CINEMATelugu Cinema

హాస్య ప్రధానంగా నిర్మించిన అద్భుత కళాఖండం… మిస్సమ్మ (1955)

మిస్సమ్మ సినిమా (12 జనవరి, 1955)

“పాతాలభైరవి”, “మాయాబజార్”, “జగదేకవీరుని కథ”, “గుండమ్మ కథ” లాంటి చిత్రాలు తెలుగు చిత్ర సీమ బ‌తికున్నంత కాలం గుర్తుంచుకోదగ్గ సినీ కళాఖండాలు. ఆ చిత్రాల కోవలోకి చేర్చదగిన చిత్రం “మిస్సమ్మ”. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై నాగి రెడ్డి మరియు చక్రపాణి లు ఈ ద్విభాషా చిత్రాన్ని నిర్మించారు. వినోదం కోసం సినిమాకు వచ్చిన ప్రేక్షకులకు దాన్ని టన్నుల కొద్దీ  వడ్డించిన చిత్రం విజయా వారి “మిస్సమ్మ”. ఈ సినిమా 1955లో విడుదలైంది. దీనికి ప్రముఖ దర్శకులు ఎల్‌.వి.ప్రసాద్‌ గారు దర్శకత్వం వహించారు. రవీంద్రనాథ్ మైత్రా రచించిన “మన్మోయీ గర్ల్స్ స్కూల్” అనే బెంగాలీ నాటకం ఆధారంగా మిస్సమ్మ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రానికి తెలుగులో “మిస్సమ్మ” అని, తమిళంలో “మిస్సియమ్మ” అనే పేర్లు పెట్టారు.

ఈ సినిమాలో అప్పటికే దేశంలో తిష్ట వేసుకు కూర్చున్న నిరుద్యోగ సమస్య ఉంది. అయితే దానికి పరిష్కారం మాత్రం లేదు. ఈ సమస్య చుట్టూతా అల్లుకుంటూ కథను నడుస్తుంది. అంతే కథలోని సన్నివేశాలకు, హాస్యానికి కూడా కీలకమైనది స్థానభ్రష్ఠత్వం. తప్పిపోయిన జమీందారుకు కూతురు కోసం సాగే వేట ప్రధాన పాయింటుగా కథ నడుస్తుంది. ఎక్కడ ఏ సన్నివేషము అసహజంగా అనిపించదు. ఆ సందర్భంలో ఆ పాత్ర అలాగే ప్రవర్తిస్తుంది అన్నట్టుగా ఉంటాయి పాత్రధారుల చర్యలు. అలా తప్ప ఇంకోలా ప్రవర్తించడానికి వీలు లేదన్నట్టు ఉంటుంది స్క్రీన్ ప్లే చాతుర్యం. చక్రపాణి భావనలకు చక్కటి తెర రూపం ఇచ్చారు దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారు.

అందుకే మొదటి నుంచి చివరిదాకా ప్రేక్షకుడు తన్మయుడై ఈ సినిమాను చూస్తాడు.

మిస్సమ్మ సినిమాలో మనం ప్రధానంగా చూసేవి నాలుగు జంటలు, నాలుగు ఇతర పాత్రలు. ఆ నాలుగు జంటలు “జమీందారు మరియు అతని భార్య”, “పాల్ మరియు అతని భార్య” “ఎమ్.టి.రావు మరియు మేరీ”, ఏ.కే.రాజు మరియు సీత. ఇక వీళ్ళని అల్లుకుంటూ వచ్చే ఇతర పాత్రలు విలన్ ఐ.పి.డేవిడ్, బ్రోకరాసురుడు, దేవయ్య, టీచరు కం వైద్యుడు పంతులు, ఒక్క మాట కూడా మాట్లాడకుండా పాకెట్ డైరీలో విన్నది విన్నట్టు వ్రాసుకునే గోవిందు. ఇందులో జమీందారు పెద్ద కూతురు మహాలక్ష్మి చిన్నప్పుడే తప్పిపోయి క్రిస్టియన్ దంపతులకు దొరికి మేరీగా పెరుగుతుంది. ఆమె కోసం సాగే అన్వేషణనే సినిమా అంతా. ఆ పిల్ల ఆచూకీ ప్రధాన ఆధారం పాదం మీద కంది బద్ధంత పుట్టుమచ్చ.

మేరీనే మహాలక్ష్మి అని సినిమాలో ముందే చెప్పేస్తారు. ఆ పాత్ర కనిపించిన తొలి సన్నివేశంలో ఆ పుట్టుమచ్చ చూపించేస్తారు. చూసే జనానికి అంతా తెలుసు, కానీ సినిమాలో పాత్రలకు మాత్రం తెలియదు. అలా సస్పెన్స్ అన్నది ఆ పాత్ర వరకే ఉంటుంది చూసే జనానికి కాదు. తప్పిపోయిన కూతురు పేరుతో ఎలిమెంటరీ స్కూల్ నడిపిస్తుంటారు. జమీందారు. ఆ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు జమీందారు మేనల్లుడు రాజు. మందులు నూరే మరో ఆచారి గారు ఎకోపాధ్యాయుడు. రాజుకు తాను డిటెక్టివ్ నని కొండంత నమ్మకం. ఆచారికేమో పిల్లల చేత మందులు నూరించడమే కార్యక్రమం. పాఠశాల పద్ధతి మరీ అద్వానంగా తయారవ్వడంతో భార్యాభర్తల టీచర్లు కావాలంటూ జమీందారు పత్రికలో ప్రకటన వేయించడంతో సందడి మొదలవుతుంది. వినోదం ప్రధానంగా తయారైన ఈ చిత్రం 12 జనవరి 1955 నాడు విడుదలయ్యి అఖండ విజయం సాధించింది.

@ చిత్ర విశేషాలు….

 • దర్శకత్వం   :   ఎల్వీ ప్రసాద్
 • నిర్మాణం   :     నాగిరెడ్డి, చక్రపాణి
 • రచన     :    చక్రపాణి
 • చిత్రానువాదం   :     చక్రపాణి

తారాగణం  :   నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఎస్వీ రంగారావు, జమున, రేలంగి వెంకటరామయ్య, ఋష్యేంద్రమణి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు

 • సంగీతం    :    సాలూరి రాజేశ్వరరావు
 • గీతరచన   :    పింగళి నాగేంద్రరావు
 • నిడివి      :     181 నిమిషాలు
 • విడుదల తేదీ   :     12 జనవరి 1955
 • భాష     :     తెలుగు

@ చిత్ర కథ సంక్షిప్తంగా…

యాభైయేళ్ళ కిందట ఒక పెళ్ళి కాని అమ్మాయి సరిగ్గా పరిచయం కూడా కాని ఒక పరాయి మగవాడికి భార్యగా నెలల తరబడి నటించడానికి సిద్ధపడడం జరిగి ఉండునా? కానీ వాళ్ళిద్దరికీ (ఎమ్టీరావు, మిస్ మేరీ లకు) అలా వ్యవహరించక తప్పని పరిస్థితులు ఎదురవుతాయి. వాళ్ళిద్దరూ ఎంత గడుసు వాళ్ళో ప్రేక్షకులకు అంతకు ముందే తెలిసి పోతుంది. కూటికోసం కోటి విద్యలు ప్రదర్శించగలిగే దేవయ్యను ‘ప్రభుత్వం భిక్షాటనను నిషేధించిందని’ భయపెట్టి ఎమ్టీరావు తమ వెంట తీసుకెళతాడు.

అక్కడ నాయుడు తప్పిపోయిన తమ పెద్ద కూతురు మహాలక్ష్మి పేరుతో నడుపుతున్న బడికి సెక్రటరీ గానే గాక అందులోనే మాస్టారుగిరీ వెలగబెడుతున్న నాయుడి మేనల్లుడు రాజు ఊళ్ళో ఎవరిదో బర్రె తప్పిపోయిందని విని తానో డిటెక్టివుననే భ్రమతో బళ్ళో పిల్లల్ని గాలికొదిలేసి, బర్రెను వెదుకుతూ తనూ గాలికి తిరుగుతూ ఉంటాడు. అదే బళ్ళోని ఇంకో ఉపాధ్యాయుడు పిల్లల్ని శిక్షించడమూ, వాళ్ళచేత ఆయుర్వేద మందులు నూరించడమూ మాత్రమే తెలిసిన వాడు. వాళ్ళిద్దరూ కలిసి స్కూలును ముంచేస్తారని కంగారు పడి నాయుడు భార్యా భర్తలైన ఇద్దరు గ్రాడ్యుయేట్లు కావాలని పేపర్లో ప్రకటించి, మారు పేర్లతో వచ్చిన వీళ్ళిద్దరినీ వాళ్ళిద్దరి స్థానాల్లో చేర్చుకుంటాడు.

తప్పిపోయిన మహాలక్ష్మే మేరీ యేమోననే అనుమానం ఆ ‘డిటెక్టివ్’ రాజుది. ఇంకోవైపు వీళ్ళిద్దరూ ఊళ్ళో దిగ్గానే నాయుడు “కూతురూ-అల్లుడూ” అని వరసలు కలిపేస్తాడు. ఈ వరసలు మేరీకి నచ్చక చిరచిరలాడుతూ, తన కోపాన్నంతా ఎమ్టీరావు మీద చూపిస్తూంటుంది. గట్టిగా దెబ్బలాడడానికి ఆమెకు కూడా భయమే. ఇంటి దగ్గర ఆమె చదువు కోసం చేసిన అప్పు కొండలా పెరిగి పోయింది. అప్పిచ్చిన డేవిడ్ “బాకీ తీర్చొద్దు నన్ను పెళ్ళి చేసుకో” అని వేధిస్తున్నాడు. వాడి బాకీ వాడి మొహాన కొట్టి, అటు వాడితోనూ, ఇటు ఎమ్టీరావుతోనూ ఒకేసారి తెగతెంపులు చేసుకునే ఉద్దేశంతో ఉన్నట్టు కనబడుతుంది.

అయితే నాయుడి చిన్న కూతురు ఎమ్టీరావుతో చనువుగా ఉంటుంది. ఆ పిల్లను చేసుకోబోయే రాజుకు ఇది సహజంగానే నచ్చదు. ఒకసారి మేరీ తాము నిజంగా దంపతులం కామనే నిజాన్ని బయట పెట్టబోయే సరికి ఎమ్టీరావు కంగారు పడి ఆమెకు కిరస్తానీ దయ్యం పట్టిందని అంటాడు. అప్పుడు ఆ దయ్యాన్ని బెదిరించడానికి అన్నట్టుగా నాయుడు “నువ్వు కాకపోతే మా అల్లుడికి (ఎమ్టీరావుకి) పిల్లే దొరకదనుకున్నవా? మా పిల్లనే ఇచ్చి చేస్తాం.” అంటాడు. ఈ విషయం దేవయ్య ద్వారా విన్న రాజు కంగారు పడి తర్వాత మెల్లగా ధైర్యం చేసి, మేరీని కలిసి, ఎమ్టీరావుకు బదులుగా తనే తన మరదలికి సంగీత పాఠాలు నేర్పడానికి వీలుగా ఆమె సలహా మీదే ఆమె దగ్గర సంగీతం నేర్చుకోబోతాడు.ఈ సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది.

తప్పిపోయిన మహాలక్ష్మే మిస్ మేరీ యేమోననే అనుమానం తీర్చుకోవడానికి ఒక నాటి అర్ధరాత్రి తన అసిస్టెంటుతో సహా మేరీ వాళ్ళుంటున్న ఇంటికెళ్ళి, ఆమె పడక మీదికి టార్చ్ లైటు వేసి చూస్తాడు రాజు. ఆ వెలుతురుకు మేరీకి మెళకువ రావడం, డిటెక్టివులు పారిపోవడంతో అంతా గందరగోళమవుతుంది. అనుకోని ఈ సంఘటనతో కలవరపడిన మేరీకి కలత నిద్ర పడుతుంది. ఆ కలతనిద్రలో ఒక పీడకల.. ఆ పీడకలలో తనను బలవంతంగా పెళ్ళి చేసుకోబోయిన దుర్మార్గుడిగా డేవిడ్, అతడి బారి నుంచి తనను కాపాడిన వీరుడిగా ఎమ్టీరావు కనిపిస్తారు. దాంతో ఆమెకు ఎమ్టీరావు మీద అనురాగం అంకురిస్తుంది. కథ తిరగవలసిన మలుపులన్నీ తిరిగి సుఖాంతమవుతుంది.

@ తారాగణం…

 • ఎం. టి. రావు గా…  ఎన్. టి. రామారావు
 • మేరీ/ మహాలక్ష్మి గా…   సావిత్రి
 • ఎ. కె. రాజు గా…  అక్కినేని నాగేశ్వర రావు
 • సీత గా…   జమున
 • గోపాలం గా…  ఎస్. వి. రంగారావు
 • ఋష్యేంద్రమణి
 • దేవయ్య గా…   రేలంగి
 • డేవిడ్ గా…   రమణారెడ్డి
 • వల్లూరి బాలకృష్ణ

@ కథకు బీజం…

విజయా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ద్విభాషా చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఎల్‌.వి.ప్రసాద్‌ గారితో నాగిరెడ్డి మరియు చక్రపాణి గార్లు సంతకం చేశారు. మిస్సమ్మ సినిమాకు రచన బాధ్యత అంతా చక్రపాణి గారే తీసుకున్నారు. తాను అనువాదం చేసిన రెండు బెంగాలీ ప్రహసనాలను గుదిగుచ్చి ఈ సినిమాను తయారు చేశారు. మొదటిది “రాసమణి గర్ల్స్ హై స్కూల్”. రవీంద్రనాథ్ మైత్రా అనే అయన దీన్ని వ్రాశారు. దానిని చక్రపాణి గారు తెలుగులోకి “ఉదరనిమిత్తం” పేరుతో అనువాదం చేశారు. ఉద్యోగం కోసం ఇద్దరు యువతీ యువకులు భార్యాభర్తలుగా నటించి, ఆ క్రమంలో మనసులు కలిసి దంపతులవ్వడం ఇందులో ప్రదానాంశం. కానీ ఇది చాలా చిన్న ఎపిసోడ్. రెండున్నర గంటల సినిమాకు ఈ కథ సరిపోదు.

