Telugu Special Stories

భారతీయ ఆర్థిక వ్యవస్థకు స్థిరమైన పునాదులు వేసిన నవ భారతనిర్మాత… డాక్టర్ ‘బి.ఆర్. అంబేద్కర్’!

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లో మొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రివర్యులుగా పని చేసిన ఘనత ఆయనదే..

ప్రముఖ న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయనేతగా, సంఘసంస్కర్తగా, 

దళితుల నాయకుడిగా, రచయితగా,

మానవశాస్త్ర అధ్యయనకర్తగా, పండితుడిగా, వక్తగా, బౌద్దిధర్మ పునరుద్దరణకర్తగా.. 

స్వేచ్చ, సమానత్వ స్థాపనే ధ్యేయంగా కృషి చేసిన సామాజిక విప్లవకారుడు.

ప్రపంచంలో మరెవరూ చదవలేనన్ని డిగ్రీలను అందుకున్న ఏకైక భారతీయ విద్యాధికుడు.. బహుభాషా కోవిదుడు.. 

నేడు అంటరానివాడిస్థాయి నుంచి అందరూ ఆరాధించే స్థాయికి చేరుకుని భారతీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు… ఆయనే భారతరత్న గ్రహీత అయినటువంటి డాక్టర్ బాబా సాహెబ్ ‘భీమ్ రావు. రామ్ జీ. అంబేద్కర్’.. 132వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన జీవిత, రాజకీయ, ఉద్యమ విశేషాలను ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం:

అస్పృశ్యత ఎక్కువగా ఉన్న ఆ రోజుల్లో అంబేద్కర్ దళితుడన్న కారణంతో.. స్కూల్ లోని అందరి పిల్లల మాదిరిగా బల్లల మీద కూర్చొనిచ్చేవారు కాదట. మూలన నేల మీద కూర్చుని పాఠాలు వినేవారు. నల్ల బోర్డును తాకడం, చాక్ పీస్ ను ముట్టుకోవడం చేసేవారు కాదట. తాగేనీటి కుళాయిని సైతం స్వయంగా ఉపయోగించే స్వేచ్ఛ అప్పట్లో లేదు. ఇంటా బయటా ఈ రకమైన అణచివేతను అనుభవించిన ఆయన బాల్యం దుర్భరం… 

అయితే చదువును అమితంగా ఇష్టపడే అంబేద్కర్ ప్రజ్ఞను, చదువు మీద కనబరిచిన శ్రద్ధను గమనించిన ఒక ఉపాధ్యాయుడు.. 

అప్పటివరకూ అంబా వాడెకర్ గా పిలువబడుతున్న.. అంబేద్కర్ కు తన పేరైన 

కృష్ణాజీ కేశవ్ అంబేద్కర్..లోని అంబేద్కర్ ను పేరుగా పెట్టడం జరిగింది. అనంతరం.. ఆ పేరునే రిజిస్ట్రారులోనూ నమోదు చేశారట. నిజానికి ఆ టీచర్ ఒక బ్రాహ్మణుడు.. 

విజ్ఞతకు, మేధో సంపత్తికి కులం అడ్డు కాదని ఈ రకంగా నిరూపించారాయన.

బాల్యం, చదువు

1891 ఏప్రిల్14న, మధ్యప్రదేశ్ లోని మౌలో రాంజీ, భీమాబాయి దంపతులకు జన్మించారు భీమ్ రావు రామ్ జీ అంబేద్కర్.. తల్లిదండ్రులకు 14వ సంతానం.. వీరి పూర్వీకులు మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతానికి చెందినవారు. వీరి సొంతూరు.. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు చెందిన అంబెవాడ గ్రామం. మెహర్ కులానికి చెందినవారు. తండ్రి రామ్ జీ, తాత మాలోజీ బ్రిటిష్ పాలనలో సైన్యంలో పని చేశారు. తల్లిది కూడా సైనిక నేపథ్యం గల కుటుంబం. తన ఆరేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయాడు. బాల్యం నుంచి కులవివక్ష, అంటరానితనం అతనికి స్వానుభవాలయ్యాయి. 

