HEALTH & LIFESTYLE

పదిమందిలో ఐదుగురుకు థైరాయిడ్ దిగులు

ప్రతి పదిమందిలో ఐదుగురు థైరాయిడ్‌ వ్యాధితో బాధపడేవారు ఉంటారు. థైరాయిడ్ అనేది ఒక గ్రంథి. ఈ గ్రంథి గొంతులో ట్రెఖియా అనే గాలి గొట్టానికి, ఇరువైపులా సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి T3, T4, TSH హార్మోన్స్ విడుదల చేస్తుంది. T3 హార్మోన్ T4(థైరాక్సిన్) విడుదలకు తోడ్పడుతుంది. T4(థైరాక్సిన్ ) ఉత్తేజపరచడానికి TSH సహాయపడుతుంది. మనం తిన్న ఆహారం ఏయే శరీర భాగాలకు ఎంత మొత్తంలో శక్తిని పంపించాలో నిర్ధారించడమే ఈ హార్మోన్ చేసే పని. థైరాయిడ్‌, పిట్యూటరీ గ్రంథులు మెదడులో హైపోథేలమస్‌ అనే భాగం పనిచేయడానికి సహాయపడతాయి.

శరీరంలో సరిపడా థైరాక్సిన్ లేకపోతే పిట్యూటరీ గ్రంథి ఈ అవసరాన్ని గుర్తిస్తుంది. దీంతో థైరాయిడ్‌ ఉత్తేజ పరిచేందుకు థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ (TSH)ని విడుదల చేస్తుంది. ఈ థైరాక్సిన్ ఉత్పత్తి, విడుదలలో అసమానతలు ఏర్పడితే హైపర్‌ థైరాయిడిజం, హైపో థైరాయిడిజం, గాయిటర్, థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 

హైపర్‌ థైరాయిడిజం:

థైరాయిడ్ గ్రంథిలో థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువ విడుదలైతే హైపర్‌ థైరాయిడిజం అంటారు. 

లక్షణాలు: 

హార్ట్‌ బీట్ పెరిగిపోవడం, నరాల బలహీనత, చిరాకు, చేతులు వణకడం, చెమట పట్టడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, వేడి తట్టుకోలేక పోవటం, జుట్టు ఊడిపోవటం, తరచూ విరేచనాలు, కనుగుడ్లు ముందుకు చొచ్చుకు రావటం, స్త్రీలలో తరచూ రుతుస్రావం వంటి అనారోగ్యాలకు గురౌతారు. 

చికిత్స:

హైపర్‌ థైరాయిడిజం రోగులకు వయసు బట్టి చికిత్స చేస్తారు. చిన్నవారైతే యాంటీ థైరాయిడ్‌ మందులు వాడుతారు. 45ఏళ్ల లోపు ఉన్న వారిలో అవసరాన్ని బట్టి ఆపరేషన్‌ చూయాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఎక్కువగా లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని వైద్యులు అంటున్నారు. ఈ ట్రీట్మెంట్ 45ఏళ్లుపైన వయసున్న వారికి మాత్రమే చేస్తారు. చికిత్స తీసుకునేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

హైపోథైరాయిడిజం:-

థైరాయిడ్‌ గ్రంథి శరీర అవసరాలకంటే తక్కువ థైరాక్సిన్ విడుదల చేస్తే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. 

లక్షణాలు:

అలసట, నీరసం, నిద్రమత్తు, ఏకాగ్రత కోల్పోవడం, గోళ్లు, దురద, పొడిబారిన చర్మం, ఉబ్బిన ముఖం, మలబద్దకం, బరువు పెరగడం, స్త్రీలల్లో తక్కువ రుతుశ్రావం, రక్తహీనత హైపో థైరాయిడిజం లక్షణాలు. ఈ వ్యాధి ముదిరితే స్వర పేటికకు పాకి బొంగురు గొంతుగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. హైపో థైరాయిడిజం నిర్ధారించాలంటే రక్తంలో ఉండే TSHను టెస్ట్ చేయాలి. ట్రోపిన్ టెస్ట్‌లో థైరాక్సిన్ విడుదల తగ్గగానే, దాన్ని పెంచడానికి థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌(TSH)ఎక్కువ మొత్తంలో రక్తంలోకి రిలీజ్ అవుతుంది. బ్లడ్‌లో TSHను బట్టి హైపో థైరాయిడిజం నిర్ధారిస్తారు.

చికిత్స: ఈ సమస్య మందులు వాడితే తగ్గిపోతుంది. ప్రారంభంలోనే గుర్తించి చికిత్స మొదలుపెడితే ఎలాంటి నష్టం ఉండదు. శారీరక, మానసిక ఎదుగుదల తక్కువగా ఉన్న పిల్లల్లో ఇది పూర్తిగా నయం కాదని వైద్య నిపుణులు అంటున్నారు.

గాయిటర్:

థైరాయిడ్‌ గ్రంథి ఉండాల్సిన దానికంటే ఎక్కువగా పెరగడాన్ని గాయిటర్‌ అంటారు. యుక్త వయసులో థైరాయిడ్‌ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆ వయసు వారిలో థైరాయిడ్ రెండు వైపులా పెరుగుతుంది. తర్వాత కొన్నిరోజులకు సాధారణ స్థితికి వస్తుంది. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఒకవైపు మాత్రమే గడ్డలాగా ఉండే వాపు చాలా ప్రమాదం. ఇది మామూలు స్థితికి రాదు. దీనికి ట్రీట్మెంట్ చేయించాల్సిందే.

థైరాయిడ్‌ క్యాన్సర్‌:

ఇది చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. ఆపరేషన్ చేయడమే దీనికి పరిష్కారం. చికిత్స చేసి థైరాయిడ్‌ గ్రంథిని పూర్తిగా తొలగిస్తారు. ఈ ఆపరేషన్‌ తర్వాత రోగి అందరిలాగే ఎక్కువ కాలం ఆరోగ్యవంతమైన జీవించలేరు.

గర్భిణుల్లో థైరాయిడ్ సమస్యలు

థైరాయిడ్‌ ఉన్న గర్భిణులు జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. థైరాక్సిన్‌ హార్మోన్‌ లోపిస్తే గర్భస్రావమయ్యే ముప్పు ఎక్కువని చాలామందికి తెలియదు. తగు చికిత్స తీసుకోకపోతే బరువు, BP పెరగటంతో పాటు ముందుగానే ప్రసవం అయ్యే ప్రమాదం ఉంది. పుట్టిన పిల్లల్లో మానసిక ఎదుగుదల ఉండదు. మన దేశంలోని గర్భిణుల్లో హైపో థైరాయిడిజం ఎక్కువ ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. అందుకే దీనిపై అవగాహన కలిగించేందుకు ఇండియన్‌ థైరాయిడ్‌ సొసైటీ జనవరి నెలను ‘థింక్‌ థైరాయిడ్‌ మంత్‌’గా ప్రకటించింది.

గర్భిణుల్లో 6.47% మంది హైపో థైరాయిడిజంతో బాధపడుతున్నట్టు వెళ్లడైంది. పుట్టబోయే బిడ్డల క్షేమం కోసం గర్భిణులంతా థైరాయిడ్‌ టెస్ట్ చేయించుకోవాలని ITS సభ్యులు సూచిస్తున్నారు. చాలామంది గర్భిణులు వాళ్లు తీసుకునే ఆహారం, రక్తపోటు, వ్యాయామం, డాక్టర్‌ వద్దకు వెళ్లడానికి ఆసక్తి చూపుతారు. కానీ థైరాయిడ్‌ గురించి పట్టించుకోరు.

Show More
Back to top button