షిన్‌కున్ లా” (“షింగో లా” అని కూడా పిలుస్తారు) భారతదేశంలో లడఖ్ మరియు హిమాచల్ ప్రదేశ్ మధ్య రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఒక పర్వత మార్గం. ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ ప్రాంతాన్ని లడఖ్‌లోని జన్స్కర్ ప్రాంతంతో కలుపుతుంది. సముద్ర మట్టానికి 16,580 అడుగుల ఎత్తున ఉన్న “షిన్‌కున్ లా” పాస్ వద్ద నిము-పదమ్-దర్చా రహదారిని అనుసంధానిస్తూ నాలుగు వరుసలతో ఏక దిశలో రెండు గోళాకారపు సొరంగాలతో సముద్రమట్టానికి 15,800 అడుగుల ఎత్తున నిర్మితమవనున్న “షిన్‌కున్ లా” మోటారు సొరంగ మార్గాన్ని 2025 చివరి నాటికి పూర్తిచేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది భారత ప్రభుత్వం.
ఏడాదికి ఐదు నుంచి ఏడు నెలల పాటు మంచు కారణంగా మూసుకుపోయే మనాలి-లేహ్ మరియు శ్రీనగర్-లేహ్ హైవేలకు మూడవ ప్రత్యామ్నాయ రహదారిగా దీనిని అందుబాటులోకి తీసుకురావాలన్నది మన ప్రభుత్వ సంకల్పం. జూలై 26న “విజయ్ దివస్” రజతోత్సవాలను పురస్కరించుకుని లడఖ్ లోని ద్రాస్ సెక్టార్లో గల “కార్గిల్ యుద్ధ వీరుల స్మారకాన్ని” సందర్శించి నివాళులు సమర్పించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ మరియు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ “షిన్‌కున్ లా టన్నెల్” ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మొదటి కొండను రిమోట్ ద్వారా పేల్చి శంఖుస్థాపన చేసారు..
*వ్యూహాత్మకం:*
షిన్‌కున్ లా టన్నెల్ ప్రాజెక్ట్ లడఖ్ ప్రాంతంలో నైసర్గికంగా అత్యంత కఠినమైన భూభాగంలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులతో విసిరే సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో సముద్ర మట్టానికి 16,580 అడుగుల ఎత్తులో ఉండే షిన్‌కున్ లా పాస్ కింద సొరంగం నిర్మించాలని భారత ప్రభుత్వం సంకల్పించడం ఒక వ్యూహాత్మక చొరవ అని చెప్పవచ్చు. చైనాతో కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల నడుమ, ఈ నిర్ణయం సరిహద్దు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో భారతదేశం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఏడాదికి ఐదు నుంచి ఏడు నెలల పాటు మంచు కారణంగా మూసుకుపోయే మనాలి-సర్చు-లేహ్ మరియు శ్రీనగర్-కార్గిల్-లేహ్ హైవేలకు ప్రత్యామ్నాయంగా ఇది మూడవ రహదారిగా అందుబాటులోకి రానుంది.
ఇది కార్గిల్, సియాచిన్ మరియు నియంత్రణ రేఖ (ఎల్ ఓ సి) వంటి వ్యూహాత్మక ప్రదేశాలకు దూరం తగ్గించడంతో పాటు నిరంతరాయంగా భారత సైన్యం యొక్క భారీ యంత్రాలు, సరుకు రవాణాను సులభతరం చేయడంతో పాటు సైనికుల కదలికలను త్వరితగతం చేయడానికి దోహదపడుతుంది. లడఖ్, కార్గిల్, సియాచిన్ సెక్టర్లలో ఉండే భారత సైన్యానికి ఆహారం, ఆయుధాలు సరఫరా చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు ఈ సొరంగ మార్గం అత్యంత సురక్షితంగా మన సైనిక వాహనాల కదలికలు చైనా లేదా పాకిస్తాన్‌ల నిఘా కక్ష్య పరిధిలోకి రాకుండా ఉంచడంతో పాటు శత్రు దేశాల సుదూర ఫిరంగి లేదా క్షిపణి కాల్పులకు అందుబాటులో లేకుండా చేస్తుంది.
దీనివల్ల భారత సాయుధ దళాలు మెరుగైన కార్యాచరణ సంసిద్ధతను సంతరించుకునేందుకు, శత్రు దేశం ద్వారా ఉత్పన్నమయ్యే ఎటువంటి ఊహించని పరిణామాలనైనా తట్టుకుని ధీటుగా తిప్పికొట్టేందుకు వెసులుబాటు కలుగుతుంది. మొత్తం 297 కిలోమీటర్ల పొడవు గల దర్చా-పడుమ్-నిము రోడ్డులో 100 కిలోమీటర్లు ఇప్పటికే రెండు వరుసల తారు రోడ్డుతో అందుబాటులో ఉంది. కొత్త రోడ్డు నిర్మాణం వల్ల మనాలీ-లేహ్ మధ్య దూరంలో మార్పు ఉండకపోయినప్పటికీ ఇది మంచు బారిన పడకుండా ఏడాది పొడవునా ప్రయాణించేందుకు వీలవుతుంది. ఇప్పటి వరకు చైనా లోని 15,590 అడుగుల ఎత్తులో ఉన్న “మి లా టన్నెల్” ప్రపంచంలోనే ఎత్తైన సొరంగ మార్గం కాగా, పూర్తయిన తరువాత “షిన్‌కున్ లా” ప్రపంచంలోనే ఎత్తైన సొరంగం మార్గంగా రికార్డు సృష్టించనుంది. అంతే కాక ఇది భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మైలురాయిగా, దేశ రక్షణ మరియు ఆర్థిక వ్యూహంలో కీలకమైన ఆస్తిగా మారనుంది.
*ప్రాజెక్టు వివరాలు:*
ఫిబ్రవరి 15, 2023న కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టు పనులను ప్రభుత్వ ఆధీనంలోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బి ఆర్ ఓ) అనుబంధ సంస్థ “ప్రాజెక్ట్ యోజక్” చేపట్టనుంది. బడ్జెట్ కేటాయింపులు మరియు టెండర్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, రూ.1,681.50 కోట్ల భారీ వ్యయంతో ఏడాది పొడవునా మనాలి – లేహ్ మార్గం అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రధాన లక్ష్యంతో, సముద్రమట్టానికి 15,800 అడుగుల ఎత్తున 4.10 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబడుతున్న ఈ షిన్‌కున్ లా సొరంగం, పూర్తయిన తరువాత ప్రపంచం లోనే అత్యంత పొడవైన హైవే టన్నెల్ అవుతుంది. మనాలి నుండి లేహ్ మీదుగా కార్గిల్ చేరుకోవడానికి 700 కిలోమీటర్లు కాగా “షిన్‌కున్ లా టన్నెల్” అందుబాటులోకి వస్తే దర్చా-షిన్‌కున్ లా-పదమ్-నిము రహదారి మీదుగా ఆ దూరం 522 కిలోమీటర్లకు తగ్గుతుంది. షిన్‌కున్ లా టన్నెల్ విజయవంతంగా పూర్తయితే అది భవిష్యత్తులో చేపట్టబోయే ఎత్తైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణంలో భారతదేశ సమర్థతకు ఒక గీటురాయిగా నిలుస్తుంది.
అంతేకాదు వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఇతర ప్రాంతాలలో కూడా ఇలాంటి ప్రాజెక్టుల రూపకల్పనకు ఇది ఒక నమూనాగా ఉపయోగపడుతుంది. సైనిక కార్యకలాపాలకు మద్దతుగా వ్యూహాత్మక ప్రాజెక్టుల వేగవంతమైన అమలు యొక్క ఆవశ్యకత, పెరిగిన వ్యయం మరియు సాంకేతికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రబ్జుత్వం బిఆర్ఓ సంస్థకు 2024-25 ఆర్ధిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్‌లో రూ.6,500 కోట్ల మూలధనం కేటాయించింది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన మొత్తం కంటే 30 శాతం మరియు 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన మొత్తం కంటే 160 శాతం ఎక్కువ కావడం గమనార్హం.
