
నేటి ఆధునిక డిజిటల్ ప్రపంచంలో కూడా అనేక మూఢనమ్మకాలు, దురాచారాలు సమాజంలో కొనసాగుతూనే ఉన్నాయి. మాయలు, మంత్రాలు, తాయత్తులు నేటికీ మనలో భాగమై ఉన్నాయి. అదే విధంగా ప్రపంచంలోని కొన్ని దేశాల్లో నేటికీ బాలికలు, స్త్రీల జననేంద్రియాలను వైద్య విధానాలకు విరుద్ధంగా, బలవంతంగా, అనారోగ్యకర పద్దతుల్లో పాక్షికంగా లేదా పూర్తిగా తొలగించడం లేదా గాయపరచడం అనే దురాచారం అమరులు కావడం సోచనీయంగా ఉన్నది. దీనినే శాస్త్రీయ భాషలో “బాలికల, స్త్రీల జననేంద్రియ వికృతీకరణ లేదా ఫీమేల్ జెనిటల్ మ్యటిలేషన్” అని పిలుస్తాం.
ఇది ఒకలాంటి స్త్రీల జననేంద్రియాలకు చేసే సున్తీగా భావించాలి. ఇలాంటి ప్రమాదకర, అనారోగ్యకర, నిష్ప్రయోజన, నష్టదాయక అనాచారాన్ని కట్టడి చేయడానికి 2012లో ఐరాస జనరల్ అసెంబ్లీ తీర్మానం ప్రకారం ప్రతి ఏట 06 ఫిబ్రవరిన ప్రపంచ దేశాలు “అంతర్జాతీయ బాలికల, స్త్రీల జననేంద్రియ వికృతీకరణ వ్యతిరేక దినం (ఇంటర్నేషనల్ జే ఆఫ్ జీరో టాసరెన్స్ ఫర్ ఫీమేల్ జెనిటల్ మ్యుటిలేషన్)” పాటించుట ఆనవాయితీగా మారింది. అంతర్జాతీయ బాలికల, స్త్రీల జననేంద్రియ వికృతీకరణ వ్యతిరేక దినం – 2025 ఇతివృత్తంగా “చర్యల వేగాన్ని పెంచుదాం : బాలికల, స్త్రీల జననేంద్రియ వికృతీకరణ దురాచార అంతానికి బలమైన సమైక్య ఉద్యమాలు” అనే అంశాన్ని తీసుకున్నారు.
బాలికల, స్త్రీల జననేంద్రియ వికృతి కరణతో లాభం శూన్యం, నష్టం అనంతం:
ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చకుండా కేవలం హానిని మాత్రమే కలిగిస్తున్న ‘బాలికల, స్త్రీల జననేంద్రియ వికృతీకరణ’ దురాచారం వల్ల తీవ్రమైన శారీరక నొప్పులు, రక్తస్రావం, శరీర కణజాలాల విధ్వంసం, ఇతర అవయవాల విధులకు నష్టం, ఇన్‌ఫెక్షన్లు పెరగడం, దీర్ఘకాల అనారోగ్యం, సంతానలేమి, శిశుజనన సమస్యలు, మానసిక ఒత్తిడి పెరగడం, శస్త్రచికిత్సలు పెరగడం, మూత్రం చూసినపుడు తీవ్రమైన మంట కలగడం లాంటి అనర్థాలు జరుగుతాయని తెలిస్తే ఆశ్చర్యకరంగా, అనాగరికంగా తోస్తున్నది. బాలికల, స్త్రీల జననేంద్రియ వికృతీకరణ దురాచార పద్దతిలో బాలికల లేదా స్త్రీల క్లిటారిస్‌ను పాక్షికంగా లేదా పూర్తిగా తొలగించడం, లాబియా మైనరా లేదా మేజరాలను తొలగించడం లేదా గాయపరచడం, వజీనల్ ద్వారాన్ని తగ్గించడాన్ని అశాస్త్రీయంగా, అనారోగ్యకరంగా, ఆక్షేపణీయంగా చేయడం కొనసాగుతున్నది. ఇలాంటి హానికరమైన విధానంలో ప్రిక్కింగ్, పీర్సింగ్, ఇన్‌సైజింగ్, స్క్రాపింగ్, లేదా కాలరైజింగ్ పద్ధతులను వాడుతూ జననేంద్రియాలను గాయపరచడం, పాక్షికంగా లేదా పూర్తిగా తొలగించడం జరుగుతున్నది.
