మనం తిన్న ఆహారం జీర్ణమై మల విసర్జన కావాలంటే కనీసం 6-8 గంటల సమయం పడుతుంది. అలా కాకుండా తిన్న వెంటనే మల విసర్జన అవుతుందా?. అయితే, మీరు ప్రమాదంలో ఉన్నట్టే. తిన్న వెంటనే బాత్‌రూంకి వెళ్లడం కొంతమందికి అలవాటుగా ఉంటుంది. కానీ, దీన్ని అంతగా పట్టించుకోరు. దీనికి కారణం గ్యాస్ట్రో కోలిక్ రిఫ్లెక్స్. ఆహారం తిన్నాక అది లోపలికి వెళ్లి జీర్ణాశయాంతర ప్రేగులలో కదలికలు ప్రేరేపిస్తుంది. ఇర్రిటెబుల్ బోవెల్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వారిలో ఎక్కువగా ఈ కదలికలు అధికంగా ఉండి మలవిసర్జన వెంటనే అవుతుంది.
ఆహారం పొట్టలోకి ప్రవేశించినప్పుడు, పెద్దప్రేగు సంకోచానికి కారణమయ్యే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. దీంతో పేగు సంకోచించి గతంలో తిన్న ఆహారాన్ని ఇంకా ముందుకు నెడుతుంది. దీని ఫలితంగా మలాన్ని విసర్జించాలనే కోరిక కలుగుతుంది. కొంతమందిలో గ్యాస్ట్రో కోలిక్ రిఫ్లెక్స్ తేలికపాటిగా ఉంటుంది. ఎలాంటి లక్షణాలు కనిపించవు. కొందరిలో మాత్రం గ్యాస్ట్రో కోలిక్ రిఫ్లెక్స్ తీవ్రంగా ఉంటుంది. కొన్ని ఆహారాలు గ్యాస్ట్రో కోలిక్ రిఫ్లెక్స్‌ను పెంచుతాయి. మోతాదుకు మించిన ఫైబర్ ఉన్న ఆహారాలు, పాలు, వేపుళ్లు, ప్రాసెస్ చేసిన ఆహారం, వంటివి తినడం వల్ల ఈ సమస్య రెట్టింపయ్యే ప్రమాదం ఉంది.
వీటి కారణంగా కూడా రావొచ్చు
కింది ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో కూడా గ్యాస్ట్రో కోలిక్ రిఫ్లెక్స్ అధికంగా ఉంటుంది.
ఒత్తిడి, ఆందోళన
ఉదరకుహర వ్యాధి
ఫుడ్ అలెర్జీ
గ్యాస్ట్రో ఎంటరైటిస్
కడుపు నొప్పి, ఉబ్బరం
గ్యాస్ సమస్యలు
అతిసారం(డయేరియా)
గ్యాస్ట్రో కోలిక్ రిఫ్లెక్స్ రాకుండా ఉండాలంటే అనారోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారాన్ని తినడం మానేయాలి. భోజనం అధికంగా ఒకేసారి తినకుండా, కొంచెం కొంచెంగా తినాలి. గ్యాస్ విడుదల చేసే ఆహారాలు తినకూడదు. భోజనం తినే ముందు పిప్పరమింట్ టీ తాగండి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.