Telugu Special Stories

సకల సమాచారానికి రేడియో తరంగాలే ఆధారం..!

ప్రపంచ దిశ దశను మార్చిన  ‘ రేడియో ‘ ఈ రోజు మనం వాడుతున్న  మొబైల్ ఫోన్, జీపీఎస్, వైఫై, బ్లూటూత్, హాట్ స్పాట్, ఇంటర్నెట్ లాంటి డిజిటల్ పరికరాలతో పాటు, దేశరక్షణ కోసం వినియోగిస్తున్న రాడార్లు, అంతరిక్షంలో సంచరిస్తున్న ఉపగ్రహాలు నుండి అందుకుంటున్న సకల సమాచారానికి రేడియో తరంగాలే ఆధారం. 

ప్రపంచ రేడియో దినోత్సవం:

ప్రపంచ రేడియో దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న నిర్వహించబడుతుంది. 13 ఫిబ్రవరి 1946 నాడు ఐక్యరాజ్యసమితి రేడియో  ప్రారంభ సందర్భంగా, 2011 నుంచి ప్రతి ఏటా ఈరోజున ఈ దినోత్సవం జరుపుకునేలా ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. రేడియో మాధ్యమ ప్రాధాన్యతను తెలియజేయడమే ఈ రోజు లక్ష్యం.

రేడియో తరంగాలంటే ?

సైన్స్ భాషలో చెప్పాలంటే రేడియో తరంగాలు  విద్యుదయస్కాంత వర్ణపటంలో అత్యల్ప పౌనఃపున్యాలు, పొడవైన తరంగదైర్ఘ్యాలు కలిగిన ఒక రకమైన విద్యుదయస్కాంత వికిరణం. 1867లో స్కాటిష్ గణిత భౌతిక శాస్త్రవేత్త జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్ ప్రతిపాదించిన విద్యుదయస్కాంత సిద్ధాంతం ద్వారా రేడియో తరంగాలను మొదట అంచనా వేశారు.1887లో జర్మన్ భౌతిక శాస్త్రవేత్త హెన్రిచ్ హెర్ట్జ్ తన ప్రయోగశాలలో కాంతి కంటే తక్కువ పౌనఃపున్యంలో విద్యుదయస్కాంత తరంగాలను ప్రయోగాత్మకంగా ఉత్పత్తి చేయడం ద్వారా మాక్స్వెల్ విద్యుదయస్కాంత తరంగాల వాస్తవికతను ప్రదర్శించాడు. ఇటాలియన్ ఆవిష్కర్త గుగ్లిఎల్మో మార్కోని 1894–1895 ప్రాంతంలో మొదటి ఆచరణాత్మక రేడియో ట్రాన్స్మిటర్లు మరియు రిసీవర్లను అభివృద్ధి చేశాడు. అతను తన రేడియో పనికి 1909లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. 1900 ప్రాంతంలో రేడియో కమ్యూనికేషన్ వాణిజ్యపరంగా ఉపయోగించడం ప్రారంభమైంది. ఆధునిక పదం ” రేడియో వేవ్ ” 1912 ప్రాంతంలో అసలు పేరు ” హెర్ట్జియన్ వేవ్ ” స్థానంలో వచ్చింది.

ప్రపంచంలో తొలి రేడియో ప్రసారాలు:

అమెరికాలోని పిట్స్‌బర్గ్ లో 2 నవంబర్ 1920న “అమెరికా అధ్యక్షుడిగా హార్డింగ్ ఎన్నికయ్యారు” అనే వార్తను ప్రసారం చేయడం ద్వారా ప్రపంచలో మెుట్టమెుదటి రేడియో ప్రసారం కేంద్రం ఏర్పాటయింది. అనంతరం ఇంగ్లాండ్లో 1922 అక్టోబర్ 18 న బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్  స్థాపించారు. 1922 నవంబర్ 14 బీబీసీ లండన్ కేంద్రంగా తన ప్రసారాలను ప్రారంభించింది.

మనదేశంలో రేడియో ప్రసారాలు:

భారతదేశ ప్రసార ప్రయాణం 1923 జూన్ లో రేడియో క్లబ్ ఆఫ్ బాంబే మొదటి ప్రసారంతో ప్రారంభమైంది. ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ (ఐబిసి) 1927 జూలై 23 న స్థాపించబడింది. ఆలిండియా రేడియో (ఎఐఆర్) 1936లో ఇండియన్ స్టేట్ బ్రాడ్ కాస్టింగ్ సర్వీస్ నుండి ఉద్భవించింది. స్వాతంత్ర్యానంతరం 1956లో “ఆకాశవాణి” అనే పేరును స్వీకరించి ఎ.ఐ.ఆర్ శరవేగంగా విస్తరించింది. అప్పటికి దేశంలో ఢిల్లీ , బొంబాయి, కలకత్తా, మద్రాస్ , తిరుచిరాపల్లి, లక్నోలలో ఆరు రేడియో స్టేషన్లు ఉన్నాయి.

ఎఫ్ఎం ప్రసారం 23 జూలై 1977న మద్రాసులో ప్రారంభమైంది. నేడు ఎఐఆర్ 591 స్టేషన్లను నిర్వహిస్తుంది. ఇది భారతదేశ జనాభాలో 98% మందికి రేడియో ప్రసారాలను అందిస్తుంది. 23 భాషలు, 146 మాండలికాలలో ప్రసారం చేస్తుంది. దేశ అభివృద్ధిలో బ్రాడ్ కాస్టింగ్ కీలక పాత్ర పోషించింది. స్వాతంత్ర్య పోరాట సమయంలో రేడియో సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, ఐక్యతను పెంపొందించడానికి ఒక శక్తివంతమైన సాధనంగా ఉంది. స్వాతంత్య్రానంతరం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత, ఆరోగ్య అవగాహన, వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది. 

రేడియో తరంగాల ఉపయోగం:

రేడియో, టెలివిజన్ ప్రసారాలు ఆడియో వీడియోలను పెద్ద సంఖ్యలో ప్రేక్షకులకు పంపడానికి,  మొబైల్ ఫోన్లు, బేస్ స్టేషన్లు మరియు స్మార్ట్ మీటర్లు కమ్యూనికేషన్ కోసం, రాడార్ ద్వారా వస్తువుల దూరం, వేగం, కోణాన్ని గుర్తించడానికి, వాతావరణ శాస్త్రవేత్తలు వాతావరణాన్ని ట్రాక్ చేయడానికి, అంచనా వేయడానికి, వైద్యరంగంలో సిటి, ఎమ్.ఆర్.ఐ స్కానింగ్‌లలో, మైక్రోవేవ్ ఓవెన్లలో, ఉపగ్రహ సమాచార మార్పిడిలో రేడియో తరంగాలను వాడుతారు.

Show More
Back to top button