దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగగా పిలుస్తారు. కొందరు దీనిని శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. ప్రకృతిని దైవంగా భావించి ఆరాధించడం.. మన పూర్వీకుల నుంచే చూస్తున్నాం. చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని– ఇలా సమస్త ప్రాణకోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ పూజిస్తూ వస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నాం.
నాగుల చవితినాడు పుట్టకు నూలు చుట్టి పూజ చేయడం అనేది ఏంటంటే.. ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా భావించేవారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా రైతుకు పంటనష్టం కలగకుండా చేస్తాయట. అలా ప్రకృతిపరంగా మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.
మన పురాణాల్లో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుడి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుడ్ని శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పోయి, సౌభాగ్యవంతులవుతారని పెద్దలు, హిందువుల నమ్మకం.
నాగదేవత.. పరమార్థం..
ఈ మానవ శరీరానికి నవరంధ్రాలు ఉంటాయి.. శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ‘వెన్నుబాము’ అని అంటారు. అందులోనూ కుండలినీశక్తి మూలాధారచక్రంలో పాము ఆకారంలాగే ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఇది మానవ శరీరంలో దాగివున్న.. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ.. మానవుడిలో ‘సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ‘నాగుల చవితి’ రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవుడిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాల్లో నివసించే శ్రీమహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే.. ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో ఉన్న ఆంతర్యంగా చెప్తారు.
నాగులచవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి లేదా అరటిపళ్ళు, తేగలు వంటివి నివేదన చేస్తారు. మన హిందువులు చాలా ఇళ్ళల్లో ఇలవేల్పుగా సుబ్రహ్మణేశ్వరుడినే ఆరాధ్య దైవంగా పూజిస్తారు. కాబట్టి వారి పేరును చాలావరకు నాగరాజు, ఫణి, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు వంటి వగైరా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు.
నాగుల చవితి అంతర్యం..
గ్రామీణ ప్రాంతాల్లో అయితే నాగుల చవితి పండుగను సందడిగా చేస్తారు. ఈ పండుగ రోజున ఊర్లో ఉన్న గుళ్లలోని పుట్టల్లో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం.
దేవాలయాల్లో రాతి విగ్రహా జంట పాముల ప్రతిమలు, రెండు పాములు మెలికలు వేసుకొని రావి, వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనం ఎక్కువ గమనిస్తుంటాం. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పూజిస్తారు. ఎందుకంటే కుజ దోషం, కాలసర్ప దోషానికి ఆదిదేవత సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే వివిధ దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.
అసలు పుట్టలో పాలు పోయడం మంచిదేనా.. అంటే కొందరు శాస్త్రవేత్తలు సహజంగా పాముకు పాలు అరగవు. పుట్టకు పాలుపోయాలనుకునే వారు పుట్ట దగ్గర ఒక మట్టి కంచు లేదా పత్రంలో పాలు పోయాలి. అనవసరంగా పుట్టను తడిపి పాముకు కీడు చేసిన వారం కాకూడదని చెబుతారు. పాము విగ్రహాలను మాత్రం పాలతో అభిషేకం చేయవచ్చు. అలానే పుట్టకు కోడిగుడ్డు సమర్పించాలనుకునేవారు పుట్టపై పెట్టాలి తప్ప పుట్ట రంధ్రాల్లో వేయకూడదు. ఎందుకంటే పాము పుట్టలోకి వెళ్లే మార్గానికి అంతరాయం కలుగుతుంది. పుట్టపై బియ్యంపిండిలో చక్కర కలిపి చల్లడం వల్ల పుట్టను అభివృద్ధి చేసే చీమలకు ఆహారం సమృద్ధిగా లభించడం వల్ల పుట్ట పెరుగుతుంది. ఆ పుణ్య ఫలంతో సంసారం అభివృద్ధి చెందుతుంది.
ఇక పూజకోసం తీసుకువెళ్లిన పసుపు, కుంకుమ పూలతో అలంకరణ చేసుకుని బెల్లంతో వండిన పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. కోరికలు తీరేందుకు బంగారం, వెండితో చేసిన ఐదు నాగపడిగేలను పుట్టలో వేసి దూప, దీప, నైవెద్యాలు సమర్పరించిన తరువాత కొబ్బరికాయ నివేదించాలి. పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. దేశవ్యాప్తంగా నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.