CINEMA

ప్రేక్షకాభిమానుల కలలరాణి.. లావణ్య వాణి కాంచనమాల

కాంచనమాల (మార్చి 5, 1917 – జనవరి 24, 1981)

తెలుగు తెరపై మొట్టమొదటి అందాల నటి. అందాల కథానాయిక. సినీ వినీలాకాశంలో కొద్దికాలం మాత్రమే ధృవతారలా వెలిగి, అర్థాంతరంగా రాలిపోయిన తోకచుక్క. సినీ కళామతల్లి చెక్కిట ఘనీభవించిన కన్నీటి చుక్క. మొట్టమొదటి అభ్యుదయవాద చిత్రం “మాలపిల్ల” తో అతి తక్కువ సమయంలో సినీ రంగంలో తారాపథంలోకి దూసుకెళ్లిన మహానటి. అతి తక్కువ కాలం సినీ పరిశ్రమలో కొనసాగిన కథానాయక.

కేవలం 24 సంవత్సరాల వయస్సులోనే చిత్ర రంగం నుండి విరమించిన అత్మాభిమానం గల నటీమణి . సినీరంగం నుండి విరమించి 40 ఏళ్లు మానసిక స్థితి సరిగా లేని కథానాయిక. 17 సంవత్సరాల వయస్సులోనే చిత్రరంగ ప్రవేశం చేసి 11 చిత్రాలలో నటించారు. అభినయం, వాచకం, గానం, అందం అద్భుతం. ఇప్పటికీ కాంచనమాల గారు గుర్తుండడానికి కారణం ఆమె అందం.

దురదృష్టవశాత్తు ఆమె జీవితంలో రెండు పార్శ్వాలు. ఒకటి స్వప్న సుందరి, ఆరాధ్య దేవత, సౌందర్యాగ్నికీల అందానికి మారుపేరు. అలా ప్రశంసలు పొందిన పార్శ్వం ఒకటి. రెండోది మతి చలించిన మహిళ, మౌన యోగిని, అందరికీ దూరమైన శాపగ్రస్త అనేవి రెండో విభాగం. ఈ రెండిటి మధ్య వైరుధ్యం చాలా ఉండడం వలన ప్రేక్షకులు ఎక్కువగా గుర్తుంచుకొన్నారు.

అంత వైభవంగా, వైభవపేతంగా, వైభోగంగా చిత్రరంగంలో ఏడు సంవత్సరాలు కొనసాగిన నటి, 40 సంవత్సరాలు అందరికీ దూరంగా ఎక్కడ ఉన్నారో ఆవిడకే తెలియని ఘోరమైన జీవనాన్ని అనుభవించడం, ప్రేక్షకుల జ్ఞాపకాలకు నిదర్శనం. జీవితం నీటి బుడగ అంటారు వేదాంతులు. జీవితం కన్నీటికి బుడగ అంటారు సినీ వేదాంతులు. ఉదాహరణ కాంచనమాల గారూ.

జీవిత విశేషాలు..

కాంచనమాల గారూ 05 మార్చి 1917 లో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా, తెనాలి దగ్గర ఐతవరంపాడు లో జన్మించారు. కాంచనమాల గారి బాబాయి వీరస్వామి వయోలిన్ విద్యాంసులు. కాంచనమాల గారు చిన్నప్పటి నుండి వాళ్ళ బాబాయి దగ్గర పెరగడం వల్ల ఆమెకు కూడా సంగీతం పట్ల విపరీతమైన మక్కువ ఏర్పడింది. అలాగే సంగీతంతో పాటు చిన్న చిన్న నాటకాలు కూడా వేస్తుండేవారు. తెనాలి దగ్గర కంచర్లపాలెం అనే ఊరిలో గాలి వెంకయ్య గారు కాంచనమాల గారిని నాటకాలు వేయడానికి ప్రోత్సహించారు. ఈ గాలి వెంకయ్య గారే తర్వాతి కాలంలో కాంచనమాల గారికి జీవితకాలం భర్తగా కొనసాగారు.

