Telugu Special Stories

సామాన్యులకు సులభమైన సమాచార, వినోదాలను పంచే వేదికలు టెలివిజన్లు

దృశ్యంతో శ్రవణాన్ని జోడించి చలించే చిత్రాలను ప్రసారం చేయగలిగే ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను టెలివిజన్‌ లేదా టివీ అని పిలుస్తున్నాం. ప్రపంచంలోనే అత్యంత ప్రజాధరణ పొందిన సమాచార, వార్తా, విద్య, సంస్కృతి, వాతావరణ, క్రీడా, సంగీత, వినోదాలను సమానపాళ్లతో వడ్డించగల ఏకైక చవకైనది టివీ మాత్రమే.  నేటి డిజిటల్‌ యుగంలో ఆర్థిక స్తోమతకు సంబంధం లేకుండా ప్రతి కుటుంబంలో ఒక టివీ డబ్బా, ఒక సెల్‌ఫోన్‌ కనీస అవసరంగా తిష్ట వేశాయి. టివీ ప్రసారాలు కేబుల్‌, శాటలైట్‌, ఇంటర్నెట్‌,డిస్క్‌/డివిడీ, సాంప్రదాయ ప్రసార పద్దతుల్లో మనకు అందుతున్నాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా 1.67 బిలియన్ల  కుటుంబాల్లో టివీలు ఉన్నాయి. యూఎస్‌లో సగటున ప్రతి ఒక్కరు 4 గంటలు టివీలు వీక్షిస్తున్నారు. 

ప్రపంచ టివీ దినం-2024 థీమ్‌:

టివీ ప్రాధాన్యాన్ని గుర్తించిన అంతర్జాత సమాజం 1996 నుంచి ప్రతి ఏట 21 నవంబర్‌ రోజున “ప్రపంచ టివీ దినం” పాటించడం, ప్రపంచాభివృద్ధిలో టివీ పాత్రను చర్చించడం లాంటి అంశాలను అవగాహన పరచడానికి, టివీ ఆవిష్కర్తలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ వేదిక ఉపయోగపడుతున్నది. టివీ వేదికల్లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వార్తలను క్షణాల్లో మన ఇంటికి చేర్చడం, ప్రజాభిప్రాయాలకు వేదిక కావడం, సంస్కృతీ వారసత్వాలను కాపాడుతూ ప్రసారం చేయడం, విభేదాలకు సమాధానాలు వెతికే చర్చలు జరపడం, సామాజిక సానుకూల మార్పులకు ఊతం ఇవ్వడం,ప్రత్యక్ష ప్రసారాలను మన కళ్ల ముందుంచడం లాంటి పలు అంశాలను అందరి దరికి చేర్చుతున్న టివీ సాధ్యం నేడు పేదలకు వినోదాలను పంచే సాధనంగా ప్రజాధరణ పొందింది. ప్రపంచ టివీ దినం-2024 థీమ్‌గా “టివీ : కనెక్టింగ్‌ ది వరల్డ్‌”అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం చేస్తున్నారు. 

టివీ జీవిత చరిత్ర:

1927లో ఫిలో టేయిలర్‌ ఫార్న్‌స్‌వర్థ్‌ అనే 21 ఏండ్ల కుర్రాడు తొలిసారి ప్రపంచానికి టీవీని పరిచయం చేయడం, 1930ల్లో టివీ సెట్స్‌ తయారు కావడం, 1936లో బిబిసి వేదికగా టివీ కార్యక్రమాలు ప్రసారం కావడం, 1941లో యూఎస్‌లో తొలి టివీ స్టేషన్ ద్వారా వాణిజ్యపరంగా ప్రసారాలు ప్రారంభం అయ్యాయని టివీ చరిత్ర స్పష్టం చేస్తున్నది. ప్రభుత్వాలు, సంస్థలు, పౌరసమాజం సమిష్టిగా టివీ వేదికగా అభివృద్ధి పథాన నడవడం కొనసాగుతున్నది, మరింత వేగం కొనసాగాల్సి ఉంది. టివీ చరిత్రలో ఎన్నో మార్పులు జరిగాయి. నాటి సాంప్రదాయ ప్రసార వ్యవస్థల నుంచి నేడు స్మార్ట్‌ఫోన్‌లో దూరేంతగా శాస్త్రసాంకేతికాభివృద్ధి జరిగింది. 

టివీ ప్రయోజనాలు జాబితా పెద్దది:

ప్రపంచం ఏ మూలన ఏమి జరుగుతుందో తెలుసుకొనిక్షణాల్లో మన ముంగిటికి చేర్చే ఎలక్ట్రానిక్‌ సాధనంగా టివీ అగ్రభాగాన నిలవడం, నేటి డిజిటల్‌ యుగంలో స్మార్ట్‌ఫోన్‌ ద్వారా కూడా టివీ కార్యక్రమాలను పడక గదిలో నుంచి చూసే సౌలభ్యం మనకు దక్కడం నమ్మశక్యంగా లేదు. స్థానిక సమస్యలను వెలికి తీయడం, సామాజిక సమస్యలను చర్చించే వేదికగా పని చేయడం, సాంస్కృతిక వినిమయం, నాణ్యమైన కార్యక్రమాలనుప్రసారం చేయడం, విద్యారంగంలో తనదైన పాత్రను నిర్వహించడం, సమాచార వితరణ, ఆటపాటల సమాగమం, వినోదాల విందు భోజనాలు, అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను వెలికి తీయడం, సంక్షోభాలకు సమాధానాలు వెతకడం, అక్రమాలను బహిర్గత పరచడం, చీకటి వ్యాపారాలకు వెలుగులోకి తేవడం, శాంతి పాఠాలు బోధించడం, శాంతి భద్రతలకు ఊతం ఇవ్వడం, ఆర్థిక సామాజిక సమస్యలకు వేదికగా మారడం, ముఖ్యమైన కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం, మానవ సంబంధాలను పెంపొందించడం, మరుగుపడిన ప్రతిభావంతులను గుర్తించి వెలికి తీయడం, ప్రపంచ వైవిధ్యాలను పరిచయం చేయడం లాంటి పలు ప్రయోజనాలు ఎన్నో మన ఇంట్లోని టివీ పెట్టెకు ఉన్నాయి. 

టివీ ప్రతి ఒక్కరి ప్రాణ నేస్తం అయ్యింది. టివీ చూడకుండా కనీసం ఒక్క రోజు కూడా గడవడం లేదు. టివీలు సామాన్యులకు వినోదాలను పంచుతూనే ఉన్నది. నేటి డిజిటల్‌ ఏఐ యుగం నుంచి రేపటి రానున్న రోజుల్లో టివీ మరెన్నో మార్పులు పొందనుందో చూడాల్సి ఉంది. నేటి యువత, పిల్లలు టివీలను తమ వ్యక్తిగత ఎదుగుదలకు మాత్రమే వాడుకోవాలని, కాలయాపన చేస్తూ అనవసర, అక్కరకురాని కార్యక్రమాలకు తావివ్వకుండా తమ భవిష్యత్తు నిర్మాణాలకు నిచ్చెనగా ఉపయోగించికోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈడియట్స్‌ బాక్స్‌గా   కాకుండా ఎలీట్‌ బాక్స్‌గా టివీ మనకు ఉపకరించాలని ఆశిద్దాం, నాణ్యమైన టీవీ ప్రసారాలు కొనసాగాలని మనసారా ఆశీర్వదిద్దాం. 

Show More
Back to top button