ఢిల్లీ వైపు వెళుతున్న కారులో డ్రైవరుతో బాటు మరో నలుగురు ప్రయాణిస్తున్నారు. అందులో ఉన్న వారు ఢిల్లీలో జరిగే అత్యవసర సమావేశానికి హాజరువ్వడానికి వెళుతున్నారు. హఠాత్తుగా వారు ప్రయాణిస్తున్న కారు టైరు పంచరయ్యింది. డ్రైవరుతో సహా మిగిలిన వారు కూడా దిగారు. డ్రైవరు వేరే టైరును బిగించేపనిలో ఉన్నాడు. నలుగురిలో ఒకరు సిగరెట్టు వెలిగించాడు, ఒకాయన తన సెల్ ఫోన్ తీసి అవతలి వ్యక్తితో ఫోన్ లో సంభాషిస్తున్నాడు, మరొక వ్యక్తి తన వెంట తెచ్చుకొన్న ఫ్లాస్కులో ఉన్న కాఫీ త్రాగుతూ సేదతీరుతున్నాడు. కొద్దిసేపటికి ఆ ముగ్గురికి నాలుగవ వ్యక్తి గుర్తుకొచ్చాడు.
ఆ ముగ్గురూ నాలుగవ వ్యక్తివైపు చూసి ఆశ్ఛర్యపోయారు. ఎందుకంటే ఆ వ్యక్తి తన చొక్కాను పైకి అనుకొని, “టై” ని భుజం వెనక్కి వేసుకొని జాకీ, స్పానర్ తీసుకొని ఆ కారు డ్రైవర్ కు సహాయపడుతున్నాడు. ఇట్టి దృగ్విషయాన్ని చూసి మిగిలిన ముగ్గురూ అవాక్కయ్యారు. ఎందుకంటే ఆ సహాయం చేసే వ్యక్తి పేరు “రతన్ టాటా”. సార్ మీరు పనిచేయడం ఏమిటి అని అతడిని అడిగారు. “అవును మనం మీటింగ్ కు వెళ్ళాలి. టైరు మార్చడానికి డ్రైవర్ కు 15 నిమిషాల సమయం పడుతుంది. అదే నేను కూడా సహాయం చేస్తే ఎనిమిది నిమిషాల్లో ఆ పని పూర్తి అవుతుంది. తద్వారా మనకు ఏడు నిముషాలు కలిసొస్తాయి కదా” అన్నారు రతన్ టాటా. అది సమయం పట్ల ఆయనకున్న నిబద్దత, సమయ పాలన వలననే టాటా గ్రూప్ ను అంత గొప్ప స్థాయికి తీసుకురాగలిగారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన వ్యాపారవేత్త రతన్ టాటా. ఆయన ఆరు ఖండాలలో గల సుమారు వంద దేశాలలో టాటా గ్రూపునకు చెందిన ముప్పైకి పైగా కంపెనీలకు నేతృత్వం వహించారు. ఆయన మంచితనం, దయ, లక్ష్యం, నిజాయితీ, సమయపాలన, క్రమశిక్షణను, కఠోర పరిశ్రమ ఇవన్నీ ఆయనను ప్రపంచంలోనే అగ్రస్థాయి పారిశ్రామికవేత్తగా నిలబెట్టాయి. బాల్యంలో ఆయన తల్లి తండ్రులు విడిపోయారు. అవ్వ పెంచిపెద్ద చేసింది. యవ్వనంలో ఆయనను ప్రియురాలు మోసం చేసింది. తరువాత కంపెనీకి విపరీతమైన నష్టాలు వచ్చి సవాళ్ళు ఎదురయ్యాయి. అయినా సరే వెరవకుండా అన్నీటిని అదిగమించి కంపెనీని ఏ స్థాయికి తీసుకెళ్ళారంటే టాటా సంస్థ అయిన టి.సి.యస్ యొక్క స్టాక్ మార్కెట్ విలువ పాకిస్తాన్ దేశపు మొత్తం స్టాక్ మార్కెట్ విలువతో సమానమయ్యేంత స్థాయికి తీసుకెళ్లారు. భారతదేశపు జీడీపీకి టాటా సంస్థ ఒక్కటే 4 % సహకరించేంత స్థాయికి కంపెనీని తీర్చిదిద్దారు. ఇదంతా కూడా రతన్ టాటా ఘనతే.
ఏడు లక్షల మందికి ఉపాధినిస్తూ పది వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని తన యుక్తితో, తన వ్యాపార నిపుణతతో ఆరు లక్షల కోట్లకు ఎగబాకేలా చేసిన ఒకే ఒక్క పారిశ్రామిక వ్యాపారవేత్త రతన్ టాటా. టాటా ఉప్పు నుండి ఉక్కు వరకు టాటా టీ నుండి ట్రక్కుల వరకు దాదాపు నూట యాభై ఏళ్ళ చరిత్ర కలిగిన టాటా గ్రూప్ ను అందనంత ఎత్తులో నిలబడేలా చేశారు రతన్ టాటా. ప్రతీ వ్యాపారంలో ఖచ్చితంగా టాటా పేరు వినిపించేలా చేసిన ఘనత ఆయనది. విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ, వ్యాపారం అంటే కేవలం ఆదాయం మాత్రమే కాదని అభిమానం, ఆత్మీయత అనీ నిరూపిస్తూ భారతీయుల గుండెల్లో చెరగని ముద్రవేసిన గొప్ప వ్యాపారవేత్త ఆయన.
దేశం సంకట స్థితిలో ఉన్నప్పుడు అన్నీ మరిచి ఆపన్న హస్తాన్ని అందించే అచంచల దేశభక్తుడు. అంత ధనవంతుడై ఉండి కూడా ఏనాడూ కుబేరులతో కలిసి కనిపించేవారు కాదు. నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం ఆయన. పేద మధ్యతరగతి వాళ్ల కష్టాలను దూరం చెయ్యడమే వ్యాపరమని, ఆదాయం కంటే ఆత్మ సంతృప్తి గొప్పదని నమ్మే మంచి మనసుతో కొట్లాది భారతీయుల హృదయాలను దోచుకొని గొప్ప లాభాన్ని సంపాదించి ఆ భగవంతుడే ఆశ్చర్యపోయే ప్రేమాభిమానాల మూటలను వెంటబెట్టుకొని దివికేగిన అసలు సిసలైన భారత రత్నం “రతన్ టాటా”. ఈరోజు ఆయన జన్మదినం పురస్కరించుకొని తన జీవన ప్రస్థానాన్ని ఒక్కసారి పరిశీస్తే..
జీవిత విశేషాలు…
జన్మనామం : రతన్ టాటా
ఇతర పేర్లు : రతన్ నావల్ టాటా
జన్మదినం : 28 డిసెంబరు 1937
స్వస్థలం : ముంబై , భారతదేశం.
తల్లి : సూనీ టాటా
తండ్రి : నావెల్ టాటా
వృత్తి : వ్యాపారవేత్త, పరోపకారి, ఇన్వెస్టర్
జీవిత భాగస్వామి : అవివాహితులు
బిరుదులు : పద్మభూషణ (2000), పద్మవిభూషణ (2008)
మరణ కారణం : అనారోగ్యం
మరణం : 09 అక్టోబరు 2024, ముంబై, భారతదేశం
నేపథ్యం…
రతన్ నావల్ టాటా 28 డిసెంబరు 1937 నాడు బొంబాయిలో పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు సూనీ టాటా, నావల్ టాటా. 1948లో రతన్ టాటాకు పది సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అతని తల్లిదండ్రులు విడిపోయారు. రతన్ టాటా తన నాయనమ్మ నవాజ్ బాయ్ టాటా వద్ద పెరిగారు. ప్రాథమిక విద్యాభ్యాసం ముంబై, సిమ్లాలో జరిగింది. ఆ తరువాత ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం అమెరికాకు వెళ్లారు. అమెరికాలోని “రివర్ డేల్ కంట్రీ హై స్కూల్” లో పట్టా పుచ్చుకున్న అనంతరం “కార్నల్ యూనివర్సిటీ” లో ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు.
