Telugu Special Stories

భారత్, శ్రీలంక మధ్య కచ్చాతీవు వివాదం ఏమిటి..? 

ప్రస్తుతం తమిళనాడుకు చెందిన ఓ అంశం దేశమంతా ట్రెండ్ అవుతోంది. అదే రామేశ్వరానికి 33 కిలోమీటర్ల దూరంలో, శ్రీలంకలోని జాఫ్నాకు 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న కచ్చాతీవు దీవి. ఈ దీవిపై నెలకొన్న వివాదం తమిళనాడులోని ప్రతి ఎలక్షన్స్‌కు తెరమీదకు వస్తుంది. అయితే ఈసారి దేశమంతా ఈ అంశం తెరమీదకు వచ్చింది. దీనికి కారణం ప్రధాని మోదీ ఈ దీవిపై చేసిన వ్యాఖ్యలే. అసలు కచ్చాతీవు దీవి స్టోరీ ఏంటి? ప్రధాని మోదీ దీనిపై ఏం వ్యాఖ్యలు చేశారు? ఇది వచ్చే ఎన్నికల్లో ఏమన్నా ప్రభావం చూపుతుందా అనే విషయాలపై ఓ లుక్ వేద్దాం పదండి. 

కచ్చాతీవు దీవి ప్రాంతం 1803 నుండి రామనాధపురం రాజా జమీందారీ ఆధీనంలో ఉండేది. 1874-76లో భారత సర్వే బృందం కచ్చాతీవును శ్రీలంకలో భాగంగా ప్రస్తావించింది. పాక్ జలసంధిలో మత్స్యవేట కోసం చర్యలు ప్రారంభం కాగా.. మద్రాసు ప్రెసిడెన్సీ ఆ దీవి ఆది హక్కు పత్రాన్ని చూపలేకపోయింది. 1920 మధ్యనుంచి ఆ భూభాగంపై శ్రీలంక అధికారం నెరపుతోంది. చారిత్రక ఆధారాలు శ్రీలంకకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ..

రెండు దేశాల మధ్య సొదర భావాన్ని పెంపొందించుకోవడం కోసం 1974లో శ్రీలంక ప్రధాని సిరిమావో బండారునాయకేలతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా శ్రీలంకకు ఆ దీవిని అప్పగించారు. సాధారణంగా ఇది చాలా చిన్నదీవి ఇక్కడ మానవసంచారం చాలా తక్కువ ఉంటుంది. కానీ, మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. దీంతో భారత మత్స్యకారులు ఇక్కడ వేట ఎక్కువగా సాగిస్తుంటారు. 

అంతేకాదు ఇక్కడ సెయింట్‌ ఆంటోనీ అనే ప్రార్థనామందిరం ఉంది. ఏటా జరిగే ఉత్సవాల్లో తమిళనాడు వాసులు ఎక్కువగా పాల్గొంటారు. ఇందిరా గాంధీ కుదిర్చిన ఒప్పందంలో భాగంగా తమిళనాడు చివరలో ఉన్న ప్రజలు ఆ దీవిలో ప్రార్థనలు చేసుకోవచ్చు, చేపల వలలు ఆరపెట్టుకోవచ్చు. కానీ ఆమె హయంలో జరిగిన ఒప్పందం మరిచి ఇప్పుడు వీరిపై దాడులు చేయడంతో పాటు శ్రీలంక అరెస్టులు చేస్తోంది. ఈ దీవిలో భారత్‌ మత్స్యకారులకు ప్రవేశం ఉందని ఒప్పందం స్పష్టం చేస్తున్నా.. శ్రీలంక కనీసం పట్టించుకోవడం లేదు.

అప్పటి నుంచి ప్రతిసారి తమిళనాడు వాసులను శ్రీలంక పట్టుకోవడం, వారిని మనదేశం విడిపించడం జరుగుతూ ఉండేది. అయితే, ఈసారి ఎన్నికల వల్ల ఇది మరింత కార్చిచ్చు రాజేసింది. 1974లో నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఈ దీవిని ఎలాంటి రాజ్యాంగ సవరణ లేకుండా శ్రీలంకకు అప్పనంగా అప్పగించారని నరేంద్ర మోదీ ఆరోపించారు. అంతేకాదు తమిళనాడులో ఉన్న డీఎంకే కూడా కచ్చతీవుపై రెండు నాల్కుల ధోరణి పాటించిందంటూ ప్రధాని మోదీ విమర్శలు చేయడంతో ఈ అంశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

కచ్చాతీవు విషయంలో మోదీ ప్రభుత్వం ఇప్పుడు పూర్వ కాంగ్రెస్ ప్రభుత్వాలపై నిందారోపణలు చేయటంలో రాజకీయ ఉద్దేశమే అని కాంగ్రెస్ అంటోంది. భౌగోళిక సమగ్రతతో కాంగ్రెస్ రాజీపడినట్లు నిందిస్తూ తమిళనాడులో మత్స్యకారుల ఓట్లకు గాలం వేస్తోందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. ప్రధానమంత్రి స్థానంలోని వ్యక్తి ఇలా దిగజారటం సరికాదని కాంగ్రెస్ వాదులు అంటున్నారు. అయితే, దీనిపై ప్రధాని మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే భారతదేశానికి సంబంధించి ఏదైనా ప్రాంతాన్ని ఇతరులకు బదిలీ చేయాలంటే తప్పని సరిగా రాజ్యాంగ సవరణ చెయాల్సి ఉంటుంది. దీనిపై మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Show More
Back to top button