Telugu Special Stories

తెలుగు వెండితెర సత్యభామ.. నటి జమున

తెలుగు వెండితెర సత్యభామ.. నటి జమున

జమున (30 ఆగష్టు 1936 – 27 జనవరి 2023)

తెలుగు తెరపై వెన్నెల కురిపించిన అలనాటి సౌందర్య రూపం.. చందమామ లాంటి లావణ్యం, హంపీ శిల్పం. సావిత్రి అనగానే తెలుగింటి నిండుదనం గుర్తొస్తే, జమున పేరు వినగానే తెలుగు అమ్మాయిల నాజూకుదనం గుర్తొస్తుంది. విశాలమైన కళ్లతో ఆమె చేసే నాట్య విన్యాసం గుర్తొస్తుంది. తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ తరువాత ఏఎన్నార్ ను చెప్పుకున్నట్టే, కథనాయికలలో సావిత్రి గారి తరువాత జమున గారి పేరునే చెప్పుకుంటారు. పౌరాణికాలు, కుటుంబ కథా చిత్రాలు, జానపదాలు ఇలా అన్ని జోనర్స్ లో తన నటనతో జమున గారూ మెప్పించారు. పొగరుబోతు అమ్మాయిగా నటించాలంటే అప్పట్లో గుర్తుకువచ్చేది జమున గారూ మాత్రమే.

ఇక పౌరాణికాలలో ఆమె చాలా పాత్రలు ధరించినప్పటికీ, ‘శ్రీకృష్ణ తులాభారం’లో ‘సత్యభామ’గా ఆమె తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ తరువాత ఎవరూ కూడా ఆమె ఆహార్యంతో సరితూగలేకపోయారు. అందువలన ఇప్పటికీ తెలుగుతెర సత్యభామ ఎవరంటే, జమున గారి పేరు మాత్రమే మనకు వినిపిస్తుంది. సాంఘిక చిత్రాలలోనే కాదు, చారిత్రక, పౌరాణిక, జానపద చిత్రాలకు తగిన కనుముక్కుతీరు ఉండటం వలన, అప్పట్లో జమునను మించిన వేరే ఎంపిక లేనే లేదు. అమాయకత్వం నిండిన పాత్రలలోనే కాదు, అహంభావం నిండిన పాత్రలను సైతం ఆమె అద్భుతంగా పోషించేవారు. అప్పట్లో అటు ఎన్టీఆర్, ఇటు ఏఎన్నార్, సావిత్రి కలయికలో నటించి మెప్పించిన ఘనత జమున గారికే సొంతం. ‘గుండమ్మ కథ’, ‘మిస్సమ్మ’ సినిమాలు అందుకు ఉదాహరణగా నిలుస్తాయి.

జననం..

జమున గారూ 1930 ఆగస్టు 30 నాడు కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో జన్మించారు. వీరి తల్లి కౌసల్యదేవీ, తండ్రి నిప్పని శ్రీనివాసరావు గార్లు. వీరికి అయిదుగురు సంతానం. అందులో ముగ్గురు చనిపోయారు. జమున గారూ, వాళ్ళ తమ్ముడు గిరిధర్ మిగిలారు. వ్యాపారం నిమిత్తం జమున వాళ్ళ నాన్న గారూ పసుపు వ్యాపారం చేయడానికి తెనాలి దగ్గర ఉన్న దుగ్గిరాల వచ్చారు. అప్పటికి సుమారు అయిదు సంవత్సరాల వయస్సు ఉన్న జమున గారికి కన్నడ భాష తప్ప తెలుగు రాదు. జమున గారి అమ్మ గారికి నాటకాల మీద ఉండే ఆసక్తితో హారికథలు చెప్పేవారు. దుగ్గిరాల వచ్చిన తరువాత కూడా హారికథలు చెబుతుండేవారు. దుగ్గిరాల వచ్చాక జమున గారిని వాళ్ళ అమ్మ గారూ బడిలో చేర్పించారు. అప్పటినుండి తెలుగు నేర్చుకోవడం మొదలు పెట్టారు జమున గారు. జమున గారి అమ్మ గారూ చెప్పే హరికథల మధ్యలో విరామంలో జమున గారితో వాళ్ళ అమ్మ గారూ పాటలు పాడించేవారట. అందువల్ల జమున గారికి తెలియకుండానే నాటకాల పట్ల, కళల పట్ల ఆసక్తి పెరిగింది.