అస్పృశ్యులు దేవరభాష నేర్చుకోకూడదన్న నెపంతో అధ్యాపకులు అంబేద్కర్ కు సంస్కృతం నేర్పడానికి ఒప్పుకోలేదట. కానీ సంస్కృతం నేర్చుకోవాలని తపన ఉన్నప్పటికీ తప్పనిసరై పార్శీ భాషను నేర్చుకున్నాడు అంబేద్కర్. నిజానికి 

వారి పుస్తకాల్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడేవారు కాదు ఉపాధ్యాయులు.. కనీసం ముఖంలోకి చూస్తూ మాట్లాడటం గాని, ఎదైనా అంశం గురుంచి చర్చించడంగాని చేయలేదు. ఇలాంటి ఎన్నో అవమానాల్ని చిన్నతనంలోనే భరించాల్సి వచ్చింది. అయితే తర్వాతి రోజుల్లో ఆయన సంస్కృతం నేర్చుకున్నారు.

1908లో ఎల్ఫిన్ స్టోన్ హై స్కూలులో అంబేద్కర్.. మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఇంటివద్ద తండ్రి ఆయనకు రామాయణ, మహాభారత ఇతిహాసాలు..  తుకారాం, జ్ఞానేశ్వర్ మొదలైన రుషి సత్తముల బోధనలను చెప్పడం.. వాటిని క్రమంగా తన భావజాలానికి ఆపాదించుకున్నారు.

ఆ కాలంలో.. కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, బాన్ విశ్వవిద్యాలయాలలో.. ఉన్నత విద్యాభ్యాసం చేయడమంటే ఆశామాషి వ్యవహారం కాదు.. 

అంతటి కృషి, పట్టుదల, చదువుపై విపరీతమైన తృష్ణ.. ఆయన సాధించిన ఎన్నో పట్టాలకు నిదర్శనం.. నాటి సమున్నత భారత రాజకీయవేత్తలలో ఏ ఒక్కరూ కూడా అంబేద్కర్ అంతా విద్యావంతులు లేరంటే అతశయోక్తికాదు.

1906లో తన 14వ ఏట వివాహమైంది. భార్య రమాబాయి. అప్పుడామె వయసు తొమిదేళ్ళు.

అప్పట్లో బరోడా సంస్థాన పాలకుడైన గైయిక్వాడా రాజు ఇచ్చిన ఇరవై ఐదు రూపాయల స్కాలర్ షిప్ తో కాలేజీ విద్యను అభ్యసించేందుకు విదేశాలకు వెళ్ళాడు. ఆయనకు భార్యగా ప్రతి విజయంలో పూర్తి సహకారం అందించారు. తాను చిరిగిన వస్త్రాలు ధరిస్తూ కూడా, బాబాసాహెబ్ చదువుకు, ఆయన చేసే కార్యక్రమాలకు ఏనాడూ అడ్డు చెప్పలేదట. చివరికి రక్తహీనతతో 1935లో చనిపోయారు రమాబాయి.

అంబేద్కర్గాంధీజీల మధ్య విబేధాలు

ఒకానొక సందర్భంలో అంబేద్కర్ హిందూ ధర్మాన్ని వదిలేస్తున్నానని బహిరంగంగానే చెప్పారు. అణచివేతను పెంపొందించే.. కుల వ్యవస్థ పోవాలనే భావన ఆయనది.. కులాలు ఉన్నంతకాలం అగ్ర కులానిదే పై చేయిగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అలాగనీ హిందూధర్మం పట్ల అంబేద్కర్‌కు విరోధ భావమేమీ లేదు. ఆగ్రహం మాత్రం ఉన్నది. అయితే హిందువుల పట్ల ఏనాడూ ఆయన వ్యతిరేకత చూపలేదు. 

“అంటరానివాడిగా పుట్టడం నా తప్పు కాదు..

అదే అంటరానివాడిగా చూసే హిందూ ధర్మం నుంచి బైటికి వచ్చే హక్కు మాత్రం నాకు ఉందని” ఆయన ఓ సందర్భంలో ప్రకటించారు. ఈ క్రమంలోనే,

1956 అక్టోబర్ 14న నాగపూర్‌లో బౌద్ధమతాన్ని స్వీకరిస్తూ ఆయన వెలువరించిన మహోపన్యాసం ఈ విషయాన్ని మరింత బలపరిచింది.

మరోవైపు గాంధీజీ… సనాతన ధర్మాన్ని పాటిస్తూ.. హిందుతత్వవాదిగా ఉన్నారు. ఆయన

భావాలు, అభిప్రాయాలు.. హిందూధర్మం నుంచి వచ్చినవే. అలానే ఇతర మతాలను గౌరవించేవారు. మత సామరస్యం ఉండాలనేది ఆయన ఆకాంక్ష… హిందూధర్మంలో అంటరానితనం మహా పాపమని చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించారు కూడా. దీన్ని రూపుమాపేందుకు 1932లో హరిజన సేవా సంఘం అనే సంస్థను సైతం స్థాపించారు.

