Telugu Special Stories

ప్రపంచ మహిళా భద్రత గాల్లో దీపమేనా !

ప్రకృతి సగం ఆమె. మానవ జనన కారణమూర్తి ఆమె. ఇంటికి దీపం ఆమె మనస్సు. ఆమె చేతి వంటే అమృతం. మహిమాన్విత శక్తి రూపం ఆమె. చదువుల తల్లి సరస్వతి, సంపదలు తీర్చే తల్లి లక్ష్మి, ధైర్యానికి చిరునామా దుర్గ మాత. ఈ మహాశక్తి స్వరూపాలు అతివలే. అబలలు కాదు, అష్టలక్ష్ములు మహిళామణులే. ఆమె లేనిదే పూట గడవదు, ముద్ద దిగదు. అయినా ఆమె అంటే పురుషాధిక్య సమాజానికి చిన్న చూపు. నేడు ఆమె ఓ ఆట వస్తువు. ఆమెను చూస్తే మృగాళ్లలో రాక్షసుడు నిద్ర లేస్తాడు. ఆమె ద్వితీయ శ్రేణి పౌరురాలు. ఆవిడంటేనే పురుష పుంగవులకు చులకన. ఆమెపై లైంగిక దాడులు, అత్యాచారాలు, మానభంగాలు, అక్రమ రవాణాలు, భ్రూణహత్యలు, గృహ హింసలు, వేధింపులు నిత్యకృత్య దుశ్శాసన పర్వాలు గుర్తుకు వస్తాయి. కార్యసిిలో లేని మగతనం మగువను చూడగానే మృగతనమై రెచ్చిపోతుంది. బాల్య వివాహ బంధనాలు, బాలకార్మిక చేష్టల చట్రాలు వస్తాయి. 

ఏ దేశం చూసినా ఏమున్నదా గర్వకారణం !

 మనతో చెల్లి, తల్లి, కూతురు ఉందని మరిచి ఆవిడపై అత్యాచారాలకు ఒడిగడుతున్న డిజిటల్‌ మృగ సమాజంలో లెక్కలేనన్ని దురాగతాలు, ఏరులై పారుతున్న మహిళల కన్నీళ్లలో పౌర సమాజంలో ఇసుమంతైనా మానవత్వం కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా 35 శాతం మహిళను తమ జీవితకాలంలో ఏదో ఒక రకమైనా లైంగిక వేధింపులకు గురికావడం, వీరిలో 40 శాతం అబలలు వేధింపుల నుంచి సహాయం కోరడం, 10 శాతం వరకు మాత్రమే న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కడం జరుగుతున్నది. మహిళపై అత్యాచారం జరిగినపుడు పౌర సమాజం ఉద్యమించడం, రెండు రోజులకే చల్లబడడం, పాత వేతలే తిరిగి జరగడం అనాదిగా జరుగుతోంది.

ప్రతి రోజు అదో ఒక మూలన మానభంగ మహిళ మౌన రోధన గొంతు దాటడం లేదు. విని స్పందించడానికి బదులు ఎగతాళి, అవమానాలు చేయడమనే దురలవాటు మొలుస్తున్నది. ఐరాస అంచనాల ప్రకారం మానవ అక్రమరవాణా చట్రంలో 71 శాతం మంది మహిళలే ఉంటున్నారు. కేవలం 52 శాతం గృహిణులు మాత్రమే కొంత స్వేచ్యను అనుభవిస్తున్నారు. ప్రపంచంలో అధిక రేపు కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో దక్షిణ ఆఫ్రికా, బోత్స్‌వానా, స్వీడెన్‌, గ్రనెడా, యూఎస్‌లు ముందు వరసలో ఉన్నారు. అమెరికాలో 9 శాతం రెపిస్టులపై విచారణలు జరుగగా, అందులో 3 శాతం వరకు మాత్రమే శిక్షలు పడడం, 97 శాతం రేపిస్టులు స్వేచ్ఛగా బయట పడడం గమనిస్తున్నాం. మహిళను, బాలికలపై అత్యాచారాలు, వేధింపులు జరిగినా వాటిని బయట పెట్టడానికి సమాజం వెనుకంజ వేయడంతో మగ మహారాక్షసుల ఆగడాలకు అంతం కనుపించడం లేదు. 

భారత్‌లో మహిళలపై అత్యాచారాలు:

 ప్రపంచవ్యాప్త మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, హింసాత్మక ధారుణులను గమనించిన ఐరాస 2000 నుంచి ప్రతి ఏట 25 నవంబర్‌ రోజున “అంతర్జాతీయ మహిళా అత్యాచార వ్యతిరేక దినం” పాటించడం ఆనవాయితీగా మారింది. మహిళా బింసకు “నో” చెబుదామంటూ యునెస్కో 25 నవంబర్‌ నుంచి 10 డిసెంబర్‌ వరకు 16 రోజుల పాటు లింగ ఆదాల హింసలకు వ్యతిరేకంగా ప్రచారాలు నిర్వహిస్తున్నది. ప్రపంచ మానభంగాల రేటు ఆధార 120 దేశాల జాబితాలో భారత్‌కు 95వ స్థానం దక్కడం విచారకరం.

భారత్‌లో తరుచుగా నిర్భయ, హత్రాస్‌ ఘటనలు ఎన్ని జరిగిన తాత్కాలిక చర్యలకు మాత్రమే ప్రభుత్వాలు పూనుకోవడం దురదృష్టకరం, ఆక్షేపణీయం. ఇండియాలో ప్రతి లక్ష మందిలో 4.2 శాతం రేపులు జరుగుతున్నాయని, రేపు కేసులు అధికంగా (20 నుంచి 10 శాతం) చంఢీఘడ్‌, రాజస్థాన్‌‌, ఢిల్లీ, కేరళ, హర్యానా, అస్సాం, హిమాచల్‌ ప్రాంతాల్లో నమోదు అవుతున్నాయి. రేప్‌ కేసులు అత్యల్పంగా (1 నుంచి 1.6 శాతం వరకు) గుజరాత్‌, కర్నాటక, తమిళనాడు, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో నమోదు కావడం గమనించారు. తెలంగాణలో 4.7 శాతం, ఏపీలో 4.2 శాతం రేపు కేసులు బయట పడుతున్నాయి. గత దశాబ్ద కాలంగా రేపు కేసులు రెట్యింపు కావడాన్ని ప్రమాద హెచ్ఛరికగా భావించాలి. 

బాలికల అక్రమ రవాణా దుర్మార్గాలు:

 మానవ హక్కుల సంస్థ గణాంకాల ప్రకారం భారత్‌లో ప్రతి ఏట 7,200 మైనర్‌ బాలికలు (లక్షకు 1.6 శాతం) మానభంగాలకు గురి కావడం భరతజాతికే సిగ్గు చేటు. బాలికల అక్రమ రవాణా, ఆ చిన్నారివని వ్యభిచార నరక కూపాల్లో బంధించడం యద్ధేచ్ఛగా కొనసాగుతోంది. దేశ జనాగ్రహావేశాలను చలి చూసిన ఢిల్లీ నిర్బయ కేసులో నిందితులకు శిక్ష పడడానికి 6 ఏండ్ల కాలం పట్టింది. అధిక శాతం మానభంగాలు 15 – 24 ఏండ్ల యువతుల్లోనే కనిపించడం, 70 శాతం రేపుల నిందితులు తెలిసిన వారే కావడం సోచనీయం. మానభంగాల తర్వాత అతివలను హత్య చేయడం కూడా సాధారణంగా జరుగుతున్న వేళ, ఈ దుశ్చర్యలకు చరమగీతం పాడడానికి ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగాలు, పౌర సమాజం సమన్యయంతో కృషి చేసి మానవ మృగాలకు చుక్కలు చూపించడం, ఉరి తీసి నరకానికి పంపడం వెంట వెంటనే జరగాలి. 

విద్యాలయాల్లో రేపటి యువతకు విలువలతో కూడిన విద్యను బోధించాలి. యూనివర్సిటీ డిగ్రీల కన్న మానవీయ విలువలే మిన్నయని తెలియజేయాలి. భారత మాత ముద్దు బిడ్డలుగా అమ్మాయిలను రక్షించాలి. మహిళకు విద్య అనే ఆయుధమిచ్చి సబలగా శక్తివంతం చేయాలి. మానభంగాలు లేని ప్రపంచాన్ని చూడడానికి అందరం విలువలతో కూడి క్రమశిక్షణతో జీవించాలి. ఈ మహాయజ్ఞంలో మనందరం భాగస్వాములమై ప్రతి మహిళలో భరతమాతను దర్శిస్తూ ముందుకు సాగుదాం. భారతీయ వనిత కన్నీటి వరదల కట్టడికి ఆనకట్టలు కడదాం. 

Show More
Back to top button