Telugu Special Stories

దేశంకోసం ఆత్మ బలిదానం గావించిన.. షహీద్‌ భగత్‌సింగ్‌!

తన ఆత్మ బలిదానంతో భారత స్వాతంత్య్ర చరిత్ర గమనానికి ఒక దిక్సూచిలా వెలిగిన అమరజీవి ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అంటూ స్వరాజ్యం కోసం నినదించిన వీరుడు.. 

23ఏళ్ల వయసులో దేశంకోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యోధుడు.. 

వారసత్వంగా విప్లవభావాల్ని తాత, తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్నాడు..  

మనుషులను చంపగలరేమో కానీ, వారి ఆశయాలను చంపలేరని చాటిచెప్పిన విప్లవ వీరుడు సర్దార్‌ భగత్‌సింగ్‌…

ఆయన ఆశయాలు, ఆలోచనలు, ఆవేశం ఎంతోమంది యువకుల్లో స్ఫూర్తినింపింది. 

గొప్ప విప్లవకారుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా చరిత్రలో నిలిచిపోయిన వీరుడు భగత్‌సింగ్‌.. వర్ధంతి రేపు సందర్భంగా ఆయన గురుంచి ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం:

తాత, తండ్రిలే స్ఫూర్తి… 

భగత్ సింగ్ స్వగ్రామం.. బంగా.. తండ్రి కిషన్ సింగ్.. తల్లి విద్యావతి. తాత అర్జున్ సింగ్. వీరిది సామాన్య కుటుంబం. తాత పంజాబ్, హిందీ, సంస్కృతం, పర్షియన్, ఉర్దూ వంటి పలు భాషల్లో ప్రావీణ్యులు.. అప్పట్లో జాతీయభావాలను ప్రజల్లో ముమ్మరంగా వ్యాప్తి చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఆర్య సమాజ్ వంటి కార్యకలాపాల్లోనూ పాలు పంచుకున్నారు. అంతేకాక ఈయన రైతు, యునాని వైద్యం చేసేవారు. ప్లీడరు గుమస్తాగా ఉద్యోగం సైతం చేశారు. బానిసత్వపు సంకెళ్ళ నుంచి భారతదేశాన్ని విముక్తి చేయాలనీ నిరంతరం తపించాడు. భగత్ తన బాల్యమంతా తాతయ్య వద్దే పెరగడంతో అయన తాలుకూ విప్లవభావాలు పుష్కలంగా భగత్ లో నాటుకున్నాయి. 

ఇక తండ్రి కిషన్ సింగ్ విషయానికొస్తే.. అప్పట్లో కరవులు, భూకంపాలు సంభవించిన నేపథ్యంలో మధ్యప్రదేశ్, గుజరాత్, కాశ్మీర్ వంటి ప్రాంతాలకు వెళ్లి సహాయ సహకారాలు అందించడంలో ముందున్నారు ఈయన. రాజకీయాల్లోనూ ప్రవేశం ఉంది. 1905లో దేశాన్ని ఊపేసిన ‘బెంగాల్ విభజన’ వ్యతిరేకోద్యమంలో క్రియాశీల పాత్ర పోషించాడు. ఎన్నో పోరాటాల తర్వాత జైలు జీవితాన్ని కూడా అనుభవించారాయన. అక్కడ జైలులో అమానుష చర్యలను, చిత్ర హింసలను సహించక నిరసనగా నిరాహార దీక్ష చేపట్టారు. వ్యతిరేకతను సమ్మతించని బ్రిటిష్ ప్రభుత్వం ఏకంగా 42 కేసులు పెట్టించింది కిషన్ సింగ్ పైన… ఫలితంగా దాదాపు రెండున్నరేళ్ల పాటు జైలులోనే ఉండేలా చేసింది. అయినా బెదరకుండా రహస్య ఒప్పందాలను నెరపి, పంజాబ్ అంతటా స్వాంతంత్య్ర కాంక్షను రగిలించడంలో కృషి చేశారు. బాబాయ్ లు అయిన అజిత్ సింగ్, స్వరణ్ సింగ్ లు కూడా స్వాంతంత్య్ర క్రతువులో ముఖ్యభూమిక పోషించారని చెప్పొచ్చు.  అనంతరం వీరమరణం పొందారు.  

జననం, బాల్యం, చదువు 

అది 20వ శతాబ్దం.. బెంగాల్ విభజన, స్వదేశీ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజులవి. దేశమంతటా విప్లవ వాతావరణం అలుముకుంది. ఈ సమయంలోనే, 1907 సెప్టెంబర్ 28న పంజాబ్ లోని బంగా లో జన్మించాడు భగత్ సింగ్. ఇతను పుట్టిన నాటికి తన తండ్రి దగ్గర లేడు. బ్రిటిష్ వారి నుంచి అరెస్టును తప్పించుకోవడానికి దేశాంతరం వెళ్ళాడు. అటువంటిది తండ్రి, ఇద్దరు తమ్ముళ్లు తిరిగి వస్తున్నట్లు కబురు అందడంతో ఆ ఇంట్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భగత్ పుడుతూనే ఇంటికి భాగ్యం తెచ్చాడని, భాగన్ లాల్, భగత్ అని పిలుస్తూ.. తర్వాత భగత్ సింగ్ గా పేరు స్థిరపడిపోయింది. 

అలా తిరిగొచ్చిన వారిని ఎప్పుడు అరెస్టు చేస్తారో, ఉరి వేస్తారో తెలియదు కనుక భగత్ సింగ్ తండ్రి.. అయన సోదరులైన అజిత్ సింగ్ ను విదేశాలకు పంపాడు. స్వరణ్ సింగ్ మాత్రం ఇక్కడే ఉండటంతో, వారికి చిక్కి, జైల్లోనే జీవితం గడిపాడు. అక్కడ ఉన్నప్పుడే క్షయ వచ్చింది. అది ముదిరి జైల్లోనే చనిపోయాడు. 

ఇక తండ్రి కిషన్ సింగ్ మాత్రం ఇంటి వద్దే ఉంటూ…  పలు విప్లవ కార్యకలాపాలకు సాయపడుతూ ఆర్థిక సూచనలు చేస్తూ ఉండేవాడు. ఇలా ఏ అవసరం ఉన్నా, వెళ్తుండేవాడు. ఇంటికెప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉండేవాళ్ళు. ఈ రకంగా భగత్ ఇల్లు ఒక రహస్య ఆశ్రయంగా మారింది.  తాత అర్జున్ సింగ్ జాతీయవాదులకు పెద్ద అండ. ఇక ఇంట్లో ఎప్పుడు రాజకీయ చర్చలు, రహస్య ప్రణాళికలు, వాటికి సంబందించిన సమాలోచనలు జరుగుతుండేవి. ఇవన్నీ చూస్తూ పెరిగిన భగత్ తెల్లవాళ్లు మన దేశానికి చేస్తున్న ద్రోహాన్ని, అన్యాయాన్ని వాళ్ల సంభాషణల్లో వినేవాడు. 

తన ఈడూ పిల్లలంతా బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే, భగత్ సింగ్ మాత్రం దేశ విముక్తి కోసం తెల్లవాళ్ళను తరిమి కొట్టేందుకు ముందుకు ఉరకాలని చూసేవాడు. బంగాలోని ప్రైమరీ స్కూల్ లో చేరాడు. చదువుపై ఇష్టం ఏర్పడింది. ఆటల్లో, చదువులో ఎప్పుడు చురుకుగానే ఉండేవాడు. కానీ భగత్ తనకున్న స్వేచ్ఛాయుత ఆలోచనల వల్ల ఎప్పుడు ఒంటరిగా ఉండటాన్నే ఇష్టపడేవాడు.  తన మేధస్సును చూసి పాఠాలు చెప్పే టీచర్లు సైతం అబ్బురపోయేవారు. పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే మాత్రం గుక్కతిప్పుకోకుండా.. నేను నాకోసం ఏమవుతానో నాకైతే తెలియదు కానీ, ఏది చేసిన ఈ దేశం కోసం, ప్రజల కోసం మంచినే చేస్తా అని అన్నాడట.. అది విని అక్కడి విద్యార్థులు, టీచర్లంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు.  

