Telugu Special Stories

ఏక దంతాయ.. వక్రతుండాయ..విశేషాలు..!

పండుగైనా, పబ్బమైనా, ఎటువంటి శుభకార్యమైనా తొలి పూజలు అందుకునేది గణనాథుడే. 16 నామాలతో పిలిచే వినాయకుడు మనకు బాల, తరుణ, భక్తి, వీర, శక్తి, ద్విజ, సిద్ధి, ఉచ్ఛిష్ట, విఘ్న, క్షిప్ర, హేరంబ, లక్ష్మీ, మహా, విజయ, నృత్య, ఊర్ధ్వ, ఏకాక్షర, వర, త్య్రక్షర, క్షిప్ర ప్రసాద, హరిద్రా, ఏకదంత, సృష్టి, ఉద్ధండ, రుణమోచన, ఢుంఢ, ద్విముఖ, త్రిముఖ, సింహ, యోగ, దుర్గా, సంకటహర గణపతిగా.. 32 రూపాల్లో దర్శనమిస్తున్నాడు. వాటిల్లో కొన్ని ముఖ్యమైన రూపాలివి..

భక్తి గణపతి.. భక్తి గణపతికి నాలుగు చేతులుంటాయి. కుడివైపు చేతుల్లో కొబ్బరికాయ, బెల్లం పరమాన్నం ఉంటే, ఎడమవైపు చేతుల్లో మామిడి పండు, అరటిపండు ఉన్న గిన్నె పట్టుకుని దర్శనమిస్తాడు భక్తి గణపతి.

తరుణ గణపతి.. తరుణ అంటే యవ్వనం. ఈ రూపంలో గణపతికి ఎనిమిది చేతులుంటాయి. అంకుశం, జామపండు, దంతం, చెరుకు గడ, ఉండ్రాళ్ళు​, వెలగపండు గుజ్జు, మొక్కజొన్న కంకి, వల పట్టుకుని కనిపిస్తాడు. 

వీర గణపతి.. వినాయక రూపాల్లో చాలా శక్తివంతమైంది వీరగణపతి రూపం. ఈ రూపంలో గణపతికి 16 చేతులుంటాయి. బాణం, బేతాళుడు, చక్రం, మంచపు కోడు, గద, పాము, శూలం, గొడ్డలి బొమ్మ ఉన్న జెండా, శక్తి, కుంతమనే, ముద్గరం అనే ఆయుధాలతో పాటు విల్లు, ఖడ్గం, అంకుశం, పాశం, విరిగిన దంతంతో దర్శనమిస్తాడు.  

శక్తి గణపతి.. శక్తి గణపతిని పూజిస్తే కష్టాలు దరిచేరవని పురాణాలు చెబుతున్నాయి. ఈ రూపంలో నాలుగు చేతులతో దర్శనమిస్తాడు గణేశుడు. అంకుశం, పాశం, విరిగిన దంతం చేత పట్టుకుని భక్తుల కోర్కెలు తీర్చుతాడు. 

వక్రతుండ.. ఈ రూపంలో వినాయకుడి తొండం వక్రంగా ఉంటుంది. ఈర్ష్యా, ద్వేషాలను మనసు నుంచి తీసేసే ప్రతిరూపమే వక్రతుండ వినాయకుడు. 

లంబోదర.. పెద్ద పొట్టతో ఈ రూపంలో దర్శనమిస్తాడు గణనాథుడు. కోపం, అసూయ, ద్వేషాలని ఈ రూపంలో తరిమేస్తాడు. 

గజానన.. గజానన అంటే ఏనుగు తల అని అర్ధం.  ఈ రూపంలో ఉన్న వినాయకుడ్ని పూజిస్తే తెలివితేటలు పెరుగుతాయి. 

నృత్య గణపతి.. మనసుకు ప్రశాంతతని ఇచ్చే ఈ గణపతి చేతులలో పాశం, అప్పాలు, అంకుశం, విరిగిన దంతం ఉంటుంది.

జయ గణపతి.. విజయాలవైపు నడిపించే ఈ గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి.  పాశం, విరిగిన దంతం, అంకుశం, పండిన మామిడి పండుతో దర్శనమిస్తాడు. 

