HISTORY CULTURE AND LITERATURETelugu Special Stories

పరమశివుడు కోడి రూపాన్ని ధరించిన క్షేత్రం కుక్కుటేశ్వరం

దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.  తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం భారతదేశంలోని పురాతన, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో పదవ శక్తిపీఠంగా పురుహూతికాదేవి ఇక్కడ వెలిశారు. పిఠాపురం ప్రాంతాన్ని పూర్వకాలంలో ‘పీఠికాపురం’ గా పిలిచేవారు. ఇక్కడ పరమశివుడు కోడిపుంజు రూపాన్ని ధరించిన అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రం “కుక్కుటేశ్వర ఆలయం”. జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ, దివ్య క్షేత్రాలకు పిఠాపురం ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ పరమశివుడు స్పటిక లింగంతో కూడిన స్వయంభు శ్రీ కుక్కుటేశ్వర స్వామిగా వెలిశాడు. ప్రకృతి రమణీయ దృశ్యాలు, చుట్టూ పచ్చని పొలాలు, గోదావరి నదికి నెలవైన ప్రాంతం పిఠాపురం. పూర్వం ఈ ప్రాంతం బుద్ధ రాజధానిగా ఉండేదట.  పిఠాపురం దివ్య క్షేత్రాన్ని కాశీతో సమానంగా భావిస్తారు. ఆలయంలో ప్రవేశించిన అనంతరం ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. అనంతరం ఏకశిలతో (ఒకే రాతి) మీద నందీశ్వరుడు ఆకర్షిస్తాడు. లేపాక్షిలోని బసవేశ్వర నంది తర్వాత ఏకశిల రెండవ అతిపెద్దదిగా చెబుతారు.

సతీదేవి ఎడమ చేయి పిఠాపురంలో పడడంతో అమ్మవారు పురుహుతికగా పదవ శక్తి పీఠంగా ప్రసిద్ధి చెందిందని పురాణాల ద్వారా చెప్పబడుతుంది. ఈ పిఠాపురాన్ని ‘పాదగయ’ అని కూడా పిలుస్తారు. రాక్షసుడు గయాసురుని కోరిక మేరకు శివుడు కుక్కుటేశ్వరుడుగా (కోడిపుంజు) రూపంలో ఇక్కడ వెలిశాడని స్థానికుల కథనం.

 *స్థలపురాణం*

అనంతమైన సృష్టికి పరమేశ్వరుడు లయకారుడు. ఎటు చూసినా ఆ ఈశ్వరుడి క్షేత్రాలే దర్శనమిస్తాయి. కుక్కుటేశ్వర స్వామి ఆలయ దర్శన భాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలం అని పెద్దలు చెబుతారు. ఇక్కడ పరమశివుడు కోడిపుంజు రూపంలో కొలువుదీరడానికి గల పురాణ కథను మనం తెలుసుకుందాం. 

పూర్వం గయాసురుడు అనే రాక్షసుడు వేల సంవత్సరాలు తపస్సు చేసి విష్ణువు నుంచి వరం పొంది ఇంద్ర పదవి దక్కించుకున్నాడు. దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు గయాసురుడి ఆకృత్యాలను తట్టుకోలేక  ఘోర తపస్సు చేసి త్రిమూర్తులను ప్రసన్నం చేసుకున్నాడు. గయాసురుడి అకృత్యాల నుండి మానవులను కాపాడాలని కోరుతాడు. ఇంద్రుని కోరిక మేరకు త్రిమూర్తులు బ్రాహ్మణ రూపాలను ధరించి గయాసురుని వద్దకు వెళతారు. తాము ఒక యజ్ఞం తలపెట్టామని, వారం రోజుల్లో ఆ యజ్ఞాన్ని పూర్తి చేయాలని, ఆ యజ్ఞానికి స్థలం కావాలని ఆ బ్రాహ్మణులు కోరతారు. అయితే ఆ గయాసురుడు తన దేహాన్ని యజ్ఞవాటికగా చేసుకోవాలని బ్రాహ్మణులకు చెబుతాడు. ఆశ్చర్యపోయిన బ్రాహ్మణులు తాము యజ్ఞం చేసే సమయంలో మధ్యలో లేస్తే సంహరిస్తామని గయాసురుడుకి చెబుతారు. దానికి గయాసురుడు అంగీకరిస్తాడు. తన శరీరాన్ని యజ్ఞవాటికగా మారుస్తాడు.  యజ్ఞం తలపెట్టిన ఏడవ రోజు పరమేశ్వరుడు తెల్లవారకముందే కోడిపుంజు రూపంలో వచ్చి కూస్తాడు. కోడిపుంజు కూతను విన్న గయాసురుడు యజ్ఞం పూర్తయిందని భావిస్తాడు. వెంటనే అక్కడ నుంచి లేస్తాడు. ఇదే అదునుగా త్రిమూర్తులు రాక్షసుడు అయినటువంటి గాయసురుడిని సంహరిస్తారు. అయితే అతని పాదాలు పడ్డ చోటు పాదగయ అయింది. గయాసురుడి తల పడిన చోటు శిరోగయ  అయిందట. మహాశివుడు కోడిపుంజుగా దర్శనం ఇచ్చిన అనంతరం పిఠాపురం ప్రాంతంలోనే కుక్కుటేశ్వరుడుగా అవతరించి విశేష పూజలను అందుకుంటున్నాడు.

 *అద్భుత శిల్పకళా వైభవం కుక్కుటేశ్వర ఆలయం* 

పచ్చని ప్రకృతి సోయగాల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవకళ ఉట్టిపడే అద్భుతమైన కట్టడాలతో శిల్పకళా సౌందర్యంతో కుక్కుటేశ్వర క్షేత్రం అలరారుతోంది. ఆలయ దర్శనంతో భక్తులలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. అక్కడ ఉన్నటువంటి కోనేరు పాదగయ కోనేరుగా పిలుస్తారు. ఇక్కడ ఉండే పాదగయ కోనేరులో భక్తులు పుణ్య స్థానాలను ఆచరించి కుక్కుటేశ్వరుడుగా పూజలు అందుకుంటున్న పరమేశ్వరుని దర్శించుకునే తరిస్తారు. పిఠాపురం పుణ్యక్షేత్రం దేవాలయ నిర్మాణం అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో ఆకర్షిస్తోంది. అద్భుతమైన కట్టడాలు, ఆలయ ప్రకారాలపై దర్శనమిస్తాయి. మహాభారత, భాగవత, రామాయణ దృశ్య కట్టడాలు దర్శనమిస్తాయి. జీవ కళ ఉట్టిపడేలా దేవతామూర్తులను అందంగా చిత్రీకరించారు. పచ్చని సోయగాలు ఆహ్లాదాన్ని పంచుతాయి. కుక్కుటేశ్వర స్వామి ఆలయం ప్రాంతాలను చూసి మనసు ఆహ్లాదంగా మారుతుంది. అద్భుతమైన ప్రాంతాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.

పాదగయలు కొలువుదీరిన కుక్కటేశ్వర స్వామి దర్శనం కోసం దేశవ్యాప్తంగా ప్రజలు తరలివస్తారు. ఆలయ ప్రాంగణం నిత్యం అర్చకులు చేసే వ్రతాలు, పూజలు, హారతులు, అర్చనలు, అభిషేకాలు భక్తుల తాకిడితో కిటకిటలాడుతూ ఉంటుంది. కుక్కుటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మరో ప్రధాన ఆలయం ఉంది. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన 

పురుహూతిక దేవి ఆలయం. ఈ శక్తి పీఠాన్ని దర్శించుకునే భక్తులకు అష్టఅయిష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మోక్షం లభిస్తుంది. ఈ దివ్య క్షేత్రంలో వెలసిన మరో పుణ్యక్షేత్రం శ్రీపాద శ్రీ వల్లభ స్వామి క్షేత్రం. ఈ ఆలయాల సందర్శన భాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలంగా చెప్పుకోవచ్చు.

 *పురుహుతిక దేవికి ఆ పేరు ఎలా వచ్చిందంటే..?* 

సర్వగ్రహ సంచారని, లోకానుగ్రహ కార్యని అమ్మవారు పురుహుతిక దేవి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ఇక్కడ అవతరించింది. అష్టాదశ శక్తి పీఠాలలో వెలిసిన అమ్మవార్లను దర్శించుకోవాలని చెబుతారు. అయితే అన్ని పీఠాలను దర్శించుకో లేకపోయినా ఏదో ఒక శక్తి పీఠాన్ని దర్శించుకున్న పుణ్యఫలం లభిస్తుందట. ఇక్కడ అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, విభిన్న ఆభరణాలతో నిత్యం అలంకరించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. పురుహితికా దేవిని దర్శించుకునే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుంది. అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కలుగుతాయట. ఈ ఆలయంలో అమ్మవారి 18 చిత్రపటాలు మనకు దర్శనం ఇస్తాయి. ఇక్కడ అమ్మవారిని మొదటగా ఇంద్రుడు సేవించినట్టు మాఘ పురాణాల్లో చెప్పబడింది. ముందుగా  ముందుగా పురుహుతుడు అమ్మవారిని సేవించడం వలన ఇక్కడ అమ్మవారికి పురుహుతిక దేవిగా పేరు వచ్చినట్లు తెలుస్తోంది. అమ్మవారి దర్శనం అనంతరం క్షేత్రపాలకుడు అయినటువంటి కాలభైరవ స్వామిని భక్తులు దర్శించుకుంటారు.

ఈశ్వర ఆలయ ప్రాంగణంలో స్వయంభూగా వెలసిన శ్రీ వల్లభ దత్తాత్రేయ స్వామి క్షేత్రం దర్శనమిస్తుంది. ఇక్కడ అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి 100 ఏళ్ల క్రితం నాటి “అవుదుంబర వృక్షం” కూడా ఉంది. ఈ క్షేత్రానికి కూడా పురాణ గాధ ఉంది. ఈ దత్తాత్రేయ స్వామి వారిని ఈ క్షేత్రంలో నివసిస్తున్న సుమతి, అప్పలదాసు శర్మలు తమకు సుపుత్రుడు కలగాలని నిత్యం  పూజించగా స్వామి వారు వీరి సేవకు మెచ్చి వారి పుత్రుడుగా శ్రీపాద శ్రీ వల్లభ స్వామిగా ఈ అవుదుంబర వృక్షం కింద జన్మించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ వృక్షం కింద ఉన్న గురుపాదుకలను ఎవరు పూజించినా విశేష ఫలితాలను ఇస్తాయని భక్తుల నమ్మకం.

ఈ ఆలయంలో ప్రధాన రాజ గోపురం నుంచి లోపలికి వెళ్ళగానే ఎదురుగా ఓ పెద్ద కోనేరు కనిపిస్తోంది. ఇందులోనే రాక్షసుడు గయాసురుడి పాదుకలు ఉన్నట్టుగా పురాణాలు చెబుతున్నాయి. భక్తులు ఈ కోనేరులో స్నానం ఆచరించి అష్టగణపతిలో ఒకరైన చింతామణి గణపతిని దర్శించుకుంటారు. అనంతరం కుక్కుటేశ్వర స్వామి గర్భాలయం ఎదురుగా ఉన్నటువంటి నందిని దర్శించుకుని భక్తులు పరమేశ్వరుని దర్శించుకుంటారు.

 *పితృదేవతలకు ముక్తినిచ్చే పాదగయ* 

పరమశివునికి అనేక నామాలు, అనేక రూపాలు. వాటిలో పురాణ విశేషాలకు తగు రూపం కుక్కుటేశ్వర స్వామి రూపం. పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని పాదగయ పితృదేవతలకు ముక్తిని ఇచ్చే పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. తల్లిదండ్రులను గౌరవించి వారి తదనంతరం కూడా వారిని స్మరించే సాంప్రదాయమున్న పుణ్యక్షేత్రం ఇది. భారతదేశంలోని మూడు గయాలలో పిఠాపురం మూడవది. బీహార్ రాష్ట్రంలో ఉన్న శిరోగయా, ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న నబీ గయా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పాదగయా పీఠాపురం.

ఇక్కడున్న అష్టాదశ శక్తి పీఠాల్లోనూ దర్శించుకునే అదృష్టం కలగడం పూర్వజన సుకృతం. ఈ క్షేత్ర దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం.

 *ఆలయంలోని ఇతర ఉప ఆలయాలు* 

కుక్కుటేశ్వర స్వామి దేవాలయ సన్నిధిలో సీతా, లక్ష్మణ, భరత, శత్రజ్ఞుడు, హనుమలతో ఉన్న రామాలయం, దత్త పంచకం, పవిత్ర కోనేరు పాదగయ, హరిహర సుత అయ్యప్ప స్వామి మందిరం, జగన్మాత రాజరాజేశ్వరి దేవి, కుంతీ మాధవస్వామి, శ్రీ వేణుగోపాల స్వామి, సాయిబాబా మందిరం సరస్వతీ మాత ఆలయాలు ఉప ఆలయాలుగా కొలువుదీరి ఉన్నాయి.

Show More
Back to top button