Telugu Special Stories

కర్ణాటక సంగీతంలో వెలిగిన తెలుగు కళా సౌరభం.నేదునూరి కృష్ణమూర్తి.

ఒకసారి కాకినాడలోని సరస్వతీ గాన సభలో జనం మాలి గారి వేణు గానం కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న రైలు బండి ఆలస్యమయ్యింది. మాలి వచ్చేదాక ఎవరైనా ఒక గాయకుడి చేత పాడించకూడదూ అని జనంలో ఎవరో సూచించారట. ఆ సమయానికి ఒక యువ గాయకుడు, యువ గాత్ర సంగీతకారుడు సానుకూలంగా స్పందించాడు. ఆ సభకు మాలి వచ్చేవరకు శ్రోతలకు జన రంజక సంగీతాన్ని అందించి అలరించారు. ఆయనే నేదునూరి. సంగీత కళానిధి బిరుదాంకితులు నేదునూరి కృష్ణమూర్తి. దక్షిణాది శాస్త్రీయ సంగీతంలో విశేషకృషి చేసి, గాయకుడిగా, స్వరకర్తగా ఎంతో ప్రఖ్యాతి గడించారు. ముఖ్యంగా వీరు స్వరపరిచిన “ముద్దుగారే యశోద”, “ఏమొకొ చిగురుటధరమున”, “నానాటి బతుకు నాటకము” మొదలగు ఎన్నో అన్నమాచార్య కీర్తనలు, అనేక స్వరాలు ఎన్నో ఏళ్ళుగా అందర్నీ అలరిస్తున్నాయి. 

నేదునూరి కృష్ణమూర్తి కర్ణాటక సంగీత విద్వాంసులు, సంగీత కళానిధి బిరుదు పొందినవారు. ఆంధ్రదేశంలోని తూర్పుగోదావరి జిల్లా, కొత్తపల్లె గ్రామంలో జన్మించిన వీరు విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో శాస్త్రీయ సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. ఆరంభంలో తనకు వయొలిన్ మీద ఆసక్తి ఉన్నా కూడా తన గురువుల సలహాపై గాత్ర సంగీతం వైపు మొగ్గు చూపారు. శాస్త్రీయ సంగీతం యొక్క విశిష్ట లక్షణం రాగ విధానం. రాగమే అన్ని రాగాలకు ఆధారం. ఒక రాగం ఆలాపన ఒక సంగీతకారుని యొక్క అత్యున్నత స్థాయి సృజనాత్మకత, సంగీత చతురత మరియు బహుముఖ ప్రజ్ఞను వెల్లడిస్తుంది. ఆ బహుముఖ ప్రజ్ఞ కలిగిన వారు నేదునూరి కృష్ణమూర్తి. ఆయన కర్ణాటక సంగీతాన్ని సుసంపన్నం చేసిన తెలుగు వారు కావడం విశేషం. 

సంప్రదాయానికి కట్టుబడి ఉండి రాగానికి ఆపాదించబడిన నియమాలు మరియు చట్టాల గురించి మంచి జ్ఞానం కలిగిన గొప్ప సంగీత విద్వాంసులు నేదునూరి కృష్ణమూర్తి. ఆయన శ్రీపాద పినాకపాణి వంటి వారి వద్ద శిష్యరికం చేశారు. అన్నమాచార్య సంకీర్తనలు, రామదాస కీర్తనలను స్వరపరిచారు. నాదసుధా తరంగిణి అనే సంస్థను ఏర్పాటు చేసి స్వరపరిచిన కీర్తనలను వాటి సంజ్ఞామానాలతో సహా ప్రచురించారు. 15వ శతాబ్దపు కవి అన్నమాచార్య యొక్క 108 కీర్తనల కూర్పుకు సంగీతం అందించి మంచి గుర్తింపు పొందారు. సంగీత కళాశాల ప్రధానాచార్యులుగా కూడా పనిచేసిన కృష్ణమూర్తి కర్ణాటక సంగీత రంగంలో గొప్ప సేవలందించినందుకు గానూ తమిళనాడు ప్రభుత్వం వారు 1991 డిసెంబరు లో “సంగీత కళానిధి” బిరుదుతో సత్కరించారు.