1959లో డిగ్రీ పట్టా పుచ్చుకొన్న రతన్ టాటా 2008లో అదే కార్నల్ యూనివర్సిటీకి 50 మిలియన్ డాలర్ల (420 కోట్ల రూపాయల) విరాళం ఇచ్చారు. ఆ విరాళంతో దాతృత్వంలో విశ్వవిద్యాలయ చరిత్రలోనే అతిపెద్ద అంతర్జాతీయ దాతగా నిలిచారు. అమెరికాలో పట్టభద్రుడైన అనంతరం ఆయన 1961 సంవత్సరంలో “టాటా సంస్థ” లో చేరారు. తొలత టాటా స్టీల్ లో చిరుద్యోగిగా చేరిన ఆయన, ఆ గ్రూపులోని వివిధ కంపెనీలో విభిన్న హోదాలలో పనిచేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే విద్యార్థిలా నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండే రతన్ టాటా 1971 లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ డైరెక్టర్ ఇన్చార్జిగా, 1981లో టాటా ఇండస్ట్రీస్ చైర్మన్ గా పలురకాల బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే 1975లో అమెరికాలోని హార్వార్డ్ బిజినెస్ స్కూల్ లో మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ పూర్తిచేశారు.
టాటా సంస్థల ఛైర్మన్ గా…
తన నైపుణ్యంతో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో టాటా కంపెనీలో ఒక ఉత్తమ ఉద్యోగిగా ఎదిగిన రతన్ టాటా, ఆ విధంగా కొన్ని సంవత్సరాలు ఉద్యోగిగానే పనిచేశారు. ఆ తరువాత 1991 లో జె.ఆర్.డి. టాటా నుండి టాటా గ్రూప్ చైర్మన్ గా భాద్యతలు స్వీకరించారు. ఈ నిర్ణయాన్ని అప్పట్లో టాటా గ్రూప్ బోర్డు మెంబెర్స్ లో చాలా మంది వ్యతిరేకించారు. ఏమాత్రం అనుభవం లేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల వ్యాపార సామ్రాజ్యం నడవలేదని పలువురు తమ అభిప్రాయాలను వెళ్ళిబుచ్చారు. కానీ ఆనాడు వారికి తెలియని విషయం ఏమిటంటే “టాటా గ్రూప్” ను ప్ర్రపంచంలో దశదిశలా వ్యాపింపజేసే ఘనుడు తానే అవుతాడని వారు ఊహించలేదు.
ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత టాటా గ్రూప్ లో సమూల ప్రక్షాళన చేశారు రతన్ టాటా. ఆయన తన అసాధారణ వ్యాపార నైపుణ్యంతో పగలు, రాత్రి కష్టపడి పదివేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని ఆరు లక్షల కోట్ల విలువ చేసే కంపెనీగా అభివృద్ధి చేశారు. దేశ వాణిజ్య , పారిశ్రామిక పురోగతిలో రతన్ టాటా కీలక పాత్ర పోషించారు. నేడు టాటా గ్రూప్ ను వందకి పైగా దేశాలలో విస్తరింపజేసి, వందకు పైగా వ్యాపారాలలో తనదైన ముద్రను వేసి, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీలలో ఒకటిగా నిలబెట్టారు ఆయన. టాటా కంపెనీ వ్యాపార సామ్రాజ్యంలో ఒక శిఖరంగా ఎదగగలిగింది అంటే అది ఆయన చొరవ, ఆయన ప్రతిభ, ఆయన శక్తి సామర్థ్యాలే అని చెప్పాలి.
ఏనాడూ కుబేరుల జాబితాలో నిలువని టాటా…
టాటా ప్రపంచ కుబేరుల జాబితా తీస్తే ఎప్పుడూ కూడా ఇంత పెద్ద కార్పొరేట్ కంపెనీ గ్రూప్ కు సూత్రధారి అయిన రతన్ టాటా పేరు మాత్రం కనిపించదు. ఎందుకంటే టాటా గ్రూప్ నుండి వచ్చే లాభాలలో 66శాతం టాటా ట్రస్టులకు విరాళంగా ఇవ్వటం జరుగుతుంది. రతన్ టాటా వ్యక్తిగత సంపాదన కూడబెట్టుకోవడం కంటే కూడా టాటా గ్రూప్ ను ఒక సామాజిక బాధ్యతాయుతమైన సంస్థగా తీర్చిదిద్దడం పైనే ఎక్కువ దృష్టి పెట్టారు. అందుకే లక్షల కోట్ల విలువ చేసే కంపెనీలకు అధిపతులైనా టాటా వంశీయులు ఇంతవరకు ఏనాడూ ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో నిలవలేదు. దేశ సామాజిక పరిస్థితులను మెరుగుపరచటానికి టాటా ట్రస్టులు ఎంతగానో కృషి చేస్తున్నాయి. తాజ్ ఉగ్ర దాడిలో నష్టపోయిన వారికి అన్ని విధాలా సహాయమందించారు రతన్ టాటా. ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక బాధ్యతయైన కంపెనీలలో ఒకటిగా మార్చి ఆరోగ్యం, విద్య, పేదరిక నిర్మూల వంటి రంగాలలో విస్తృతంగా పనిచేశారు.