ఇక భగత్ కు అన్న జగత్ సింగ్ అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడు వెంటే తిరుగుతూ ఉండేవారు. అలాంటిది జగత్ ఉన్నటుండి జ్వరం బారిన పడి, అది ముదిరి, చనిపోయాడు. దీంతో భగత్ ఎప్పుడు తోడుగా ఉండే అన్న దూరం కావడాన్ని తట్టుకోలేకపోయాడు. మానసికంగా కుంగిపోయాడు. ఎప్పుడు దిగాలుగా కూర్చోడం, తిండి సరిగా తినకపోవడంతో.. ఉన్న ఒక్క కొడుకు కూడా ఏమైపోతాడోనని తండ్రి కిషన్ సింగ్ మకాం లాహోర్ కు మార్చాడు.  

భగత్ కి తొమిదేళ్ళు.. ఎంతో పేరు ప్రఖ్యాతులున్న సిక్కుల ఖాల్సా స్కూల్ లో వేయకుండా.. స్థానికంగా ఉన్న డి.ఏ. వి పాఠశాలలో చేర్పించాడు. కొత్త వాతావరణం, కొత్త మనుషుల వల్ల భగత్ కాస్త తిరిగి అందరిలో తిరుగుతున్నాడు. లాహోర్ లోనూ తండ్రి రాత్రి, పగలు లేకుండా చేసే రాజకీయాల చర్చిలు విని.. తన ఆలోచన విధానమే పూర్తిగా మారిపోయింది. తన పాఠ్యపుస్తకాల కంటే మహనీయుల జీవితానుభవాలనే పాఠాలుగా నేర్చుకున్నాడు. ఇది గమనించిన  భగత్ తల్లి.. ఓ రోజు ఇలా అడిగింది. నువ్వు మరో ప్రభుత్వ వ్యతిరేకివి అవ్వాలనుకున్నటున్నావా.. ఇలా చేస్తే నువ్వు ఎన్ని అవస్తలు ఎదుర్కోవాల్సి వస్తుందో… ఎన్నేళ్లు జైల్లో మగ్గుతావో.. అని మనసులో అనుకుంది. తల్లి కదా ఆమె భయంలో నిజం లేకపోలేదూ.. 

తండ్రి వద్దన్నా వినకుండా స్కూల్ మానేసి అప్పట్లో గొప్పగా సాగుతున్న గాంధీయ ఉద్యమంలో చేరాడు. వస్తుందనుకున్న స్వరాజ్యం అయితే రాలేదు. కానీ ఏడాది చదువు పోయింది. సరిగా చదివి ఉంటె ఈపాటికి పదవ తరగతి అయిపోయి.. కాలేజీలో చేరి ఉండేవాడు. నిజానికి తనకు సర్కారు కాలేజీలో చేరడంకన్నా కూడా లాలా లజపతి రాయ్ స్థాపించిన నేషనల్ కాలేజిలో చేరాలనే ఆకాంక్షే ఎక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడ జాతీయవిద్యను భోదిస్తారని తెలిసి, అక్కడైతేనే తాను ఏదైనా చేయగలనని భావించాడు. 

కానీ ఇక్కడే ఒక చిక్కు ఉంది. ఇందులో చేరేవారికి కనీస అర్హత పదో తరగతి. దీంతో రూల్ ప్రకారం వీలు కాకున్నా తండ్రి, తాతల విప్లవ కృషిని విని, తనను చేర్చుకున్నారు. తక్కువ కాలంలోనే భగత్ సింగ్ సామాన్యుడు కాదని, ఎంతో ప్రతిభావంతుడని, ఆయన ప్రజ్ఞకు ప్రజ్ఞకు ముగ్దుడై మరిన్ని పుస్తకాలు చదువుకోమని అక్కడి లెక్చరర్లు ప్రోత్సహించారు. 

