CINEMA

నృత్య రాజీవలోచన నటి రాజసులోచన

చిత్తజల్లు రాజీవలోచన (15 ఆగష్టు 1935 – 5 మార్చి 2013), రాజసులోచనగా ప్రసిద్ధికెక్కిన, రాజీవలోచన గారూ భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి మరియు నటి.

అలనాటి చిత్రాలలో శాస్త్రీయ రీతులలో సాగే నృత్య సన్నివేశాలకు ఎంతో ఆదరణ ఉండేది. ప్రస్తుతం సాంఘిక కథాంశాలతో మాత్రమే చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. కానీ గతంలో జానపద, పౌరాణిక, ఇతిహాస ఇతివృత్తాలతో సినిమాలు తయారయ్యేవి. ఆనాటి కథనాయికలకు ఎక్కువగా శాస్త్రీయ నృత్యంలో  ప్రావీణ్యత మెండుగా ఉండేది.

ఒకవేళ శాస్త్రీయ నృత్యంలో ప్రవేశం లేకపోతే చిత్రికరణకు ముందు కొన్ని నెలలపాటు నృత్యాన్ని నేర్చుకుని ఆయా సన్నివేషాలలో నటించేవారు. అలాగే సలక్షణ రీతిలో శాస్త్రబద్ధంగా నృత్యాన్ని నేర్చుకొని చిత్ర రంగంలోకి ప్రవేశించి కథనాయికలుగా రాణించినవారూ ఉన్నారు. వారిలో రాజసులోచన గారూ ఒకరు.

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో దాదాపు 300 పైచిలుకు చిత్రాల్లో నటించిన రాజసులోచన గారూ కేవలం నటిగానే కాకుండా భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చి భారతీయ కళావైభవాన్ని ప్రపంచానికి చాటిన నృత్యకారిణిగా కూడా సుపరిచితులు. కళా సరస్వతికి తన జీవితాన్ని అంకితం చేశారు రాజసులోచన గారూ.

జీవిత విశేషాలు.

జన్మదినం :  15 ఆగస్టు 1935

స్వస్థలం :    విజయవాడ (కృష్ణాజిల్లా),ఆంధ్రప్రదేశ్.

తండ్రి :      పిల్లియార్చెట్ట భక్తవత్సలం నాయుడు

తల్లి :            దేవిక, భర్త :            సి.యస్. రావు

పిల్లలు :    ఇద్దరు అమ్మాయిలు (శ్రీ గురుస్వామి , శ్రీదేవి), ఒక అబ్బాయి

నివాసము :       చెన్నై

నటించిన సినిమాలు :  దాదాపు 300 వరకు ,

నటించిన భాషలు :   తమిళ , కన్నడ , మలయాళం , తెలుగు,

మరణం :    5 మార్చి 2013 మద్రాసు , తమిళనాడు.

బాల్యం..

ఎన్నో రోజులుగా పిల్లల కోసం పరితపిస్తున్న దంపతులకు దేవుడు వరమిచ్చినట్లుగా 15 ఆగస్టు 1934న ఆనాటి బెజవాడ (విజయవాడ లో) భక్తవత్సలం నాయుడు మరియు దేవిక దంపతులకు రాజసులోచన గారూ జన్మించారు. లేకలేక జన్మించిన సంతానం కావడంతో, అందులోనూ అమ్మాయి అవ్వడంతో ఆమెను అల్లారుముద్దుగా పెంచుతూ వచ్చారు. రాజసులోచన గారి నాన్న గారూ మద్రాసులో ఉన్న ఎస్.ఎం.రైల్వే కంపెనీ జనరల్ మేనేజర్ కు పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేసేవారు. ఆ రోజులలో రైలు ప్రయాణం చేయాలంటే మద్రాసులో ఉన్న ఎస్ఎం రైల్వేనే ఆధారం.

