
హెపటైటిస్ ఈ వైరస్ గురించి ఎంత మందికి తెలుసు.. నేడు ఇది చాప కింద నీరులా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏటా జూలై 28న జరిగే దినోత్సవంలో భాగంగా ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ఇంకా చాలా మందికి వీటిపై సరైన అవగాహన లేక పెద్దగా ఫలితం ఉండటం లేదు. ఈ వైరస్ కాటుతో ప్రతి సంవత్సరం అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 354 మిలియన్ల మంది ప్రజలు హెపటైటిస్ B, C వైరస్లతో బాధపడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. అసలు ఏంటి ఈ వైరస్లు, వీటి నుంచి జాగ్రత్తలు ఎలా? వంటివి తెలుసుకుందాం.
హెపటైటిస్ అనేది కాలేయ సంబంధ వ్యాధి. కాలేయం అనగానే మందు తాగడం వల్లే వస్తుందని అనుకుంటే పొరపాటే. మద్యపానం ఒక కారణమే.. కానీ, అదొక్కటే కాకుండా చాలా రకాల కారణాలతో హెపటైటిస్ సోకుతుంది.
జీవనశైలిలో మార్పులు, ఊబకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు హెపటైటిస్ రావడానికి కారణం అవుతున్నాయి.
కాలేయ వాపు చెందడం, రక్తాన్ని శుద్ధి చేసిన మలినాలను బయటకు పంపే కాలేయం సరిగా పనిచేయకపోవడం, వాపు చెంది ఇబ్బంది కలిగించడాన్నే హెపటైటిస్ అంటారు.
ఇందులో A, B, C, D, E అనే రకాలు ఉన్నాయి. దీనిలో A వైరస్ అంత ప్రమాదం కాకపోయినా.. మిగతా వైరస్లు మాత్రం చాలా ప్రమాదం.
వీటిపై సరైన అవగాహన లేకపోతే.. దీని నుంచి వచ్చే ప్రమాదం నుంచి తప్పించుకోలేరు.
ఈ వైరస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత విపరీతమైన అలసట, ఆకలి లేకపోవడం, కామెర్లు, కాలేయ ప్రాంతంలో నొప్పి, వికారం వంటివి లక్షణాలుగా ఉంటాయి.
ఇది ఎలా వస్తుందంటే..కలుషిత నీటివల్ల, రక్త మార్పిడి, వీర్యం, శరీర రక్షణలేని శృంగారం వల్ల వాటివల్ల ఇతరులకు సోకుతుంది.
ఒకవేళ తల్లికి ఈ వైరస్ ఉంటే పుట్టిన బిడ్డకు వచ్చే అవకాశం ఉంటుంది. దీని బారిన పడకూడదని భావిస్తే కలుషిత నీరు తాగవద్దు.
ఇంజక్షన్ తీసుకునేటప్పుడు కొత్త సిరంజి వాడుతున్నారా లేదా అనేది చెక్ చేయడం తప్పనిసరిగా చూసుకోవాలి.
పిల్లలకు తప్పని సరిగా హెపటైటిస్ టీకాలు వేయిస్తే దీని నుంచి ముందుగానే రక్షణ పొందవచ్చు.
Help line:
ఈ వైరస్ శరీరంలో ప్రవేశించిన ఆరు నెలల వరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు.