భావోద్వేగం అనేది అందరికీ సహజంగా ఉండే ఒక లక్షణం. భావం అంటే ప్రేమ, కోపం, బాధ, భయం లాంటివి. అవి విపరీతమైన స్థాయిలో ఉన్నప్పుడు భావోద్వేగం అంటాము. మన భావాల పట్ల, మనస్తత్వం పట్ల మనకు ఒక అవగాహనతో ఉండాలి.
పని వత్తిడి ఎన్నో వ్యాధుల నిలయం. ఇటీవల కాలంలో చాలామంది పని ఒత్తిడితో సతమతమవుతూ ఉన్నారు. కొందరు ఒత్తిడి సమయంలో అధికంగా ఫుడ్ తీసుకుంటారు. ఈ పద్ధతిని ఎమోషనల్ ఈటింగ్ అని అంటారు. ఎమోషనల్ ఈటింగ్ అనేది తమ భావోద్వేగాలకు అనుగుణంగా తినే ప్రక్రియ. ప్రతీ జీవి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. కానీ కొన్నిసార్లు కొన్ని ఆహారపు అలవాట్లు భావోద్వేగాలచే ప్రభావితమవుతాయి.
ఎమోషనల్ ఈటింగ్ అకస్మాత్తుగా జరిగే ప్రక్రియ. ఆ సమయంలో వ్యక్తి ఆలోచన విధానాన్ని కోల్పోతాడు. మానసికంగా తినడం, ఒత్తిడితో తినడం, భావోద్వేగంతో అతిగా తినడం అని కూడా పిలుస్తారు ప్రతికూల భావావేశాలను ఎదుర్కోవడానికి ఒక సాధనంగా తినడం అని సూచిస్తున్నప్పటికీ, ఇది అలవాటుగా మారితే ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లే.
అయితే ఈ ఎమోషనల్ ఈటింగ్ నుండి బయటపడేందుకు మానసిక నిపుణుల కొన్ని సలహాలు సూచిస్తున్నారు అవేంటో తెలుసుకుందాం.
వ్యాయామం…
ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల స్ట్రెస్ అనేది క్రమంగా తగ్గిపోతుంది. ఎమోషనల్ ఈటింగ్ నుంచి బయటపడేందుకు వ్యాయామం తప్పనిసరి అంటున్నారు మానసిక వైద్యులు. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల శరీరం అలసటను దరిచేరనీయదు. దీని ద్వారా మైండ్ సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తుంది. దీంతో ఎమోషనల్ ఈటింగ్ సమస్య దూరం అవుతుందని అంటున్నారు.
డైరీ మెయింటైన్ చేయాలి…
ఎమోషనల్ ఈటింగ్ సమస్య నుండి తప్పించుకోవాలంటే డైరీ మెయింటైన్ చేయడం ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు ఏ సమయంలో ఏ ఆహారం తీసుకుంటున్నామో డైరీలో రాయడం అలవాటు చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు రాయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందొచ్చు. తినే ఆహారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి పోషకాలు కేలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎమోషనల్ ఈటింగ్ దరిచేరదంటున్నారు నిపుణులు.
స్ట్రెస్ ఉన్నప్పుడు బయటకు వెళ్లక పోవడమే మంచిది…
అధికమైన ఒత్తిడి సమయంలో చాలామంది బయటకు వెళ్తే ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటారు. ఆ విధంగా బయటకు వెళ్లిన సమయంలో ఏ ఫుడ్ కనిపించినా తినేస్తుంటారు. అయితే స్ట్రెస్ ఉన్నప్పుడు బయటికి వెళ్ళకుండా ఉండడమే మంచిదని నిపుణులు అంటున్నారు. ఒత్తిడిగా ఫీల్ అవుతున్నప్పుడు బయటకు వెళితే ఎమోషనల్ ఈటింగ్ సమస్య మరింత పెరుగుతుందట. బయట ఫుడ్ నాణ్యత లోపంతో ఉంటుందని అటువంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి హెల్దీ ఫుడ్, ఫ్రూట్స్, కూరగాయలు తినాలని.. ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ తినే ఆహారం పైన శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు దీని ద్వారా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
స్నేహితులతో సంభాషణ…
ఒత్తిడిగా ఉన్న సమయంలో మీ మనసుకు దగ్గరగా ఉన్న స్నేహితులతో మాట్లాడితే ఒత్తిడిని తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రతి వ్యక్తికి ఒకరు లేదా ఇద్దరు ప్రాణమిత్రులుగా ఉండే వారు ఉంటారు. ఆ సమయంలో వారితో గడపడం వల్ల వారి మాటల ద్వారా ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.
ఆధ్యాత్మిక భావన…
నెగిటివ్ ఆలోచనలు.. ఒత్తిడి మనిషిని ఎమోషనల్ గా క్రుంగదీస్తాయి. ఇటువంటి సమయంలో ఆధ్యాత్మిక చింతన అనేది మనసుకు ప్రశాంతతను కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. మనసు గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో దైవ నామ స్మరణ అనుకోకుండానే పాజిటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతుందట. ఈ సమయంలో ఆలయాలను దర్శించడం ద్వారా ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండడం మానసిక సంఘర్షణకు గురైనప్పుడు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.