భక్తవత్సలం నాయుడు గారి బంధువులలో అధిక శాతం మంది కూడా రైల్వే ఉద్యోగులే. తన మేనమామ గారి ఇంట్లో జన్మించిన రాజసులోచన గారి అసలు పేరు రాజీవలోచన. పాఠశాల రిజిస్టర్ లో పొరపాటున రాజసులోచనగా వ్రాయడంతో అదే పేరుతో రాజసులోచన గారూ స్థిరపడిపోయారు. ఆరు నెలల అనంతరం చిన్నారి రాజసులోచన గారిని తీసుకొని భర్త దగ్గరికి మద్రాసు వచ్చేశారు దేవిక గారూ. తన బంధువులంతా మద్రాసులో గల ట్రిప్లికేన్ లో ఉంటే, భక్తవత్సలం నాయుడు గారూ మాత్రం తన కార్యాలయంనకు అందుబాటులో ఉండేలా జార్జ్ టౌన్ లోనే ఉండేవారు.

రెండవ ప్రపంచం యుద్ధ సమయం కావడంతో భయం కారణంగా చాలా మంది మద్రాసును వదిలి, ఖాళీచేసి వెళ్లిపోతుంటే, అక్కడి నుండి వెళ్లిపోవడానికి ససేమిరా ఇష్టం లేని భక్తవత్సలం నాయుడు గారూ మాత్రం మద్రాసు విడిచి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. భగవద్గీతలో చెప్పినట్టు ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అనుకునే తత్వం వారిది. తండ్రి గారి మంచితనం, దూసుకుపోయే తత్వం రాజసులోచన గారికి కూడా వచ్చాయని అందరూ అనుకుంటూ ఉండేవారు.

నాట్యం పట్ల ఆసక్తి…

రాజ సులోచన గారికి నాట్యం పట్ల విపరీతమైన ఆసక్తి ఉండేది. అంతలా ఆమెకు నాట్యం పట్ల ఇష్టం ఏర్పడడానికి తన మేనమామ గారే కారణమని చెప్పాలి. మేనమామ గారూ కళాభిమాని కావడంతో “సుగుణ విలాస సభ” అనే సంగీత మండలిని స్థాపించి నాటక ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించేవారు. చిన్నారి రాజసులోచన గారూ ఆయా ప్రదర్శనలు చూసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా పాడేవారో ఉన్నదున్నట్లు తల్లిదండ్రులకు పాడి వినిపించేవారు. అల్లారు ముద్దుగా పెంచిన ఒక్కతే కూతురు కావడంతో ఆమె చేష్టలకు మురిసిపోయేవారు.

రాజసులోచన గారూ గ్రామ్ ఫోన్ రికార్డులు పెట్టుకొని నృత్యం చేస్తుంటే, తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించేవారు. నృత్యం నేర్చుకోవాలనే రాజసులోచన గారి కోరికకు బీజం పడింది అప్పుడే. తనకు ఏడేళ్ల వయసున్నప్పుడు తమ ఇంటికి ఎదురుగా ఉంటున్న పంకజం టీచర్ దగ్గర సంగీతం నేర్చుకోవడానికి రాజసులోచన గారిని పంపించారు వాళ్ళ నాన్న గారూ. అయితే రాజసులోచన గారికి సంగీతం కంటే నాట్యం మీదే విపరీతమైన మక్కువ ఏర్పడడంతో రాజసులోచన గారూ సంగీతాభ్యాసాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. ఆ తర్వాత కొంతకాలం వయోలిన్ నేర్చుకున్నారు. అనంతరం “సరస్వతి గానం నిలయం”లో చేరి లలిత టీచర్ గారి వద్ధ నాట్యం నేర్చుకున్నారు రాజసులోచన గారూ.