*ఇలా ఎవరి భావజాలం వారికుంది.. అయితే,

1930-32లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. ఇందులో మొదటి సమావేశానికి కాంగ్రెస్ హాజరు కాలేదు. రెండోసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ తరపున మహాత్మా గాంధీని నిలబెట్టింది.

అయితే ఇదే సమావేశంలో.. అంబేద్కర్..

ఎన్నికలలో పోటీ చేసే హక్కు.. రిజర్వ్డ్ ఎన్నికల గురుంచి ప్రతిపాదించారు.. రిజర్వ్ డ్ ఎన్నికలంటే, ఒక వర్గానికి సంబంధించి.. ఎక్కువ ప్రాతినిధ్యం ఉన్న చోట.. ఆ వర్గంలోని వారే ఎన్నికల్లో పోటీ చేయాలి. ఇందుకు ఆ వర్గం వారే ఓటు వేసి, ఎన్నుకోవాలి. అయితే ఈ విషయంలో అప్పటికే.. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం.. ముస్లీం, అంగ్లో ఇండియన్లకు, యూరోపియన్లు, సిక్కులకు ప్రత్యేకంగా ఎలక్ట్రో రైట్స్ ను ఇచ్చింది. ఈ నేపథ్యంలో అంబేద్కర్ హిందువుల్లో దళితులకు ఈ రైట్స్ ఇవ్వాలని కోరారు. అలానే ఎన్నికల్లో వారు పాల్గొనే అవకాశం రావాలని ప్రతిపాదించారు. ఈ విషయాన్ని సైమన్ కమిషన్ లో కూడా ప్రస్తావించారు. ఇలా అదే విషయాన్ని రౌండ్ టేబుల్ సమావేశాల్లో గట్టిగా వినిపించారు. 

మరీ కాంగ్రెస్ తరపున వచ్చిన మహాత్మా గాంధీజీ.. 

అంటరాని వారి రాజకీయ హక్కుల ప్రతిపాదన గురుంచి తీవ్రంగా వ్యతిరేకించారు. అదే వీరివురుకి మొదటి విభేదం.. పరిచయం కూడా. 

అణగారిన వర్గాలను ఆర్థిక, సామాజిక అణచివేతకు గురిచేశారనేది అంబేద్కర్ వాదన.. అందుచేతనే వారి హక్కులు వారికి ఇవ్వాలని, వారి ప్రతినిధులను వారే ఎన్నుకునే అవకాశం కల్పించాలని కోరారు.

అయితే బదులుగా గాంధీగారు..

దళితులకు ప్రత్యేక ఓటింగ్ హక్కులు, ఎన్నుకునే అవసరం లేదని.. ఇది కులాల మధ్యన చిచ్చులా మారుతుందని.. ఇప్పటికే మతాల పేరుతో సమాజాన్ని విడదీశారు. ఇలాగే కొనసాగితే అందరూ సమానులే అన్న భావన పోతుంది. తద్వారా సమ సమాజం ఏర్పడదనే వాదన గాంధీగారిది.

ఇలా రెండు వాదనలు విన్న బ్రిటిష్ ప్రభుత్వం.. మొదట్నుంచీ డివైడ్ అండ్ రూల్ ను బాగా విశ్వసిస్తుంది. అందుచేతనే అంబేద్కర్ ప్రతిపాదనను అంగీకరించింది. దీంతో గాంధీ ఆ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. 

‘అంటరానివారికి ప్రత్యేక ఓటింగ్ హక్కుల్ని కల్పిస్తే మాత్రం తాను అమరణ నిరాహార దీక్ష చేస్తానని’ అందులో హెచ్చరించారు. ఆ సమయంలో ఆయన జైలులో ఉన్నారు. ఇటువంటప్పుడు ఆయనకు ఏదైనా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గమనించి.. అంగీకారాన్ని వెనక్కు తీసుకుంది. ఒకరకంగా ఇది అన్యాయమే అయినప్పటికీ.. సమసమాజ స్థాపనకై అంబేద్కర్ సైతం సరేనన్నారు. ఇలా ఇద్దరు కలిసి చేసుకున్న ఒప్పందమే.. ‘పూణే ఒప్పందం’..