రంగస్థల నటన…

Telugu Silver Screen Sathyabhama.. Actress Jamuna
Telugu Silver Screen Sathyabhama.. Actress Jamuna

జమున గారికి సంగీతం పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన వాళ్ళ అమ్మగారు దుగ్గిరాలలో ఒక హార్మోనియం మాస్టారు దగ్గర చేర్పించారు. వారి వద్ధ ఒకటే హార్మోనియం ఉండడంతో  వంతుల వారీగా ఒకరి తరువాత ఒకరు నేర్చుకోవలసి వస్తుండడంతో, జమున గారి నాన్న గారితో ఒక హార్మోనియం కొనిపించి ఇంట్లోనే హార్మోనియంలో శిక్షణ ఇప్పించారు జమున గారి అమ్మ గారూ. జమున గారికి 11 సంవత్సరాల వయస్సులో వాళ్ళ ప్రక్కన ఉన్న పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో పాల్గొన్న జమున గారూ, భానుమతి గారూ నటించిన “స్వర్గసీమ” నుండి “ఓహోహో పావురమా” అనే పాట పాడుతూ, నృత్యం చేస్తూ అభినయించడం ప్రారంభించారు. ఆ పాట మధ్యలో “నా వలపు కౌగిలిలో ఓలలాడరావే” అనే వాక్యంలో అచ్చుగుద్దినట్లు భానుమతిలాగే అభినయించే సరికి ప్రేక్షకులందరూ చప్పట్లు కొట్టి ఈలలేశారు.

దాంతో జమున గారూ మాస్టారు దగ్గరికి పరుగెత్తుకెళ్లి ఏడుస్తూ విషయం చెప్పిందట. దానికి వాళ్ళ మాస్టారు గారూ నీవు మంచిగానే నటిస్తున్నావమ్మా, అందుకే ఆ ఈలలు, చప్పట్లు అని నచ్చజెప్పి ఆ బహుమతి జమున గారికే ఇప్పించారట. నాటకాలలో జమున గారి ఆసక్తి, అభినయం తెలుసుకున్న దుగ్గిరాలలోని నాటక సమాజం వాళ్ళు ఈమెను ఢిల్లీ ఛలో అనే నాటకంలో నటింపజేశారు. తెనాలి దగ్గర మండూరులో వేసే నాటకంలో పాత్ర కోసం జమున గారిని వాళ్ళ పాఠశాల తెలుగు మాస్టారు “నటులు జగ్గయ్య” గారూ తీసుకెళ్లారు. ఆ నాటకం పేరు “ఖీల్జీ రాజ్య పతనం”. ఈ నాటకంలో ప్రముఖ నటులు గుమ్మడి వెంకటేశ్వర రావు గారూ కూడా నటించారు.

సినీ రంగ ప్రవేశం..

డాక్టరు గరికపాటి రాజారావు గారూ రాజమండ్రిలో వైద్య వృత్తి చేసేవారు. వారు ప్రజానాట్యమండలిలో చురుకైన కార్యకర్త, నటుడు, దర్శకత్వం వహించేవాడు, నాటకాలు సమాకూర్చేవాడు. చాలా క్రమశిక్షణ కలిగినటువంటి ప్రజా నాట్యమండలి కార్యకర్త. ఒకవైపు వైద్యం చేస్తూనే, ఇంకోవైపు ప్రజానాట్యమండలిని నడిపిస్తూ, వామపక్ష భావాలని ప్రజలలోకి చేరవేస్తూ, ప్రజానాట్యమండలి దళాలను అయన నడిపిస్తూ ఉండేవారు. ఆయన మాభూమి నాటకాన్ని ఆంధ్రదేశమంతటా వెయ్యి సార్లు వేశారట.

ఈ గరికపాటి రాజారావు గారూ సినిమా తీయదలిచి, జమున గారిని కథానాయికగా తీసుకోదలచి, జమున గారి నాన్న గారిని పిలిపించి విషయం చెప్పి జమున గారి ఫోటోలను బొంబాయిలో ఉన్న తన మిత్రుడికి పంపించారు. వారి నుండి సమాచారం రాలేదు. కొన్నాళ్ళకు బి.వి. రామానందం గారూ జమున గారి ఇంటికి వచ్చి “జై వీర బేతాళ” సినిమాలో జమున గారిని ఎంపిక చేసుకుని మద్రాసుకు పిలిపించారు. షూటింగ్ మొదలైన కొన్ని రోజులకు బి.వి.రామానందం గారు మరణించడంతో చిత్రం ఆగిపోయింది.

Telugu Silver Screen Sathyabhama.. Actress Jamuna
Telugu Silver Screen Sathyabhama.. Actress Jamuna

కొన్ని రోజులకు డాక్టరు రాజారావు గారి నుండి పిలుపొచ్చింది. రాజా ప్రొడక్షన్స్ బ్యానరుపై “పుట్టిల్లు” చిత్రం నిర్మిస్తున్నారు రాజారావు గారూ. ఈ చిత్రానికి కథనాయకుడు, దర్శకుడు, నిర్మాత కూడా రాజారావు గారే. జమున గారూ కథానాయిక. సినిమా పూర్తిచేసి 1953 లో విడుదల చేశారు. సినిమా ఆడలేదు. ఈ సినిమా నష్టంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు రాజారావు గారూ. కానీ జమున గారి అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. జమున గారి రెండవ చిత్రం “వద్దంటే డబ్బు”  కూడా విజయం సాధించలేదు. ఒకటీ, రెండు సినిమాలు తీస్తూ మిస్సమ్మ (1955) చిత్రంతో తిరుగులేని నటిగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకుంది.

సత్యభామ పాత్ర అంటే ముందుగా గుర్తొచ్చేది జమున గారే. పాత్రకు తగ్గ ఆహార్యం, అభినయం, కోపం, చిలిపితనం  అన్నీ కలగలిసిన చిత్రం “శ్రీకృష్ణ తులాభారం”. దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారూ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ఈ పాత్రలో మరొకరిని ఉహించుకోలేనంతగా అభినయించింది. అంతకుముందు వినాయకచవితి చిత్రంలో సత్యభామగా నటించినా, శ్రీకృష్ణ తులాభారం” లోని అత్యద్భుత నటనే ఈమెను తెలుగువారి సత్యభామగా నిలబెట్టింది. అక్కినేని నాగేశ్వరావు గారితో, ఎన్టీఆర్ గారితో చాలా చిత్రాలలో జమున గారూ నటించారు.

గుండమ్మ కథ, ఇలవేల్పు, ఇల్లరికం, పల్నాటియుద్ధం, రాముడు భీముడు, అప్పుచేసి పప్పుకూడు, పెళ్లినాటి ప్రమాణాలు, తెనాలి రామకృష్ణ, శ్రీకృష్ణ తులాభారం, సంపూర్ణ రామాయణం, వినాయక చవితి, మూగమనసులు, కలెక్టర్ జానకి, ఉండమ్మా బొట్టు పెడతా, మిస్సమ్మ, ఇల్లరికం, బంగారు తల్లి, లేత మనసులు, మట్టిలో మాణిక్యం, తాసిల్దారుగారి అమ్మాయి, పండంటి కాపురం, లాంటి చిత్రాలలో నటించారు. తెలుగు చిత్రాలతో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్రాలతో కలిపి సుమారు 198 చిత్రాలలో నటించారు. అదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో తెలుగులో తీసిన మూగ మనసులు (1964), హిందీలో తీసిన మిలన్ (1967) చిత్రాలకు గానూ ఉత్తమ సహాయనటి పురస్కారాలను దక్కించుకొన్నారు.

అగ్ర కథానాయకులతో విభేదించిన జమున..

పెద్ద పెద్ద కళ్లతో, అద్భుతమైన అభినయంతో, పన్ను మీద పన్ను మెరుస్తూ వుంటే, అమాయకమైన చిలిపి నవ్వులు విసురుతూ ఎన్టీఆర్, ఏయెన్నార్లతో హీరోయిన్‌గా తిరుగులేని ప్రస్థానంతో దూసుకుపోతున్న రోజుల్లోనే ఈ హీరోలిద్దరితో ఆమె తగువు పెట్టుకున్నారు. దానివలన కలిగే నష్టం, చిత్రాలలో అవకాశాలు రాకుండా ఉండే పరిస్థితి వస్తే  తన సినిమా కెరీర్‌ను వదిలిపెట్టటానికి కూడా సిద్ధపడ్డారు జమునగారూ. అయితే ఈ ఘటన వల్ల అందరూ ఊహించినట్టుగా ఆమె కెరీర్  ముగిసిపోలేదు. ఒక మూడేళ్ల పాటు ఆమె శోభన్ బాబు, కృష్ణ, చలం, హరనాథ్, కృష్ణంరాజు లాంటి కథనాయకులతో నటించారు. కథాబలం, తన పాత్రకు ప్రాముఖ్యత ఉన్న చిత్రాలైతే ఏ చిన్న హీరోతో అయినా జమున గారూ నటించటానికి సందేహించలేదు. ఆ తరువాత చక్రపాణి, బి.నాగిరెడ్డి గార్లు చొరవతో మూడేళ్లుగా ఎదురుచూస్తున్న గుండమ్మ కథకు తెరదించేశారు. జమున పాత్రకోసమే వాయిదా వేస్తున్న కథను ఎట్టకేలకు ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమున గార్లతో తెరకెక్కించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.

వైవాహిక జీవితం..

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జంతుశాస్త్రం ప్రొఫెసర్ గా పనిచేస్తున్న జూలూరి రమణరావు గారిని 1965లో జమున గారూ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు వంశీకృష్ణ, కుమార్తె స్రవంతి ఉన్నారు. వీరు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. జమున భర్త గారూ జూలూరి రమణారావు గారూ 2014 నవంబరు 10లో గుండెపోటుతో మరణించారు.

రాజకీయ ప్రస్థానం…

జమున గారికి దివంగత ప్రధాని ఇందిరాగాంధీ అంటే వల్లమాలిన అభిమానం. ఆమెలాగా ప్రజలకు సేవచేయాలనే ఒక ధృడసంకల్పంతో 1980 లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సినీరంగంలో ఎన్టీఆర్ గారిని ఎంతో అభిమానించే జమున గారూ, రాజకీయరంగంలో మాత్రం ఎన్టీఆర్ గారితో విభేదించేవారు. 1983 లో మంగళగిరి నియోజకవర్గం నుండి శాసనసభకు పోటీ చేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్ గారిని తీవ్ర పదజాలంతో దూషించారు. దాంతో ఆ ఎన్నికల్లో జమున గారూ ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 1989 లో జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ నుండి పోటీ చేసి విజయం సాధించారు. కానీ తరువాత రెండు సంవత్సరాలకే జరిగిన ఎన్నికల్లో తిరిగి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత జమున గారూ రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. జమున గారూ రాజకీయ కోణంలో ఎన్టీఆర్ గారితో విభేదించి, దూషించినా కూడా, వ్యక్తిగతంగా ఎన్టీఆర్ గారిని ఎంతో అభిమానిస్తారు, గౌరవిస్తారు.

Telugu Silver Screen Sathyabhama.. Actress Jamuna
Telugu Silver Screen Sathyabhama.. Actress Jamuna

పురస్కారములు..

  • మూగ మనసులు చిత్రానికి గానూ 1964 వ సంవత్సరంలోఉత్తమ సహాయ నటిగా జమున గారూ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు..
  • అదుర్తి సుబ్బారావు గారూ హిందీలో తెరకెక్కించిన మిలన్ (తెలుగులో మూగ మనసులు) చిత్రంలో నటించిన జమున గారికి 1968 సంవత్సరంలో ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది.
  • 2008 సంవత్సరానికి గానూ ఎన్.టి.ఆర్ జాతీయ పురస్కారం జమున గారిని వరించింది.
  • 17 సెప్టెంబర్ 2021 నాడు జేఆర్‌సీ కన్వెన్షన్‌ హాలు, హైదరాబాద్‌లో జరిగిన సాక్షి మీడియా 2019, 2020 ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమంలో భాగంగా జమున గారికి జీవితసాఫల్య పురస్కారం దక్కింది.

మరణం..

తెలుగు చిత్రపరిశ్రమలో దాదాపు 30 యేండ్లు మహారాణిగా వెలుగొందిన నటి జమున గారూ, 27 జనవరి 2023 నాడు పరమపదించారు. వృద్ధాప్యం కారణంగా వయోధిక భారంతో, అనారోగ్యంతో 86 సంవత్సరాల వయస్సులో హైదరాబాదులోని తన నివాస గృహంలో మరణించారు. అల్లరి పిల్లగా, కొంటె మరదలుగా, ఉత్తమ ఇల్లాలుగా, తెలుగువారి సత్యభామగా ఇలా అనేక రకాల వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకాభిమానాన్ని చూరగొన్న అలనాటి అందాల నటి జమున గారూ శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళారు.

Show More
Back to top button