జీవిత విశేషాలు…

జన్మనామం  :  నేదునూరి కృష్ణమూర్తి

ఇతర పేర్లు  :  నేదునూరి

జననం   :       10 అక్టోబరు 1927

స్వస్థలం :    యు.కొత్తపల్లి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 

వృత్తి   :       సంగీత విద్వాంసులు

తండ్రి    :   రామమూర్తి పంతులు

తల్లి      :    విజయలక్ష్మి

పురస్కారాలు   :   సంగీత కళానిధి

మరణ కారణం  :   వృద్ధాప్యం

మరణం   :   08 డిసెంబరు 2014, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.

నేపథ్యం…

నిజానికి నేదునూరి రామమూర్తి పంతులు, విజయలక్ష్మి దంపతులది తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న నేదునూరు.  తాతల కాలం నుండి వారివి పెద్ద కుటుంబాలు, వందల ఎకరాల ఆస్తులు. అంగరంగ వైభవంగా జరిగే పెళ్లిళ్లకి, పబ్బాలకి ఆస్తులన్నీ కరిగిపోగా రామ్మూర్తి పంతులు చిన్నతనంలోనే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వచ్చి అక్కడి రాజావారి సొత్తులో (ఎస్టేట్) ఉద్యోగిగా స్థిరపడ్డారు. ఉద్యోగ బాధ్యతల కారణంగా రామ్మూర్తి పంతులు పిఠాపురానికి నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న యు.కొత్తపల్లి అనే గ్రామంలో కొంతకాలం ఉండవలసి వచ్చింది.

అక్కడే నేదునూరి కృష్ణమూర్తి నేదునూరి కృష్ణమూర్తి 10 అక్టోబరు 1927 నాడు నేదునూరి రామమూర్తి పంతులు, విజయలక్ష్మి దంపతులకు జన్మించారు. అక్కడే 1927 అక్టోబర్ 10 వ తారీఖున పుట్టారు  రామ్మూర్తి పంతులుకు ఉన్న పదిమంది సంతానంలో ఆఖరి కొడుకు కృష్ణమూర్తి. ఆ కుటుంబంలో తొలినాటి సంగీత స్పర్శ ఆయన తల్లి విజయలక్ష్మి గారిది. ఆమె పెరుగును మజ్జిగలాగా చిలుకుతూ, ఇంటి పనులు చేసుకుంటూనే సాంప్రదాయ కీర్తనలు, మంగళహారతులు, తరంగాలు, ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు అతి మధురంగా పాడుకునేవారు. ఆమె అన్ని పాటలు పాడేవారు. అందువలన కృష్ణమూర్తికి తన తల్లి గొంతు మార్గదర్శి. తల్లి పాడే పాటలు, గ్రామ్ ఫోన్ లో వినే పాటలన్నీ కూడా నేదునూరి కృష్ణమూర్తి గొంతునుండి వినిపించేవి.

విద్యాభ్యాసం…

ఏ పాట అయినా విన్నది విన్నట్టుగా చక్కగా పాడే కృష్ణమూర్తిని చూసి ఈ అబ్బాయికి సంగీతం నేర్పిస్తే చక్కగా నేర్చుకుంటాడు చుట్టుప్రక్కల వారు అనేవారు. కానీ తండ్రి రామ్మూర్తికి తన ఆర్థికస్థోమత సహకరించకపోవడంతో చదువు చెప్పించలేకపోయారు. కానీ ఆ స్థానంలో ఉచితంగా సంగీతవిద్య నేర్పించే అవకాశం దొరికింది. 1936 ప్రాంతంలో రామ్మూర్తి నెల జీతం 20 రూపాయలు. పెద్ద దివాణం లాంటి ఇల్లును మూడు రూపాయలకు అద్దెకు తీసుకున్నారు. ఆ రోజుల్లో ఒక క్వింటా బియ్యం బస్తా ఖరీదు ఒక్క రూపాయి. కృష్ణమూర్తి చదువు స్థానికంగా ఐదవ తరగతి వరకు సాగింది. ఆరవ తరగతి మరియు ఆపై చదువులకు మూడు రూపాయలు డబ్బు కట్టాలి.

నిజానికి తండ్రి రామ్మూర్తి దగ్గర డబ్బు లేదు. చేసేది లేక ఎవ్వరైనా ఉచితంగా ఏమైనా నేర్పిస్తే నేర్చుకో అని తండ్రి అన్నారు. వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి ఆ ఊళ్లో గొప్ప సంస్కృత పండితులు. వారి వద్ద కొంతకాలం సంస్కృతం నేర్చుకున్నారు. వారి అల్లుడు రేగిళ్ల సుబ్బారావు వద్ద హిందీ నేర్చుకున్నారు. కానీ కృష్ణమూర్తికి తెలిసిన విద్య సంగీతం మాత్రమే అని గ్రహించిన తన తండ్రి రామ్మూర్తి పలువురు ప్రసిద్ధ ప్రముఖుల వద్దకు వెళ్లి కుమారుడి గురించి వారిని అభ్యర్థించారు. కానీ ఎవ్వరూ కూడా కృష్ణమూర్తికి సంగీతం నేర్పడానికి ముందుకు రాలేదు. కానీ బాదం అప్పారావు అనే సంగీత ఉపాధ్యాయుడి వద్ద నేదునూరి ఐదారు వర్ణాలు నేర్చుకున్నారు. అలాగే కాళ్లూరు వేణుగోపాలరావు అనే సంగీత గురువు వద్ద కొన్ని తరంగాలు మరియు అష్టపదులు నేర్చుకున్నారు.

సంగీత కళాశాలలో చేరి….

ఒకనాడు నేదునూరి ఇంట్లోనే పాట పాడుతుందాగా విశ్రాంత తహసీల్దారు “వంతెన అప్పల నరసింహం” అనే పదవీవిరమణ చేసి విజయనగరం నుంచి వచ్చారు. వస్తూనే ఆయన నేదునూరి కృష్ణమూర్తి పాడిన పాట విని “పాట చాలా చాలా బాగుంది. మా ఊళ్లో సంగీత కళాశాల ఉంది అక్కడికి వచ్చి నేర్చుకుంటావా” అని అడిగారు. నిజానికి అక్కడ మహారాజ వారి సత్రంలో సంగీతం నేర్చుకునే విద్యార్థులకు ఉచితంగా భోజనం సదుపాయం కూడా ఉంది అని నేదునూరి కృష్ణమూర్తి తండ్రితో చెప్పారు. దాంతో తండ్రి రామ్మూర్తి “నేను ఎలాగూ చదువు చెప్పించలేకపోతున్నాను. కనీసం సంగీతం అయినా నేర్చుకో అని అన్నారు. అలా 1940 వ సంవత్సరంలో కృష్ణమూర్తిని సంగీత కళాశాల, విజయనగరం పంపిస్తూ ఒక్క రూపాయి పెట్టి రైలు టికెట్ కొని, మరో రూపాయి కృష్ణమూర్తి చేతికి ఇచ్చారు. నేదునూరి కృష్ణమూర్తి సంగీత జైత్ర యాత్ర అలా ప్రారంభమైంది. ఎట్టకేలకు వంతెన అప్పల నరసింహం అప్పటి సంగీత కళాశాల ప్రధానాచార్యులుగా వున్న ద్వారం వెంకటస్వామి నాయుడు దగ్గరకి కృష్ణమూర్తిని తీసుకెళ్లారు. నేదునూరి కృష్ణమూర్తి పాట విన్న ద్వారం వెంకటస్వామి నాయుడు వెంటనే ఆయనను సంగీత కళాశాలలో చేర్చుకున్నారు.