1932 వ సంవత్సరంలో తెలుగు టాకీలు మొదలైన కొత్తలో చిత్తజల్లు పుల్లయ్య గారూ దర్శకత్వం వహించిన కృష్ణ తులాభారం సినిమాలో కపిలవాయి రామనాధశాస్త్రి, కాంచనమాల, లక్ష్మీరాజ్యం, రేలంగి వెంకట్రామయ్య, ఋష్యేంద్రమణి గార్లు నటించారు. ఋషేంద్రమణి ఈ చిత్రంలో తొలిసారిగా సత్యభామగా నటించారు. రేలంగికి గారికి ఇది తొలిచిత్రం. ఈ సినిమాను కలకత్తాలో చిత్రీకరించారు. కాంచనమాల, లక్ష్మీరాజ్యంలకు కుడా ఇది తొలిచిత్రం. ఈ కృష్ణ తులాభారం చిత్రంలో శ్రీకృష్ణుని అష్ట భార్యలలో ఒకరైన మిత్రవింద పాత్రకు కాంచనమాల గారిని ఎన్నుకున్నారు.

డాక్టర్ అంబాలాల్ పటేల్ గారూ హిందీలో వీరాభిమాన్యు చిత్రాన్ని తీశారు. ఇదే చిత్రాన్ని తెలుగులో తీయదలచి తెలుగులో నటీనటుల ఎంపికచేయుటకు, బాపట్లలో తనకు పరిచయం ఉన్న ఇద్దరు కుర్రాలను తనకు సహాయకులుగా పెట్టుకున్నారు. వాళ్ళిద్దరిలో ఒకరు కుర్రాడు పేరు జోగారావు. గాలి వెంకయ్య గారికి జోగారావు దూరపు బంధువు. దాంతో కాంచనమాల గారిని వీరాభిమన్యు చిత్రంలో నటించడానికి గాలి వెంకయ్య గారిని ఒప్పించి కాంచనమాల గారిని బొంబాయి తీసుకెళ్లారు.

నర్గీస్ కు తల్లి, “సునీల్ దత్‌”కి అత్తగారు మరియు సంజయ్ దత్‌ల అమ్మమ్మ అయిన “జద్దన్‌బాయి” గారూ ఆ రోజులలోనే మహిళా దర్శకులు. కాంచనమాల గారిని హిందీ చిత్ర సీమలో నటింప చేయడానికి బొంబాయిలోనే ఉండమని “జద్దన్‌బాయి” గారూ అడిగారట. ఒకవేళ ఆవిడ ఒప్పందానికి అంగీకరించి కాంచనమాల గారూ బొంబాయిలోనే ఉండి వుంటే ఆమె జీవితం మరోలా ఉండేది. మహబూబ్ గారూ (అందాజ్, మదర్ ఇండియా దర్శకులు) కూడా కాంచనమాల గారిని వీరాభిమన్యు చిత్రీకరణ సమయంలో తమ హిందీ చిత్రాలలో నటించమని అడిగారట. కానీ కాంచనమాల గారికి తెలుగు చిత్రాల మీదే ఆసక్తి ఉండడం వలన ఒప్పుకోలేదు. అభిమన్యుడు చిత్రంలో ఒక పాత్ర వేసిన బందా కనకలింగేశ్వర రావు గారిని కూడా బాపట్ల కుర్రాళ్లే తీసుకెళ్లారు. వీరాభిమన్యు (1936) చిత్రానికి రచయిత కొడవగంటి కుటుంబరావు గారు. 1936లో విడుదలైన ఈ చిత్రం బాగా ఆడింది.

విప్రనారాయణ (1937)

విప్రనారాయణ తెలుగు చిత్రాన్ని కలకత్తాలో నిర్మించారు. దీనికి దర్శకులు అహీంద్ర చౌదరి, ఛాయాగ్రాహకులు నిమాయి ఘోష్, సంగీత దర్శకులు ప్రఫుల్ల మిత్ర తదితర సాంకేతిక వర్గమంతా బెంగాళీవాళ్ళే. ఈ చిత్రంలో చిత్తజల్లు కాంచనమాల, కస్తూరి నరసింహారావు, వంగర వెంకటసుబ్బయ్య, టంగుటూరి సూర్యకుమారి తదితరులంతా తెలుగువాళ్లే నటించారు.

ఈ చిత్రంలో 12 ఏళ్ల సూర్యకుమారితో పాటపాడించటానికై ప్రత్యేకంగా ఆమె కొరకు సినిమాలో ఒక పాత్రను కూడా సృష్టించారు. ఈ చిత్రంలో కథానాయక పాత్ర కాంచనమాల గారూ పోషించారు. ఈమె అందం, అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. సినిమా విజయంతో కాంచనమాల గారూ మద్రాసులో అడుగుపెట్టారు.

గృహలక్ష్మి (1938)..

తొలి టాకీ చిత్ర దర్శకులు అయిన హెచ్.ఎం.రెడ్డి గారి స్వీయ దర్శకత్వంలో 1938లో నిర్మించిన సాంఘిక చిత్రం గృహలక్ష్మి. మూలా నారాయణస్వామి, బి.ఎన్.రెడ్డి, హెచ్.ఎమ్.రెడ్డి గార్లు స్వయంగా భాగస్వామ్యంతో నిర్మించిన ఈ చిత్రంలో కన్నాంబ, కాంచనమాల, చిత్తూరు నాగయ్య, రామానుజాచారి, గోవిందరాజు సుబ్బారావు లాంటి నటీనటులు కలిసి నటించిన చిత్రం గృహలక్ష్మి. ఈ చిత్రానికి కమలాకర కామేశ్వరరావు గారూ సహాయ దర్శకులుగా ఈ చిత్రానికి పనిచేశారు. వేశ్య పాత్రధారిణిగా నటించిన కాంచనమాల గారికి ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. చిత్తూరు వి.నాగయ్య గారికి ఇది తొలిచిత్రం.

మాలపిల్ల (1938)…

కళ్యాణపురం అనే గ్రామంలో హరిజన యువతి, బ్రాహ్మణ యువకుడు ప్రేమించుకుని సాంఘిక స్థితిగతులను ఎదిరించి ప్రేమ సఫలం చేసుకోవడమూ, హరిజనులు పోరాటం ద్వారానూ, తమ సహృదయత ద్వారానూ ఛాందస బ్రాహ్మణుడైన ధర్మకర్త సుందరరామశాస్త్రి మనసు మార్చి దేవాలయ ప్రవేశం పొందడం సినిమా కథాంశం. గూఢవల్లి రాంబ్రహ్మం గారి దర్శకత్వంలో వచ్చిన తొలి తెలుగు అభ్యుదయవాద చిత్రం “మాలపిల్ల”. అంటరానితనం నిర్మూలన, హరిజనుల దేవాలయ ప్రవేశం, కులాంతర వివాహం, సంస్కరణోద్యమం వంటి సాంఘిక అంశాలను ప్రధానంగా, సమాజంలో ఉన్న దురాచారాలను ఎండగట్టడం ఎదిరించడం లాంటివి ఈ చిత్రంలో మేళవించి తీశారు.

“మాలపిల్ల” లో కథానాయిక కాంచనమాల గారూ. “గూఢవల్లి రామబ్రహ్మం” గారు ప్రొడక్షన్ మేనేజర్ గా వున్న సమయంలో కాంచనమాల గారిని సినిమాలో వేషం కోసం తీసుకువెళ్తే ఈవిడ సినిమాలకు పనికిరారని చెప్పారట. “మాలపిల్ల” సినిమా చిత్రీకరణ సమయంలో కాంచనమాల గారూ గూఢవల్లి గారి వద్ధ ఇదే విషయాన్ని ప్రస్తావించినప్పుడు “అప్పుడేదో అన్నానులే, ఇప్పుడు నీకు పేరు వచ్చింది కదా” అని కాంచనమాల గారితో చెప్పేశారట.