సిద్ధి గణపతి.. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి.  చేతుల్లో పండిన మామిడి పండు, పూలగుత్తి, గొడ్డలితో దర్శనమిస్తాడు.

వినాయక చవితి అనగానే… గణపతి ప్రతిమనూ, 21 రకాల పత్రినీ తెచ్చుకుంటాం. కుడుములూ ఉండ్రాళ్లూ చేసి స్వామికి నివేదిస్తాం. పూజ అంత అయ్యాక గుంజీలు తీస్తాం. పుస్తకాలు ఉంచుతాం. అటువంటి వినాయక చవితి పూజలో ప్రతి ఒక్క అంశానికి విశేష ప్రాధాన్యం, అంతరార్థం ఉంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వినాయకుడిని 21 రకాల పత్రితో పూజిస్తాం.. ఎందుకు?

వినాయక చవితి పూజలో వినాయకుడి ప్రతిమ, 21 రకాల పత్రీ తప్పనిసరి. ఎందుకంటే, నవరాత్రులయ్యాక ఆ పత్రితోపాటుగా విగ్రహాన్ని స్థానికంగా ఉండే చెరువులు, బావులూ, నదుల్లో నిమజ్జనం చేస్తుంటాం. నిజానికి ఈ పత్రిలో ఉపయోగించే ఆకులన్నీ కూడా ఔషధగుణాలున్నవే. ఇక, వానలు కురిసే ఈ సమయంలో వాటిల్లో నీరు కలుషితమవుతుంది. వీటిని శుభ్రం చేసేందుకు ఈ 21 రకాల పత్రి సరైన పరిష్కారమని పెద్దలు చెబుతారు. ఆ ఆకుల్ని నీటిలో కలిపినప్పుడు వాటిలోని ఔషధగుణాలన్నీ నీటిలోకి చేరతాయి. అవి బ్యాక్టీరియాను నిర్మూలించి జలాన్ని శుద్ధి చేస్తాయి.

గణపతి పూజలో గరిక ప్రాధాన్యం..

గరికలేని గణపతిపూజ వ్యర్థమని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వినాయక చవితినాడు స్వామికి అర్పించే పత్రిలో గరిక తప్పనిసరి… ఎందుకంటే, పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడిని పుట్టించి, దేవతల్ని ఇబ్బందిపెట్టాడట. అది తెలిసి వినాయకుడు ఆ అసురుడ్ని మింగేయడంతో.. స్వామి శరీరం వేడిగా మారిపోయిందట. ఎంత ప్రయత్నించినా ఆ ఉష్ణం తగ్గకపోవడంతో కొందరు రుషులు వచ్చి 21 గరిక పోచలను గణేశుని తలపైన పెట్టమంటూ సూచించారట. అలా చేసిన వెంటనే గణపతి శరీరంలోని వేడి తగ్గిపోయిందట. అందుకే గణపతి పూజలో గడ్డిపోచకు అంత ప్రాధాన్యం సంతరించుకుంది. చవితి పూజలో ఎన్నిరకాల పుష్పాలు వాడినా, పత్రిలో గరిక లేకపోతే విఘ్నేశ్వరుడు లోటుగానే భావిస్తాడట మరీ.

వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తాం..?

వినాయకుడి ఎదురుగా గుంజీలు తీయడమంటే.. క్షమించమని కోరడం కాదు. ఓసారి మహావిష్ణువు కైలాసానికి వెళ్ళినప్పుడు, హరిహరులు సంభాషణలో మునిగి ఉండగా, బాల గణపతి సుదర్శన చక్రాన్ని తీసుకుని, మింగేశాడట. విష్ణువు వైకుంఠానికి వెళ్తూ.. దానికోసం వెతికితే గణపతి తాను మింగేశానని చెప్పాడట. నారాయణుడు ఎంత బతిమాలినా వినాయకుడు ఇవ్వలేదట. చివరకు మహావిష్ణువు కుడిచేత్తో ఎడమచెవినీ, ఎడమచేత్తో కుడిచెవినీ పట్టుకుని గుంజీలు తీశాడట. అది చూసి గణపతి పడీపడీ నవ్వడంతో సుదర్శన చక్రం నోట్లోంచి బయటకు వచ్చింది. గుంజీలు తీసి విష్ణుమూర్తి తనకు కావాల్సింది పొందాడు కాబట్టి, నాటి నుంచీ గణపతి ఎదురుగా గుంజీలు తీస్తే, మన కోర్కెలు నెరవేరతాయనే విశ్వాసం ఏర్పడింది. 