రతన్ టాటా తమ సంపదలో ఎక్కువ భాగాన్ని వివిధ సామాజిక కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు. టాటా గ్రూప్ లోని ఎక్కువ భాగం ఆస్తులు ట్రస్టులకే వెళ్లాయి. దీనివలన వ్యక్తిగత సంపద కేంద్రీకరణ కాకుండా సంస్థ మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది. బ్రహ్మచారిగా ఉంటూ నలుగురి బాగు కోసం బ్రతికిన మహనీయులు రతన్ టాటా. అందువలననే తన ప్రతిభను మెచ్చి పలు దేశాలలోని యూనివర్సిటీలు ఆయనను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. అంతే కాదు భారత ప్రభుత్వం పద్మ భూషణ్ (2000), పద్మ విభూషణ్ (2008) లతో రతన్ టాటాను గౌరవించింది. కోట్లకు అధిపతి అయినా కూడా రతన్ టాటా ఏనాడూ కుసుమంత గర్వాన్ని కూడా ప్రదర్శించేవారు కాదు. 79 ఏళ్ళ వయస్సు లోనూ సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటూ కోట్ల మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్నారు. రతన్ టాటా అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక సంస్థ, ఒక బ్రాండ్. వీటన్నిటికీ మించి దార్శనికత, సృజనాత్మకత ఉన్న గొప్ప మానవతావాది.
లక్ష కే “నానో కారు”…
ఒక రోజు ముంబైలో కుటుంబమంతా ఒక ద్విచక్ర వాహనముపై వెళుతుండడం చూశారు రతన్ టాటా. కారులో ప్రయాణించాలనుకునే భారతీయ మధ్యతరగతి కుటుంబాల కల నెరవేర్చాలని ఆయన బలంగా సంకల్పించారు. ఆయన సంకల్పమే నానో కారు రూపకల్పనకు దారి తీసింది. దాంతో మధ్యతరగతి కలలను సాకారం చేసేందుకు టాటా సరికొత్త మోడల్ కారును ఆవిష్కరించింది. అదే రతన్ టాటా కలల ప్రాజెక్టు అయిన టాటా నానో. అందుకే మధ్యతరగతి వారు కూడా కొనేలా ఈ నానో కారును అందుబాటులోకి తీసుకువచ్చారు. లక్ష రూపాయలకే నానో కారును విక్రయించనున్నట్టు ప్రకటించారు.
ఆ కారును 2008లో మార్కెట్ లోకి తీసుకువచ్చారు. అప్పటికే ధనిక వర్గానికి పరిమితమైన ఈ కారును మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తెచ్చి వారి కలను నెరవేర్చారు. ఈ కారు బయటకు వచ్చాక ఆరంభంలో కష్టాలు ఎదుర్కొన్నా కూడా ఆటోమొబైల్ మార్కెట్ లో అది ఒక సంచలనం సృష్టించింది. ఆటోమొబైల్ పరిశ్రమ కేవలం ఉన్నత వర్గాల కోసమే కార్లను తయారు చేయడం కాకుండా మధ్యతరగతి దిగువ వర్గాలను దృష్టిలో ఉంచుకొని వాహనాలు తయారు చేయాలని చర్చకు దారితీసింది. ఈ విషయంలో రతన్ టాటా దృష్టి స్పష్టంగా ఉంది. మధ్యతరగతి స్తోమతకు తగ్గ కారును వారి ముందుచడం నానో కారుతో అది ఆయన పూర్తి చేశారు. ఆ తరువాత చాలామంది మధ్యతరగతి ప్రజలు ఈ నానో కారును కొనుగోలుజేశారు.
అవహేళన చేసిన వారే అక్కున చేర్చుకునేలా…
సాధారణ వ్యక్తులని అవమానాలు కృంగదీసి వారిని నిస్సహాయులని చేస్తాయి. అవే అవమానాలు గొప్ప వ్యక్తులని రెచ్చగొట్టి వారి నిజ జీవితంలో మరింత పైకెదిగేటట్టు చేస్తాయి. అవమానాలు ఎదుర్కొన్నప్పుడు గొప్ప వ్యక్తులు సహనం కోల్పోరు, ఎవరి మీద కోపం ప్రదర్శించరు. ఆ కోపాన్ని తమ మీదే ప్రదర్శించుకుని, తమ మీద తామే కోప్పడి మరింత కసితో పనిచేస్తారు. ఆ కసి చివరకు తనను అవమానించినవారినే తన కాళ్ల వద్ద చేరుకునేలా చేస్తోంది. రతన్ టాటా విషయంలోనూ ఇదే జరిగింది.
మామలుగానే టాటా కంపెనీ ఆరు ఖండాలు, వంద కంటే ఎక్కువ దేశాల్లో విస్తరించి తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రతన్ టాటా ఎంత ధనవంతుడైనా కానీ ఆయనలో కోపం, అహంకారం కనిపించవు. ఆయన గుణమే ఆయనను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యాపారవేత్తగా తీర్చిదిద్దింది. అయితే 1998లో టాటా గ్రూప్ తొలిసారిగా ప్యాసింజర్ కార్ల విభాగం లోకి అడుగుపెట్టింది. కానీ ఆ ఇండికా కార్లు వాహనదారులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో దాన్ని ఫోర్డ్ కు విక్రయించాలని టాటా గ్రూప్ భావించింది. దానికోసం చర్చలు జరపగా ఫోర్డ్ కంపెనీ ప్రతినిధులు టాటా గ్రూప్ ప్రతినిధులను చిన్నచూపు చూశారు.
కార్ల గురించి అవగాహన లేకుండానే ఈ రంగంలోకి ఎలా ప్రవేశించారు అని అవమానించారు. దీంతో ఆ డీల్ ని వద్దనుకొని ఇండికా కారులో స్వల్ప మార్పులు చేసి మళ్లీ మార్కెట్లోకి కొత్తగా తీసుకువచ్చారు. దాంతో ఇది మంచి విజయం సాధించింది. కాలమే అన్నింటికి సమాధానం చెబుతుంది అన్నట్లు టాటా కార్లను అవమానించిన కంపెనీయే దివాళా అంచున కూర్చుంది. దీంతో ఫోర్డ్ కంపెనీ తన లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ లాండ్ రోవర్ ను టాటాకు విక్రయించాలని భావించింది. అప్పుడు తమను అవమానించిన వారే ఇప్పుడు తమకు ఉపకారం చేస్తున్నారని వారు చెప్పారు. ఇప్పుడు ఆ కంపెనీ లాభాల్లో కొనసాగుతోంది. అవమానాన్ని సైతం పాఠంగా మల్చుకొని గొప్ప లక్షణాలు సాధిస్తారని చెప్పడానికి రతన్ టాటా ఒక ఉదాహరణ.
జీవితాంతం అవివాహితుడిగానే…
రతన్ టాటాకు అవివాహితులు. పెళ్లి కాలేదు, పిల్లలు లేరు. తన జీవితంలో నాలుగు సార్లు పెళ్లి చేసుకోవడానికి దగ్గరగా వచ్చారు. కానీ ఆగిపోయారు. పారిశ్రామికంగా ఎంతో ఎత్తుకు ఎదిగి, విజయాలు సాధించి ప్రపంచస్థాయి వ్యాపార దిగ్గజంగా పేరుపొందిన “రతన్ టాటా” కూడా మిగతావారిలాగే ప్రేమలో విఫలమయ్యారు. ఎంతోమందిలా ఓ “లవ్ ఫెయిల్యూర్”. దీనికి కారణం భారత్ చైనాల యుద్ధం. నిజమే. 1962లో భారత్, చైనా దేశాల మధ్య జరిగిన యుద్ధం “రతన్ టాటా” ప్రేమ విఫలం కావడానికి కారణమైంది. అప్పటికి తన వయస్సు 25 సంవత్సరాలు. ఆ వయస్సులో తన చదువు పూర్తిచేసుకుని అమెరికాలోని “లాస్ ఏంజెల్స్” లో ఆర్కిటెక్చర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు.
అక్కడ ఉద్యోగం చేస్తున్న సమయంలో అక్కడ “మహిళ” తో ప్రేమలో పడిపోయారు. ఆమెనే పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోవాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. కానీ సరిగ్గా అదే సమయానికి ఏడు సంవత్సరాలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన నాయనమ్మతో కొద్దిరోజులు సమయం గడపడం కోసం ఆయన స్వదేశానికి వచ్చారు. ఆయన ఆయన ప్రేయసి కూడా భారతదేశానికి వస్తుందని ఆశించారు. కానీ 1962 భారత్ – చైనా యుద్ధం ప్రారంభమైంది. దాంతో సదరు మహిళ తల్లిదండ్రులు ఆమె భారత్ వెళ్లేందుకు అంగీకరించలేదు. అక్కడితో రతన్ టాటా ప్రేమ కథ ముగిసింది. ఈ తొలిప్రేమ ఆయనకు తీరని జ్ఞాపకంగా మిగిలిపోయింది.
రతన్ టాటా తన ప్రేమకథను పలుమార్లు బయటపెట్టినా కూడా సదరు మహిళ ఎవరనేది ఆయన ఎప్పుడూ బయటపెట్టలేదు. ఆ తరువాత 1970లో హిందీ చిత్రశ్రమలో ప్రముఖ నటీమణిగా వెలుగొందిన “సిమీ గరేవాల్” కు రతన్ టాటా చాలా దగ్గరయ్యారు. దాంతో వారి బంధం పెళ్లి పీటల వరకు వెళుతుందని ఆశించారు, కానీ జరగలేదు. అందుకని “సిమీ గరేవాల్” మరొకని పెళ్ళాడింది. ఈ విధంగా నాలుగు వేరు వేరు సందర్భాలలో ఆయన పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధపడినా కూడా అవి వేర్వేరు కారణాలతో ఏవీ సిద్ధించకుండా అవి కేవలం ఆజన్మ బ్రహ్మచారిగానే ఉండిపోయారు.
స్వర్గ ప్రాప్తి…
అనారోగ్యం కారణంగా రతన్ టాటా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సోమవారం వార్తలు రాగానే “నా ఆరోగ్యం బాగానే ఉంది. వైద్య పరీక్షలు నిమిత్తం ఆసుపత్రికి వెళ్లాను. ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు” అని ఆయన అదే రోజు సామాజిక మాధ్యమం ట్విట్టర్ (“ఎక్స్”) ద్వారా స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ పరిస్థితి విషమించింది. దిగ్గజ పారిశ్రామికవేత్త పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత టాటా సన్స్ గౌరవ చైర్మన్ “రతన్ టాటా” (86) బుధవారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్య సమస్యల కారణంగా ముంబై లోని “బ్రీచ్ క్యాండీ హాస్పిటల్” అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూనే 09 అక్టోబరు 2024 నాడు రాత్రి 11 గంటల 30 నిమిషాలకు ఆయన స్వర్గప్రాప్తి పొందారు. ఆయన మరణం దేశంలో కొందరి కొన్ని లక్షల కుటుంబాలను ప్రభావితం చేసింది.
వ్యాపారం చేసి డబ్బు అందరూ సంపాదిస్తారు. కానీ పేరు, ప్రఖ్యాతులను, ప్రజల గుండెల్లో స్థానాన్ని మాత్రం చాలా తక్కువ మంది సంపాదిస్తారు. అలా చెప్పుకోవలసి వస్తే ప్రపంచం యావత్తూ చెప్పుకోదగిన మహోన్నత వ్యక్తి “రతన్ టాటా”. దేశం సంకట స్థితిలో ఉన్నప్పుడు అన్నీ మరిచి ఆపన్న హస్తాన్ని అందించిన అచంచల దేశభక్తుడు ఆయన. సంపన్న కుటుంబంలో పుట్టినా పేద, మధ్యతరగతి ప్రజల బ్రతుకులు బాగుండాలని ఆలోచించిన సహృదయుడు రతన్ టాటా. విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ, వ్యాపారం అంటే కేవలం ఆదాయం మాత్రమే కాదని అభిమానం, ఆత్మీయత అనీ నిరూపిస్తూ, ఒక మధ్యతరగతి కుటుంబం కలిసి ప్రయాణం చేయడానికి లక్ష రూపాయల్లో కారుని పరిచయం చేసిన గొప్ప వ్యక్తి రతన్ టాటా. భారతీయుల గుండెల్లో చెరగని ముద్రవేసిన గొప్ప వ్యాపారవేత్త. నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.