ఒక అగ్రకులస్తుడు, ఒక నిమ్నజాతి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనే కథలో తయారైన ఈ సినిమాలో “మాలపిల్ల”గా కాంచనమాల గారు నటించారు. “మాలపిల్లగా కాంచనమాల గారిని కథానాయకగా పెడితే ఈవిడని పెళ్లి చేసుకుంటారా” తన అసోసియేట్ గూఢవల్లి గారిని అడిగితే దానికి సమాధానంగా గూఢవల్లి గారూ “ఆవిడ కాంచనమాల. ఏ పిల్లగా పెట్టినా కాంచనమాలను చేసుకుంటారు” అని అన్నారట.  గూడవల్లి రామబ్రహ్మం గారి మాటలను బట్టి కాంచనమాల గారూ ఎంతటి అందగత్తెనో మనకు అర్థమైపోతుంది.

“మాలపిల్ల” చిత్రం 12 కేంద్రాల్లో విడుదలయ్యింది. రోజుల్లో 12 కేంద్రాల్లో విడుదలైన మొట్టమొదటి చిత్రం “మాలపిల్ల”నే కావడం విశేషం. ఇది 25 సెప్టెంబర్ 1938లో విడుదలైంది. ఈ చిత్రంలో కాంచనమాల గారు తన పాటలు తనే పాడుకున్నారు. ఈ చిత్రం వివాదాస్పదమైనా కూడా అద్భుతమైన విజయం సాధించింది. మొట్టమొదటి అభ్యుదయవాద చిత్ర దర్శకుడుగా గూఢవల్లి గారికి పేరు తెచ్చిన చిత్రం “మాలపిల్ల”.

వందేమాతరం (1939)..

హెచ్.యం.రెడ్డి గారితో చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వున్న బి.ఎన్.రెడ్డి గారూ, తమ చిత్రాలలో అశ్లీలతకు, అసభ్యతకు చోటుండడం సహించలేక, ఆ నిర్మాణ సంస్థ నుండి బయటకు వచ్చి వాహినీ ఫిలిమ్స్ స్థాపించి మూలా నారాయణస్వామి గారితో కలిసి చిత్తూరు వి.నాగయ్య గారు కథనాయకుడు, కాంచనమాల గారు కథానాయికగా “వందేమాతరం” అనే చిత్రం తీశారు. నిరుద్యోగం, వరకట్న దురాచారం, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు లాంటి ప్రధానాంశాలు ఈ సినిమాలో ప్రస్తావనకు వచ్చాయి. 1938 లో విడుదలై ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆంధ్ర ప్రాంతంలోని కొన్ని కేంద్రాల్లో ఈ చిత్ర రజతోత్సవాలు కూడా జరిగాయి.

వందేమాతరం చిత్రం తర్వాత వైవి రావు గారి దర్శకత్వంలో “మళ్లీ పెళ్లి” అనే సినిమాలో కాంచనమాల గారూ నటించారు. ప్రజాధరణ దృష్టిలో పెట్టుకుని తీసిన ఈ చిత్రం కూడా అద్భుతమైన విజయం సాధించింది. ఆ తరువాత కాంచనమాల గారూ నటించిన మైరావణ, ఇల్లాలు చిత్రాలు అంతగా ప్రజాదరణ పొందలేదు.

వివాహం..

కాంచనమాల గారూ చిన్నప్పటి నుండి తనకు నాటకాలలో తోడుండి, తనను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన తెనాలికి చెందిన గాలి వెంకయ్య అనే యువకుణ్ణి ప్రేమించిన కాంచనమాల గారూ వారినే పెళ్ళాడారు.

కాంచనమాల గారి ప్రాభవం..

కాలం కాటు వేసిన ఒక సౌందర్య రాశి. అశేష ప్రజానీకంతో అభినయ హారతులు, అభిమాన హారతులు పట్టించుకుని అతికొద్ది కాలంలోనే తెరమరుగై, గతాన్ని పూర్తిగా మర్చిపోయిన కాంచనమాల గారూ, ఇప్పటికీ ఆమెనే సౌందర్యరాశి అని ఎందుకు అనుకుంటారనేది ఆమె వైభవానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం..