పలు ప్రపంచ దేశాల్లో బాలికల, స్త్రీల జననేంద్రియ వికృతి కరుణ దురాచారం:
బలవంతంగా అమలు చేస్తున్న హానికారక బాలికల, స్త్రీల జననేంద్రియ వికృతి కరుణ దురాచారంతో ప్రతి ఏట 4.4 మిలియన్ల బాలికలు లేదా స్త్రీలు (రోజుకు 12,000 మంది) బాధపడుతూ ఉన్నారు. ఇప్పటికే 200 మిలియన్ల కన్న అధికంగా బాలికలు, మహిళలు బాలికల, స్త్రీల జననేంద్రియ వికృతీకరణ దురాచార బారిన పడ్డారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. దాదాపు 30 ఆఫ్రికన్ దేశాలు (ఏడాదికి 3 మిలియన్లు), మిడిల్ ఈస్ట్ దేశాలతో పాటు దాదాపు విశ్వవ్యాప్తంగా ఈ దురాచారం కొనసాగుతున్నది. గత దశాబ్ద కాలంగా బాలికల, స్త్రీల జననేంద్రియ వికృతీకరణ దురాచారం క్రమంగా తగ్గుతున్నట్లు కూడా గమనించడం కొంత ఊరటను ఇస్తున్నది. దీని వల్ల బాలికల/మహిళల మానవ హక్కుల ఉల్లంఘన, అసమానతలు పెరగడం, విద్యకు దూరం కావడం, ఆర్థిక నష్టాలు, అనారోగ్యాలు కలుగుతున్నాయి. ఈ సామాజిక, లింగ ఆధార దురాచారాన్ని కట్టడి చేయడానికి అందరం సమైక్యమే, గళాలను విప్పుతూ, చర్యల వైపు అడుగులు వేస్తూ, సంపూర్ణ అవగాహన కల్పించడమే ఉత్తమ మార్గమని తెలుసుకోవాలి.
బాలికల, స్త్రీల జననేంద్రియ వికృతీకరణ దురాచార మూలాలు:
ఆడ శిశువు నుంచి 15 ఏండ్ల బాలికలకు, కొన్ని సందర్భాల్లో మహిళలు కూడా జననేంద్రియ వికృతీకరణ ఆచారం వలయంలో చిక్కుతూ తీవ్రమైన బాధలను నిశ్శబ్దంగా అనుభవిస్తున్నారు. పెళ్లి కాని యువతులు, బాలికలు, మహిళలు జననేంద్రియ వికృతీకరణ దురాచారం విష వలలో చిక్కి తల్లడిల్లుతున్నారు. సామాజిక, సంస్కృతి, మత విశ్వాసాల చెరలో చిక్కిన బాలికలు, మహిళలు ఈ దురాచారం బారిన పడుతున్నారు. కొన్ని మతాల్లో పెళ్లికి ముందు వధువు జననేంద్రియ వికృతీకరణ తప్పనిసరి అని తెలిస్తే బాధ కలుగుతుంది. యువతులు లేదా మహిళల్లో లైంగిక కోరికలను నియంత్రణలో ఉంచడానికి కూడా ఈ దురాచారం కొనసాగుతున్నట్లు పేర్కొనబడింది. బాలికల, స్త్రీల జననేంద్రియ వికృతి కరణ దురాచారాన్ని ఏ మత గ్రంథాలు ప్రస్తావించనప్పటికీ దానిని ఆధునిక యుగంలో కూడా కొనసాగించడం విచారకరం.
మౌలిక మానవ హక్కుల హననం జరుగుతున్న వేళ కూడా బాలికల, స్త్రీల జననేంద్రియ వికృతి కరుణ దురాచారంతో వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడం, అతివను చులకనగా చూడడం, హింసించడం కొనసాగుతున్నది. ఈ దురాచారానికి చరమగీతం పాడడానికి ప్రభుత్వాలు, పౌర సమాజం, స్వచ్చంధ సంస్థలు కలిసి అవగాహన కలిగించడానికి చొరవ చూపుతూ బాలికల, స్త్రీల జననేంద్రియ వికృతీకరణ దురాచార అంతానికి ప్రతిన బూనాలి.