GREAT PERSONALITIESTelugu Special Stories

ఆస్తి లోనే కాదు వ్యక్తిత్వం లోనూ సంపన్నురాలు… ఇన్ఫోసిస్ సుధా మూర్తి…

సుధా మూర్తి (జననం 19 ఆగస్టు 1950)

జోరుగా వర్షం కురుస్తుంది. ఇంతటి జడివాన లో ఎక్కడికెళతారు ? ఈ రాత్రికి మా ఇంట్లోనే వుండి రేపు బయలుదేరండి అని ఓ నిరుపేద ఒడిషా కూలీ విన్నపం మేరకు సరే అని ఆ రాత్రికి ఆ ఇంట్లోనే తల దాచుకుంది ఒక మహిళ. నిజానికి ఆమె అక్కడున్న పేద పిల్లలకు ఉచిత బడి స్థాపించే పని మీద అక్కడికెళ్ళారు.

ఆవిడ మన అతిథి. ఆమె టీ ,కాఫీ త్రాగరట, పాలు ఇవ్వు అని ఆ కూలీ భర్త అన్నారు. దానికి సమాధానంగా ఆ కూలీ “మన పాపకు ఆ ఒక్క గ్లాసుడు పాలే వున్నాయి. ప్రస్తుతం వాన పడుతోంది. ఆ పాలు ఆమెకిస్తే ఈ రోజు రాత్రంతా మన పాప ఏడుస్తుంటుంది” అంది ఆమె. అయినా పరవాలేదు. సగం పాలకు సగం నీళ్ళు కలిపి, చక్కెరతో ఇవ్వు అన్నాడు భర్త. ఒరియా భాష తెలిసిన ఆ ఆతిథ్య మహిళకి అది వినపడింది. అప్పుడు ఆవిడ “ఈ రోజు బుధవారం , నేను ఉపవాసం. ఏమీ తీసుకోను” అన్నారు. అందరూ సోమ , గురు , శుక్ర , శని వారాలు ఉపవాసం చేస్తారు. మీరు బుధవారం ఉపవాసం వుంటున్నారెందుకు? అని అతనడిగాడు. దానికి సమాధానంగా “నేను గౌతమ బుద్ధుడి కోసం ఉపవాసం వుంటున్నాను” అన్నారు ఆవిడ. నిజానికి అప్పటివరకు ఉపవాసం ఉండని ఆవిడ ఆ రాత్రే ఆ నిర్ణయం తీసుకొన్నారు. “గుక్కెడు పాలు త్రాగలేని పసిపిల్లలు లక్షలమంది నాదేశం లో వుండగా , నేను పాలు త్రాగడమా ? వద్దు” అని ఆనాటి నుండి ఆమె పాలు త్రాగడం మానేసారు. ఆమె ఎవరో కాదు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తి. ఆవిడ టాటా వారి టెల్కో లో భారతదేశపు మొట్టమొదటి మహిళా ఇంజినీర్. 2 ,21,501 మంది ఉద్యోగులతో ప్రతీ ఏటా 2.48 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయం కలిగి, ప్రపంచంలోని పది అగ్రగామి సాఫ్ట్వేర్ కంపెనీలలో ఒకటైన “ఇన్ఫోసిస్” నడిపే “ఇన్ఫోసిస్ ఫౌండేషన్” కు “చైర్ పర్సన్” అయిన సుధా మూర్తి నిరాడంబరతకి మారుపేరులా వుంటారు.

సుధా మూర్తి ఒక భారతీయ విద్యావేత్త, రచయిత్రి మరియు పరోపకారి. ఆవిడ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు యన్.ఆర్. నారాయణ మూర్తిని వివాహం చేసుకున్నారు. ఆమె ఒక ఉపాధ్యాయురాలుగా కంప్యూటర్ సైన్స్ ను భోదిస్తారు. ఆవిడ కంప్యూటర్ ఇంజనీర్ గా తన జీవితాన్ని ప్రారంభించి ఇన్‍ఫోసిస్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాలలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇన్ఫోసిస్ కంపెనీ లాభాపేక్ష లేకుండా స్థాపించిన స్వచ్ఛంద సంస్థ “ఇన్ఫోసిస్ ఫౌండేషన్” వ్యవస్థాపక ఛైర్‌పర్సన్. తన వృత్తి జీవితంతో బాటు రచయితగా ఈవిడ ఎన్నో కాల్పనిక రచనలు కూడా చేస్తుంటారు. ఆవిడ రచించిన కన్నడ నవల “డాలర్ సొసే” (డాలర్ కోడలు) ఆంగ్లములో డాలర్ బహుగా అనువదించబడింది. ఆ తరువాత ఇదే నవల 2001 లో జీ టీవీ లో ధారావాహికగా ప్రసారమైనది.

