FOODHISTORY CULTURE AND LITERATURE

సంక్రాంతి వంటల్లో ఆరోగ్య లాభాలు

భారతదేశంలో ఎన్నో పండుగలు ఉన్నాయి. ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే, సంక్రాంతిని తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగగా భావిస్తారు. ఈ రోజు ఎన్నో పిండి వంటకాలు చేసుకుంటారు. అయితే, ఆ వంటలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఏ వంటకాల్లో ఏ ఏ లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం..?

అరిసెలు: పండుగలంటేనే అందరికీ గుర్తొచ్చేది స్వీట్స్‌. పైగా సంక్రాంతి స్పెషల్‌ స్వీట్ అయిన అరిసె అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. వీటిని బెల్లం, బియ్యపుపిండి, నువ్వులతో తయారు చేస్తారు. దీనిని తినడం వల్ల శరీరంలో రక్తం శుభ్రపడటంతో పాటు ఐరన్ సహా అనేక పోషకాలు లభిస్తాయి. 

జంతికలు: ఇవి పండుగల సమయంలోనే కాదు. మామూలు సమయాల్లో కూడా వండుకునే వంటకం. దీనిని కూడా బియ్యపు పిండితో తయారు చేసుకుంటారు. ఇందులో ఉప్పు, కారం, నువ్వులు, వాము వేస్తారు. చాలామంది దీన్ని ఉదయం టిఫిన్ లాగా కూడా భుజిస్తారు. అయితే వీటిని తినడం వల్ల జీర్ణం తేలికగా అవుతుంది. వాము వాడడం వల్ల జీర్ణ ప్రక్రియ వేగవంతం అవుతుందట.

నువ్వుల ఉండలు: సంక్రాంతి పండుగకు, నవ్వులకు విడదీయలేని బంధం ఉంటుంది. సంక్రాంతికి తప్పకుండా నువ్వుల లడ్డు చేసుకుంటారు. తెల్ల నువ్వులు, బెల్లం కలిపి చేయడం వల్ల ఎంతో రుచికరంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో ప్రోటీన్స్, విటమిన్స్ పెరుగుతాయి. అంతేకాదు, బలహీనత, రక్తహీనత దూరం చేస్తుంది.

సకినాలు:బియ్యాన్ని నానబెట్టి పిండిలా చేసి.. అందులో నువ్వులు, వాము వేసి వీటిని చేస్తారు. ఇవి దాదాపు ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. చలికాలంలో వచ్చే సంక్రాంతికి వీటిని తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. నువ్వులు, వాము ఉపయోగించడం వల్ల జలుబు, దగ్గు లాంటివి దూరం అవుతాయి. 

సున్నుండలు: ఇవి మినుములతో చేసే స్వీట్. ఇది తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడడంతో పాటు విటమిన్ సి, విటమిన్ బి- కాంప్లెక్స్‌లోని బి1, బి3, కాల్షియం, మెగ్నిషియం, ఐరన్ వంటివి కూడా పుష్కలంగా లభిస్తాయి.

Show More
Back to top button