
మన జీవన కాలాన్ని నిర్ణయించేది మనం తీసుకునే ఆహారపదార్థాలే. సరైన ఆహారం తీసుకుంటే మనం వ్యాధులు, హాస్పిటల్‌లకు దూరంగా ఉండవచ్చు. అత్యధిక అనారోగ్య సమస్యలు, ఆకస్మిక మరణాలు గుండె సంబంధిత వ్యాధుల కారణంగానే వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులు రావడానికి కారణం మన ఒంట్లో చెడు కొవ్వు నిల్వలు పెరడమేనని వైద్యులు చెబుతున్నారు. లో డెన్సిటీ లిపోప్రొటీన్ కొవ్వులు రక్తనాళాల్లో రక్త సరఫరాకు అంతరాయం కలిగిస్తాయి.
శరీరంలో వీటి నిల్వలు అనేక వ్యాధులకు కారణమవుతాయి. జీవన శైలి, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడంతో బాడీలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. ప్రతిరోజు సైక్లింగ్, వాకింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది. అధిక బరువు ఉన్నవారు తగ్గుతారు. శరీరంలో చెడు కొవ్వులను నియంత్రిస్తే రక్తనాళాల్లో వాపు, రక్తం గడ్డ కట్టడాన్ని, గుండెపోటు, హార్ట్ స్ట్రోక్ వంటివి నివారించవచ్చు. రక్తనాళాల గోడలు దళసరి కాకుండా ఉంటాయి.
తగ్గించేవి ఇవే..
కొన్ని రకాల ఆహార పదార్థాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇవి రక్తనాళాల్లో రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేసి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.
బీన్స్
వీటిలో ఉండే కరిగే పీచు చెడు కొలెస్ట్రాల్ తయారీని నివారిస్తుంది. బీన్స్‌లో లెసిథిన్, కొలెస్ట్రాల్ కరిగిపోయేలా చేస్తుంది. దీనితో పాటు బీన్స్‌లో పొటాషియం, రాగి, మాంగనీసు, ఫోలిక్ ఆమ్లాలు కూడా ఉంటాయి.
వంకాయ
వంకాయ అనేక ఫైటో న్యూట్రియంట్లు, అనేక రకాల విటమిన్లు, మినరల్స్ కలిగి ఉంటుంది. ఆక్సీకరణ ప్రక్రియలో తోడ్పడతాయి.
వెల్లుల్లి
ఇది రక్తపోటును నియంత్రించి, ఎక్కువగా ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
సోయా
కాలేయానికి రక్తం నుంచి కొలెస్ట్రాల్ తొలగించే శక్తిని పెంచుతుంది. సోయా చిక్కుళ్లల్లో విటమిన్ B3, B6, విటమిన్-E ఉన్నాయి.
ఓట్ మీల్
దీనిలోని కరిగిపోయే బీటా గ్లూకాన్ అనే పీచు పదార్థం చెడు కొలెస్ట్రాల్ నిర్వీర్యం చేస్తుంది.
సబ్జా గింజలు వీటి పొట్టు, ప్రేగుల లోనికి కొలెస్ట్రాల్ చేరనివ్వదు. చెడు కొలెస్ట్రాల్ తగ్గించే గుణం సబ్జా గింజలకు ఉంది.
పొట్టు తీయని గోధుములు, మొక్కజొన్న, అవిసె గింజలు తినాలి. ఇవి కొలెస్ట్రాల్ పరిమాణం, రక్తపోటు, రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి.