Telugu Special Stories

ప్రజా కళాకారుల గుండెల్లో.. సదా చిరంజీవి.. గరికపాటి రాజారావు..

గరికపాటి రాజారావు (ఫిబ్రవరి 5, 1915 – సెప్టెంబరు 8, 1963)

అతనొక నాటక ప్రయోక్త. అతనొక నటుడు. అతనొక నట శిక్షకుడు. అతనొక నాటక సంస్థల నిర్వాహకుడు. అతనొక రచయిత. అతనొక రంగస్థల నర్తకుడు. ఎంతో మంది కళాకారులకు రంగస్థలం జీవితాన్నిచ్చిన కళాప్రపూర్ణుడు. ప్రజా సాంస్కృతిక ఉద్యమానికి గరికపాటి రాజారావు జీవితం నిరంతర స్ఫూర్తి. వృత్తి రీత్యా అతనొక డాక్టరు.. ప్రవృత్తి రీత్యా ఆయానొక రంగస్థల కళాకారుడు. తెలుగు కళారంగాన్ని ప్రజా కోణం నుండి రాస్తే ముందుగా వినపడే పేరు గరికపాటి.

గరికపాటి రాజారావు మనకు అందించిన స్పూర్తిని అందిపుచ్చుకోవాల్సి ఉంది. తీసి విడుదల చేసింది ఒకే ఒక్క చిత్రం. అయినా సినీ నిర్మాత, దర్శకుడు, కథనాయకుడు కూడా.  కళలను పోరాటానికి అనుసంధానం చేసిన తీరును అధ్యయనం చేయాల్సి ఉంది. గరికపాటి రాజారావు గారి లోని మరోకోణం మానవత్వం, దయార్థ హృదయం, దేశభక్తి, ప్రజాసేవ. తన జీవితంలోని ప్రతీ క్షణాన్ని ప్రజలకు అంకితం చేసిన మహానుభావుడు. అసలు సిసలైన ప్రజా వైద్యుడు. ప్రజా కళాకారుడు. నిఖార్సైన కమ్యూనిస్టు కార్యకర్త.

జననం…

డాక్టరు గరికపాటి రాజారావు గారూ 1915 ఫిబ్రవరి 5 నాడు రాజమండ్రిలో జన్మించారు. వాళ్ళ నాన్న కోటయ్య దేవర గారూ తెనాలి ప్రాంతానికి చెందినవారు. వాళ్ళ అమ్మ సోమలింగమ్మ గారూ రాజమండ్రికి చెందినవారు. వీరికి అయిదుగురు సంతానం. ముగ్గురు అమ్మాయిల తరువాత రాజారావు గారూ. ఆ తరువాత తమ్ముడు ఉన్నారు. మొదట్లో వీరి పేరు రామలింగేశ్వర రావు గారూ. బడిలో చేరినప్పుడు రాజారావు గా మార్చినారు. రాజారావు గారి నాన్న గారి ఉద్యోగ రీత్యా, వీరి బాల్యం అంతా సికింద్రాబాద్ లోనే గడిచింది.

బాల్యం…

ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి అయ్యాక చదువుకోవడానికి సోమలింగమ్మ గారికి అన్న గారూ, సర్ సి.వి.రామన్ గారికి మిత్రుడు ఐన డాక్టరు సుబ్రహ్మణ్యం గారి వద్దకు విజయనగరం పంపించారు. దాంతో గరికపాటి గారూ యస్.యస్.యల్.సి వరకు విజయనగరంలో చదువుకున్నారు. విజయనగరం కళలకు పుట్టినిల్లు. ఆదిభట్ల నారాయణ దాసు గారి హరికథ జరుగుతూవుంటే చూసి రాజారావు గారూ లయబద్ధంగా నర్తించడం గమనించించిన ఆదిభట్ల గారూ పెద్దయ్యాక మంచి నటుడువి అవుతావుని రాజారావు గారిని దీవించారట.

వివాహం…

ఉన్నత పాఠశాలలో చదివే రోజులలోనే బడిలో సత్యహరిశ్చంద్ర నాటకంలో మాతంగి కన్య వేషం వేసి నాటకాలలో మొట్ట మొదటి సారిగా రంగస్థలం ఎక్కారు. విజయనగరంలో యస్.యస్.యల్.సి పూర్తి చేసుకుని వచ్చిన రాజారావు గారిని సికింద్రాబాద్ లోని లాలాగూడలో ఒక వర్క్ షాప్ లో గుమస్తాగా చేర్పించారు వాళ్ళ నాన్న గారూ. విజయనగరంకు చెందిన నాగేశ్వరమ్మతో వివాహం జరిపించారు. సుమారు నాలుగు సంవత్సరాలు లాలాగూడలోని రైల్వే వర్క్ షాప్ లో పనిచేసిన రాజారావు గారిని తన పై అధికారి పెత్తనం భరించలేక మద్రాసు వచ్చారు. తన 22వ యేట 1937 లో యల్.ఐ.యం. లో చేరారు.

నాటకరంగంలో…

ఒకవైపు డాక్టరుగా చదువుతూనే గుండ్లపల్లి నారాయణ మూర్తి గారూ వ్రాసిన “విడాకులు”, “షాజహాను” అనే నాటకం, రవీంద్రనాథ్ ఠాగూర్ గారూ వ్రాసిన బలిదానం, గాలి బాలసుందర్ రావు గారూ వ్రాసిన “అపోహ”, భమిడిపాటి కామేశ్వరరావు గారూ వ్రాసిన “బాగు బాగు” ఇలాంటి నాటకాలు వేస్తూ వచ్చారు. ఇదే కాకుండా తాను స్వంతంగా “పశ్చాత్తాపం” అనే నాటకాన్ని స్వయంగా రచించి ప్రదర్శించారు రాజారావు గారూ. పుచ్చలపల్లి సుందరయ్య గారి తమ్ముడు అయిన డాక్టరు రామచంద్రారెడ్డి, సి.వి.రంగనాథ దాసు గారి తమ్ముడు అయిన డాక్టరు రామదాసు గారూ మరియు రాజారావు గారూ వీళ్ళ ముగ్గురిని డాక్టరు త్రయం అనేవారు. పుచలపల్లి సుందరయ్య గారి పరిచయంతో కళాశాలలో ఉండే రాజారావు గారికి మార్కిస్టు భావాలు అలవడ్డాయి. చదువు, నాటకాలు, ఉద్యమాలు ఇలా సాగిపోతూనే 1942లో తన డాక్టరు కోర్సు పూర్తిచేశారు. ఆ సమయంలో వాళ్ళ నాన్న గారూ మరణించే సరికి అమ్మ, భార్యతో కలిసి రాజమండ్రికి వచ్చేశారు. కమ్యూనిస్టు పార్టీ సూచనలు అనుసరించి విజయవాడకు వచ్చేసి, “ప్రజావైద్యశాల”ను ప్రారంభించి దగ్గరలోని పెనమలూరు, పోరంకి, మొఘల్ రాజపురం ప్రాంతాలలో వైద్యం చేస్తూ ఉండేవారు. ఎక్కువ భాగం డాక్టరుగా ప్రజాసేవ చేస్తూ వచ్చారు.

ప్రజా నాట్య మండలి స్థాపన…

1943 మే 25, 26 తేదీలలో బొంబాయిలో భరత కమ్యూనిస్టు మహాసభలు జరిగాయి. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఇప్టా) ను ప్రారంభించారు. ప్రఖ్యాత నటులు పృథ్విరాజ్ కపూర్, ముల్కి రాజ్ ఆనంద్, బలరాజ్ సహాని లాంటి వారు సభ్యులుగా ఉన్నారు. దేశం నలుమూలల నుండి సాంస్కృతిక దళాలను బొంబాయికి తీసుకెళ్లారు. ఆంధ్రా ప్రాంతం నుండి వెళ్లిన వాళ్లలో రాజారావు గారూ ముఖ్య పాత్ర పోషించారు. వాళ్లకు నాయకులుగా ముక్కామల నాగభూషణం గారూ ఉన్నారు. ఇప్టా ప్రారంభించినప్పుడు అందులో కార్యవర్గ సభ్యునిగా రాజారావు గారిని నియమించారు. ఇప్టా కు అనుబంధంగా ప్రతీ రాష్ట్రంలో ప్రజా నాట్య మండలి లు ఏర్పాటు చేశారు.

ప్రజా నాట్యమండలిలో వ్యవస్థాపక కార్యదర్శిగా…

ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పబడిన ప్రజానాట్యమండలి కి వ్యవస్థాపక కార్యదర్శి గా రాజారావు గారిని నియమించబడ్డారు. సాంస్కృతిక శిబిరాలు ప్రారంభించి కళాకారులకు శిక్షణ ఇస్తూ ఉండేవారు. ప్రాచీన కళరూపాలు అయిన బుర్రకథ, వీధి భాగవతం, జముకల కథ, పిట్టల దొర, కోలాటం, విచిత్ర వేషాలు ఇలాంటివి ఆధునీకరించి దేశభక్తి పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆరు సంవత్సరాల కాలంలో 600 దళాలను ఏర్పాటు చేశారు రాజారావు గారూ. వీరితో పాటు మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారూ కూడా పనిచేశారు. తరువాత కాలంలో మిక్కిలినేని గారూ సినిమా రంగంలోకి వెళ్లి స్థిరపడ్డారు. అన్ని జిల్లాలలో, పట్టణాలలో ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు రాజారావు గారూ.

ఒకవైపు వైద్యుడిగా ఉచితంగా వైద్యం చేస్తూనే, ఇంకోవైపు ప్రజానాట్యమండలి లో రంగస్థలం నాటకాలతో ప్రజలను మేల్కొలుపుతూ ఉండేవారు. “వేదిక ఎక్కితే నటవిశ్వరూపం, వేదిక వెనకాల నట శిక్షణా శిబిరం, ఈ రెండూ లేనప్పుడు ప్రజా వైద్యాలయం” అన్నట్లుగా రాజారావు గారూ తన జీవితాన్ని గడుపుతూ వచ్చారు. 1948 వ సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీ పై నిషేధం విధించినప్పుడు చాలామంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పుచలపల్లి సుందరయ్య గారికి ఆశ్రయం ఇచ్చినందుకు గానూ రాజారావు గారిని జైల్లో పెట్టి హింసించి, ఏ ఆధారాలు దొరక్కపోవడంతో తిరిగి విడుదల చేశారు. తెలంగాణ ప్రాంతంలో రజాకార్లతో సాయుధ పోరాటం చేసి వచ్చిన అజ్ఞాతం వీరులను తన ఇంట్లో ఉంచేసి వైద్యం చేసేవారు. సాయుధ పోరాటం ముగిసి కమ్యూనిస్టుల మీద నిర్భంధం తొలగిపోవడంతో రాజమండ్రిలో తిరిగి వైద్య వృత్తిని ప్రారంభించారు రాజారావు గారూ.

సినీ రంగ ప్రవేశం..

ప్రజా నాట్య మండలిలో పనిచేసిన వారిలో చాలా మంది సినిమాలలో చేరడానికి మద్రాసు వెళ్లిపోయారు. దాంతో రాజారావు గారూ కూడా మద్రాసు వెళ్లారు. పుట్టిల్లు సినిమా ప్రారంభించే నాటికి రాజారావు, నాగేశ్వరమ్మ లకు ముగ్గురు సంతానం. పెద్దబ్బాయి పేరు పృథ్విరాజ్, రెండో అబ్బాయి పేరు గాంధీ ప్రతాప్, మూడవ పేరు సీతారామరాజు. 1952 ప్రారంభంలో సినిమా తీయదలచి పుట్టిల్లు సినిమా ప్రారంభిస్తూ జమున గారిని కథానాయికగా, అల్లు రామలింగయ్య గారిని ముఖ్య పాత్రధారుడిగా , పెరుమాళ్ళు గారూ, కోడూరు అచ్చయ్య గారూ, మిక్కిలినేని గారూ, రామకోటి గారూ, లక్ష్మి నరసయ్య గారూ, బుర్రకథ నాజర్ గారూ, మాభూమి వ్రాసిన వాసిరెడ్డి సుంకర గారూ, పబ్లిసిటీ కళాకారిణి కేతా గారూ వీళ్లందరిని పుట్టిల్లు చిత్రానికి పరిచయం చేశారు.

1952 లో చిత్రీకరణ జరిగింది. ఆ సమయంలోనే రాజారావు గారికి కూతురు జన్మించగా సురేఖ అని పేరు పెట్టారు. అల్లు రామ లింగయ్య గారికి కూడా ఆ సమయంలో కూతురు పుట్టగా గురువుగారు రాజారావు గారి కూతురు పేరే తన కూతురికి సురేఖ అని పేరు పెట్టుకున్నారు. అల్లు రామ లింగయ్య గారి కూతురు సురేఖ గారే తరువాత రోజులలో మెగాస్టార్ చిరంజీవి గారికి భార్య అయ్యారు. అల్లు రామ లింగయ్య గారికి గురువు రాజారావు గారూ అంటే అంత భక్తి భావం ఉండేది. 1953 లో పుట్టిల్లు చిత్రం పూర్తి అయిపోయింది. 19 ఫిబ్రవరి 1953 లో విడుదలయిన ఈ చిత్రం భిన్నమైన ముగింపు కారణంగా ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.

రాజారావు గారూ కథనాయకుడు, జమున గారూ కథానాయిక ఉన్న ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ల మధ్య వయసులో చాలా వ్యత్యాసం ఈ చిత్రానికి ప్రతికూలం అని చెప్పాలి. కథనాయకుడే విలన్ పాత్రధారిగా ఉండడం, చిత్రం యొక్క ముగింపు ఆసక్తికరంగా లేకపోవడం చిత్రం పరాజయం పాలవ్వడానికి ప్రధాని కారణాలు. పుట్టిల్లు చిత్రం పరాజయంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు రాజారావు గారూ. దాంతో కుటుంబంతో సహా రాజమండ్రి వచ్చి తిరిగి తన రాజా క్లినిక్ ని కొనసాగించారు. రాఘవ కళా సమితి అనే నాటక సంస్థను స్థాపించి ఎప్పటిలాగే నాటకాలు వేయడం ప్రారంభించారు.

1959 లో రాజారావు గారికి మిత్రుడు వి.కె.ఆర్. జయంతి గారూ రాజారావు గారిని మరలా సినిమా తీయమని ప్రోత్సహించారు. “దున్నేవాడిదే భూమి” అనే చిత్రం షూటింగ్ మొదలుపెట్టి ఒక షెడ్యూల్ పూర్తి అవ్వగానే ఆ చిత్రం ఆగిపోయింది. దాంతో మద్రాసులో నాగార్జున పాలి క్లినిక్ పెట్టి వైద్యం చేయడం మొదలుపెట్టారు. వి.కె.ఆర్. జయంతి గారూ గారి ప్రోత్సాహంతో నాటకాలు కూడా మొదలుపెట్టారు. కొడాలి గోపాల్ రావు గారూ వ్రాసిన “ఛైర్మన్” అనే నాటకాన్ని ప్రదర్శన చేశారు. తెనాలి నుండి వచ్చిన ఒక కుర్రవాడికి ఇందులో ఒక వేషం కూడా ఇచ్చి ప్రదర్శనలు చేయించారు. ఆ కుర్రవాడే తరువాత రోజులలో సూపర్ స్టార్ కృష్ణ గారూ.

నాటకాలు అంటే ఎంతో అంకిత భావంతో ఉండేవారు. ఒకసారి కాంట్రాక్టరు నాటకాలు వేసే క్రమంలో రైలు టిక్కెట్ కు సరైన సమయానికి డబ్బులు అందివ్వకపోతే రాజారావు గారూ తన కూతురు మెడలో గొలుసు తాకట్టు పెట్టి రైలు టిక్కెట్టు కొనిచ్చి మరీ నాటక ప్రదర్శనకు తీసుకెళ్లేవారు. పారితోషికం ఇవ్వకుండా కాంట్రాక్టరు తప్పించుకుంటే తానే స్వంతంగా డబ్బులు ఇచ్చేవారు రాజారావు గారూ. రాజారావు గారికి భార్య నాగేశ్వరమ్మ గారి సహకారం ఎంతో ఉండేది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సర్దుకుపోతూ తన సహాకారాన్ని అందిస్తూ ఉండేది.