గణపతి పూజలో పుస్తకాలు ఎందుకు ఉంచాలి..?!

‘శుక్లాంబరధరం విష్ణుం’ అంటూ గణేశుని విష్ణువుగా భావించి పూజిస్తాం. విష్ణుమూర్తిలాగే గణేశుడు వ్యాపన శక్తి, గ్రాహక శక్తి కలిగినవాడు. 

ప్రసన్నత ప్రతిఫలించే గజముఖుడ్ని 

‘ప్రసన్న వదనం ధ్యాయేత్‌’ అంటూ అర్చిస్తాం. వ్యాసుడు మహాభారతాన్ని వినాయకుడి చేత రాయించదలచుకున్నప్పుడు…

‘ఆపకుండా చెబితే రాస్తాను’ అంటూ గణేశుడు షరతు పెడితే, బదులుగా వ్యాసమహర్షి 

‘అర్థం చేసుకుని రాయాలి’ అంటూ ప్రతి షరతు విధించాడు. 

ఏదైనా వేగంగా సాగాలి అన్నది గణపతి సందేశం. ఏ విషయాన్నైనా అర్థం చేసుకున్న తర్వాతే లిఖించాలన్నది మహర్షి ఉద్దేశం. 

తర్వాత వినాయకుడు లిఖించిన భారతం పంచమవేదమైంది. అందువల్ల తొలి లేఖకుడైన గణపతి పూజలో పుస్తకాలు, పెన్ను ఉంచడం ఆనాటి నుంచి సంప్రదాయమైంది.

బొజ్జగణపయ్యకు కుడుములు, ఉండ్రాళ్లే ఎందుకు నివేదిస్తాం.. 

ఇది దక్షిణాయనం. పైగా వర్షాకాలం. మన శరీరంలో జీవక్రియల పనితీరు నెమ్మదిస్తుంది. దీంతో అరుగుదల తగ్గి, ఆకలీ మందగిస్తుంది. శరీరంలో వ్యర్థాలు పెరిగి, అనారోగ్యాలు వస్తాయి. వాటిని నివారించాలంటే..  బియ్యప్పిండితో ఆవిరిమీద చేసిన వంటకాలు అయితే పెద్దగా ఇబ్బంది అనిపించదు. వీటిల్లో ఉప్పు, నెయ్యి మాత్రమే ఉంటాయి. కాబట్టి భారంగా అనిపించదు. అరుగుదల కూడా బాగుంటుంది. శరీరానికి కావాల్సిన శక్తి కూడా అందుతుంది. ఈ కాలంలో ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి కాబట్టి మన పెద్దలు ఇలా ఆవిరిపైన ఉడికించినవాటిని తినడం మంచిదని భావించి ఈ  సంప్రదాయాన్ని తీసుకొచ్చారు.

చవితినాడు చంద్రుడిని చూడొద్దుఎందుకంటే..?!

దీని అంతార్థం ఏంటంటే, కుమారస్వామి జననం తర్వాత భాద్రపద శుద్ధ చతుర్థినాడు గజాననునికి విఘ్నాధిపత్యం రావడంతో, అనేక పిండిపదార్థాలు తిని తల్లిదండ్రులకు ప్రణామం చేయడానికి ఇబ్బంది పడుతుండగా శివుడి తలపై ఉన్న చంద్రుడు, వినాయకుడి యాతన చూసి ఫక్కున నవ్వుతాడు. అది నచ్చని పార్వతీదేవి చంద్రుడ్ని శపిస్తుంది. దానివల్ల భూలోకంలో వినాయక చవితినాడు చంద్రుని చూసినంతన నీలాపనిందలు కలుగుతాయనే నమ్మకం స్థిరపడిపోయింది. అందుకే ఈరోజు చంద్రుడ్ని చూడొద్దు అంటారు మన పెద్దలు.

Show More
Back to top button