1935 “కృష్ణ తులాభారం” అనే చిత్రంలో ఒక చిన్న వేషం వేశారు. 1936లో “వీరాభిమన్యు” అనే చిత్రంలో “ఉత్తర” పాత్ర చేశారు. ఓ మాదిరి పేరు వచ్చింది. 1937లో విప్రనారాయణ చిత్రంలో నటించారు. 1938లో గృహలక్ష్మి, మాలపిల్ల అనే రెండు చిత్రాలు చేశారు. అవి  అత్యంత ప్రజాదరణ పొందాయి. దాంతో కాంచనమాల గారు తెలుగువారి ఆరాధ్య దేవతగా తారా పథంలోకి దూసుకెళ్లారు.

1939లో “వందేమాతరం”, “మళ్లీ పెళ్లి” అనే రెండు చిత్రాలలో నటించారు. వీటితో మంచి పేరు వచ్చింది. 1940లో “మైరావణ”, “ఇల్లాలు” అనే చిత్రాలలో నటించారు. ఇవి సరిగ్గా ఆడలేదు. 1942లో “బాలనాగమ్మ” అనే చిత్రంలో నటించారు. ఇది అఖండ విజయం సాధించింది. ఇదే కాంచనమాల గారు నటించిన ఆఖరి చిత్రం. 1935 నుండి 1942 వరకు ఏడు సంవత్సరాలలో కేవలం 11 సినిమాలలో నటించారు.

తన మిత్రురాలు, నటి, నిర్మాత అయిన లక్ష్మీరాజ్యం గారు కాంచనమాల గారిని “నర్తనశాల” చిత్రంలో నటింపజేసినా కూడా కాంచనమాల గారు మానసిక స్థితి కారణంగా ఫలితం లేకపోయింది. కాంచనమాల గారూ నటించిన 11 చిత్రాలలో ఐదు సినిమాలే ఘనవిజయం సాధించాయి. అయినా కూడా ప్రేక్షకులలో ఆమెకు ఆదరణ తగ్గలేదు  1938లో ధాన్యం బస్తా ధర కేవలం మూడు రూపాయలు వున్న ఆ రోజులలో కాంచనమాల గారూ తన పారితోషికంగా 10000 రూపాయలు తీసుకున్నారు. అంటే తన నటన, అందచందాల ప్రాభవం ఎలా ఉండేదో మనకు సులువుగా అర్థమైపోతుంది.

తారాపథం నుండి శూన్యంలోకి..

చిన్న చిన్న బ్యానర్లకు సినిమాలు చేస్తే పెద్దగా పేరు రాకపోవడాన్ని గమనించిన కాంచనమాల గారూ పెద్ద బ్యానర్లకు చేయాలని నిర్ణయించుకున్నారు. జెమినీ వాసన్ గారి నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న “బాలనాగమ్మ” లో కథానాయికగా ఎంపికయ్యింది. రూపుదిద్దుకుంది. ఆ సమయంలో వారి చిత్రాలలోనే నటిస్తానని కాంచన మాల గారూ అగ్రిమెంట్ వ్రాసి ఇచ్చారు. తెలియక చేసినా తెలిసి చేసినా అదే కాంచనమాల గారూ చేసిన పెద్ద తప్పయింది. అప్పటికే బాగా పేరుగాంచిన కాంచనమాల గారికి అవకాశాలు మెండుగా వచ్చి పడ్డాయి.

ఊంఫ్ గరల్, ఆంధ్రా గ్రేటా గార్భో అని పేరు పొందిన కాంచనమాల గారి దగ్గరకు ఎన్నో మంచి ప్రాజెక్టులు రాసాగాయి. కానీ జెమినీ వాసన్ నిర్మాణ సంస్థకు ఇచ్చిన అగ్రిమెంటు వలన ఆమె ఇతర చిత్రాలలో నటించడానికి కుదరలేకపోయింది. ఆ సమయంలో జెమినీ వాసన్ గారు కూడా కొత్త ప్రాజెక్టులు ఏవీ కూడా నిర్మించకపోవడంతో కాంచనమాల గారూ వాసన్ గారితో అగ్రిమెంట్ రద్దు చేయమని కోరింది. అందుకు ఒప్పుకోని వాసన్ గారూ వీల్లేదు అని తెగేసి చెప్పడంతో వారిద్దరి మధ్య మాట మాట పెరిగిపోయింది. మాములుగానే సున్నిత మనస్కురాలైన కాంచనమాల గారూ జెమినీ వాసన్ గారితో “నీ దిక్కున్న చోట చెప్పుకో, నీవు కోటీశ్వరుడవి ఐతే నా కేంటి? “అని అన్నారు.

ఈ మాటలన్నీ జెమినీ వాసన్ గారూ కాంచనమాల గారికి తెలియకుండా వారు మాట్లాడుతున్న గదిలో టేప్ రికార్డర్ లో రికార్డ్ చేసి కాంచనమాల గారికే వినిపించాడు. రికార్డు చేసిన ఈ టేపుతో కోర్టుకెక్కి నీ అంతు చూస్తానన్నారు జెమినీ వాసన్ గారూ. అది కాంచనమాల గారికి ఊహించని షాక్ అయ్యింది. అదే సమయంలోనే “బాలనాగమ్మ” విడుదల అయ్యి అఖండ విజయం సాధించింది. “బాలనాగమ్మ” చిత్రం విజయంతో వచ్చిన లాభాలతో ముందు నుండి జెమినీ వాసన్ గారికి వున్న అప్పులన్నీ తీరిపోయాయి. కాంచనమాల గారి అద్భుతమైన నటనకు ఈ “బాలనాగమ్మ” చిత్రం గీటురాయి. కాంచనమాల గారికి తెలియని విషయమేమిటంటే ఆ చిత్రమే కథానాయికగా ఆమెకు ఆఖరి చిత్రం అవుతుందని.

ఆంధ్ర ప్రేక్షకుల కళ్ళన్నీ తన వైపుకి తిప్పుకున్న కాంచనమాల గారి కళ్లు ఆ షాక్ తో శూన్యం లోనికి చూడటం మొదలుపెట్టాయి. తెలుగు మీద మమకారంతో హిందీ చిత్ర సీమలో వచ్చిన అవకాశాలు తిరస్కరించిన కాంచనమాల గారికి ఇలా జరిగడం ఆమె జీవితానికి తీరని లోటు. కాంచనమాల గారూ బ్రతికి ఉండగానే తెలుగు చలన చిత్ర జగతి ఓ మహానటిని కోల్పోయింది. కాంచనమాల గారూ ఆ స్థితిలో ఉండగానే ఆమెకు జీవితాంతం తోడుండాల్సిన భర్త గాలి వెంకయ్య గారు క్షయ వ్యాధి తో మరణించారు. దాంతో పూర్తి స్థాయిలో శూన్యంలోకి వెళ్లిన కాంచనమాల గారూ తాను మరణించే వరకు మాములు స్థితికి రాలేకపోయింది.

కాంచనమాల గారి చిత్ర సమాహారము..

తెలుగులో…

కృష్ణ తులాభారం (1935)

వీరాభిమన్యు (1936)

విప్రనారాయణ (1936)

మాలపిల్ల (1938)

గృహలక్ష్మి (1938)

వందేమాతరం (1939)

మళ్ళీ పెళ్ళి (1939)

ఇల్లాలు (1940)

బాల నాగమ్మ (1942)

నర్తనశాల (1963)

హిందీ భాషలో..

జింబొ (హింది) (1958)

లవ్ మ్యారేజి (హింది) (1959)

జీవన మలిసంధ్యలో…

కాంచనమాల గారి స్నేహితురాలు, నటి, నిర్మాత లక్ష్మీరాజ్యం గారూ 1963 లో నిర్మించిన నర్తనశాల చిత్రంలో లక్ష్మీరాజ్యం గారి బలవంతంతో ఓ చిన్న పాత్రను పోషించారు కాంచనమాల. నర్తనశాల చిత్రంలో కాంచనమాల గారూ నటిస్తున్నారనే వార్తలు రాగానే ఎంతో మంది అభిమానులు కాంచనమాల గారిని చూడటానికి వచ్చారు. ఆ సమయంలో కాంచనమాల గారూ ఎవ్వరినీ గుర్తుపట్టకపోవడంతో వారందరూ నిరాశతో వెనుదిరిగారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత మేకప్ వేసుకున్నా కూడా కాంచనమాల గారి ముఖంలో ఏమాత్రం ఆనందం ఆగపించలేదు. అలానే శూన్యంలో సంవత్సరాలు గడిపిన కాంచనమాల గారూ మద్రాసులో 1981 జనవరి 24 న ఈ లోకాన్ని వదిలిన కాంచనమాల గారూ అశేష ప్రేక్షకాభిమానులను శోకసంద్రంలో ముంచి వెళ్లారు.

వీరు మరణించిన నాలుగు దశాబ్దాలు అయిన ఆవిడ సినీ రంగం నుండి విరమించి ఎనిమిది దశాబ్దాలు అయినా ఇప్పటికీ కూడా ఆవిడ గురించి ఏదో ఒక పత్రికలో ఏదో ఒక రూపంగా వ్యాసాలు వస్తూనే ఉంటాయి

శ్రీ శ్రీ గారి కవితలో కాంచనమాల గారికి చోటు..

ఆనంద వాహిని పత్రికలో ఆమె అందం, నటన గురించి పద్యాలు వ్రాసేవారు. శ్రీశ్రీ గారు తన మహాప్రస్థానంలో, ప్రాసక్రీడలలో కాంచనమాల గారిని ఉదాహరించారు. మహాప్రస్థానంలో సంధ్యాసమస్యలు అనే కవితలో ఒక చరణంలో “బ్రాడ్ వే” లో కాంచనమాల, రాక్సీలో “నర్మా షేరర్” ఎటుకేగుటో సమస్య తగిలిందో ఉద్యోగికి అని ఆ రోజుల్లో ఆమెకు ప్రేక్షకులలో గల అభిమానం గురించి వ్రాసుకొచ్చారు. ప్రాసక్రీడల్లో “తెలుగు సినీ పరిశ్రమకు కళాకాంతులెప్పుడు, శ్రీమతి కాంచనమాలకు పిచ్చి కుదిరినప్పుడు” అని కాంచనమాల గారి తుది జీవితాన్ని ఉద్ధేశించి వ్రాశారు. 1938 – 40 ప్రాంతాల్లో స్లీవ్ లెస్ జాకెట్ వేసుకొని, వాలు జడ ముందుకు వేసుకొని, చేతిలో టీ కప్పు, మెడలో సన్నని గొలుసు విశాలమైన నేత్రాలతో అందంగా ఉన్న ఆమె బొమ్మతో క్యాలెండర్ విడుదల చేస్తే సంవత్సరాల తరబడి గోడ మీద ఉంచుకునే వారట ఆ రోజుల్లో.

భానుమతి గారు చిత్రసీమలో అడుగుపెట్టేందుకు అప్పుడే మద్రాసుకు వచ్చారు. భానుమతి గారూ అద్దెకు ఉన్న ప్రక్క వీధిలోనే కాంచనమాల గారు కూడా అద్దె ఉండేవారు. కాంచనమాల గారిని చూడాలని వచ్చిన భానుమతి గారూ గుమ్మం దగ్గర నిలుచుని ఉన్నారు. ఆ వీధి గుండా కాంచనమాల గారి కారు వెళుతుండగా, కారుకు ముందు పశువులు అడ్డు వచ్చి భానుమతి గారు నిలుచున్న ఇంటి దగ్గరే కారు ఆపేశారు. ఆ క్షణంలో కాంచనమాల గారిని చూసిన భానుమతి గారు ఆమె అందానికి ముగ్ధులైపోయారు. తన జన్మ చరితార్థమైనదిగా భావించారు కూడా. ఒకానొక దశలో “దివి నుండి భూవికి దిగివచ్చిన రంభ లాగా ఉన్నారావిడ” అని కాంచనమాల గారిని తన అందం గురించి ఆ విధంగా పొగుడుతూ తన ఆత్మకథలో వ్రాసుకున్నారు.

Show More
Back to top button