తొలి నృత్య ప్రదర్శన…

మూడో ఫారంలో చదువు ఆపేసిన రాజసులోచన గారూ అప్పటికే నృత్యంలో డిప్లమా పొంది ఉండటంతో తన 13వ యేట వేదిక మీద తొలిసారిగా ఆరంగ్రేటం చేశారు. రాజసులోచన గారూ. మద్రాసులోని హిందూ పాఠశాల ప్రాంగణంలో ఆమె ఇచ్చిన తొలి ప్రదర్శనకి, ఆనాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి టి.ఎల్.వెంకట్రామ అయ్యర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈడొచ్చిన యువతి బయటకు వెళ్లకూడదని తల్లిదండ్రులు కట్టుబాట్లు విధించడంతో మరో ప్రదర్శన ఇచ్చే అవకాశం రాజసులోచన గారికి కలగలేదు.

నృత్య విద్యాలయం ప్రారంభించిన “రాజసులోచన”.. 

దాంతో ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు ఆసక్తి ఉన్న నలుగురు పిల్లలకు నాట్యం నేర్పిస్తే బాగుంటుందని ఆలోచనతో తన గురువు ఆశీస్సులతో నృత్య విద్యాలయాన్ని ప్రారంభించారు రాజ సులోచన గారూ. తదనంతర కాలంలో పుష్పాంజలి నృత్య సంస్థల ఆమె ప్రారంభించడానికి ఇది ప్రేరణగా నిలిచింది. కొంతకాలం తర్వాత తన గురువు లలిత అక్క కుమార్తె “తాంబరం లలిత” తో కలిసి నృత్య బృందాన్ని ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు రాజసులోచన గారూ. తల్లిదండ్రులు ఆమె అభిమతాన్ని కాదనలేకపోయారు.

తొలిచిత్రం.. కన్నడ, తమిళ భాషలలో..

రాజసులోచన గారి నృత్య ప్రదర్శనలు ఇస్తున్న తరుణంలో కే.ఎస్.ఆర్.ప్రొడక్షన్స్ సంస్థ మేనేజర్ రామ్మూర్తి గారూ రాజసులోచన గారిని చూశారు. అదే సమయంలో గుబ్బి కర్ణాటక ఫిలిమ్స్ వారు “గుణసాగరి” చిత్రాన్ని కన్నడ, తమిళ భాషల్లో నిర్మిస్తూ ఒక కొత్త నటిని పరిచయం చేయాలనే యోచనతో అన్వేషిస్తున్నారు. రాజసులోచన గారి గురించి వారికి తెలియజేశారు రామ్మూర్తి గారూ. భక్తవత్సలం నాయుడు గారిని కలిసిన దర్శకులు హెచ్.ఎల్.ఎన్.సింహ గారూ రాజసులోచన గారిని పరిచయం చేసే అవకాశం కల్పించమని అడిగారు.

భక్తవత్సలం నాయుడు గారూ అందుకు అంగీకరించలేదు. చివరికి నిర్మాత గుబ్బి వీరన్న భక్తవత్సలం నాయుడు గారిని కలుసుకుని ఎంతో బతిమాలి, ఎన్నో హామీలు ఇచ్చిన తర్వాత అంగీకరించారు. అయితే రాజసులోచన సినిమాల్లో నటిస్తోందని తెలుసుకున్న ఆమె బంధువులు ఆగ్రహించి వారి కుటుంబాన్ని వెలివేసినంత పని చేశారు. ఈ సంఘటనతో విస్తుపోయిన భక్తవత్సలం నాయుడు గారూ ముందు ఒప్పందాన్ని రద్దు చేసుకుందామని అనుకున్నారు. కానీ మాట ఇచ్చిన తర్వాత వెనక్కి జరగడం తగదని ఏదైతే అదే అవుతుందని గుండె నిబ్బరం చేసుకుని తన కూతుర్ని ప్రోత్సహించారు.

తొలి తెలుగు చిత్రం “కన్నతల్లి”..

1951 వ సంవత్సరంలో  ప్రారంభమైన “గుణసాగరి” చిత్రం 1953లో విడుదలయ్యింది. 1952లో ఈ చిత్రం రషెస్ చూసిన దర్శక, నిర్మాత కె.ఎస్.ప్రకాష్ రావు గారూ తన “కన్నతల్లి” చిత్రంలో రాజసులోచన గారికి అవకాశం ఇచ్చారు. ఈ చిత్రంలో కూచిపూడి యక్షజ్ఞానంలో నృత్య దర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి తో కలిసి రాజసులోచన గారూ పాల్గొన్నారు.

కథానాయికగా తొలి చిత్రం ఎన్టీఆర్ తో..

రాజసులోచన గారూ ప్రారంభంలో నటిగా నిలదొక్కుకోవడానికి కొన్ని చిత్రాలలో వ్యాంప్ పాత్రలు ధరించిన రాజసులోచన గారికి, అమర గాయకుడు ఘంటసాల గారూ నిర్మించిన “సొంత ఊరు” చిత్రంలో కథానాయికగా ప్రమోషన్ లభించింది. ఎన్టీఆర్ గారూ ఈ చిత్రంలో కథనాయకుడుగా నటించారు. అంతకు ముందు ఏ.ఎన్.ఆర్ గారూ హీరోగా, కే.వీ.రెడ్డి గారూ రూపొందించిన పెళ్లినాటి ప్రమాణాలు చిత్రంలో అవకాశం వచ్చింది.

అప్పటినుండి హీరో కృష్ణ మినహా కాంతారావు, బాలయ్య, కృష్ణంరాజు, శోభన్ బాబు, హరనాథ్, రమణమూర్తి, చలం తదితర హీరోలు అందరితోనూ ఆమె నటించారు. తమిళంలో “ఎల్లామ్ ఇన్బమయమ్”, కనడంలో “బేడర కణ్ణప్ప”, మలయాళంలో “మనస్సాక్షి”, హిందీలో “నయా ఆద్మీ” చిత్రాలతో రాజసులోచన గారూ  తొలిసారి హీరోయిన్ గా నటించారు. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం రామానాయుడు గారూ నిర్మించిన “తోడికోడళ్ళు”. తమిళంలో టి.రాజేందర్ గారూ నిర్మించిన “ఎంగవీట్టు వేలన్”.

తొలిసారి నృత్య దర్శకురాలిగా..

రాజసులోచన గారూ నటిగానే కాకుండా కొన్ని చిత్రాలలో నృత్య సన్నివేశాలలో కూడా పాల్గొన్నారు. ప్రముఖ నటి సావిత్రి గారూ తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ రూపొందించిన చిత్రం “చిన్నారి పాపలు”. మహిళా సాంకేతిక నిపుణులతో తెరకెక్కించిన ఆ చిత్రానికి రాజసులోచన గారూ నృత్య దర్శకత్వం వహించారు. అది కూడా సావిత్రి గారి కోరికపై, ఆవిడ గారి మీద అభిమానంతో. తర్వాత మరి కొంతమంది దర్శకులు కోరినా రాజసులోచన గారూ మళ్ళీ నృత్య దర్శకత్వం జోలికి వెళ్లలేదు.

“మోసగాళ్ళకు మోసగాడు” లో ప్రత్యేక గీతం తో..

1970 ప్రాంతాల్లో అమెరికా వెళ్లి ఆరు నెలల పాటు నృత్య ప్రదర్శనలు ఇచ్చిన రాజసులోచన గారూ తిరిగి మద్రాసుకు వచ్చారు. ఆ సమయంలోనే హీరో కృష్ణ గారూ “మోసగాళ్లకు మోసగాడు” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ చిత్రంలో విలన్ బృందంపై ఒక పాటను చేయమని అడగగానే, ఇంతకుముందు కొన్ని చిత్రాలలో నృత్య సన్నివేశంలో పాల్గొన్న అనుభవం ఉండడంతో సరేనన్నారు. తీరా చిత్రీకరణకు వచ్చేసరికి వేసుకోవాల్సిన బట్టలను చూసి చాలా ఇబ్బందిపడ్డారు.

ఆ సమయంలో ఆ పాట చేయనని చెప్పి వెనక్కి తిరిగి వెళ్లి పోతే నిర్మాత ఇబ్బంది పడతారని గ్రహించిన రాజసులోచన గారూ అయష్టంగానే చాలీచాలని దుస్తులు వేసుకొని పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. సినిమాలో ఆ పాట ఎంతో హైలెట్ అయింది. ఈ చిత్రాన్ని ట్రెజర్ హంట్ పేరుతో ఇంగ్లీషులోకి అనువదించినప్పుడు సినిమాలోని పాటలన్నీ తీసేసి విభిన్నంగా సాగే ఈ జిప్స్ సాంగ్ ని అక్కడ కొనుగోలుదారుల సూచనపై అలాగే ఉంచివేయడం జరిగింది. ఆ తర్వాత “మొనగాడు వస్తున్నాడు జాగ్రత్త” చిత్రంలో కూడా క్లబ్ సాంగ్ చేశారు రాజ సులోచన గారూ.

ఎన్టీఆర్ గారితో..

ఎన్టీఆర్ గారి సరసన తొలిసారిగా “సొంత ఊరు” చిత్రంలో నటించిన రాజసులోచన గారూ, ఎన్టీఆర్ గారి సరసన “రాజమకుటం”, వాల్మీకి తదితర చిత్రాలలో నటించారు. “రాజమకుటం” లోని “సడి సేయకో గాలి సడి సేయబోకే” పాట ఇప్పటికి అల్లరిస్తున్న గీతం. కరువు కాటకాలు సంభవించినప్పుడు తుఫాను బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ గారూ నిధులు సేకరణ నిమిత్తం ఎప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా అందులో తప్పకుండా రాజసులోచన గారూ పాల్గొనేవారు.

వైవాహిక జీవితం..

ప్రతీ ఒక్కరి జీవితంలో ప్రేమలు, పెళ్లిళ్ళు, విడాకులు, రెండో వివాహం, వివాదాలు ఇలా ఎన్నో మలుపులు తిరుగుతూ ఉంటుంటాయి. సినీ తారల జీవితాలు ఇందుకు అతీతం ఏమీ కాదు. నటి రాజసులోచన గారి జీవితంలో కూడా మొదట వివాహం, తరువాత విడాకులు, రెండో వివాహం లాంటి ఘట్టాలు ఉన్నాయి.

తొలి వివాహం పరమశివంతో…

రాజసులోచన గారికి తొలి సినిమా అవకాశం వచ్చిన తరుణంలోనే, తనని ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని వచ్చిన పరమశివంను రాజసులోచన గారూ, తన తల్లిదండ్రుల అనుమతితో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి వారికి మూన్నాళ్ళ ముచ్చటే అయ్యింది. రాజసులోచన గారి జీవితంలో అనుకోకుండా జరిగిన ఈ వివాహం ఆమెని నానా అవస్థలకు గురిచేసింది.

అంతవరకు నాట్యాన్ని ప్రేమించిన రాజసులోచన గారూ పెళ్లయిన తర్వాత తన భర్త గారిని కూడా అమితంగానే ప్రేమించింది. కానీ తన భర్త అయిన పరమశివం నుండి తాను ఆశించిన ప్రేమను పొందలేకపోయింది. 1952 సెప్టెంబర్ లో ఈ దంపతులు ఒక మగ బిడ్డకు జన్మనిచ్చారు. అతనికి పేరు శ్యామ్. కొడుకు పుట్టిన కొద్ధి కాలానికే ఆ దంపతులు విడిపోయారు. కుమారుడు శ్యామ్ తల్లి రాజసులోచన గారి దగ్గరే ఉండిపోయారు.

దర్శకులు చిత్తజల్లు శ్రీనివాసరావు తో రెండో పెళ్లి..

