Telugu Special Stories

అంతటాశివోహం.. విశ్వేశ్వరుడిదేవైభవం!

శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు… 

విశ్వంలోని జీవులన్నీ పరమాత్మ ఆదేశంతోనే కర్మలను అనుసరిస్తున్నాయి..

విధులను నిర్వర్తిస్తున్నాయి..

విశ్వమంతా నిండినది కాశీ విశ్వేశ్వరుడేననీ.. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందంటారు పెద్దలు..  మహాశివరాత్రి రోజున ఇక్కడి ఆలయాలు.. పూజలు, హోమాలతో విలసిల్లుతుంటాయి. అంతేనా, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి శివాలయం, గుళ్ళు.. భక్తుల ఉపవాస, జాగరణ దీక్షలతో, విశిష్ట పూజలతో విరాజిల్లుతుంటాయి.  రేపు మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా కాశీ విశ్వేశ్వరాలయం, ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తీశ్వరాలయం, తెలంగాణలోని కీసరగుట్ట(రామలింగేశ్వరాలయం)ల ప్రాశస్త్యం గురుంచి ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం: 

శ్రీకాళహస్తీశ్వరాలయం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహ్తీశ్వరాలయం ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతికి 37 కి.మీ.ల దూరంలో స్వర్ణముఖి నదీతీరంలో కొలువై ఉంది. భక్తులకు భూకైలాసంగా.. వాయులింగ స్థానంగా ప్రఖ్యాతి గాంచింది. పంచభూత లింగాల్లోని పృథ్వీలింగం, తేజోలింగం, ఆకాశలింగం, జలలింగంలు తమిళనాడులో ఉంటే.. ఒక్క వాయులింగం మాత్రమే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వెలసింది. రాహు,కేతు, సర్పదోష నివారణ క్షేత్రంగా అక్కడ విరాజిల్లుతుండటం విశేషం.

స్థలపురాణం

శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభువుగా కొలువై ఉండగా, ఇక్కడకు వచ్చే భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ఇక్కడ అమ్మవారు జ్ఞానాంబిక పూజలందుకోవడం విశేషం. బ్రహ్మదేవుని చేత పూజలందుకుంటున్న ఈ శైవక్షేత్రం ప్రతి సంవత్సరం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుందనడంలో సందేహమేమి లేదు. 

శ్రీకాళహస్తీశ్వరుడు… అంటే, శ్రీ(సాలెపురుగు), కాళం(పాము), హస్తి(ఏనుగు)ల పేరిట ఏర్పడ్డ ఈ క్షేత్రం… ఆ మూడు మూగజీవుల దైవభక్తికి ప్రతీక అని చెప్పుకోవాలి. వీటి గురుంచి 

ఇక్కడి శివయ్యను ఆరాధించి.. చివరకు ఆయనలోనే ఐక్యమయ్యాయి. భక్త కన్నప్ప వృత్తాంతమూ ఈ క్షేత్రానికి సంబంధించిందే. కుజదోష నివారణ పూజలు.. నాగదోష నివారణ పూజలు.. నవగ్రహ దోష నివారణ పూజలు ఈ క్షేత్రంలో ప్రత్యే ప్రభావం కనబరుస్తాయన్నది భక్తుల విశ్వాసం. గ్రహణ కాలాల్లోనూ తెరచివుంచే గుడిగా ఈ శ్రీకాళహస్తీశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది!

తీర్థప్రసాదాలు

* ఆలయంలో జరిగే అభిషేక సేవలకు ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారు. రుద్రాభిషేకానికి పులిహోర, లడ్డూ, కండువా, జాకెట్టుముక్క, స్వామి అమ్మవార్ల చిత్రపటం, పంచామృతం, పచ్చకర్పూర తీర్థజలం, విభూది ఆలయం తరఫున భక్తులకు అందజేస్తారు.

* పచ్చకర్పూర అభిషేకం చేయించిన భక్తులకు తీర్థంగా పచ్చకర్పూర జలాన్ని, పంచామృత అభిషేకం చేయించిన భక్తులకు అభిషేకం చేసిన పంచామృతాన్ని కానుకగా అందజేస్తారు.

* నిత్య కల్యాణోత్సవం చేయించిన వారికి లడ్డూ, వడను నైవేద్యంగా ఇస్తారు.

* చండీ, రుద్రహోమాలు చేయించిన వారికి ఉప్పు పొంగలి ప్రసాదంగా అందజేస్తారు.