గాత్రంతో బాటు వయోలిన్ కూడా నేర్చుకుని…

సంగీత కళాశాలలో చాలామంది విద్యార్థులు వయోలిన్ నేర్చుకునే వారు. వారిని చూసి నేదునూరి కృష్ణమూర్తికి కూడా వయోలిన్ నేర్చుకోవాలనే కోరిక కలిగింది. ఆయన గాత్రానికి బదులు వయోలిన్ నేర్చుకోవాలని పట్టుబాట్టారు. ప్రఖ్యాతి ప్రభావం కళాశాల విద్యార్థుల మీద ఉండేది.  ఆ విధంగా ద్వారం వెంకటస్వామి నాయుడు అన్నగారి కుమారుడు ద్వారం నరసింగరావు నేతృత్వంలో వయోలిన్ శిక్షణకు ఆ కళాశాలలో సీటు లభించింది. వయోలిన్ శిక్షణ 5 సంవత్సరాలలో పూర్తయ్యింది. ఒకవైపు నేదునూరి కృష్ణమూర్తి వయోలిన్ నేర్చుకుంటున్నా కూడా ద్వారం నరసింహారావు శిక్షణ తరగతిలో ఎప్పుడూ కృష్ణమూర్తిని పాటలు పాడిస్తూ ఆయనకు వయోలిన్ సహకారం అందించేవారు. ఆ రకంగా ఆయన చదువు వయోలిన్ లో సాగినా కూడా చివరికి గాత్రం స్థిరపడింది. 

విజయనగరంలో నేదునూరి కృష్ణమూర్తి సంగీతం నేర్చుకున్న ఐదు సంవత్సరాలు కూడా తన తండ్రి ఆయనకు ప్రతినెలా ఒక్క రూపాయి మాత్రమే పంపేవారు. అది ఛాయి, కాఫీ ఖర్చులకు సరిపోయేది. ఇడ్లీ తినాలంటే మరో రూపాయి కావాలి. కానీ తండ్రి రామ్మూర్తి పంపలేకపోయేవారు. విజయనగరం మహారాజ వారి సత్రంలో మొదటి విడత భోజనాలను సంస్కృత పాఠశాల, ఆంగ్ల పాఠశాల విద్యార్థులు తిని వెళ్లిపోయేవారు. పది గంటల విడతకు మిగిలిపోయిన భోజనం దక్కేది. అది తినడం వలన ఆయన యొక్క ఆరోగ్యంగా క్రమక్రమంగా  దెబ్బతింది. ఒకసారి ఆయన సెలవులకు ఇంటికి వచ్చేసరికి కృష్ణమూర్తిని తన తల్లిదండ్రులే పోల్చుకోలేనంతగా నల్లబడిపోయారు.

వినాయక చవితి నాడు తొలి కచేరీ…

నరసింహారావు సిఫారసు మేరకు కృష్ణమూర్తి “తుని” వెళ్లి ప్రముఖ  మార్డంగికులు కోలంక వెంకట్రాజు దగ్గర కొంతకాలం మృదంగంతో సాధన చేశారు. ఎందుకంటే మృదంగంతో లయలో మంచిపట్టు గాత్ర సౌష్టవం పెరుగుతుంది. తునిలో వెంకట్రాజు నేర్పిన పాఠంతో లయబద్ధంగా పాడటం, కచేరి ప్రణాళిక వంటబట్టింది. సెప్టెంబరు 1945 లో వినాయక చవితి గణపతి నవరాత్రి ఉత్సవాలలో నేదునూరి కృష్ణమూర్తి తన మొదట కచేరి చేశారు. ఆ కచేరిలో “వాతాపి గణపతిం భజే” అనే దీక్షితారు కీర్తనతో సభికుల ముందు గళం విప్పారు. ఆ కీర్తనకు కోలంక వెంకట్రాజు మృదంగ సహకారం అందించగా, నర్సింగరావు వయోలిన్ సమాకూర్చారు. ఆ తరువాత రోజే కాకినాడ శ్రీరామ సమాజంలో కచేరి చేశారు. కాకినాడకు చెందిన పేరి సుబ్బారావు మృదంగ సహకారం అందించారు.

ఆ కచేరీకి ఆరోజుల్లో పెద్ద మొత్తం 25,000 రూపాయలు పారితోషికం అందజేశారు. అప్పటికే కృష్ణమూర్తి తండ్రి రామ్మూర్తి ఉద్యోగ విరమణ చేశారు. దాంతో తన 18 వ యేటనే తనకు కుటుంబ బాధ్యతలు మీదపడ్డాయి. అప్పటినుండి తణుకు, రాజమండ్రి వంటి పెద్ద పెద్ద పట్టణాల్లో కచేరీలు చేయసాగారు. ఆల్ ఇండియా రేడియో, మద్రాసులో 1947 వ సంవత్సరంలో కచేరి చేశారు. ఎగ్మూరులో ఉండే ఆ రేడియో స్టేషన్ నుండి వచ్చిన ఆ కచేరిని విన్న మృదంగం విద్వాంసులు ఎస్.వి.ఎస్. నారాయణన్ మిక్కిలి ఆనందించి నేదునూరి కృష్ణమూర్తికి ఫోన్ చేసి కేరళలో కచేరి చేస్తారా అని అడిగారు. అలా కేరళలో మొదలైన కచేరీ నరసింగరావు, కోలంగి వెంకటరాజు వాద్య సహకారంతో నాలుగేళ్ల పాటు వరుసన జైత్రయాత్ర సాగగా, నేదునూరి కృష్ణమూర్తి తనదైన మనోధర్మంతో ఎందరో సంగీత రసజ్ఞులను అలరించారు.

పినాకపాణి శిష్యరికం…

విశాఖపట్నంలో 1948 వ సంవత్సరంలో విజయ త్యాగరాజ సంగీత సభ వారు త్యాగరాయ కీర్తనల పోటీ నిర్వహించింది. డాక్టరు శ్రీపాద పినాకపాణి, బ్రహ్మయ్య శాస్త్రి, డాక్టరు అళహసింగరి లాంటి వారి నేతృత్వంలో ఆ పోటీలు నిర్వహించారు. ఆ పోటీలకు న్యాయ నిర్ణేత పినాకపాణి. ఆ పోటీలలో నేదునూరి కృష్ణమూర్తి స్వర్ణపతకాన్ని గెలుచుకున్నారు. ఆ స్వర్ణాన్ని పినాకపాణి చేతుల మీదుగా అందుకున్నారు. ఆ పతకం అందుకునే సమయంలో “మీ ద్వారా నాకు మీ విద్య కావాలి” అన్నారు కృష్ణమూర్తి. పినాకపాణి శిష్యరికానికి రమ్మన్నారు. అనుకోకుండా ఒకసారి నూకల చిన సత్యనారాయణ పాడిన ఒక కీర్తనను విన్న కృష్ణమూర్తి తాను పాడే బాణీ కన్నా బావుంది అనిపించింది. అప్పటినుండి ఆ బాణీని అలవర్చుకోవాలనే ఆసక్తితో ఆ కీర్తన నేర్పింది డాక్టరు శ్రీ పాద పినాకపాణి అని తెలుసుకున్నారు. అందువలన ఆయన శిష్యరికం కోరారు కృష్ణమూర్తి.

డాక్టరు పినాకపాణితో బజారుకు వెళ్ళినప్పుడు రిక్షా ఎక్కగానే రాగం మొదలుపెట్టేవారు. ఇంటికి ఐదు వస్తువులు కావాలంటే తీరా సంగీతంలో పడిపోయి మూడు వస్తువులు మర్చిపోయేవారు. ఆ రాగప్రవాహం మరెవ్వరికీ రాదు అంటూ మురిసిపోయేవారు కృష్ణమూర్తి. గురువు ప్రతిభాపాటవాలు తలుచుకుంటూ ఆయన పాట వినడమే కృష్ణమూర్తికి పాఠం. అదే ఆయనకు గురుకులం, అదే శంకరాభరణం. దానికి తోడు తోడి, కాంబోజి వంటి ఘనరాగాలే కాకుండా సురటి, బేగడ, రీతిగౌళ వంటి రాగాలు గొంతులో సుడులు తిరిగిపోయేవి. ఆ రాగం ఒక అద్భుతమైన గంగా ప్రవాహం. ఆయన మనోధర్మంలోని అమూల్యమైన అంశాన్ని కృతి పాఠాన్ని సాధ్యమైనంతగా అలవర్చుకున్నారు. కృత్తిపాఠాంతరాన్ని కృతి “దిట్ట” అంటారు. కృష్ణమూర్తి సంగీత స్వరూపాన్ని, ఆయనదైన బాణీని పట్టుకునే ప్రయత్నం చేసేవారు.

రిక్షాలోనే పాఠం…

నేదునూరి కృష్ణమూర్తి తన గురువు పినాకపాణి దగ్గర చేరిన నెల రోజులకే పినాకపాణికి విశాఖపట్నం నుండి కర్నూలుకు బదిలీ అయ్యింది. దాంతో వారితో కలిసి నేదునూరి కృష్ణమూర్తి కర్నూలుకు బయలుదేరారు. ప్రతీరోజు డాక్టరు పినాకపాణి విధులు పూర్తిచేసుకుని రిక్షాలో బయలుదేరి వారి సంసారానికి సరిపడా సామాన్లు కొనుక్కునేవారు. రిక్షాలోనే కృష్ణమూర్తికి పాఠం చెప్పేవారు. నరసింగరావు పేటలో ఇల్లు. వైద్యాశాలకు వెళ్ళినప్పుడు తప్ప పినాకపాణి పాట వినిపిస్తూనే ఉండేది. పినాకపాణి కొన్ని ప్రత్యేక కృతులను పాఠం ద్వారా చెప్పేవారు. తన బాణీలను, తన ప్రత్యేకతలను నేర్చుకోమని ఆ కృతులను ప్రారంభించారు. ఆ పద్ధతిలో మెలకువలు ఎక్కువ. ముందు ఆ మెలకువలు నేర్చేసుకోమని కృష్ణమూర్తికి చెప్పేవారు. అవి కష్టంగా ఉండడంతో కొంతకాలం నేదునూరి గందరగోళంలో పడ్డారు. తనకు లొంగిన బాణీ పోతుంది, గురువు నేర్పిన బాణీ లొంగడం లేదు. ఇది తనకు తికమకలాగా తలనొప్పిగా మారింది. కానీ కృష్ణమూర్తి పట్టు వదల్లేదు. క్రమక్రమంగా తన గురువు సంగీతంలో వెసులుబాటు దొరికింది. దక్షిణాది సంగీత విద్వాంసులను మురిపించే స్థాయి నేదునూరుకి కుదిరింది.

1951 నుండి వరుస కచేరీలు…

అది 1951 సంవత్సరం. మద్రాసులో సంగీత అకాడమీ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రముఖ విద్వాంసులు జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం సిఫారసు మేరకు నేదునూరి కృష్ణమూర్తి పాడటానికి సిద్ధంగా వున్నారు. ఆ సంవత్సరం చెంబై వైద్యనాథ భాగవతార్ అకాడమీ సభలకి అధ్యక్షులు. ఆ కచేరీలు మైలాపూర్ పి.ఎస్.పాఠశాల ఆడిటోరియంలో సాగేవి. ఆ రోజు మధ్యాహ్నం రెండున్నరకి కచేరి పెద్దలంతా సభలో ఉన్నారు. కచేరీ అద్భుతంగా సాగింది. మరుసటి రోజు కృష్ణమూర్తికి లాల్ గుడి జయరామన్ ఎదురుపడి నిన్న మీ కచేరి విన్నాను. చాలా బాగా నచ్చింది. ఇక మీ కచేరి లన్నింటికీ నేనే వాయిస్తాను అన్నారు. అప్పటినుండి కొన్నివేల కచేరీలు నడిచాయి.

