HEALTH & LIFESTYLE

అందరికీ ఆరోగ్య భద్రత గొడుగు పట్టలేమా !

పౌర సమాజ శ్రేయస్సు, స్థిర జీవనం, ఉత్పాదకత, సంపాదన లాంటి అంశాలకు వ్యక్తిగత ఆరోగ్యాలు ఆధారపడి ఉన్నాయి. ఐరాస గుర్తించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030 సాధనకు ఆరోగ్యకర ప్రపంచ జనాభా అత్యవసరం. గత రెండు దశాబ్దాలుగా కుటుంబాల వైద్య ఆరోగ్య ఖర్చులు విపరీతంగా పెరగడం గమనించారు. ప్రపంచ జనాభాలో 2 బిలియన్ల ప్రజలు వైద్య ఖర్చులతో నలిగి పోతున్నారని, అనారోగ్య కారణాలతో 1.3 బిలియన్ల ప్రజలు ఆర్థికంగా చితికిపోయి నిరు పేదలుగా మారారని గణాంకాలు వివరిస్తున్నాయి. ముఖ్యంగా తల్లులు, పిల్లల ఆరోగ్య సమస్యలు కుటుంబాల ఆర్థిక స్థితిని దిగజార్చడం, రోగ నిర్థారణతో పాటు వైద్య ఖర్చులు భరించలేక కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సహితం కోల్పోవడం కనిపిస్తున్నది. 

ప్రజారోగ్యం ప్రభుత్వ కనీస బాధ్యత:

 వైద్య ఆరోగ్య అభద్రత కారణంగా ప్రపంచ మానవాళి ఆర్థిక స్థితులు తీవ్రంగా ప్రభావితం కావడాన్ని గమనించిన ఐరాసతో కూడిన అంతర్జాతీయ సమాజం ఈ విషయం పట్ల అవగాహన కల్పించటానికి ప్రతి ఏట 12 డిసెంబర్‌న “సార్వత్రిక ఆరోగ్య భద్రత దినం (యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజ్‌ డే)” పాటించుట 2006 నుంచి ఆనవాయితీగా మారింది. సార్వత్రిక ఆరోగ్య భద్రత దినం-2024 థీమ్‌గా “ఆరోగ్యం – ప్రభుత్వ కనీస బాధ్యత” అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం చేయడం కొనసాగుతున్నది.

సార్వత్రిక ఆరోగ్య భద్రతలో భాగంగా నాణ్యమైన అత్యవసర వైద్య సదుపాయాల కల్పన, దీర్ఘకాలిక ఆరోగ్య భద్రత కల్పన, ఔషధాల అందుబాటు, సకాలంలో టీకాలను వేయించడం ప్రపంచ జనాభా ముంగిట ఉచితంగా అందించాలి. పేదరికం, పోషకాహార లోపాలతో ఆరోగ్య సమస్యలు నేరుగా సంబంధాలను కలిగి ఉంటాయని, ఈ ప్రాథమిక సమస్యలకు సమాధానాలను వెతకడం మన కనీస ధర్మమని ప్రభుత్వాలుతెలుసుకోవాలి. 

సార్వత్రిక ఆరోగ్య భద్రత సవాళ్ళు, అధిగమించే మార్గాలు:

 సార్వత్రిక ఆరోగ్య అభద్రతకు కారణాలుగా అరకొర వైద్య సిబ్బంది, వైద్య వసతుల లేమి, వైద్య ఆరోగ్య శాఖల్లో నిధుల కొరత, విపరీతంగా పెరుగుతున్న ప్రైవేట్‌ ఆసుపత్రులు, ప్రభుత్వ పని తీరు నిరాశాజనకంగా ఉండడం లాంటివి పేర్కొనబడ్డాయి. 2015లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే వివరాల ప్రకారం 38 శాతం ప్రపంచ జనాభాకు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో పాటు సురక్షిత నీటి వనరులు అందుబాటులో లేవని, 35 శాతం జనాభా తమ చేతులను శుభ్రంగా కడుక్కోవడానికి అవసర సబ్బు లాంటి పదార్థాలు లేదని తెలుస్తున్నది.

ఇలాంటి దయనీయ దుస్థితిలో అంటువ్యాధులు కమ్ముకోవడం, అనారోగ్యాలు ముసురుకోవడం జరుగుతుంది. నేటి అభాగ్య పేదరిక ప్రపంచ జనాభాకు ఆరోగ్య భద్రత కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. సార్వత్రిక ఆరోగ్య భద్రత కల్పనకు ప్రభుత్వాలు రోగ నిర్ధారణ కేంద్రాలు, వైద్య ఆరోగ్య కేంద్రాలు నెలకొల్పి నిరు పేదల వైద్య ఖర్చులను తగ్గించడంతో ద్వారా పేదరికం కూడా తగ్గిపోవడం, ఆర్థికంగా బలోపేతం కావడం, కుటుంబంలో సంతోషాల జల్లులు కురవడం, మొత్తంగా ప్రపంచ శాంతి నెలకొనడం ఫలిస్తుంది. 

 అందరికీ సమానంగా వైద్య ఆరోగ్య వసతులు కల్పించిన సమాజంలో సార్వత్రిక ఆరోగ్య భద్రత సకల్పించినట్లు అవుతుంది. వ్యక్తిగత, కుటుంబ వైద్య ఆరోగ్య ఖర్చులను తగ్గించినా సమాజంలో పేదరిక నిర్మూలన వేగం పుంజుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా నలుమూలల వైద్య సదుపాయాలు, అవసరమైన వైద్య సిబ్బంది నియామకాలు, ఔషధాల అందుబాటు, చవకైన ఆరోగ్య భీమా అవకాశాలు లాంటి సకారాత్మక చర్యలు తీసుకున్న సమాజంలో ప్రజారోగ్య భద్రత వర్థిల్లుతుందని గమనించాలి. ఆరోగ్యకర కుటుంబాల నెలవుగా ప్రపంచం మారాలి. ఆసుపత్రులు అందుబాటులో ఉండాలి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండడానికి ప్రతి ఒక్కరు కనీస పరిశుభ్రతను పాటించాలి. 

Show More
Back to top button