కీసరగుట్ట(రామలింగేశ్వరాలయం)…

తెలంగాణలోని శైవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిచెందిన ప్రాంతమే.. కీసరగుట్ట. గుట్టంతా శివలింగాలే ఉంటాయి. ఇక్కడి పరమేశ్వరుడు… శ్రీరాముడి చేతుల మీద వెలసి అనంతరం రామలింగేశ్వరుడిగా సేవలందుకుంటున్నట్లు ప్రతీతి.. మరి కీసరగుట్ట అనే పేరు ఎందుకొచ్చిందంటే… ఈ ప్రాంతం అనేది దండకారణ్యంలో ఉండటంతో కేసరాలు(సింహాలు) గుంపులుగా సంచరించడం వల్లే.. ఇది కేసరగిరి అయ్యింది. వానరరాజు అయిన కేసరిగిరి(ఆంజనేయుడి తండ్రి) నివాసం కూడా ఇదే కావడంతో ఈ క్షేత్రం కాస్త కేసరిగిరి అయ్యిందనేది పురాణ గాథ. 

క్షేత్రంలోని విజయ స్తూపం మీద కనిపించే.. మత్స్య, కూర్మ, వరాహ, గణపతి, కేసరి, ఆంజనేయ విగ్రహాల రూపాల ఆధారంగా ఈ క్షేత్రం శైవ, వైష్ణవ సంప్రదాయాల మేలుకలయికగా విరాజిల్లుతూ  వస్తోంది. ఈ పశ్చిమాభిముఖంగా ఉండటం ఒక  విశేషమైతే, స్వామికి చేసిన అభిషేకాల నీరు ఎక్కడికి వెళ్తుందో ఇప్పటికీ అంతుపట్టకపోవడం మరో విశేషం.

స్థల పురాణం/ క్షేత్ర ప్రాశస్త్యం 

త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి సమేతంగా హనుమంతుడితో కలిసి రావణ సంహారం అనంతరం వనవిహారానికై వచ్చి, ఇక్కడి ప్రకృతి రమణీయతకు ముగ్ధుడై.. కొంతకాలం ఇక్కడే ఉండిపోయారట. రావణున్నీ హతమార్చినందుకు హత్యాపాతక నివారణ కోసం ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నారట. ఆ కారణంగా కాశీకి వెళ్లి ఒక జ్యోతిర్లింగాన్ని తేవాల్సిందిగా హనుమంతుడ్ని ఆజ్ఞాపిస్తాడు. రామాజ్ఞ ప్రకారం శివలింగాన్ని తెచ్చేందుకు హనుమ కాశీకి వెళ్తాడు. అక్కడ ఆంజనేయుడు శివ మహిమకు ప్రభావితుడై, ఒక్కటికి బదులుగా నూటొక్క శివలింగాలను శ్రీరాముని పూజకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఆంజనేయుడు శివలింగాన్ని తీసుకురావడంలో కాలయాపన జరగడంతో.. శ్రీరాముడు శివున్నీ ప్రార్ధించి లింగరూపధారియైన ఆయన విగ్రహాన్ని, మహర్షులు నిర్ణయించిన ముహూర్తానికి ప్రతిష్ఠించి, అభిషేకించి హత్యాపాతకం నుంచి విముక్తి పొందాడు. ఇంతలోనే కాశీ నుంచి నూటొక్క లింగాలతో తిరిగి వస్తాడు హనుమ. శ్రీరాముడు శివలింగ ప్రతిష్ఠ అప్పటికే చేయడంతో తాను తెచ్చిన లింగాలలో ఒక్క లింగమైనా రామపూజకు నోచుకోనందుకు బాధ పడతాడు. అది గమనించిన శ్రీరాముడు హనుమను ఓదార్చి ఇలా అంటాడు.. తాను ప్రతిష్ఠించిన శివదర్శనం అనంతరం కాశీ నుంచి తెచ్చిన నూటొక్క శివలింగాలను భక్తులు దర్శించేలా వరమిస్తున్నా అనడంతో సంతోషిస్తాడు.

ప్రధాన ఆలయం వెనుక ఏకశిలతో సీతమ్మగుహ ఉంది. చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లుతున్న ఈ దివ్యక్షేత్రాన్ని ఒక్కసారైనా సందర్శించి తీరాల్సిందే అంటారు శివభక్తులు..

కాశీ విశ్వేశ్వరాలయం… 

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి.. కాశీ విశ్వనాథుని ఆలయం.. ఏడాది పొడవునా భక్తులతో కళకళలాడుతుంటుందా పవిత్రధామం. 

పరమశివుడు నివసించిన మహిమాన్విత క్షేత్రమే కాశీ. ఆయన కొలువైన ఆలయమే విశ్వేశ్వరాలయం.  ‘ఈ నగరం చరిత్రకన్నా ప్రాచీనమైనది, సంప్రదాయం కన్నా పురాతనమైనది’. కాశీకే వారణాసి అని మరోపేరు. వరుణ, అసి అనే రెండు నదుల మధ్య నిర్మించిన నగరం కావడంవల్లే ఇది వారణాసి అయిందనీ, ఆ పేరును పాళీ భాషలో బారనాసి అని రాసేవారనీ అదే బెనారస్‌గా మారిందనీ అంటారు. ఈ నగరాన్ని ఇతిహాసాల్లో అవిముక్తక, ఆనందకానన, మహాశ్మశాన, రమ్య, సుదర్శన… ఇలా ఎన్నో పేర్లతో వర్ణించారట. అయితే కాశీ నగర పుట్టుకే అంతుబట్టని రహస్యం అంటుంటారు అక్కడి నివాసులు. 

క్షేత్ర ప్రాశస్త్యం

బ్రహ్మదేవుడు సృష్టి సాగించే సామర్థ్యంకోసం తపస్సు చేసుకోవడానికి వీలుగా శివుడు త్రిశూలాగ్రమ్మీద సృష్టించిన భూ ఖండమే కాశీగా అభివర్ణిస్తారు. దీనిమీద కూర్చుని బ్రహ్మదేవుడు సమస్త లోకాలనూ, భూమినీ సృష్టించాడట. దేవతలు, రుషిమునుల విన్నపం మేరకు శివుడు త్రిశూలంమీద ఏర్పడ్డ భూఖండాన్ని అలాగే దించి, నేలమీద నిలబెట్టడంతో.. అదే కాశీ పట్టణంగా నిలిచిపోయిందని శివపురాణం చెబుతోంది. మనిషిని విశ్వంలో ఐక్యం చేసే నగరంగానూ చెబుతారు. అందుకే అక్కడికి వెళ్లినవాళ్లకి తిరిగి రావాలనిపించదట. కైలాసంలో సన్యాస జీవితాన్ని గడిపే ఈశ్వరుడు పార్వతితో వివాహమయ్యాక కాశీని నివాసంగా చేసుకున్నాడట.

చారిత్రాత్మక నగరం… 

ఐదువేల సంవత్సరాలక్రితమే కాశీ నగరం ఏర్పడిందని, ఇందుకు రుజువుగా వేదాల్లోనూ ఇతిహాసాల్లోనూ ప్రస్తావన ఉందని ప్రతీతి.  తొలి నిర్మాణం ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ పూర్వం ఇక్కడ 72 వేల గుడులు ఉండేవనీ.. యోగశాస్త్రం ప్రకారం ఇది మనిషి శరీరంలోని నాడుల సంఖ్యతో సమానమనీ.. శక్తి చలనం ఉన్న చోటల్లా మందిరాలు నిర్మించినట్లు తర్వాతి కాలాల్లో జరిపిన పరిశోధనల్లో తేలింది. 

కాశీలో ఉన్నవాళ్లకి సమస్త యాగాలు చేసిన పుణ్యం సిద్దించడంతో పాటు, శరీరంలోని చక్రాలన్నీ ఉత్తేజితమవుతాయట. కాశీలో గద్దలు ఎగరవు, గోవులు పొడవు పెరగవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవనీ అంటుంటారు. ఇక్కడ మరణించిన ఏ జీవికైనా కుడి చెవి పైకి లేచి ఉంటుందట. అంతేకాక హిమాలయాల్లోని గోముఖం నుంచి బయలుదేరిన గంగమ్మ దారి మళ్లి, కాశీ నగరాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుందట. ఎంత కరవు వచ్చినా గంగమ్మ ఇప్పటివరకూ కాశీ ఘాట్లను వదిలి దూరం పోలేదట.