లాల్ గుడికి ఖాళీ ఉండకపోతే కచేరీ తేదీలు మార్చేవారు. ఎందరో ప్రముఖ విద్వాంసుల ప్రక్కన వాయిద్యాలు వాయించారు లాల్ గుడి. వయోలిన్ తో ఎం.ఎస్.గోపాలకృష్ణన్, ఎం.చంద్రశేఖరన్, మృదంగంతో పాల్ఘాట్ రఘు, ఉమయల్పురం శివరామన్, వెల్లూరు రామభద్రన్, గురువాయూర్ దొరై మొదలైన వారు కృష్ణమూర్తికి సహకరించారు. పాల్గాట్ మణి అయ్యర్ నాలుగైదు కచేరిలకు మృదంగం వాయించడం తన జీవితంలో గొప్ప విశేషణంగా నేదునూరి కృష్ణమూర్తి చెప్పుకుంటారు. 1951 నుండి సుమారు 52 సంవత్సరాల పాటు నిరాఘాటంగా క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరం సంగీత అకాడమీ సంగీతం ఉత్సవాలలో కచేరి చేస్తూవచ్చారు. 2010 వ సంవత్సరంలో తన 55 కచేరీ (ఆఖరి కచేరి) చేశారు. అది ఆఖరి కచేరి కావడానికి కారణం కృష్ణమూర్తి అనారోగ్య పరిస్థితి. కృష్ణమూర్తికి అనారోగ్యంగా వున్నా కూడా అకాడమీ ఆయనను విడిచిపెట్టలేదు.

అన్నమయ్య కీర్తనలు…

నేదునూరి కృష్ణమూర్తి 1975 వ సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర సంగీత కళాశాలలో పనిచేస్తున్నారు. కామిశెట్టి శ్రీనివాసులు అన్నమయ్య ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. ఆయన కృష్ణమూర్తికి ఒక పాట ఇచ్చి దీనికి రాగాన్ని నిర్ణయించండి అన్నారు. “ఏమొకో చిగురుట ధరముల” అన్న పాట అది. మాములుగానే అన్నమయ్య పాటలు సంగీతానికి లొంగవనేది నేదునూరి అభిప్రాయం. కనుక ఆయన పని మీద పెద్దగా ఆసక్తి చూపలేదు. మేడ మీదే ప్రాజెక్ట్ కార్యాలయం ఉండేది. శ్రీనివాసులు కనిపించినప్పుడల్లా పాట బాణీ గురించి కృష్ణమూర్తిని అడుగుతుండేవారు. ఆయన ఆ బాధపడలేక ఒకరోజు పట్టుగా కూర్చున్నారు నేదునూరి. 

అన్నమయ్య కీర్తన చేత పట్టుకొని స్వామినే తలుచుకునేవారు. స్వామీ! ఆ పాటకు నాకు ఏ రాగం తలపిస్తావు అని రాగం ఛాయ మనసులోనే కలుగింది. ఎన్ని పాటలు ఇవాళ సంగీత ప్రపంచంలో ఎందరో ఆర్ద్రంగా ఆలపించే ఎన్నో అన్నమయ్య కృతులు వారి బాణీలుగా వెలువడ్డాయి. “ఒకపరి ఒకపరి” (ఖరహర ప్రియ), నానాటి బ్రతుకు (రేవతి), ముద్దుగారే యశోద (కురంజి), బావములోన (శుద్ధ దన్యాసి), పలుకుతేనే తల్లి (అభేరి), చేరి యశోదకు (మోహన ) ఇవన్నీ అన్నమయ్య పదసంపదలోనే నేదునూరి సృష్టించిన మధురకల్పనలు. మొట్టమొదటి కీర్తన “ఏమోకో చిగురుటధరముల” కీర్తన ఎంతోమంది గాయకులు పాడినా కూడా ఇప్పటికీ తిలంగ్ లోనే పాడుతారు.

“సంగీత కళానిధి” బిరుదు ప్రధానం…

ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.రమేష్ ఒకరోజు ఫోన్ చేసే నేదునూరి కృష్ణమూర్తిని తొందరగా బయలుదేరి మద్రాసుకు వెళ్ళి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి కి అన్నమయ్య కీర్తనలు నేర్పాలని చెప్పారు. కృష్ణమూర్తి అక్కడికి వెళ్ళేటప్పటికి సుబ్బలక్ష్మికి శెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ పాఠం చెబుతున్నారు. శెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ ప్రత్యేక గాయకులు. ఆయన కృష్ణమూర్తి గురువు పినాకపాణికి అభిమాన గాయకులు. శ్రీనివాసయ్యర్ పాఠం పూర్తయ్యాక సుబ్బలక్ష్మిని అన్నమయ్య కీర్తనలు పాడమని కృష్ణమూర్తి చెప్పారు. అప్పుడు ఆవిడ రెండు, మూడు కీర్తనలు పాడారు. అవి ఆయనకు నచ్చాయి. కానీ ఎక్కువ కీర్తనలు నేర్చుకునే వ్యవధి లేక “ఒకపరి ఒకపరి” మాత్రం నేర్చుకున్నారు.