సుధా మూర్తి భారతీయ సంఘ సేవకురాలిగా ఎన్నో సేవా కార్యక్రమాలను ఆవలంభించారు. ఆవిడ పలు అనాధాశ్రమాలను ప్రారంభించారు. అలాగే అనేక గ్రామీణాభివృద్దికి కార్యక్రమాలకు సహకరించారు. కర్ణాటక రాష్ట్రములో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లను అందించి వాటి ద్వారా పేద విద్యార్థులు కూడా ఉచితంగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పొందగలిగేందుకు తోడ్పడ్డారు. అలాగే ఆవిడ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ గ్రంథాలతో “ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా” ను కూడా ప్రారంభించారు. తన సామాజిక సేవకు గుర్తుగా సుధా మూర్తికి 2006లో భారత ప్రభుత్వం ద్వారా భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ లభించింది. సుధా మూర్తి 2023లో భారతదేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్ అందుకున్నారు. ఆవిడ చేసే సామాజిక సేవా కార్యక్రమాల కృషికి మరియు విద్యకు 8 మార్చి 2024 నాడు పార్లమెంటు రాజ్యసభ సభ్యులుగా ఆమె నామినేట్ అయ్యారు.

@ జీవిత విశేషాలు.

  • జన్మనామం  :    సుధా కులకర్ణి
  • ఇతర పేర్లు  :   సుధా మూర్తి 
  • జన్మదినం :  19 ఆగస్టు 1950
  • స్వస్థలం :    షిగ్గవి , మైసూరు రాష్ట్రం (ప్రస్తుత కర్ణాటక ), భారతదేశం
  • తండ్రి :      ఎస్. ఆర్. కులకర్ణి
  • తల్లి :            విమలా కులకర్ణి ,
  • జీవిత భాగస్వామి :   ఎన్.ఆర్. నారాయణ మూర్తి  
  • పిల్లలు :    రోహన్ , అక్షతా 
  • బంధువులు   :  రిషి సునాక్ (అల్లుడు)
  • వృత్తి      :     పార్లమెంటు సభ్యురాలు & ఇన్‍ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్, పిల్లల రచయిత
  • పురస్కారాలు    :    పద్మశ్రీ (2006), దాన చింతామణి అత్తిమబ్బే అవార్డు (2010), పద్మ భూషణ్ (2023)

@ నేపథ్యం…

సుధా మూర్తి భారతదేశంలోని మైసూర్ రాష్ట్రం (ప్రస్తుత కర్ణాటక ) లోని హవేరి జిల్లా షిగ్గావ్‌లో కన్నడ మాట్లాడే బ్రాహ్మణ కుటుంబంలో ఎస్.ఆర్. కులకర్ణి మరియు విమలా కులకర్ణి దంపతులకు 19 ఆగస్టు 1950 నాడు జన్మించారు. తండ్రి ఎస్. ఆర్. కులకర్ణి వైద్యులు, తల్లి ఉపాధ్యాయనీ. తన బాల్యమంతా తల్లిదండ్రులు, తాతయ్య, నానమ్మల మధ్య గడిచింది. అందువలన ఆ అనుభవాలతోనే ఆవిడ పెద్దయ్యాక “హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అండ్ అదర్ స్టోరీస్” అనే పుస్తకాన్ని రచించారు. ఆమె తాత ఆనాటి ప్రముఖ న్యాయవాది శ్రీ నారాయణ మేల్గెరె.  టెలికామ్ రంగంలో విశిష్ట వ్యక్తి శ్రీనివాస కులకర్ణి ఆమెకు సోదరుడు.

సుధా మూర్తి బి.వి.బి. సాంకేతిక కళాశాల నుండి ఎలక్టికల్ ఇంజనీరింగ్ పట్టాను పొంది, కర్ణాటక రాష్ట్రంలో ఆ పట్టాను పొందిన ప్రప్రథమరాలిగా ముఖ్యమంత్రి నుండి స్వర్ణ పతకం అందుకున్నారు. 1974లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి కంప్యూటర్ సైన్స్ లో   ఎం.టెక్ పట్టభద్రురాలయ్యారు. ఆమె ప్రతిభను గుర్తించిన ఇనిస్ట్యూట్ ఆమెను స్వర్ణపతకంతో సత్కరించింది. ఆవిడ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని భారతదేశ అతిపెద్ద ఆటో పరిశ్రమ అయిన టాటా టెల్కో లో మొట్టమొదటి మహిళా ఇంజనీర్ గా ఉద్యోగం సాధించారు. అప్పటివరకు ఈ సంస్థవారు కేవలము పురుషులకు మాత్రమే ఉద్యోగాలు కల్పించేవారు. ఈ రకమైన లింగ వివక్షతను నిరసిస్తూ, ప్రశ్నిస్తూ ఆవిడ ఆ సంస్థ అధ్యక్షుడికి ఒక పోస్టుకార్డు వ్రాశారు. దానికి స్పందించిన అధినేత ఆమెతో ప్రత్యేక ఇంటర్వ్యూ జరిపి 1974 నుండి 1981వరకు పూణేలోని తమ సంస్థ జనరల్ మేనేజర్ గా నియమించారు. ఆ తరువాత ఆమెను ముంబైకి బదిలీ చేశారు.

@ నారాయణ మూర్తితో పరిచయం…

నాగవర రామారావు నారాయణ మూర్తి ఒక భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త. అతను ఇన్ఫోసిస్ యొక్క ఏడుగురు సహ వ్యవస్థాపకులలో ఒకరు. ఆయన విజయాల చరిత్రలో సుధా మూర్తి భాగస్వామ్యం వెలకట్టలేనిది. సుధా మూర్తి ప్రస్తావన లేకపోతే, ఆమె త్యాగాలని గుర్తు చేసుకోలేకపోతే, ఆమె ప్రోత్సాహాన్ని కొనియాడకపోతే నారాయణ మూర్తి విజయాల చరిత్ర అసంపూర్ణం, అసమగ్రం. నారాయణ మూర్తి సాఫ్ట్‌ట్రానిక్స్ పేరుతో ప్రారంభించిన ఒక కంపెనీని దాదాపు ఏడాదిన్నర తరువాత విఫలమైనప్పుడు, అతడు పూణేలోని పాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్‌లో చేరారు. అలా ఆయన మొదటిసారిగా సుధా మూర్తిని పూణేలో కలుసుకున్నారు. ఇద్దరూ కూడా కన్నడకు చెందినవారే. నారాయణ మూర్తి తండ్రి బడిపంతులు. గంపెడు సంతానంలో ఆయన ఒకరు. ఐఐటి కాన్పూర్ నుండి పట్టా అందుకున్నారు. అప్పటిదాకా ఆయనకు స్థిరమైన ఉద్యోగం లేదు. సుధా మూర్తి మాత్రం సంపన్న కుటుంబంకు చెందిన అమ్మాయి. ఆమె అప్పటికే టెల్కో టాటా సంస్థలో ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.

@ నారాయణ మూర్తితో ప్రణయం..

నారాయణ మూర్తి పుస్తక ప్రియులు. ఆమెకు కూడా పుస్తకాలు అంటే ఇష్టం. ఓ మిత్రుడు అతని దగ్గర పుస్తకాలు తీసుకొని ఆమెకి ఇచ్చేవాడు. మొదటి పేజీలో పేరు వ్రాసుకోవడం నారాయణమూర్తి కి అలవాటు. అలా నారాయణ మూర్తి కంటే, ఆయన పేరు సుధా మూర్తికి బాగా పరిచయం. ఆ తరువాత ఏదో విందులో ఇద్దరు కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. ముందుగా నారాయణ మూర్తే ప్రేమ ప్రతిపాదన తీసుకొచ్చారు. నా ఎత్తు ఐదు అడుగుల నాలుగు అంగుళాలు. నేను కళ్ళజోడు పెట్టుకుంటాను. పెద్దగా అందగాడిని ఏమీ కాదు. పేద కుటుంబం నుంచి  వచ్చాను. నా దగ్గర డబ్బు లేదు. అలాగని సంపాదిస్తానని అనుకోవడం లేదు. అయినా సరే నన్ను పెళ్లి చేసుకుంటారా అని ఆమెను అడిగారు. దానికి ఆమె కాస్త ఆలోచించుకునే సమయం ఇవ్వండి అని అన్నారు. సుధా మూర్తి ఆ ప్రతిపాదనను తన కన్నవారి ముందు ఉంచారు. దానికి తాడు బొంగరం లేని మనిషితో నీకు పెళ్లి ఏమిటి? అసాధ్యం అని ఆమె తండ్రి తేల్చి చెప్పారు. అప్పుడు తండ్రితో సుధా మూర్తి “ఎప్పటికైనా మీ అనుమతితోనే అతనిని పెళ్లి చేసుకుంటాను, కాదంటే నేను ఇలానే ఉండిపోతాను” అని బదులిచ్చారు.