1962లో దేశభక్తిని ప్రభోధించే “జై భవాని” అనే నాటకాన్ని ప్రదర్శింపజేశారు. ఈ నాటకం రవీంధ్రభారతిలో ప్రదర్శించినప్పుడు ప్రముఖ నటీమణి వాణిశ్రీ గారూ స్త్రీ పాత్రలో నటించారు. ఆ నాటకాన్ని వీక్షించడానికి 15 నిముషాలు సమయం మాత్రమే కేటాయించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారూ మూడు గంటలు సాగిన మొత్తం నాటకాన్ని తిలకించారు.

మరణం…

ఒకవైపు వైద్య వృత్తి, ఇంకోవైపు తీరికలేని నాటకాలు, మరోవైపు విమర్శలు దాంతో విపరీతమైన ఒత్తిడికి లోనయ్యారు. 1963 సెప్టెంబర్ 6వ తారీకు కేంద్ర మంత్రి గారూ మద్రాసులో రాజారావు గారిని పిలిపించారు. మంత్రి గారితో మాట్లాడుతూ ఉండగానే రాజారావు గారికి గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు వైద్యం చేశారు. 1963 సెప్టెంబర్ 8న వాళ్ళ పెద్దబ్బాయి పృథ్విరాజ్ కపూర్ ని పిలిపించారు. రాజారావు గారికి కాంపౌండరు తిరుపతి రావు, నర్సు నారాయణమ్మ సపర్యలు చేస్తున్నారు.

గాలి బాలసుందర రావు గారూ వైద్యం చేస్తుండగానే మరొకసారి రాజారావు గారికి గుండెపోటు వచ్చింది. 1963 సెప్టెంబరు 8 సాయంకాలం 4:45 నిమిషాలకు ప్రజా కళాకారుడి జీవితం గాలిలో కలిసిపోయింది. రాజారావు గారూ కన్నుమూశారు. అశేష అభిమానాన్ని సంపాదిచారు రాజారావు గారూ. పెద్దపెద్ద వాళ్ళలో కూడా వారిని ఎంతగానో అభిమానించేవాళ్ళున్నారు. రోజువారీగా వారిని కలవకపోయినా కూడా వారి అంతిమయాత్రకు హాజరైనవారిని చూస్తే తెలిసిపోయిందని పత్రికల వాళ్ళు వ్రాశారు.

ఒకప్పటి ప్రజా నాట్యమండలి కళాకారులూ వి.మధుసూదన రావు, తాపీ చాణక్య గారూ, తిలక్ గారూ, గుత్తా రామినీడు గారూ, హేమంబర రావు గారూ, ఎల్వీ ప్రసాద్ గారూ, గాయని జానకి గారూ, సంగీతం దర్శకులు కోదండపాణి గారూ, రావి కొండలు రావు గారూ, నార్ల చిరంజీవి గారూ, గోపాలం గారూ, బొల్లిముంత గారూ తదితరులు అందరూ వచ్చారు. 9 సెప్టెంబరు 1963న ఉదయం 11 గంటలకు త్యాగరాయ నగర్ లో కన్నంపేట శ్మశానవాటికలో రాజారావు గారి అంత్యక్రియలు జరిగాయి. అశేష అభిమానులను రాజారావు గారూ కంటతడి పెట్టించారు. అతి చిన్న వయస్సులోనే ఈ లోకాన్ని వదిలి వెళ్ళడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. సెప్టెంబరు 17 తారీకున మద్రాసులోని విజయా గార్డెన్స్ లో చిత్రసీమ వాళ్లంతా కలిపి రాజారావు గారికి సంతాప సభను నిర్వహించారు. రాజారావు గారూ తీసింది ఒక సినిమానే. రెండవ సినిమా ఆగిపోయింది. మౌలికంగా రంగస్థలమే అయినప్పటికీ సినిమా వాళ్ళు సంతాప సభ నిర్వహించడం ఒక అపూర్వ సంఘటన.

“రాజారావు గారూ ఒక నట విశ్వవిద్యాలయం”.

       …. అక్కినేని నాగేశ్వరావు గారూ

“నేను రాజారావు గారితో కలిసి ఎక్కువగా పనిచేయక పోయినప్పటికీ, వారు వైజ్ఞానిక దళాలను ఏర్పాటు చేయడం, దాని లక్ష్యం, దాని ప్రచారం ఇవన్నీ కూడా ఎంతో ఆదర్శం”.

                   … ఎన్టీఆర్ గారూ

ఆచార్య ఆత్రేయ గారూ వ్రాసిన కవిత రాజారావు గారి జీవితాన్ని సమీక్షించినట్లుగా ఉంది.

సంతాప సభలో ఆత్రేయ గారి కవిత..

కవిత కాదు కన్నీరు.. ఆత్రేయ..

వెళ్లిపోయావా రాజా..

విశ్వ మానవతా నందన వీధుల్లో

విరబూసిన తెల్లని రోజా,

చల్లని రాజా.. వెళ్లిపోయావా..??

అసూయ, అసహనాలతో..

అమానుష స్వార్థంతో..

అందమైన ఈ లోకం..

చిందర వందర అయ్యే కాలంలో..

ఇవ్వడమే ఎరిగిన రాజా..

పుచ్చుకోవడం, రేపటికోసం దాచుకోవడం

తెలియని రాజా..

త్యాగదనంతో మహారాజులనే

తలదన్నిన రాజా..

డాక్టరుగా ఎందరెందరి చెల్లిపోయిన జీవితపు

చిట్టాలు తిరిగి వ్రాసి బ్రతికించావు..

ఎన్ని గుండెలలో తాపాలు హరించావు..

ఎన్ని గుడిసెలలో దీపాలు వెలిగించావు..

నీవు వుంటే మృత్యువే లేదని..

యముడు, గిముడు ఒట్టి కట్టు కథలని..

పెద, సాదా, బిక్కి, బీద చిన్న, పెద్ద..

ఎందరెందరు ఎంత నమ్మకంతో ఉండేవారు..

ఎంత దమ్ముతో బ్రతికే వారు..

అంతా వమ్ము చేసి వెళ్లిపోయావా..

అంతా ఖర్మని నమ్మమంటావా..

నీ వద్ధ నుంచి మేము ఎన్నోసార్లు

ప్రాణాలను అరువు తెచ్చుకున్నాము..

జీవితాలను పొడిగించుకున్నాము..

కానీ.. ఈనాడు అందరం, ఇందరం..

నిన్ను మృత్యువు నుంచి కావలేకపోయాము..

నిలబడి ఊరకే కన్నీరు కార్చాము..

అసహాయులమై అక్రందించాము..

అంతకన్నా ఏమి చేయగలం..

మర్త్యులము.. మామూలు మానవులము..

డాక్టరుగా సరే.. యాక్టరుగా

హిమాలయ శిఖరం అంతటి వాడవు నీవు..

ఆంధ్ర నాటక రంగంలో అతినూతన ఆధునాతన

యావనికలెన్నో ఆవిష్కరించావు..

నవయుగ గళములు పలికించావు..

ప్రజలకోసం కళ అనే సత్యాన్ని

ప్రతీసారి నిరూపించావు..

మామూలు మట్టిలోనుంచి

మహా నటీనటులను సృష్టించావు..

మా నాటకాలలో ఎన్నో పాత్రలకు

రూపం తెచ్చి ప్రాణం పోశావు..

ఎన్ని ప్రవేశికలు, ఎన్ని నిష్క్రమణలు..

ఎంత నాటకీయంగా

ఎదురుచూడని విధంగా ఏర్పరిచావు..

అందుకే నీ నిష్క్రమణ కూడా

అంత నాటకీయంగా చేశావు..

నీ హృదయంలా.. నీ ఇల్లు విశాలమైనది..

అది ఒక సత్రం అంటారు అందరూ..

కాదు.. పుష్పక విమానం అంటాను నేను..

ఎందరికైనా అందులో చోటుంది..

అందరికీ అందులో అన్నం ఉంది..

నిర్భాగ్యులకు, నిరుపేదలకు

నిరాశతో నీరయ్యేవారికి

నందన వనం అది..

ఆనంద నిలయం అది..

తిండి లేకపోయినా నీవు అండగా ఉంటే

నీ అభయహస్తం, నీ అమృత హాసం

నిరంతరం నీడనిస్తుందని..

ఆకలిదప్పులు తీరుస్తుందని

ధీమాగా ఉండేవారెందరో..

ధీనులు, దినం గడవలేని వారు..

దిగ్గజాల్లాంటి కళాకారులు..

నివురుగప్పిన నిప్పులు.. మట్టిలో మాణిక్యాలు..

మన సినిమా లోకం ఆదరించిన ఆర్టిస్టులు..

చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు..

వాళ్లందరినీ ఈనాడు అనాథలుగా చేశావు..

అమ్మనాన్నలు లేని పసిపాపలు వాళ్ళు..

ఏం చేయమంటావు వాళ్ళను..

ఎంతకాలం త్రాగమంటావు కన్నీళ్లను..

నీ మంచితనానికి పునాదిరాయే

పునీతమైన నీ సతి..

24 గంటలు ఇంటికి వచ్చిన అందరికీ

వండీ వార్చడం తప్ప వేరే ఎరుగని ఇల్లాలు

అన్నపూర్ణ, అరుంధతి, అర్థాంగి కాదు

ఆమె పూర్ణాంగి  నీకు..

కష్టాలనే మృష్టాన్నం చేసి తినిపించి

హరించుకునే శక్తిని కలుగజేశావు ఆ సతికి

కనుకనే కళ తప్పని నీ కాలేబరాన్ని కాంచి

కన్నీరైనా కార్చలేకపోయింది..

నిన్ను తీసుకెళుతుంటే ఎందుకు ఏడుస్తారు

అందరూ పోయేవారే అన్నది.

అదే నీవు ఆమెకు వదిలిన ఆస్తి..

నీవు చేసిన పుణ్యం..

నీవు చేసిన పుణ్యం..

నీవు చేసిన ప్రజాసేవ..

నీ త్యాగం వృధా పోదు..

అదే కోటి పువ్వులు పూస్తుంది..

శతకోటి కాయలు కాస్తుంది..

నీ సతీ సుతులను కాస్తుంది..

తెలుగు నాడు ధనం కురిపిస్తుంది..

కానీ నీ ఎత్తు ధనం పోసినా

నిన్ను మరలా తెచ్చుకోగలదా..

నీలాంటి మనిషిని చూడగలదా..

నీ ఋణం తీర్చుకోగలదా ఈ తెలుగుదేశం..

లేదు.. లేదు..

మా తపస్సు అందుకు చాలదు..

మా తుది ప్రార్థన ఒక్కటే..

నీవు హాయిగా, ప్రశాంతంగా..

ఆ జగన్నాటక సూత్రదారునికి..

నవ్య నాటక రీతులు చూపుతూ..

కళా ప్రయోజనం నేర్పుతూ..

దివిలో కూడా ఒక విప్లవం తీసుకు రా..

భువి మీద మేము..

శరద్ ఋతువు వెన్నెలలో..

వేసవి ఎర్రని ఎండలలో..

శిశిరములో, చలిలో..

వర్షా కాలపు మెరుపులలో..

ఉరుములలో..

మంద మందానిలంలో..

అనలంలో.. భయంకరమైన తుఫానులలో..

అనుదినం, అనుక్షణం

నిన్ను దర్శిస్తుంటాము..

నిన్నే స్మరిస్తుంటాము..

శాంతి.. శాంతి.. శాంతి..

అని వ్రాసిన ఆత్రేయ గారూ తన గురించి ఇలా వ్రాసుకున్నారు..

మంచితనానికి, మానవత్వానికి

ప్రతిరూపంగా నిన్ను ఆరాధించే

శత సహస్ర హృదయాలకు అద్దం పట్టిన ఆత్రేయ..

సెప్టెంబర్ 17, 1963..

జమున గారూ మాట్లాడుతూ నేను 100 సినిమాలు పూర్తి చేసిన తరువాత రాజారావు గారిని సన్మానిద్దామనుకున్నాను. కానీ ఇలాంటి సందర్భం ఒకటి వస్తుంది అని అనుకోలేదు అని బాధపడుతూ 25000 రూపాయలు విరాళం ప్రకటించారు. సినీ ప్రముఖులు, కళాకారులూ అంతా కలిసి లక్ష రూపాయలు విరాళాలు సేకరించి వారి కుటుంబానికి ఒక ఇల్లు కట్టించారు. డాక్టరు గరికపాటి రాజారావు గారూ మరణించి అరవై యేండ్లు దాటినా కూడా ప్రజా కళాకారుల గుండెల్లో ఆయన సదా చిరంజీవి.

Show More
Back to top button