగ్లా మాతృ భాష మాట్లాడే ప్రజలు నిరసన ప్రదర్శనలు చేయడంతో 21 ఫిబ్రవరి 1952న పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించడం జరిగింది. మాతృభాష పరిరక్షణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏటా ఫిబ్రవరి 21న “అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం” నిర్వహించుకోవడం 1999 నుంచి ఆనవాయితీగా మారింది.
మాతృభాష ప్రాముఖ్యత:
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వేదికగా భాషాభివృద్ధి సదస్సులు, బహు భాషావాదాన్ని ప్రోత్సహించడం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, భాషలు అంతరించకుండా జాగ్రత్త పడటం, భాషా పోషకులను గుర్తించడం లాంటి కార్యక్రమాలను నిర్వహించాలి. మాతృభాషలో చదివితే సులభంగా నేర్చుకోవడం, సృజనాత్మకతను ప్రదర్శించడం జరుగుతుంది. మాతృభాషతో ప్రజల్లో సమ్మిళిత ఐక్యత, సామాజిక-భావోద్వేగ అభివృద్ధి, సాంస్కృతిక గుర్తింపు, లింగ సమానత్వం, విలక్షణ ఆలోచనలతో ఆవిష్కరణలు, విషయ పరిజ్ఞానం లాంటివి పెరుగుతాయని మనకు తెలుసు. నేడు దాదాపు 40 శాతం విద్యార్థులు మాతృభాషను వదిలి ఇతర భాషల్లో విద్యాభ్యాసం చేయడం చూస్తున్నాం.
మాతృభాష అమ్మ రొమ్ముపాలంత తియ్యన. మాతృభాషను చులకన చేస్తే అమ్మను హేళన చేసినట్లే. మాతృభాషను గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవడం, మాతృభాషలో విద్యాభ్యాసం చేయడం, మాతృభాష అభివృద్ధికి ఆజ్యం పోయడం లాంటివి నిరంతరం జరుగుతూనే ఉండాలి. మాతృభాషలో మాట్లాడితేనే చిన్న చూపు చూసే విపరీతమైన బుద్దులు పుట్టుకురావడం శోచనీయం. “ప్రపంచ భాషలందు మాతృభాష లెస్స” అంటూ నినాదాలు చేద్దాం. మాతృభాషను ఆత్మగా గౌరవిద్దాం, అమ్మ ముచ్చట్లను తేనె మూటలుగా ఆదరిద్దాం.