గొప్ప ఆర్థిక సంస్కరణ

*1922లో అంబేద్కర్ గారు డాక్టరేట్ కోసం ఒక పరిశోధన గ్రంథం రాశారు. ‘ది ప్రాబ్లెమ్ ఆఫ్ ది రూపి 

ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్’.. ఇందులో ఎన్నో ఆర్థికపరమైన అంశాలను కూలంకషంగా వివరించారు.. అయితే రాయల్ కమిషన్…

భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎలా నెలకొల్పాలి. దీని నియమ నిబంధనలు ఎలా ఉండాలి. ఏయే విధానాలలో ఇది పని చేయాలి అనే దాని గురించి.. అంబేద్కర్ గారు సమర్పించిన పరిశోధన గ్రంథాన్ని రిఫర్ చేసింది. అంటే, ఈరోజున మన భారత ఆర్థిక వ్యవస్థ.. ఎలా ఉండాలనే అంశాల గురించి ఆయన అప్పుడే రాసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనం పాటిస్తున్న అర్ బీ ఐ విధి విధానాలు అని కూడా.. ఇలా ఉండటానికి మూల కారణం.. ఆయనే! ఎకనామిక్స్ లో ఇండియాలోనే కాక ఆసియాలోనే మొదటి డాక్టరేట్ పొందిన విద్యావేత్త. 

*‘ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ’, ‘ప్రొవిన్షియల్ డీ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటీష్ ఇండియా’, ‘ది బుద్దా అండ్ కార్ల్ మార్క్స్’, ‘ది బుద్ధా అండ్ హిజ్ ధర్మ’ పలు గ్రంథాలు రాశారు.

ఆర్థిక శాస్త్రంలో ఆసియా ఖండం నుంచి మొట్టమొదటి డాక్టరేట్, డీఎస్సీ తీసుకున్న మొదటి, చివరి భారతీయుడు కూడా ఆయనే…

మొట్టమొదటి ప్రపంచ స్థాయి న్యాయవాది..

బాబాసాహెబ్ తన జీవితకాలంలో 20 వేల పుస్తకాలు సేకరించారు. అయితే అమెరికా నుంచి తిరిగి వచ్చే సమయంలో ఆయన పుస్తకాలు తీసుకొస్తున్న నౌకను జర్మనీ సబ్ మెరైన్ దాడి చేసి, ముంచేయడంతో దాదాపు 6000 పుస్తకాలు పోగొట్టుకున్నారు. ఆ విషయంలో బాబాసాహెబ్ చాలా బాధపడ్డారట.

అంబేద్కర్ కు దాదాపు తొమ్మిది(మరాఠీ, హిందీ, ఇంగ్లీషు, గుజరాతీ, పాళీ, సంస్కృతం, జర్మన్, పార్శీ, ఫ్రెంచ్) భాషల్లో ప్రావీణ్యం ఉంది.

ఆయన నడిపిన దళిత పత్రికలు

దళిత వర్గాల ప్రయోజనాలను పరిరక్షించే ఉద్దేశంతో… ‘మూక్ నాయక్’ అనే పత్రికను నడిపారు. _బహిష్కృత్ భారత్’ పేరుతో..

”మూక్ నాయక్” అనంతరం మరో పత్రికను స్థాపించారు.

ఇదే సమయంలో ”సమత(1928)” జర్నల్ గా మొదలైంది. ఆ తర్వాత బహిష్కృత్ భారత్ పేరును ”జనతా”గా.. మళ్లీ పునఃప్రారంభించారు.

అయితే దళితుల కోసం ప్రత్యేకంగా నడిపించిన పత్రికగా ఈ జనతా రికార్డులకెక్కింది. దాదాపు 25 ఏళ్లపాటు ఈ పత్రిక నడిచింది. ఆ తర్వాత కాలంలో అంబేద్కర్ ఉద్యమంలో మార్పులకు అనుగుణంగా దీని పేరును ”ప్రబుద్ధ భారత్”గా మార్చారు. ఇది 1956 నుంచి 1961 వరకు నడిచింది. దీంతో బహిష్కృత్ భారత్ మొత్తంగా 33ఏళ్లు నడిచిందని, భారత్‌లో దళితుల కోసం సుదీర్ఘకాలం పనిచేసిన పత్రిక ఇదేనని గర్వంగా చెబుతారు.

*స్థాపించిన పార్టీలు… ఇండిపెండెంట్ లేబర్ పార్టీ(ILP),  షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్(SCF).. (ILP నే SCF గా మార్చారు). రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI)… బాబాసాహెబ్ అనారోగ్యం కారణంగా ఆయన తదనంతరం నెలకొల్పబడింది.

*స్థాపించిన విద్యా సంస్థలు.. డిప్రెస్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సొసైటీ, పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ, సిద్ధార్థ్ కాలేజి, ముంబై, మిళింద్ కాలేజీ, ఔరంగాబాద్..

*ధార్మిక సంస్థ.. బుద్ధిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా.

*నాయకత్వం వహించిన కొన్ని ముఖ్య ఉద్యమాలు.. మహద్ చెరువు ఉద్యమం, మొహాళీ(ఘులేల) తిరుగుబాటు, అంబాదేవీ మందిరం ఆందోళన, పూణే కౌన్సిల్ ఉద్యమం, పర్వతీ ఆలయ ఉద్యమం, నాగపూర్ ఆందోళన, కాలారామ్ ఆలయ ఆందోళన, లక్నౌ ఉద్యమం, ముఖేడ్ ఉద్యమం.. 

సాధించిన హక్కులు

మహిళల విద్య, ఆర్థిక సమానత్వం కోసం.. హిందూకోడ్ బిల్లు.

పురుషులతో పాటు మహిళలకు సమాన వేతనాలు.

మహిళలకు గర్భధారణ సమయంలో 8 వారాల ప్రత్యేక సెలవు(Maternity leave).

పని ప్రాంతాలలో మహిళకు ప్రత్యేక సౌకర్యాల కోసం పథకాలు.

స్త్రీ శిశు సంక్షేమ చట్టం.. ఇది తరువాతి కాలంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆవిర్భావానికి దారి తీసింది.

*కార్మికులు/ ఉద్యోగుల కోసం… 14 నుంచి 8 గంటలకు పని దినాలను కుదించారు.

ఈఎస్ఐ(Employee State Insurance) వారి సౌకర్యం, ఆరోగ్య భద్రత కోసం…

ఇండియన్ ఫ్యాక్టరీల చట్టం.. పని ప్రదేశంలో నిర్ధిష్ట విధానాలు, జవాబుదారీతనం కోసం.

పెరిగిన నిత్యావసర ఖర్చులను భరించేందుకు వీలుగా.. కరువు భత్యం.

కనీస వేతనం ఉండే విధంగా చర్యలు.

పీఎఫ్(ప్రావిడెంట్ ఫండ్) సౌకర్యం.

రిజర్వు బ్యాంకు స్థాపన కోసం ఏర్పాటు చేసిన హల్టన్ అండ్ యంగ్ కమీషన్ పూర్తిగా బాబాసాహెబ్ రాసిన “The Problem of the Rupee – it’s origin and it’s solution.” ని అనుసరించి ఉంటుంది.

ఇతరాంశాలు

*లండన్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నిటిని చదివి అవపోసన పట్టిన వ్యక్తి.. బాబాసాహెబ్.

ప్రపంచంలోనే అత్యధిక విగ్రహాలుగల ప్రజా నాయకుడు ఈయనే.

ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావశీలురైన ఆరుగురు మేధావులలో బాబాసాహెబ్ ఒకరు.. ఆయన బౌద్ధం తీసుకుంటే, మరో ఆలోచన లేకుండా 5లక్షల మంది బౌద్ధం తీసుకున్నారు(అప్పటి సామజిక అసమానతలు మూలంగా బాబాసాహెబ్ బౌద్ధం స్వీకరించారు).. ఇంతటి అభిమానం ఇంకే నాయకుడు పొంది ఉండడు.

1956 డిసెంబర్ 6న, 65 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో నిద్రలోనే ఆయన మరణించారు.

ఆయన మరణించిన 34 ఏళ్ల తర్వాత..1990లో, భారతరత్న వచ్చింది. రాజకీయాల్లో ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానే ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడూ ఆయనకు తక్కిన గౌరవం ఇవ్వలేదు. 527 ప్రసంగాలు చేశారు. అవన్నీ ఎంతో ప్రభావవంతమైనవి.

అలా మట్టిలో మాణిక్యంలా.. అవమానాలు, అస్పృశ్యతల నడుమ వజ్రంలా మెరిసి.. నేడు లోకానికే దిశా నిర్దేశమయ్యారు.. బాబా సాహెబ్ అంబేద్కర్.. ఆయన జయంతికి నివాళులు అర్పించే సమయమిది.


Show More
Back to top button