ఈ ప్రాంతాన్ని పాలించిన ఆనాటి చక్రవర్తులూ, ప్రజలూ కలిసి నిర్మించిన గుడులు మొత్తంగా 26 వేలకు పైనే ఉండేవట. ప్రస్తుతం వీటిసంఖ్య రెండున్నర వేలకు తగ్గింది. కాశీ నగరం.. ముస్లిం దండయాత్రల్లో మూడుసార్లు ధ్వంసమైనట్లూ, అలా ధ్వంసమైన ఆలయాల్ని అక్బర్ కాలంలో పునరుద్ధరించినట్లూ తెలుస్తోంది. గమనిస్తే, కాశీలోని ప్రతి వీధిలోనూ ఓ గుడి ఉంటుందట. అన్నింటిలోనూ నిత్యం పూజలూ, హోమాలూ జరుగుతూనే ఉంటాయట. వీటన్నిటిలోకి ప్రత్యేకమైనది  విశ్వనాథ మందిరం. పూర్వం ఈ గుడి ఎంతో వైభవంగా ఉండేదట. ఆ తరవాత దాడులకు భయపడి, గుడి చుట్టూ చిన్నాపెద్దా భవనాలు కట్టడంతో ఇరుకు సందుల మధ్య ఉండిపోయిందట. అందుకే దాన్ని మళ్లీ అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కాశీ విశ్వనాథధామ్‌ ప్రాజెక్టును చేపట్టింది ప్రభుత్వం.

ప్రత్యేకతలు.. 

విశ్వనాథుడి ఆలయానికి వెళ్లేదారిలోనే మనకు సాక్షి గణపతి ఆలయం, కలంతో ఉన్న వినాయకుడు కనిపిస్తారట. కాశీకి వచ్చినవాళ్ల వివరాలను ఆయన రాసుకుంటాడని నమ్ముతారు. గేటు వద్ద మరో దుండి గణపతి ఆలయం ఉంటుంది. 56 స్వరూపాలతో కూడిన స్వామి కాశీ పట్టణాన్ని కాపాడుతుంటాడనీ, దర్శించుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోతాయనీ భక్తుల విశ్వాసం. అది దాటిన తర్వాత  విశ్వనాథుడి ఆలయం వస్తుంది. గర్భగుడిలో ఓ మూలగా ఉంటుందా లింగం. ప్రస్తుత మందిరాన్ని 1780ల్లో ఇండోర్‌ రాణి అయిన అహల్యాబాయి హోల్కర్‌ కట్టించిందట. మహారాజా రంజిత్‌ సింగ్‌ ఈ ఆలయ గోపురాలకు బంగారు పూత వేయించడానికి, వెయ్యి కిలోలకుపైగా బంగారాన్ని సమర్పించాడట. అందుకే దీన్ని సువర్ణదేవాలయం అని కూడా పిలుస్తుంటారు భక్తులు. 

విశ్వనాథుడి గర్భగుడికి నాలుగు ద్వారాలు ఉంటాయి. రెండు లోపలకు వెళ్లడానికీ, మిగతా రెండు బయటకు రావడానికీ ఏర్పాటు చేయబడ్డాయి. గుడిలో నలువైపులా సీతారామలక్ష్మణులు, దశ భుజ వినాయకుడు, కాల భైరవుడు, పార్వతీ పరమేశ్వరులు, మహా శ్వేత రూపాలు దర్శనమిస్తాయి. కాశీ విశ్వేశ్వరునికి..  శవభస్మ లేపనంతోనే పూజ ప్రారంభిస్తారట. 

ప్రతి ఏటా మహాశివరాత్రినాడు మృత్యుంజయ ఆలయం నుంచి విశ్వనాథ ఆలయం వరకూ ఊరేగింపు జరుగుతుందిక్కడ. విశ్వనాథుడికన్నా ముందు తారకేశ్వర లింగాన్ని దర్శించుకుంటారు భక్తులు. ఈ లింగమే కాశీలో మరణించేవారి చెవిలో తారకమంత్రంను ఉపదేశిస్తుందట. దర్శనానంతరం బయటకు రాగానే అవిముక్తేశ్వర లింగం కనిపిస్తుంది. ఈయన పరమశివుడు గురువైన ముక్తేశ్వరుడనీ శివుడి పూజలందుకునే పవిత్ర లింగమనీ చెబుతారు. ఈ విశ్వనాథ మందిరంతోపాటు అన్నపూర్ణదేవి, విశాలాక్షి, వారాహిదేవి, ఆశా వినాయకుడు… ఇలా వేలకొద్దీ మందిరాలూ, దశాశ్వమేధ, ప్రయాగ్‌, సోమేశ్వర్‌, హరిశ్చంద్ర, మణికర్ణికాఘాట్‌… వంటి 80కి పైగా ఘాట్‌లతో అలరారే ఈ ముక్తి క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా చూసి, తరించాలని కోరుకుంటారు భక్తులు.. 

హర హర మహాదేవ శంభో శంకర

Show More
Back to top button