నిర్మాణ బాధ్యత బిఆర్ఓ కు అప్పగింత వెనుక ఆంతర్యం:
భారతదేశంలోని రహదారి నిర్మాణ కార్యనిర్వాహక దళం అయిన “బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్” లేదా ‘బిఆర్ఓ’ భారతదేశం యొక్క సరిహద్దులను సురక్షితంగా ఉంచడానికి మరియు దేశంలోని ఉత్తర మరియు ఈశాన్య రాష్ట్రాల లోని మారుమూల ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మే 7, 1960న స్థాపించబడింది. సముద్ర మట్టానికి అధికఎత్తులో ఉండే పర్వత ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను నిర్మించడంలో ఏర్పడే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడంలో బిఆర్ఓ సంస్థకు విశేష అనుభవం ఉండడం వలన ఆ సంస్థకు “షిన్‌కున్ లా టన్నెల్” నిర్మాణ పనుల బాధ్యత అప్పగించబడింది.
షిన్‌కున్ లా పాస్ ప్రాంతం నైసర్గికంగా సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉండడంతో పాటు కఠినమైన వాతావరణ పరిస్థితులు నెలకొని ఉండడం కారణంగా టన్నెల్ నిర్మాణంలో గణనీయమైన భద్రతాపరమైన మరియు ఇతర సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. సొరంగం నిర్మాణంలో క్లిష్టమైన, అధునాతన టన్నెల్-బోరింగ్ సాంకేతికత పరిజ్ఞానం మరియు భారీ యంత్ర సామాగ్రి అవసరమవుతుంది. బిఆర్ఓ గత మూడేళ్లలో రు.8,737 కోట్లతో 330 ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడమే కాక చైనాతో సరిహద్దు వెంబడి భారత సాయుధ దళాల వ్యూహాత్మక కదలికలను గణనీయంగా మెరుగుపరిచడంలో కీలక తోడ్పాటునందించింది.
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసి) సమీపంలోని భారతదేశం యొక్క ఉత్తరాన ఉన్న సైనిక స్థావరం అయిన దౌలత్ బేగ్ ఓల్డి (డిబిఓ)కి అత్యంత కీలకమైన ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించడానికి ఈ సంస్థ నేతృత్వంలో కొనసాగుతున్న ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ పనులు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. బిఆర్ఓ భారతదేశ సరిహద్దు ప్రాంతాలు మరియు స్నేహపూర్వక పొరుగు దేశాలలో రహదారి నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేయడంతో పాటు వాటి నిర్వహణను పర్యవేక్షిస్తుంది. బిఆర్ఓ 21 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు పొరుగున ఉన్న మన మిత్రు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మయన్మార్, తజికిస్తాన్ మరియు శ్రీలంకలలో మౌలిక సదుపాయాల కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ దేశంలోని 32,885 కిలోమీటర్ల రహదార్లను మరియు 12,200 మీటర్ల శాశ్వత వంతెనల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. బిఆర్ఓ కూడా “ఆర్డర్ ఆఫ్ బాటిల్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్”లో అంతర్భాగం.
సరిహద్దుల వద్ద పేలవమైన నిఘా ఏర్పాట్లు మరియు లోపభూయిష్టమైన మౌలిక సదుపాయాలను తరచుగా స్మగ్లర్లు, మాదకద్రవ్యాల వ్యాపారులు మరియు ఉగ్రవాదులు తమ కార్యకలాపాల నిర్వహణకు అనుకూలంగా మలచుకోవడం సర్వసాధారణం. దేశ భద్రతను, సమగ్రతను భంగపరిచే ఇలాంటి విద్రోహుల చర్యలను సమర్థవంతంగా నిరోధించడానికి అవలంబించే బహుముఖ విధానాలలో భాగంగా సరిహద్దు నియంత్రణ రేఖ మరియు వాస్తవాధీన నియంత్రణ రేఖల వద్ద మెరుగైన రహదార్లు, వంతెనలు మరియు సొరంగ మార్గాల ఏర్పాటు అత్యంతావశ్యకం. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం చేపడుతున్న “షిన్‌కున్ లా టన్నెల్” టన్నెల్ నిర్మాణం స్వాగతించ దగ్గ పరిణామం.