అందువలన చక్రపాణి గారు తాను అనువాదం చేసిన “డిటెక్టివ్” అనే మరో ప్రహసనాన్ని దీనికి జోడించారు. తప్పిపోయిన ఒక యువతి ఒకానొక ఔత్సాహిక అపరాధ పరిశోధకుడు వెతికి పట్టుకొని వివాహమాడడం అందులోని ప్రధానాంశం. దీనికి మూల రచయిత శరదిందు బెనర్జీ. ఇక రచయితగా చక్రపాణి విషయానికి వస్తే తన పాత్రలకు ఎలాంటి ముద్రలు ఉండవు. అతి మంచివాడు, అత్యంత దుర్మార్గుడు, సకల సద్గుణ సంపన్నుడు ఇలా ప్రత్యేకించి ఎవ్వరూ ఉండరు. సాధారణ జీవితంలో అత్యంత సగటు మనుషులు ఆయన పాత్రలన్నీ. అలాగే హాస్యం అనేది సన్నివేశపరంగా కనిపిస్తుందే తప్ప సంభాషణ రూపంలో వినిపించదు. 1954వ సంవత్సరంలో తెలుగులో “మిస్సమ్మ” పేరుతోనూ, తమిళంలో “మిస్సియమ్మ” పేరుతోనూ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యింది.

@ తారాగణం…

మిస్సమ్మ సినిమాకు మొదటగా నందమూరి తారకరామారావు మరియు భానుమతి లను మొదటిసారిగా నాయక, నాయికలుగా తీసుకున్నారు. నందమూరి ధరించిన పాత్రను తమిళంలో జెమినీ గణేశన్ వేశాడు.  అయితే చక్రపాని గారికి, భానుమతి గారికి మధ్య వచ్చిన ఒక చిన్న మాట పట్టింపు కారణంగా భానుమతి గారు ఆ సినిమా అవకాశం పోగొట్టుకున్నారు. అందువలన ముందు అనుకున్నట్లుగా సీత వేషానికి ఖరారు అయిన సావిత్రి గారు “మేరీ” పాత్రధారి అయ్యారు. జమున గారు సీత పాత్రధారి అయ్యారు. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా భానుమతి గారి స్థానంలో “సావిత్రి” రావడం తమిళ వర్షన్ కి సానుకూలంగా మారింది.

అప్పటికే సావిత్రి, జెమిని గార్లు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కానీ ఇంకా వారు కాపురం ఆరంభించలేదు. అందువలన వాళ్ళిద్దరి సాన్నిహిత్యం అప్పటికే జనంలో మంచి చర్చనీయాంశంగా ఉంది. అప్పటికి మిస్సియమ్మ విడుదలైన మరుసటి ఏడాదికి వారిరువురూ కాపురం పెట్టారు. ఇక రెండో కథనాయకుడు రాజు వేషానికి వస్తే ఇది పూర్తి హాస్యప్రధానమైన వేషం. తమిళంలో ఈ పాత్రను తంగవేలు చేశారు. కాకపోతే ఈ పాత్ర చాలా అతిగా ప్రవర్తిస్తుంటుంది. తెలుగులో ఈ పాత్ర అక్కినేని గారు వేశారు. ఆ రోజులలో తనకున్న స్టార్ స్టేటస్ కి అక్కినేని గారు ఆ వేషం వేయడం చాలా వింత. కానీ విజయా వారి సినిమా అని తనకి ఆ వేషం వైవిధ్యం అవుతుందని అక్కినేని గారు ఎలాంటి శషబిషలు లేకుండా దర్శకులు చెప్పింది చెప్పినట్టు చేశారు.

