శ్రీశ్రీ.. ఈ పేరు విననివారు.. తెలియనివారు ఉండరేమో.. ఆయన రాసిన రచనల్లో ప్రముఖంగా, ప్రథమంగా.. నిలిచేది మహాప్రస్థానం..
దీని గురుంచి వర్ణించని కవులు..
చదవని పాఠకులుండరేమో..
ఎన్నిసార్లు చదివినా కొత్తగా చదివినప్పటి భావన కలుగుతుంది. తెలుగు పదాలను ఇంత అద్భుతంగా, శక్తిమంతంగా వాడొచ్చా.. అని అనుమానం కలుగక మానదు.
ఇందులోని ప్రతి కవితా.. దేనికదే ప్రత్యేకం!
కొన్ని కవితల్లో శ్రీశ్రీ ప్రయోగించిన పదాలు సాధారణ పాఠకులకు సైతం అంత తేలికగా అర్థం కావు కానీ… అందులోని అంతరార్థం మాత్రం ఎంతో లోతైనది. ప్రాసకు పెట్టింది పేరు..
మచ్చుకు కొన్ని…
“మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం.. పిలిచింది!
పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం పైపైకి!” అంటూ పాఠకుల్లో విప్లవ స్ఫూర్తిని రగిలించారు శ్రీశ్రీ..
“జయభేరి”లోని.. ‘నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను!’
‘కాదేదీ కవితకనర్హం!’అంటూ..
వాడుక భాషను సైతం ఆయన శైలిలో ప్రయోగించారు.
‘బాటసారి’లోని కష్టాలు, బాధల్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.
‘భిక్షువర్షియసీ’లో.. సాటి ముసలవ్వ గురుంచి మాట్లాడుతూ.. స్వతహాగా తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు.
‘దేశచరిత్రలు’లోనీ ‘ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం’ అంటూ ప్రశ్నిస్తూ..
‘శైశవగీతి’లోని పిల్లలు.. వారి ఆటపాటల గురుంచి చక్కగా వర్ణించడం.. వరకు
ఇలా ఏ కవిత తీసుకున్నా…
అందులో ప్రాచీన తెలుగును ప్రయోగించి..
దానికి వ్యతిరేకమైన మార్క్స్ కమ్యూనిజాన్ని చొప్పించిన తీరు.. శ్రీశ్రీ మార్క్ గా గోచరిస్తుంది.
ఈ సంపుటిలో మొత్తం 41 గీతాలు పొందుపరచబడ్డాయి.
పేద, మధ్య తరగతి ప్రజల భావాల్ని..
‘కల’మెత్తి చాటారు.
వేసిన దారి వెంట వెళ్లడం సులభం, కానీ కొత్తదారులు వెతకడం కష్టం అంటూ..
అతి సామాన్యమైన భాషలోనూ.. అర్థవంతమైన ప్రయోగాలు చేశారు.
కవిత్వం గురుంచి.. కదలాలి. కదిలేది, కదిలించేది, మారేది, మార్పించేది, పెనునిద్దుర వదిలించేదిగా ఉండాలని.. కవిత్వంలోనే కదలిక తీసుకురావడం అనేది శ్రీశ్రీ సాధించిన గొప్ప విజయంగా చెప్పాలి.
శ్రమజీవులనుద్దేశించి.. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదనే కొత్త నినాదం పుట్టింది కూడా శ్రీశ్రీవల్లే.
దేశభక్తి, భావ కవిత్వంతోపాటు సమతా చైతన్యాన్ని అత్యంత కవితాత్మకంగా చెప్పారు శ్రీశ్రీ.
“కవిత్వం ప్రధానంగా అర్థ ప్రధానం..
సంగీతం ప్రధానంగా నాద ప్రధానం..”
అంటే అచ్చంగా శ్రీశ్రీ రచనలే అగుపిస్తాయి.
ప్రపంచపు బాధ అంతా తన బాధగా చేసుకున్నందుకే ఆయన విశ్వకవి అయ్యారు.
శ్రీశ్రీ ప్రస్థానం…
1910 ఏప్రిల్ 30న విశాఖపట్నంలో జన్మించారు శ్రీశ్రీ. పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఆయనొక విప్లవ కవి, హేతువాది, అభ్యుదయవాది, నాస్తికుడు..
1933-40ల మధ్య కాలంలో రాసిన కవితలే… “మహాప్రస్థానం”గా ఉద్భవించాయి.
ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆయనొక ప్రభంజనమనే చెప్పాలి.
ఎనిమిదేళ్లకే గోకులాయి, వీరసింహ విజయసింహ వంటి నవలలు రాశారు శ్రీశ్రీ..
ఖడ్గ సృష్టి, ప్రభవ, సిప్రాలి, మరోప్రపంచం, మరోప్రస్థానం, అనంతం-శ్రీశ్రీ ఆత్మకథ, చరమ రాత్రి… అనేవి ఇతర రచనలు..
*ఈ మహాకావ్యాన్ని తన మిత్రుడైన కొంపెల్ల జనార్ధనరావుకు అంకితమిచ్చారట శ్రీశ్రీ.
అక్షరాల్ని ఆయుధాలుగా మలచి పదునైన చుర కవితల్ని.. సంపుటిగా మలిచిన.. శ్రీశ్రీ.. పుస్తకం.. ఇప్పుడు.. ప్రముఖ ఆన్లైన్ వేదికల్లోనూ, పబ్లిషింగ్ హౌస్ లలోనూ అందుబాటులో ఉంది.
అల్పక్షరాలతో అనంతర్థాల్ని సృష్టించిన కవియోగి!