నేదునూరి మరి కొన్ని కీర్తనలు రికార్డు చేసి సుబ్బలక్ష్మికి ఇచ్చారు. “నానాటి బ్రతుకు నాటకం” అన్న ఒక కీర్తన బాణీకి మీకు సంగీత కళానిధి సత్కారం జరగాలని నేదునూరి కృష్ణమూర్తితో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి అన్నారు. ఆ సమయంలో ఆయన ఆమె ఇంట్లోనే భోజనం చేస్తున్నారు. ఆమె అన్నదే నిజమయ్యింది. నిజంగానే కృష్ణమూర్తికి ఆ అరుదైన సత్కారం జరిగింది. 1991 లో సంగీత కళానిధి సత్కారానికి నేదునూరి పేరును శెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ ప్రతిపాదిస్తే, స్వయంగా ఎమ్మెస్ సుబ్బలక్ష్మి సమర్థించారు. ఆనాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అధ్యక్షతన జరిగిన సభలో నేదునూరి కృష్ణమూర్తికి “సంగీత కళానిధి” బిరుదు ప్రధానం జరిగింది. అలాంటి ఘనత మరెవ్వరికీ దక్కలేదు.

మరణం…

తన 65 సంవత్సరాల సుదీర్ఘమైన సంగీత యాత్రలో  మల్లాది బ్రదర్స్, సరస్వతి విద్యార్థి, లహరి మొదలైన వారిలాంటి ఎందరో శిష్యులు నేదునూరి కృష్ణమూర్తి బాణీలను ఓడిసి పట్టుకున్నారు. బాలకృష్ణ ప్రసాదుని, శోభరాజుని తిరుపతిలో అన్నమయ్య ప్రాజెక్టు స్కాలర్షిప్ కి ఎంపిక చేసే తర్ఫీదునిచ్చారు నేదునూరి. వాళ్ళిద్దరూ గాయకులుగా ప్రసిద్ధులయ్యారు. అన్నమయ్య పద సౌరభం పేరిట దాదాపు 200 అన్నమయ్య కీర్తనలకు బాణీలు చేసి నాలుగు సంపుటాలుగా  వెలువరించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్స్ వారు నిర్వహించే “నాదోపాసన” అనే కార్యక్రమంలో ఎందరో శిష్యులకు ఆయన పరోక్షంగా సంగీత పాఠాలు బోధించేవారు.

అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఎందరో ఈ కార్యక్రమంలో స్ఫూర్తిగా పొందుతున్నారు. బెంగళూరు సమీపంలోని “కైవారం” లో యోగి నారాయణ ఆశ్రమం ఉంది. యోగి నారాయణ రచించిన 25 పాటలకు నేదునూరి కృష్ణమూర్తి స్వరపరి ప్రచారం చేశారు. తన 82వ ఏట సంగీత ప్రస్థానాన్ని శిష్య ప్రశిష్యులతో కొనసాగిస్తూ పుణ్యాన్ని పురుషార్ధాన్ని ఇతోధికంగా సమకూర్చుకుంటూ కొన్నాళ్ళపాటు ప్రశాంత జీవనాన్ని సాగించారు. దాశరథి శతక పద్యాలు, రాగ సుధా రసాలతో భద్రాచల రామదాస కీర్తనలు, అన్నమాచార్య పదకదంబం, సంకీర్తనలు,  నారాయణ తీర్థ తరంగాలు, రామదాస కీర్తనలు ఇలా శ్రోతలను అలరించే ఎన్నో కచేరీలు చేసిన నేదునూరి కృష్ణమూర్తి అనారోగ్యంతో బాధపడుతూ తన 87 సంవత్సరాల వయస్సులో 08 డిసెంబరు 2014 నాడు విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు.

Show More
Back to top button