ఈ సినిమాలో బాలకృష్ణ వేషాన్ని తమిళంలో కరుణానిధి వేశారు. బెంగాలీ మూలంలోని “డిటెక్టివ్”లోని  పాత్రను యథాతథంగా సినిమాలో దించేశారు. అయితే తెలుగులో ఈ పాత్ర చాలా నిలకడగా ఉంటుంది. కానీ ఇదే పాత్ర తమిళంలో మాత్రం చాలా అతిగా హావాభావాలను ప్రదర్శిస్తుంది. దేవయ్యగా రేలంగి గారు వేశారు. అతని పూత పదం “తైలం” ఆ రోజులలో చాలా పెద్ద హిట్. తమిళంలో ఈ వేషం “సారంగపాణి” గారు వేశారు. జమీందారుగా ఎస్వీ రంగారావు గారు, ఆయన భార్యగా ఋష్యేంద్రమణి గారు నటించారు. తమిళంలో కూడా వాళ్ళిద్దరే  కనిపిస్తారు. అలాగే పాల్ దంపతులుగా చేసిన దొరస్వామి, మీనాక్షి కూడా బాగా నటించారు. ఐ.పి డేవిడ్ గా రమణారెడ్డి చక్కటి విల్లనీని వడ్డించారు. పంతులుగా కాసేపు కనిపించిన అల్లురామలింగయ్య గారు ఛెళపెళలాడించేశారు.

@ కదం తొక్కిన చక్రపాణి కలం…

ఈ సినిమాలో సన్నివేశాలు కల్పించడంలో, పాత్రలను కలుపుకురావడంలో, సంభాషణలు వడ్డించడంలో చక్రపాణి కలం చిందులు తొక్కింది. ఉద్యోగులుగా వచ్చిన వాళ్లు బంధువుల్లా చూడబడతారు. కన్యకు శ్రీమంతం జరుగుతుంది. ప్రేమించుకుంటున్న వాళ్ళు కీచులాడుకుంటారు. జమీందారు చేత మేరీని వెళ్ళగొట్టించాలని వచ్చిన డేవిడ్ చివరికి ఆమె ఆయన కూతురేనని ఋజువుచేయడానికి సాయపడినవాడు అవుతాడు. సినిమా అంతా ఈ తారుమారు తకరారు బంతిలా చెంగుచెంగున ఎగురుతూనే ఉంటుంది. నవ్వుల జడివానలో ముంచెత్తుతుంది. అలా అని సినిమాలో లోపాలు లేనివని కాదు, ఉన్నాయి కూడానూ.

ఉదాహరణకు ఎలిమెంటరీ పాఠశాల ఉపాధ్యాయులకు రెండువందలు, రెండువందల యాభై చొప్పున జీతాలు ఇస్తామని జమీందారు గారు ప్రకటిస్తారు. ఆ రోజుల్లో వాల్తేరు ఆంధ్రవిశ్వవిద్యాలయం లెక్చరరు జీతమే 250 రూపాయలు ఉండేది. అంటే వీళ్ళిద్దరికీ యూ.జీ.సీ స్కేలు అన్న మాట. ఇది చాలా అతి. అయినా కూడా ప్రేక్షకులు తామున్న వినోద లోకంలో ఈ ఐహిక విషయాలను పట్టించుకోలేదు. హాయిగా ఆనందించారు, ఆనందించారు ప్రతీ మాట ఆస్వాదించారు. ఈ సినిమాలో మేరీకి ఒక కల వస్తుంది. ఆ కల ఆమె మనస్తత్వానికి అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఇక్కడ యల్.వి. ప్రసాద్ గారు తన చమత్కారం గుప్పించేశారు. అది రచయిత సన్నివేశం కాదు, దర్శకుడి సన్నివేశం.

@ ఆహార్యం…

ఎస్వి రంగారావు గారు మిస్సమ్మ సినిమా తెలుగు, తమిళం రెండిట్లోనూ నటించారు. తమిళ సినిమాలో ఎంత జమీందారులైనా గోచీ పోసి పంచె కట్టరు. అడ్డ లుంగీనే కడతారు. కానీ “మిస్సియమ్మ” సినిమాలో మాత్రం రంగారావు గారు పంచె తోనే కనిపిస్తారు. తెలుగు, తమిళం ఒకేసారి తీసినందున తెలుగు సన్నివేశం కాగానే, రంగారావు గారు తమిళం కోసం వెంటనే గెటప్ మార్చి అడ్డలుంగీ కట్టుకుని రావాలి. కాంబినేషన్ షాట్లు ఉన్న సన్నివేశాలకు ఇదంతా చాలా సమయాన్ని మింగేస్తుంది. అందుకే ఆయన ఈ గొడవేమీ లేకుండా తెలుగు గెటప్ తోనే తమిళంలోనూ కనిపిస్తారు. సినిమా బాగుంటే ఇలాంటివేవీ జనానికి గుర్తుకురావు. ఇది కూడా అంతే అయ్యింది.