రాజకీయాల్లోకి… 

1919.. జలియన్‌వాలాబాగ్‌లో జరిగిన అనంతరం.. బ్రిటిష్‌వారు అవలంబించిన ‘విభజించి పాలించు’ పద్ధతికి మరింత పదునుపెట్టారు. ఈ ఘటనలో మరణించిన వారిలో అన్ని మతాల వారున్నారు. దీని తర్వాత 1924లో దేశవ్యాప్తంగా మత ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలపై ఒక జాతీయ చర్చ తెరపైకి వచ్చింది. సార్వత్రికంగా అలాంటి మత ఘర్షణలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని స్వాతంత్య్రోద్యమం గుర్తించింది. ఈ పరిణామాలతో నాటి కాంగ్రెస్‌ నాయకత్వం హిందూ, ముస్లిం నాయకులతో శాంతి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించే ప్రయత్నం చేసింది. దీనికి భగత్‌సింగ్‌ కూడా మద్దతు ఇచ్చారు. ఇస్తూ ఇలా పలికాడు.. ‘నేడు భారతదేశ పరిస్థితి దయనీయంగా ఉంది. ఒక మతానికి చెందిన ప్రజలు పరస్పరం ఇతర మతస్తులను శత్రువులుగా భావిస్తున్నారు. కనుక రాజకీయాల నుంచి మతాన్ని వేరుచేయడమే దీనికి పరిష్కారం’ అని భగత్‌సింగ్‌ అన్నాడు. 

ఇతరాంశాలు

వర్గ చైతన్యమే మతతత్వాన్ని నిర్మూలిస్తుందని బలంగా నమ్మిన వ్యక్తి భగత్‌సింగ్‌.

సమానత్వం, సామాజిక న్యాయం గురించి భగత్‌సింగ్‌ చాలా రచనలు చేశారు. ‘ప్రజలందరూ సమానులేనని, వర్గాల విభజన, అంటరానితనం అనే విభజన ఉండకూడదనీ, మతానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడకుండా ఇంట్లో కూర్చుంటామని ప్రతిజ్ఞ చెయ్యాలి లేదా దాన్ని కచ్చితంగా వ్యతిరేకించాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. 

ఉరికొయ్య ముందు నిల్చొని ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అనే నినాదమిచ్చారు. ఆ ధైర్యమే విప్లవ ప్రవాహంలా మారి, తర్వాతి తరాలకు మార్గదర్శనం అయింది.

1928లో శాంతియుతంగా ఉద్యమిస్తున్న లాలా లజపతిరాయ్‌.. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా బ్రిటిష్‌ పోలీసుల దాడిలో మరణించారు. ఆయన మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని భగత్‌సింగ్‌ ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు. 

నేషనల్‌ కాలేజీలో చదువుతున్నప్పుడు భగవత్‌ చరణ్‌ సుఖ్‌దేవ్, యశ్‌పాల్‌లు భగత్‌ సింగ్‌కు స్నేహితులు. వారితో కలిసి దేశ చరిత్ర, విప్లవాలపై నిత్యం అధ్యయనం చేసేవాడు. ఈ  క్రమంలో ముగ్గురు సన్నిహిత మిత్రులయ్యారు.  

అప్పట్లో నవజవాన్‌ భారతసభను స్థాపించాడు. ఆపై నవజవాన్‌ భారత సభను.. చంద్రశేఖర్‌ ఆజాద్‌ స్థాపించిన హిందుస్థాన్‌ రిపబ్లికన్‌ ఆర్మీని కలుపుతూ హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రివల్యూషన్‌ ఆర్మీగా నెలకొల్పారు. ఈ కారణం చేత బ్రిటిష్‌ ప్రభుత్వం వీరిని అరెస్ట్‌ చేసింది. మరోవైపున శాండర్స్‌ హత్య కేసులో భాగంగా సుఖదేవ్, రాజ్‌గురులనూ అరెస్ట్‌ చేసి రెండేళ్లపాటు జైల్లో ఉంచింది. 

1931 మార్చి 24న భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరితీయాలని ప్రకటించిన ప్రభుత్వం.. అనంతరం దేశవ్యాప్తంగా నెలకొన్న ఆందోళనకు భయపడి ఒక్కరోజు ముందుగానే అంటే, 1931 మార్చి 23న సాయంత్రం 7 గంటలకు వీరిని ఉరితీసింది. ఈ రకంగా భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌ దేవ్‌లు 23 ఏళ్ల ప్రాయంలో ఉరితాళ్ళను ముద్దాడుతూ, ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అంటూ ప్రాణాలు వదిలారు. 

ఉరిశిక్ష ఖరారైనప్పటికీ ఈ పోరాటం తమతో ఆరంభం కాలేదని, అలాంటిది తమతోనే అంతం కాదని భగత్‌సింగ్ చాటాడు. 

Show More
Back to top button