చిత్తజల్లు శ్రీనివాసరావు (సి.యస్.రావు) గారూ రచయిత మరియు దర్శకులు. వీరు సినిమా దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య గారి కుమారులు. తెలుగు, తమిళం, మలయాళం, ఒరియా భాషల్లో దాదాపు 65 చిత్రాలకు దర్శకత్వం వహించారు. రాజసులోచన గారికి, సి.ఎస్.రావుతో పరిచయం, ప్రణయం, పరిణయంగా మారింది.

చాలా సినిమాలకు రాజసులోచన గారూ హీరోయిన్, సి.ఎస్. రావు గారూ దర్శకులు. రాజసులోచన గారూ తన భర్త నుండి విడిపోయి తన సినీ ప్రస్థానంలో ఆటుపోట్లకు గురవుతున్న తరుణంలో తన బాధలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉంటే చాలనిపిస్తున్న తరుణంలో, తన చుట్టూ ఎందరో ఉన్నా సి.ఎస్.రావు గారి లోని మంచితనాన్ని గమనించి, అన్ని విషయాల వారికి చెప్పుకొని ఓదార్పుపొందేవారు. సి.ఎస్.రావు గారితో చనువుగా, సన్నిహితంగా ఉండడం చూసి చిత్ర పరిశ్రమలో రకరకాల కథనాలు మొదలయ్యాయి.

అలాంటి వాటికి అడ్డుకట్ట వేయకపోతే కష్టం అనుకున్న సి.ఎస్.రావు గారూ, రాజసులోచన గారిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అప్పటికే  సి.ఎస్.రావు గారికి దర్శకుడు కడారి నాగభూషణం నటి కన్నాంబల కుమార్తె రాజేశ్వరి గారితో పెళ్లయింది. తన భార్య రాజేశ్వరి గారికి విడాకులు ఇచ్చి ఆమె నుండి విడిపోయిన సి.ఎస్.రావు గారూ 1963 మే నెలలో “గురువాయూరు”లో రాజసులోచన గారిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. శ్రీ గురుమూర్తి, దేవి.

పెద్ద కుమార్తె విదేశాలలో స్థిరపడింది. దేవి మాత్రం ప్రస్తుతం మద్రాసులోనే ఉంటుంది. కొడుకు శ్యామ్ కూడా ప్రస్తుతం విదేశాలలోనే ఉంటున్నారు. కొడుకు శ్యామ్, దర్శకుడు భీమ్ సింగ్ కుమార్తెను వివాహం చేసుకున్నారు. ప్రతి సంవత్సరం దీపావళి రోజున విదేశీ విద్యార్థులకు అతిథ్యం ఇవ్వడం సి.ఎస్.రావు, రాజసులోచన దంపతులకు అలవాటు. మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న దంపతులు, పిల్లలు ఎదిగిన తర్వాత వచ్చిన అభిప్రాయాల బేధాల కారణంగా విడిపోవడం దురదృష్టకర పరిణామంగా పరిగణించవచ్చు.

మరణం..

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు పట్టుదలతో కూచిపూడి, కథాకళి, కథక్, భరతనాట్య నృత్యం నేర్చుకొని దీక్షాదక్షకురాలు రాజసులోచన గారూ. కథక్ నృత్యాన్ని ఇటు లక్నో  శైలిలో, అటు జైపురి శైలిలో ఏకకాలంలో నేర్చుకున్న మొట్టమొదటి కళాకారిణి రాజసులోచన గారూ. నాట్యాన్ని పదిమందికి నేర్పించి ఆ కళకు మహోన్నత స్థానం కల్పించడమే ధ్యేయంగా మద్రాసులో 1962లో పుష్పాంజలి “నృత్య కళా కేంద్రాన్ని” స్థాపించారు. నటన, నృత్యం రెండు కళ్ళుగా భావించే రాజ సులోచన గారూ అనారోగ్యంతో బాథపడుతూ చెన్నై లోని తన స్వగృహంలో 2013, మార్చి 5, తెల్లవారుజామున మరణించారు.

Show More
Back to top button