మిస్సమ్మ సినిమాకు “పసుమర్తి కృష్ణమూర్తి” నృత్య దర్శకుడు. ఆ రోజుల్లో వెంపటి సోదరుల తరువాత ఆయనే పేరున్న నాట్యాచార్యులు. “బాలనురా మదనా” పాట జావళి. చక్కగా కూచిపూడి నృత్యం ఉండాలి. అక్కడ అలాగే “బృందావనమది అందరిదీ” పాటప్పుడు కూడా చక్కటి సంప్రదాయం నృత్యం కావాలి. జమునకు ఏమో సంప్రదాయ నాట్యం రాదు. అందుచేత లేడీ విక్రమార్కుని మాదిరి ఆవిడ నెలరోజులు క్రమం తప్పకుండా ఆ పాటలకు రిహార్సర్లు చేసిన జమున గారు ఈ సినిమాలో అద్భుతంగా నర్తించారు. చిన్న చిన్న ముద్రల దగ్గర్నుంచి జమున గారు తీసుకున్న జాగ్రత్తలు ఆ పాటల్లో విస్పష్టంగా కనిపిస్తాయి.

@ పాటలు…

ఈ సినిమాలో పాటలన్నీ పింగళి గారు వ్రాశారు. తెలుగు, తమిళానికి కూడా సాలూరు వారే సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలోని పాటలు కూడా మనకు కథలు చెబుతాయి, పాత్రధారుల మనోభావాలను తేటతెల్లం చేస్తాయి. బ్రహ్మచారి ఎమ్టీ రావు అనాటి ఆడపిల్లల మనస్తత్వాలను కాచి వడపోసినట్టు “ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే” అంటూ మనకు భాష్యాలు చెబుతాడు. ఈ పాట ఆ తరువాత ఓ మాటయ్యి సామెతలుగా, సూక్తి లాగా వాడుకైపోయింది. 45 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ తెలుగు సినిమాలో వినిపించింది. సీతారాం సీతారాం పాట రాజకీయాల మీద మంచి వ్యంగ్యాస్త్రం. దేశానికి స్వాతంత్రం వచ్చి పట్టుమని పదేళ్లయినా కాకుండానే నాయకుల్లో ఎంత స్వార్థం ప్రబలిందీ ఈ పాటే చెబుతుంది.

చందాలంటూ భలే ప్రచారం, వందలు వేలు తమ ఫలహారం అన్న లైన్ చాలు అప్పటికే దేశం నైతికంగా తిరోగమనం ప్రారంభించిందని చెప్పడానికి. “తెలుసుకొనవే చెల్లీ” పాట ఈడొచ్చిన ఆడపిల్లలకు ఇద్దరు పెద్దలు చెప్పే సుద్దుల పాట. ఎన్నేళ్లయినా అన్వయించుకోదగిన పాట. సన్నివేశ ప్రాధాన్యంగా కనిపించే “బృందావనమది అందరిదీ”, “రావోయి చందమామ” పాటలకు కాల పరిమితి అంటూ లేదు తెలుగు సినిమా పాట ఉన్నంతకాలం అవి చిరంజీవిలు. “ఏమిటో ఈ మాయ” పాట విజయావారి బ్రాండైన చందమామ పాట. మార్కేస్ బార్ట్లే మామూలుగానే ఈ పాటలో కూడా వెన్నెల చల్లదనంతో హాల్లోనే జనాన్ని మత్తెక్కించాడు. ఈ సినిమాలో పైన ఉదాహరించిన పాటలతో కలుపుకొని మొత్తం 14 పాటలు ఉన్నాయి.

@ మిస్సయిన భానుమతి…

మిస్సమ్మ సినిమాకు తెలుగు, తమిళ భాషలలో కూడా ముందు ఎంపికచేసింది భానుమతి గారినే. పెంకి పిల్ల వేషంలో తాను బాగా నప్పుతారని యూనిట్ అంతా అభిప్రాయపడ్డారు. ఆవిడతో నాలుగు రీళ్ళ సినిమా కూడా తయారైంది. ఆరంభంలో వచ్చే సన్నివేశాలు అన్నీ తీశారు. అయితే ఒక చిన్న సంఘటన కారణంగా ఆ వేషం కోల్పోయారు. అదేమిటంటే ఏటా ఆవిడకు వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం అలవాటు. ముందు రోజు ఆ విషయం ప్రొడక్షన్ మేనేజర్ కి చెప్పి, తాను చిత్రీకరణకు మధ్యాహ్నం నుంచి వస్తానని తెలియజేశారు కూడా. కానీ ఎక్కడో ఏదో లోపం జరిగి ఆ సంగతి చక్రపాణి గారి చెవుల దాకా వెళ్ళలేదు. చక్రపాణి గారు క్రమశిక్షణ విషయంలో హిట్లర్.

భానుమతి గారు ఉదయాన్నే రాకపోవడంతో అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. వ్రతం పూర్తి చేసుకుని మధ్యాహ్నం కారు దిగిన భానుమతిని చూడగానే చక్రపాణి గారు పరుశురాముడు అయిపోయారు, అరిచేశారు. భానుమతి గారి అభిమానం సంగతి మనకు తెలిసిందే. తాను కూడా ధీటుగా జవాబు ఇచ్చారు. పట్టరాని కోపంతో చక్రపాణి గారు అప్పటిదాకా తీసిన సినిమా నాలుగు రీళ్ళ నెగిటివ్ ని ఆవిడ ముందే చుట్టగా పోసి అగ్గిపుల్ల పడేశారు. భానుమతి గారికి ఇది ఊహించని అవమానం. ఆవిడ ఇంటికి వెళ్లిపోయారు. ఆ తరువాత నాగిరెడ్డి అన్ని విషయాలు వాకబు చేసి జరిగిన పొరపాటున తెలుసుకున్నారు.

కేవలం సమాచారం మార్పిడి లోపం వల్ల ఈ అనర్ధం జరిగిందని ఇద్దరు అలా ప్రవర్తించడంలో ఎంత మాత్రం తప్పు లేదని గ్రహించారు. తాను  సయోధ్య చేయాలని చాలా ప్రయత్నించారు. కానీ భానుమతి గారు మళ్ళీ చిత్రీకరణకు రాలేకపోయారు. అలా ఆవిడ మిస్ మేరీ అయ్యారు. మొదట తీసిన సినిమాలో తన నడక, ఠీవి, మాట చాతుర్యం గురించి స్టూడియో వర్కర్లు, సహ నటీ నటులు చెప్పుకుంటూ ఉంటే ఆవిడకు చాలా బాధగా అనిపించేది. కానీ గ్రహబలాన్ని బాగా నమ్మే భానుమతి గారు ఇంతే ప్రాప్తం అనుకుని సరిపెట్టుకున్నారు. సావిత్రి అనే మహానటిని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేందుకు దేవుడు ఇలా చేసి ఉంటాడని కూడా భానుమతి గారు భావించేవారు.

@ విడుదల…

1954 సంవత్సరం అంతా చిత్రీకరణ జరుపుకున్న మిస్సమ్మ సినిమా ఆ ఏడాది చివరికల్లా పూర్తయింది. చిత్రీకరణ సమయంలోనే సినిమా సత్తా ఏమిటో విజయాధినేతలకు అర్థమయిపోయింది. రషెస్ చూసినప్పుడు అది ధృవపడింది. మిస్సమ్మ 1955 సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదలైంది. విడుదల కాగానే పెద్ద ఎత్తున పేరు సంపాదించుకుంది. ఏ క్లాస్ సెంటర్లు పట్టుమని పాతిక కూడా లేని ఆ రోజుల్లో 13 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది మిస్సమ్మ సినిమా. దాంతో తమ సినిమాలో ప్రధాన పాత్రలు వేసిన వారందరికీ డాడ్జ్ కార్లు కొని బహుకరించారు. తమిళంలోనూ మిస్సియమ్మ పేరుతో విడుదలై అక్కడ కూడా సినిమా ఘన విజయం సాధించింది. గోరాశాస్త్రి గారు తన స్వతంత్ర పత్రికలో ఈ సినిమాను సమీక్షిస్తూ, పెద్ద వాళ్ళు కూడా చూసి ఆనందించదగ్గ పిల్లల సినిమా అని వ్రాశారు. ఆ సినిమా తర్వాత రెండేళ్లకే ఆ సినిమాను ఏ.వి.మెయ్యప్పన్ హిందీలో మిస్ మేరీ పేరిట తీశారు. అక్కడ కూడా ఆ సినిమా విజయవంతం అయ్యింది. నవ్వుల సినిమాలు తెలుగులో చాలానే వచ్చినా మిస్సమ్మ సినిమా స్థానం మాత్రం ఈనాటికి ప్రత్యేకమే.

@ విశేషాలు…

★ “ఆడవారి మాటలకు అర్థాలే వేరులే” అనే పదబంధం తెలుగు యాసగా మారింది. మిస్సమ్మ సినిమాలో దేవయ్య ఉపయోగించిన “తైలం” అనే పదం “నగదు”కి పర్యాయపదంగా మారింది.

★ సావిత్రి, జమునలకు ఈ సినిమాతో చక్కని అభినేత్రిగా మంచి పేరు వచ్చింది. వారు ఇక చిత్ర పరిశ్రమలో తిరిగి చూడ లేదు.

★ మిస్సమ్మ చిత్రము యొతిష్ బెనర్జీ అనే బెంగాలి రచయిత యొక్క “మన్మొయీ గర్ల్స్ స్కూల్” అనే హాస్య రచన ఆధారంగా చక్రపాణి గారు రచించగా, ఎల్వీ ప్రసాదు గారి దర్శకత్వంలో రూపొందిచబడింది.

★ సావిత్రి, ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, రేలంగి, అల్లు రామలింగయ్య మొదలైన వారి నటనతో సినిమా పూర్తి వినోదాత్మకంగా రూపొందింది.

★ ఈ సినిమాకు పింగళి నాగేంద్రరావు గారు రచించిన మాటలు, పాటలు తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నదగ్గ వాటిలో కొన్ని. పింగళి నాగేంద్రరావు గారి సాహిత్యమూ, ఎ.ఎం.రాజా, పి.లీల, పి.సుశీల గార్ల గాత్రమాధుర్యమూ కలిసి “మిస్సమ్మ” సినిమా పాటలను అజరామరం చేసాయి. ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పాటలు ఈనాటికీ తెలుగు వారిని అలరిస్తూ ఉన్నాయి.

★ పి.లీల పాడిన కరుణించు మేరిమాత అనేపాట ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది.

★ మిస్సమ్మ సినిమా చిత్రీకరణ మద్రాసు (ప్రస్తుతం చెన్నై) చుట్టుపక్కల జరిగింది, 1954 డిసెంబరు నాటికల్లా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.

★ మిస్సమ్మ సినిమా 12 జనవరి 1955 నాడు తొలిసారి ప్రదర్శించారు, ఆపైన మరో రెండు రోజులకు థియేటర్ల వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్లు రెండూ వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి, వందరోజులు పూర్తిచేసుకున్నాయి.

★ ఈ ద్విభాషా చిత్రం నటీనటులకు, స్టూడియోకి తెలుగు, తమిళ సినీ రంగాల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది.

★ తెలుగు వారి జన జీవితంలో మిస్సమ్మ సినిమాలోని మాటలు, పాటలు భాగమైపోయాయి.

★ 1957లో ఏ.వీ.ఎం ప్రొడక్షన్స్ ఈ సినిమాని హిందీలోకి మిస్ మేరీగా నిర్మించారు. మిస్ మేరీ ఎల్‌.వి.ప్రసాద్‌కి బాలీవుడ్‌లో దర్శకుడిగా మొట్టమొదటి సినిమాగా నిలిచింది.

★ 1991లో ముళ్ళపూడి వెంకటరమణ, రావికొండలరావు గార్లు “మిస్సమ్మ” సినిమా కాన్సెప్టుని తిరగేసి, అడాప్ట్ చేసుకుని పెళ్ళిపుస్తకం కథ వ్రాస్తే దాన్ని బాపు సినిమాగా తీశాడు, ఇది కూడా మంచి విజయం సాధించింది.

★ మరున్నత్తిల్ ఒరు మలయాళీ (1971) యొక్క కథాంశం మిస్సమ్మతో సారూప్యతతో ప్రసిద్ది చెందింది , ఎందుకంటే దాని మహిళా ప్రధాన పాత్ర (ఒక క్రిస్టియన్) బ్రాహ్మణ అమ్మాయిలా ఉంటుంది. చక్రపాణి గారు ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్‌గా 1976లో పునర్నిర్మించారు.

★ తెలుగు భాషా చిత్రం, ఖుషి (2001) సినిమా కోసం సంగీత దర్శకులు మణిశర్మ “ఆడవారి మాటలకు అర్థాలే వేరులే” మెలోడీ మరియు సాహిత్యాన్ని మార్చకుండా ఆ పాటను రీమిక్స్ చేసారు.

★ సినిమా దర్శకులు నీలకంఠ తన హాస్య చిత్రానికి మిస్సమ్మ (2003) అనే పేరు పెట్టినప్పటికీ , అసలు దానికి వేరే సారూప్యత లేదు.

★ భారతీయ సినిమా వందేళ్లను పురస్కరించుకుని, ది హిందూ పత్రిక “మిస్సమ్మ” , “పాతాళ భైరవి” , “మాయాబజార్” , “గుండమ్మ కథ” , “మదువే మది నోడు” (1965), “రామ్ ఔర్ శ్యామ్” (1967), “జూలీ” (1975) మరియు “శ్రీమాన్ శ్రీమతి” (1982)లను నాగిరెడ్డి గారు నిర్మించిన ఐకానిక్ సినిమాలుగా జాబితా చేసింది

Show More
Back to top button