@ నారాయణ మూర్తితో పెళ్లి…

నారాయణ మూర్తి  ప్యాట్ని కంప్యూటర్స్ లో చేరినాక సుధా మూర్తి పెళ్ళికి ఆమె తల్లిదండ్రులకు ఒప్పుకున్నారు. చేతిలో డబ్బులు లేకపోయినా నారాయణమూర్తి తన మిత్రులతో కలిసి ఇన్ఫోసిస్ ప్రారంభించాలని అనుకున్నప్పుడు సుధా మూర్తి మనసారా ప్రోత్సహించారు. ఆమె పొదుపు చేసుకున్న పదివేల రూపాయలను ఆయన చేతిలో పెట్టారు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో తన నగలు కుదువబెట్టి వారి జీతాల్ని సకాలంలో చెల్లించేవారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే నారాయణ మూర్తిని ఎప్పుడూ నిరాశ పరచలేదు. “కుటుంబం గురించి నేను ఆలోచిస్తాను, లక్ష్యం గురించి మీరు ఆలోచించండి” అని సుధా మూర్తి భరోసా ఇచ్చారు.

వారిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఇన్ఫోసిస్ వ్యవహారాలు చూడాలని భర్త నారాయణమూర్తి నిర్ణయించినప్పుడు ఆమెకు అన్ని అర్హతలు ఉన్నా కూడా ఆ అవకాశం భర్తకే ఇచ్చారు. ఎందుకంటే అది ఆయన కల. ఆమె మాత్రం కుటుంబ బాధ్యతలకే పరిమితమయ్యారు. ఇన్ఫోసిస్ తొలి రోజులలో “నేను గుమస్తాని, వంట మనిషిని, ప్రోగ్రామర్ ని, ఆయనకు సెక్రెటరీని అని ఆమె నవ్వుతూ చెబుతుంటారు. ఎంత త్యాగం చేశారు అని ఎవరైనా సానుభూతి చూపితే ఆమె తట్టుకోలేరు. ఎందుకంటే ఆమె దృష్టిలో అది త్యాగం కానే కాదు, అది ప్రేమ అని చెబుతారు. ఆ దంపతులకు ఒక కుమారుడు రోహన్, కుమార్తె అక్షత. వారిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి.

@ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ గా…

ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ కు ఛైర్ పర్సన్ గా వ్యవహరించే సుధా మూర్తి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. నిరుపేదలకు ప్రత్యక్ష సాయం చేస్తారు. లక్షల కుటుంబాలకు నిత్యావసరాలు అందిస్తుంటారు. ఆహార పదార్థాలు, భోజనాలు ఇలా క్షేత్రస్థాయిలో ఎక్కడ అవసరం ఉందో గుర్తించి ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ సేవలు కొనసాగిస్తుంటారు. 24 లక్షల మందికి ఆహారం, 2.30 లక్షల కుటుంబాలకు చేయూత, 12.41 లక్షల భోజనాల పంపిణీ, 10 వేల మంది దినసరి కూలీలకు 1,000 చొప్పున సాయం ఇలాంటివి ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌యొక్క దాతృత్వం. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ లక్ష్యం రూ.100 కోట్ల సాయం. సంకల్పం బలంగా ఉంటే లక్ష్యం చిన్నదైపోతుంది. సుధామూర్తి అనుకున్నది దాటేశారు. రూ.100 కోట్లు కాస్తా రూ.120 కోట్లు అయ్యింది. ఇన్ఫోసిస్‌ లాంటి సంస్థ నిర్వహిస్తున్న ఫౌండేషన్‌కు వంద కోట్లు ఖర్చుచేయడం పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. కానీ దానిని ఎలా వినియోగిస్తున్నారన్నదే ముఖ్యం. ఈ విషయంలో సుధామూర్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫౌండేషన్‌ ద్వారా నిర్వహిస్తున్న పనులను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఆ వివరాలన్నిటినీ ఎప్పటికప్పుడు అందరితో పంచుకుంటుంటారు.

@ కోవిడ్ 19 సమయంలో…

2020 వ సంవత్సరం కొవిడ్‌-19 ఉగ్రరూపు దాల్చుతున్న క్రమంలో కర్ణాటకలోని బెంగళూరులో ఓ ఆస్పత్రిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి. అన్నట్టుగానే వంద గదుల క్వారంటైన్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. బెంగళూరులోని నారాయణ హెల్త్‌ సిటీలో దీనిని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు పీపీఈ కిట్లు, మాస్కులు, ఇతర సామగ్రిని కూడా అందజేసేలా ప్రణాళికలు రూపొందించారామె. వాటితో పాటు క్వారంటైన్‌ సెంటర్‌, ఆస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు ప్రధానమంత్రి సహాయనిధి “పీఎం కేర్స్‌” కు రూ.50 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. 142 వెంటిలేటర్లు, 26 మల్టీపారా పేషంట్‌ మానిటర్స్‌, 14వేల లీటర్ల శానిటైజర్‌, 40వేల పీపీఈ కిట్లు, రెండున్నర లక్షల చేతి తొడుగులు, 32వేల ఎన్‌95 మాస్కులు ఇలా అక్కరకు వచ్చే ప్రతీ వస్తువులను అందించారు. రెండు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ వసతి కల్పించారు.

@ అహం లేని ఆదర్శ దంపతులు…

భార్యాభర్తల మధ్య అహంతో నేనే గొప్ప అంటూ ఇద్దరి మధ్య హెచ్చుతగ్గులు ఉంటున్న ఈ రోజులలో నారాయణ మూర్తి దంపతులు ఒకరికొకరు చేయూతనిచ్చుకుంటూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. సుధామూర్తి వల్లనే తాను విజయం సాధించానని, తన విజయంలో ఆమెదే ముఖ్యపాత్ర అని నారాయణమూర్తి చెబుతారు. విచ్చలవిడిగా ధనం ఖర్చు చేసి, ఖరీదైన కార్లలో తిరగడమే సంపన్నత కాదు. వందల కోట్ల ఆస్తి ఉన్నా సామాన్యుల్లానే జీవిస్తూ, తాము సంపాదించిన డబ్బుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సంపూర్ణ జీవితం గడుపుతున్న సుధామూర్తి, నారాయణమూర్తి దంపతుల జీవితం ఆద్భుతం. “అక్రమాల ద్వారానే డబ్బు సంపాదిస్తారనే ఆలోచన తప్పు. ధర్మ బద్ధంగా కూడా ధనం సంపాదించవచ్చు” అని ఇన్ఫోసిస్‌ సంస్థను ప్రారంభించినప్పుడు తన మిత్రులను ఉద్దేశించి నారాయణమూర్తి చెప్పిన మాట. చెప్పడమే కాదు, ఆయన ఆచరించి చూపించారు. విలువలకు కట్టుబడిన “ఇన్ఫోసిస్” సంస్థ ఐటి రంగంలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా నిలిచింది. నారాయణ మూర్తి దంపతులు వాళ్ల కంపెనీలో ఓ పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టి కేవలం పదేళ్లలో కోటీశ్వరులు అయ్యారు.

వేల కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఆ దంపతులు చూడడానికి మధ్యతరగతి కుటుంబీకుల్లానే కనిపిస్తారు. అలా కనిపించడమే కాదు, వారి జీవిత విధానం కూడా ఆ విధంగానే ఉంటుంది. డబ్బుకు మనం విలువ ఇస్తే అది మనకు విలువ ఇస్తుందని ఆ దంపతుల జీవితాలను చూస్తే ఎవ్వరికైనా అర్థమవుతుంది. ఏ రంగంలోనైనా సకాలంలో అడుగు పెట్టడమే ముఖ్యం అంటారు నారాయణ మూర్తి. 1971లోనే ఐటి రంగం అభివృద్ధిని ఊహించి ఆ రంగంలో అడుగు పెట్టిన వారు, ఆ రంగంలో ఘన విజయం సాధించి, విలువలతో జీవనం కొనసాగిస్తున్నారు. తన సతీమణి సుధామూర్తి ఇచ్చిన పదివేల రూపాయల పెట్టుబడితో నారాయణమూర్తి “ఇన్ఫోసిస్” సంస్థను ప్రారంభించి అంతర్జాతీయంగా ఖ్యాతి గడించారు. ఒకరు ఇంటి బాధ్యత నిర్వర్తిస్తే, ఇంకొకరు కంపెనీ బాధ్యత నిర్వహిస్తూ జీవితంలో ఊహించని స్థాయికి ఎదిగారు. వ్యసనాలు, విందులు, విలాసాలతో ఎంతో మంది సంపన్నులు బికారులుగా మారిపోయిన ఈ కాలంలో సామాన్యులకే కాదు, సంపన్నులకూ నారాయణ మూర్తి దంపతుల జీవితం ఆదర్శప్రాయం.

@ తల్లి ఆదర్శాలే కుమారుడికి..

సుధా మూర్తి దంపతుల కొడుకు రోహన్ మూర్తికి చాలా మంది స్నేహితులు ఉండేవారు. ఒక్కసారి తన పుట్టినరోజును ఖరీదైన స్టార్ హోటల్ లో జరుపుకొందామని అదే విషయాన్ని తల్లి సుధామూర్తికి చెబుతాడు. అప్పుడు ఆమె ”ఎంత ఖర్చు అవుతుంది ?” అని అడుగుతారు. అందుకు సమాధానంగా ఒక యాభై మంది స్నేహితులు వస్తారు కనుక యాభైవేల రూపాయలు ఖర్చు అవుతుంది అంటాడు రోహన్. దానికి సుధామూర్తి తన కుమారుడితో రోహన్ “ఒక్కసారి మన ఇంట్లో పనిచేసే ఈ పనిమనిషిని చూడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఇద్దరి చదువుల ఖర్చు ఒక ఏడాదికి ఇరవైవేల రూపాయలు అవుతుందట. నీవు నీ పుట్టినరోజు వేడుకను వద్దనుకొంటే ఆ ఇద్దరు పేదపిల్లలు రెండు సంవత్సరాలు చదువుకోగలుగుతారు, ఆలోచించు. ఒకవేళ నీవు నిర్ణయించుకున్నట్లుగా ఆడంబరంగానే జరుపుకోవాలంటే  , అలాగే కానిద్దాం” అని అన్నారు.  

రాత్రంతా ఆలోచించిన రోహన్ మూర్తి ఉదయమే అమ్మ దగ్గరికొచ్చి  “అమ్మా , నీవు చెప్పినట్టే చేద్దాం” అన్నాడు. వెంటనే సంతోషించిన సుధామూర్తి మరుసటిరోజు తన యాభైమంది స్నేహితులను తన ఇంటికి పిలిపించి, వాళ్ళందరికి ఒక వంటమనిషిని తోడు తీసుకొని సుధామూర్తిగారే స్వయంగా వంటలు వండి అందరికీ వడ్డించారు. అదే రోజు ఇంట్లో పనిచేసే పనిమనిషికి పిల్లల చదువులకోసం రోహన్ చేతనే ఇరవైవేల రూపాయలు  ఇప్పించారు. ఆ సంఘటన రోహన్ మూర్తి మీద ఎంత ప్రభావం చూపిందంటే , అతడు తరువాత విదేశాలకెళ్ళి చదువుకొంటున్నపుడు , అక్కడి యూనివర్సిటీలు ఇచ్చే స్కాలర్ షిప్ ను మొత్తం పేదలకు ఉపయోగించమని బెంగళూరులో వున్న తల్లి సుధామూర్తి గారికి పంపించేవాడు.

@ 20 సంవత్సరాల నుండి ఒక్క చీర కొనలేదు..

భారతీయ సినిమా రంగంలో అత్యున్నత స్థానం నుంచి అధఃపాతాళానికి పడిపోయిన ఎందరో మహానుభావుల గురించి మనకు తెలుసు. దీనికి భిన్నంగా ఒక సామాన్యురాలు అసామాన్యురాలిగా అత్యున్నత స్థాయికి చేరుకున్న సుధామూర్తి ఎందరికో స్ఫూర్తిదాతగా నిలిచారు. ఖరీదైన చీర కొనుక్కోవడానికి కూడా ఇష్టపడని సుధామూర్తి ఇంట్లో దాదాపుగా 50 వేల పుస్తకాలున్నాయి అంటే నమ్మగలరా? తప్పదు నమ్మాల్సిందే. కేవలం తన ఇంటి కోసమే పుస్తకాలు కొనడమే కాకుండా, కర్నాటకలోని దాదాపు 60వేల గ్రంథాలయాలకు నారాయణ మూర్తి దంపతులు ఉచితంగా పుస్తకాలు అందజేశారు. 

నిజానికి అసామాన్య విజయాలు సాధించిన వారు మిగతా వారిని మించి ఎలాంటి ప్రత్యేకతలు కలిగి ఉండరు. అందరిలానే వీరికీ కూడా రోజుకు ఇరవై నాలుగు గంటలే ఉంటాయి. అందరిలానే రెండు చేతులు, రెండు కాళ్లే ఉంటాయి. కానీ వారు తమకున్న 24 గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆ ఆలోచనలే మనిషిని ఉన్నత స్థాయికైనా, పతన స్థితికైనా తీసుకువెళతాయి. మనం ఎలాంటి ఆలోచనలతో వెళుతున్నామనేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

గంటల తరబడి మహిళలు షాపింగ్‌లో కాలం గడుపే ఈ రోజులలో కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి ఉన్న మహిళ షాపింగ్‌కు వెళితే ఎలా ఉంటుందో అని మనం ఏవేవో ఊహించుకుంటూంటాం. కానీ, “ఇన్ఫోసిస్” నారాయణ మూర్తి భార్య, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి గత 20 ఏళ్ల నుంచి కనీసం ఒక్క చీర కూడా కొనలేదు. భారతీయ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన కాశీకి వెళ్లిన వారు తమకు ఇష్టం అయిన ఏదో ఒక దానిని అక్కడ వదిలేయడం సంప్రదాయం. ఎక్కువ మంది తమకు నచ్చిన ఆహార పదార్థాన్ని వదిలేస్తారు. సుధామూర్తి మాత్రం షాపింగ్ అలవాటును వదిలేశారు. అప్పటి నుంచి ఆవిడ కొత్తగా చీరలేమీ కొనలేదు.

@ నిరాడంబరతకు నిదర్శనం…

సుధా మూర్తి దగ్గర వున్నది కేవలం 8 చీరలు మాత్రమే అంటే మనలో చాలా మంది నమ్మగలరు? నమ్మడం అంటుంచితే అవాక్కవుతారు, ఆశ్చర్యపోతారు కూడా. నిజమే, చివరిసారిగా ఆమె చీర కొన్నది 1998 లోనే.

సుధా మూర్తి ఒకసారి ప్రపంచ ప్రసిద్ధ “లండన్ హెత్రో  విమానాశ్రయం” లో అక్కడి ఒక ఆంగ్ల మహిళ సాధారణ దుస్తుల్లో వున్న సుధా మూర్తి ని చూసి “ఇది ధనవంతులు ప్రయాణించే బిజినెస్ క్లాస్, నీలాంటి వారు అదిగో అక్కడ మామూలు ప్రజలు వెళ్ళే ఎకానమి క్లాస్ వుంది వెళ్ళు” అనడంతో చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోయింది సుధా ముర్తి. కానీ అదే రోజు 24 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఒక సదస్సులో అధ్యక్షురాలి హోదాలో ఆంగ్లములో అనర్గళంగా  మాట్లాడుతుంటే ఆ ఆంగ్ల మహిళ అవాక్కయింది. “నిజంగా గొప్పవారికి  తాము గొప్పవారనే విషయమే గుర్తుండదు, అదే వారి గొప్పతనం” అంటాడు చైనా కు చెందిన లా తజు అనే ఒక ఫిలాసఫర్. కేవలం 8 చీరలే కలిగిన సుధామూర్తి తన ఇంట్లో మాత్రం 50,000 పైగా పుస్తకాలు కలిగివున్నారు. తన ఆదాయాన్ని ఆమె పేదల చదువుకు, అనాథలకు, ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. జీవితంలో బ్రతకడం వేరు , జీవించడం వేరు.

Show More
Back to top button