Telugu Special Stories

ప్రపంచం మెచ్చిన ఆర్థిక శాస్త్రవేత్త మన్మోహనుడు

భారత మాజీ ప్రధాని, ఆచార్యులు, బ్యూరోక్రాట్‌, అకడమీషియన్‌, ఆర్థికశాస్త్రవేత్త, రాజనీతిజ్ఞుడు, నిస్వార్థ సేవకుడు, నిరాడంబరతకు నిలుటద్దం, నేల మీద మాత్రమే నడవడం తెలిసిన మహా మేధావి మన్మోహన్‌ సింగ్‌ తన 92వ ఏట తుది శ్వాస విడిచిన సందర్భంగా దేశ ప్రజాగొంతు మూగబోయింది. పార్టీ ఏదైనా తన పదవిని ఒక మహత్తర బాధ్యతగా భావించి ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన నిరాడంబర బుద్ది జీవి మన మన్మోహన్‌. ఆర్థిక నిపుణులు సహితం తన ఆర్థికశాస్త్ర పరిజ్ఞానానికి తల వంచి “సింగ్ ఈజ్‌ కింగ్” అని కొనియాడడం చూసాం. ప్రతిపక్ష నాయకులు సహితం మన్మోహన్‌ సింగ్‌ను వ్యక్తిగతంగా విమర్శించడానికి వెనకడుగు వేసిన సందర్భాలు ఎన్నో.

అందరి బంధువుగా, అతి సామాన్య జీవితాన్ని గడిపి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా నిరూపించుకున్న యోధుడు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ నిలబడిని మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభకు పలు మార్లు ఎన్నికై 33 ఏండ్ల పాటు ఎంపీగా, మంత్రిగా, ప్రధానిగా విశేష సేవలు అందించారు. అవస్థల విష వలయంలో చిక్కిన భారత ఆర్థిక వ్యవస్థను పలు ఆర్థిక సంస్కరణలతో గాడిలో పెట్టిన మహా మేధావి. 2004 , 2014 మధ్య కాలంలో రెండు పర్యాయాలు యూపిఏ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా అమూల్య సేవలు అందించారు. రెండవ దఫా ప్రధానిగా ఉన్న సమయంలో పలు అవినీతి కుంభకోణాలు, ద్రవ్యోల్బణ సంక్షోభాలను ఎదుర్కొంటూ ప్రతిపక్ష నాయకుల చేత “బలహీన పిఎం” అని పిలిపించుకున్నారు. 

భారత ఆర్థిక సరళీకరణ రూపశిల్పి:

 జూన్‌ 1991లో పి వి నర్సింహారావు నేతృత్వంలో కాంగ్రేస్‌ పార్టీలో సభ్యుడిగా చేరి అక్టోబర్‌ 1991 నుంచి ఐదు సార్లు అస్సాం(1991-2019), ఒక సారి రాజస్థాన్‌ నుంచి (2019-24) రాజ్యసభకు ఎన్నికైన మన్మోహన్‌ సింగ్ ఏప్రిల్‌ 2024లో తన ఎంపీ పదవిలో 33 ఏండ్ల పాటు ఉంటూ‌ కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా “భారత ఆర్థిక సరళీకరణ రూపశిల్పి”గా, రెండు పర్యాయాలు ప్రధాన మంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారు. భారతదేశ ఎదుగుదలను ఏ ప్రపంచ శక్తి ఆపలేదని, రాజకీయ నాయకులు ప్రజల మనోభావాలపై స్వారీ చేస్తున్నారని, దేశ చరిత్ర తనపై దయ తలిచిందని, నరేంద్ర మోదీ దేశ ప్రధాని కావడం దురదృష్టకరమని, డీమానిటైజేషన్‌తో పాటు జిఎస్టీ‌ ఒక విఫల జంట ప్రయోగాలని వివిధ సందర్భాల్లో నిక్కచ్చిగా పేర్కొనడం తనలోని ధైర్యంతో పాటు స్పష్టమైన భావవ్యక్తీకరణకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 

బాల్యం, విద్యాభ్యాసం, ఉన్నత అధికార‌ బాధ్యతలు:

26 సెప్టెంబర్‌ 1932న గుర్ముఖ్ సింగ్‌-అమ్రిత్‌ కౌర్‌ దంపతులకు నేటి పాకిస్థాన్‌లోని గహ్ ప్రాంత సిక్కు కుటుంబంలో జన్మించి, 1947లో దేశ విభజన సమయంలో భారత్‌కు వచ్చి వారి కుటుంబం స్థిరపడింది. పాఠశాల విద్యను పెషావర్‌లో ప్రారంభించి, హల్దీ ప్రాంతానికి వలస వచ్చి, అమృత్‌సర్‌ హిందూ కాలేజీ, పంజాబ్‌ యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్(1952), ఎకనమిక్స్‌లో పిజీ(1954) పూర్తి చేశారు. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ(1957), సెయింట్‌ జాన్స్‌ కాలేజీల్లో ఉన్నత విద్యను కొనసాగించి, యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్సఫర్డ్‌లో ఎకనమిక్స్‌లో పిహెచ్‌డి (1962) పూర్తి చేసారు.

1957-59లో పంజాబ్‌ యూనివర్సిటీలో సీనియర్‌ లెక్చరర్‌గా, 1959-63లో రీడర్‌గా, 1963-65లో ప్రొఫెసర్‌గా పని చేశారు. అనంతరం 1966-69లో ఐరాసలో ఉద్యోగిగా, ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో ప్రొఫెసర్‌గా కూడా పని చేశారు. తర్వాత కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ మినిస్ట్రీలో బ్యూరోక్రాట్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, 1970-1980ల్లో భారత ప్రభుత్వంలో పలు బాధ్యతలు నిర్వహించి, 1972-76లో చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌గా, 1982-85లో ఆర్‌బిఐ గవర్నర్‌గా, 1985-87లో ప్లానింగ్‌ కమీషన్‌ హెడ్‌గా, 1990లో ప్రధాని చంద్రశేఖర్‌కు ఆర్థిక సలహాదారుగా, 1991లో స్వల్పకాలం యూజిసీ చైర్మన్‌గా విశేష సేవలు అందించారు. 

ఉత్తమ రాజకీయ ప్రస్థానం:

1991లో భారత్‌ తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న వేళ నాటి ప్రధాని పివి నరసింహారావు చొరవతో కాంగ్రేస్‌లో చేరి క్యాబినెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. భారతదేశ ఆర్థిక దుస్థితిని గాడిలో పెట్టడానికి ఆర్థిక సరళీకరణ, ప్రైవెటీకరణ, గ్లోబలైజేషన్‌లను ప్రవేశపెట్టి దేశాన్ని సంక్షోభంలోంచి కాపాడి బయటకు తీసుకువచ్చారు. 1996 ఎన్నికల్లో విఫలమైన కాంగ్రేస్‌ ప్రతిపక్షంలో ఉండగా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా (1998-2004 మధ్య) బాధ్యతలు నిర్వహించారు. 2004 ఎన్నికల్లో యూపిఏ (కాంగ్రేస్)‌ నెగ్గడంతో సోనియాగాంధీ నిర్ణయంతో మన్మోహన్‌ సింగ్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. 2009 ఎన్నికల్లో కూడా యూపిఏ విజయం సాధించడం, మరో పర్యాయం పిఎంగా పదవిని చేపట్టారు. రెండవ పర్యాయం పిఎంగా పదవిలో ఉన్నపుడు కామన్‌వెల్త్‌ గేమ్స్ నిర్వహణ, బొగ్గు గనుల కేటాయింపు, 2జీ స్పెక్ట్రమ్‌ అలాట్‌మెంట్‌ అంశాల్లో జరిగిన భారీ కుంభకోణాల విమర్శల మాటల యుద్ధాలను ఎదుర్కొన్నారు. ఏప్రిల్‌ 2024లో రాజ్యసభ సభ్యత్వం ముగియడంతో రాజకీయాల నుంచి నిష్క్రమించారు. 

దేశ, విదేశీ పత్రికలు కొనియాడిన రాజకీయాలే తెలియని ప్రధానమంత్రి:

“అసాధారణ గౌరవం, తేజస్సు కలిగిన నేత”గా పేరు తెచ్చుకోవడంతో పాటు “ప్రపంచ అగ్రనేతల్లో ఉన్నతుడు”గా కూడా విదేశీ పత్రికల్లో కొనియాడబడ్డారు. మారుతీ 800 కారు యజమానిగా అతి సాధారణ జీవితాన్ని గడిపిన దేశ ప్రధానిగా చరిత్రలో నిలిచి పోయారు. “ప్రతిపక్ష నాయకులు సహితం గౌరవించే అద్వితీయ నేత”గా కీర్తించబడి, “ముందు చూపు కలిగి నైతికతే ఆభరణంగా ధరించిన దార్శనికుడు”గా మెప్పు పొందిన మన్మోహనుడు, మనసున్న మానవత్వ రూపం. నేటి రాజకీయ నాయకులను ఆయన జీవితం ఓ పాఠంగా నిలుస్తుంది. ఫోర్బ్స్‌ జాబితాలో ప్రపంచ అత్యంత ప్రతిభగల నేతల్లో 18 స్థానాన్ని పొంది, “భారత్‌ను అగ్ర రాజ్యాల సరసన నిలిపిన యోధుడు”గా, “భారత్‌ను గట్టెక్కించిన మన్మోహన్‌”కు దేశం సదా రుణపడి ఉంటుంది. 

 ఆయన రాజకీయ రంగంలో ఏ పదవిని కోరుకోలేదు. అన్ని పదవులు ఆయన చెత్తకు చేరి మురికి పోయాయి. ఆయన మరణం భరతమాతకు తీరని నష్టం. ఆయన సామాన్యల్లో అసమాన్యుడు, అలసట ఎరుగని నిరంతర శ్రామికుడు, దేశభక్తిని శ్వాసించిన సేవకుడు. 

Show More
Back to top button