HEALTH & LIFESTYLE

నిశ్శబ్ద విపత్తుగా మారుతున్న ఆంటీ-మైక్రోబియల్‌ నిరోధకత !

అతి ప్రధానమైన 10 ప్రజారోగ్య సమస్యల్లో “ఆంటీ-మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌(ఏఎంఆర్‌)” లేదా “ఆంటీ-మైక్రోబియల్‌ నిరోధకత”ను ఒకటిగా గుర్తించడంతో 2005 నుంచి ఐరాస ప్రతి ఏట 18-24 నవంబర్‌ రోజుల్లో “వరల్డ్‌ ఆంటీ-మైక్రోబియల్‌ అవేర్‌సెస్‌ వీక్‌ లేదా ‌ “ప్రపంచ ఆంటీ-మైక్రోబియల్‌ అవగాహన వారం” పాటించుట ఆనవాయితీగా మారింది. బాక్టీరియా, వైరస్‌, ఫంగీ, పరాన్నజీవులు లాంటి సూక్ష్మజీవులు కలిగించే సాంక్రమిక వ్యాధులను త్వరగా, సమర్థవంతంగా నయం చేయడానికి ఆంటీ-మైక్రోబియల్‌ ఔషధాలను వాడుట అలవాటు అయ్యింది.

కాలానుగుణంగా సూక్ష్మజీవుల్లో వస్తున్న మార్పులతో ఆంటీ-మైక్రోబియల్‌ డ్రగ్స్‌ పట్ల సూక్ష్మజీవులు నిరోధకతను పెంచుకొని, ఆ ఔషధాలకు రోగ కారక సూక్ష్మజీవులు లొంగకుండా మొండికేయడంతో అంటువ్యాధుల చికిత్సలకు అవాంతరాలు ఏర్పడి ప్రాణాంతక స్థితులకు చేరడంతో పాటు మరో “నిశ్శబ్ద విపత్తు” ఏర్పడుతున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదకర విపత్తు వల్ల ఏడాదికి 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం, ఈ సంఖ్య 2050 వరకు 10 మిలియన్లకు చేరవచ్చని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఏఎంఆర్‌ సమస్య ఆసియా, ఆఫ్రికా దేశాల్లోనే 90 శాతం వరకు విస్తరించిందని నిర్థారణ అవుతున్నది. 

ఆంటీ-మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ పెరగడానికి కారణాలు:

 ఏఎంఆర్‌ పెరగడానికి ప్రధాన కారణాలుగా విచక్షణారహితంగా అధిక మోతాదులో ఆంటీ-మైక్రోబియల్‌ డ్రగ్స్‌ వాడడం, సురక్షిత నీటి కొరత, పారిశుద్ధ్యం సమస్యలు, వ్యక్తిగత పరిశుభ్రత లాంటి అవలక్షణాలతో మానవాళే కాకుండా జంతువులు, వ్యవసాయ పంటలు ప్రమాదంలో పడుతున్నాయి. 2000-15 మధ్య కాలంలో ఆంటీ-మైక్రోబియల్‌ డ్రగ్స్‌ వాడకం 65 శాతం వరకు పెరుగగా, 2030 నాటికి 200 శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే 2017-30న మధ్య జంతు చికిత్సలకు వాడే ఆంటీబయోటిక్స్‌ 12 శాతం పెరగవచ్చనే అశుభ వార్తలు వింటున్నాం. 

ప్రపంచ ఆంటీ-మైక్రోబియల్‌ అవగాహన వారం -2024 థీమ్‌:

 ప్రపంచ ఆంటీ-మైక్రోబియల్‌ అవగాహన వారం-2024 థీమ్‌గా “ఎడ్యుకేట్‌, అడ్వకేట్‌, ఆక్ట్‌ నౌ” అనబడే అంశాన్ని తీసుకొని అవగాహన కల్పిస్తున్నారు. ఏఎంఆర్‌ పట్ల అవగాహన కల్పించడానికి పౌరసమాజం, ప్రభుత్వ యంత్రాంగం, వెటర్నరీ విభాగం, రైతులు, ఫార్మసిస్టులు, విద్యావేత్తలు, యువజన సంఘాలు, సీనియర్‌ సిటిజెన్స్‌, వ్యవసాయ శాఖల సమన్వయంతో కృషి చేయాల్సి ఉంది. కరోనా విపత్తు సమయంలో అధిక శాతం రోగులకు ఆంటీబయాట్ ఔషధాలను విచక్షణారహితంగా, అధిక మోతాదులో వాడడంతో నేడు దాని దుష్ప్రభావాలు నేడు తీవ్రరూపం దాల్చడం, తీవ్ర అనారోగ్యాలు కలగడంతో పాటు ప్రాణాలు సహితం పోవడం చూస్తున్నాం. గత ఎనిమిది దశాబ్దాలుగా ఆంటీ-మైక్రోబియల్‌ ఔషధాలను విరివిగా వాడి రోగాలను నయం చేసే ప్రయత్నాలు చేయడంతో ఆ డ్రగ్స్‌ పట్ల నిరోధకత పెరిగి వాటి ప్రభావం పూర్తిగా తగ్గడం గమనిస్తున్నాం. ఏఎంఆర్‌ ఫలితంగా సూక్ష్మజీవుల కారణ సాంక్రమిక వ్యాధులకు చికిత్స కష్టం అవుతున్నది. 

ఏఎంఆర్‌ కట్టడి మార్గాలు:

రానున్న రోజుల్లో ఆంటీ-బాక్టీరియల్‌, ఆంటీబయాటిక్, ఆంటీలైరల్‌, ఆంటీఫంగల్‌, ఆంటీపారాసైటిక్స్‌ లాంటి ఔషధాలు పని చేయక పోవడం‌తో, వ్యాధుల కట్టడి వైద్యులకు కష్టం కావడంతో మరో ప్రమాదకర సంక్షోభానికి లేదా విపత్తుకు తలుపులు తెరుచుకుంటున్నాయి. ఆంటీ-మైక్రోబియల్‌ డ్రగ్స్‌ పని చేయని యెడల రోగులు/జంతువులు/పంటలు కూడా ప్రభావితం కావడం, పలు సంబంధిత సమస్యలకు దారి తీస్తున్నాయి. వైద్యుల సలహాలు తీసుకోకుండా ఆంటీ-మైక్రోబియల్‌ డ్రగ్స్‌ వాడరాదు. ఆంటీ-మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ను అదుపు చేయడానికి చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం, సురక్షిత నీరు తాగడం, పరిశుద్ధ ఆహారం తీసుకోవడం, టీకాలు తీసుకోవడం, పరిసరాల పరిశుభ్రత, వ్యాధిగ్రస్తులకు దూరంగా ఉండడం, సురక్షిత లైంగిక సంబంధాలు కలిగి ఉండడం లాంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 

 ఏఎంఆర్‌ ప్రతికూల ప్రభావంతో ప్రజలు, పశుసంపద, మత్స్యసంపద, పాడి పరిశ్రమ, ఆక్వాకల్చర్‌, హార్టీకల్చర్‌, పండ్ల తోటలు, పర్యావరణ వ్యవస్థలు దెబ్బతినే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఆంటీ-మైక్రోబియల్‌ ఔషధాలను వైధ్యులు సూచించినట్లుగా విచక్షణతో వాడడం, మోతాదు మించకపోవడం, ఇతర జాగ్రత్తలను తూచా తప్పకుండా పాటించడం వల్ల ఏఎంఆర్‌ అదుపు చేయబడి మానవాళి, జంతువులు, పంటల ఆరోగ్యాలు వర్థిల్లుతాయి. 

Show More
Back to top button