మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కానీ ఈ మధ్యకాలంలో మితంగా కొన్ని ఆల్కహాల్ బ్రాండ్స్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనని పలు నివేదికల్లో వచ్చాయి. ఇలా చెప్పడంతో మద్యం తాగనివారు సైతం అలవాటు చేసుకున్నారు. అలాగే మందుతాగే వాళ్లు ఎక్కువగా తాగడం మొదలుపెట్టారు. తగు మోతాదులో రోజూ మద్యం సేవిస్తే.. ఆరోగ్యానికి మంచిదని చెప్పడంలో వాస్తవం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) స్పష్టం చేసింది. శరీరంలోకి వెళ్తున్న ఆల్కాహాల్ ప్రతి చుక్క అనారోగ్యానికి దారితీస్తుందని పేర్కొంది. తక్కువ మోతాదులో మద్యం తాగితే ఆరోగ్యంగా ఉంటామని, కొన్ని రుగ్మతలు అదుపు చేయవచ్చని చెబుతున్న మాటల్లో శాస్త్రీయ రుజువులు లేవని వివరించింది.
ఏడు రకాల క్యాన్సర్లకు కారణం
ప్రపంచంలో మద్యం ఎక్కువగా తాగేది యూరోపియన్ దేశాలవారు. ఆ దేశాల్లో మద్యం తాగడం వల్ల క్యాన్సర్ బారినపడేవారి సంఖ్య ఎక్కువగా ఉందని ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ ఓ నివేదికలో పేర్కొంది. మద్యం సేవిస్తే క్యాన్సర్ కణాలు ఎక్కువ వృద్ధి చెందుతున్నాయని, అలాగే ఆల్కహాల్ 7 రకాల క్యాన్సర్లకు కారణమవుతుందని WHO కూడా చెబుతుంది. దీంతోపాటు శరీరంలోని అన్ని వ్యవస్థలను ఆల్కాహాల్ దెబ్బతీస్తుందని వైద్యులు అంటున్నారు. కాగా, గుండె జబ్బుల్ని నిరోధించే లక్షణాలు ఆల్కహాల్‌లో ఉన్నాయని శాస్త్రీయంగా రుజువు కాలేదని WHO స్పష్టం చేసింది.