Telugu Politics

రాష్ట్రాన్ని మరో ఐదేళ్లు కోలుకోలేనంతగా వైసీపీ చేసిందా..?

ప్రస్తుతం రాష్ట్రంలో చాలాకాలం నుంచే అమలు జరుగుతున్నది రాజారెడ్డి రాజ్యాంగమేగానీ అంబేద్కర్ రాజ్యాంగం కాదని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. నిజానికి, వారి వాఖ్య వాస్తవిక పరిస్థితుల్ని ఇంతకింత తగ్గించి చూపినట్లే. ఎందుకంటే, ఒకప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనే అమలయ్యేది. కానీ, నేడు ఘనతకెక్కిన జగన్ రెడ్డి పాలనలో రాజారెడ్డి రాజ్యాంగం రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతోందని టీడీపీ శ్రేణులు అంటున్నారు. ‘తండ్రిని మించిన కొడుకు’ అనేది పాత సామెత. తాతను మించిన మనుమడు అని నేడు జరుగుతున్న ఘోరాల్ని చూసినప్పుడు తెలుస్తోంది అంటున్నారు.

గత ఐదేళ్ల ఆంధ్రప్రదేశ్ అనుభవాలను చూస్తే ప్రతి ఒక్కరికీ వైసీపీ చేసిన దారుణాలే కనిపిస్తాయని తెలుగుదేశం అధినేతలు అంటున్నారు. దీనికి ఉదాహరణగా.. మొదటిది రాష్ట్రం నుంచి పరిశ్రమల్ని తరిమేయడమే! తమకు కోరిన ముడుపులు ఇవ్వడానికి నిరాకరించారన్న కక్షతో.. లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అమరరాజా లిథియం అయాన్ బ్యాటరీస్, లులూగ్రూప్, బీఆరెట్టి కంపెనీలు, రిలయెన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్, కియా అనుబంధ పరిశ్రమలు, ట్రైటాన్ బ్యాటరీస్, ఒంగోలు ఏపీపీ పేపర్, జాకీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మొదలైన వాటిని రాష్ట్రం నుంచి నిష్క్రమించేలా చేశారని వారు చెబుతున్నారు.

అంతేకాదు ఇవన్నీ రావడానికి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేయగా, ఆ కంపెనీలు మొదలైతే ఎక్కడ చంద్రబాబునాయుడికి పేరొస్తుందోననే దుగ్ధతోనే జగన్ రెడ్డి వాటిని పనిగట్టుకొని వెళ్లగొట్టించారని టీడీపీ ఆరోపిస్తోంది.  వీటితోపాటు పేదలు ఆకలితీర్చే ‘అన్న క్యాంటీన్’లను ఎత్తేశారు. పేదలకు పండుగ సమయాల్లో తెలుగుదేశ ప్రభుత్వం అందించిన సంక్రాంతి కానుకలు, రంజాన్ తోఫా వంటి వాటిని రద్దు చేశారని అంటున్నారు.

దేశంలో వివిధ రాష్ట్రాలు పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షణలో ప్రతియేటా పెట్టుబడి సదస్సులను ఘనంగా నిర్వహిస్తున్నాయి. చత్తీస్ఘడ్, ఒడిశా లాంటి వెనుకబడిన రాష్ట్రాలు సైతం ‘సమ్మిట్’లను నిర్వహిస్తూ తమ రాష్ట్రాలకు పెట్టుబడులు రప్పించేందుకు కృషి చేస్తుంటే, ఇక్కడ మన రాష్ట్రంలో నీరోచక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కాలక్షేపం చేసినట్లు ‘బటన్’ నొక్కడంలోనే కాలం గడిపేస్తున్నారని రాజకీయ వాదులు అంటున్నారు. ఆ బటన్ నొక్కడం ద్వారా లబ్దిదారులకు పూర్తి స్థాయిలో డబ్బు జమ అవుతున్నదో లేదో ఎవ్వరికీ తెలియదు. బటన్ నొక్కడం ద్వారా అందిస్తున్న డబ్బులో అధికశాతం అప్పుల ద్వారా సేకరించినదే తప్ప, సంపద సృష్టి ద్వారా సముపార్జించినది కాదన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం అని అంటున్నారు.

ఎన్నికలముందు కేంద్రం మెడలు వంచ్చేస్తాం అని బీరాలు పలికి కేంద్రానికి మోకరిల్లాల్సిన అవసరం, అనివార్యత ఈ ముఖ్యమంత్రికి ఎందుకు ఏర్పడిందో ప్రజలు అర్థం చేసుకోగలరని టీడీపీ శ్రేణులు అంటున్నారు. రాష్ట్రంలో రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో స్వయంగా అధికార పార్టీకి చెందిన నెంబర్ 2 విజయసాయిరెడ్డి ఒప్పుకున్నారని చెబుతున్నారు. ఒక్క రోడ్లే కాదు.. అన్నీ అధ్వాన్నమే! మౌలిక సదుపాయాల విస్తరణ లేదు. ఇళ్ల నిర్మాణం, ఉద్యోగాలు, ఉపాధి కల్పన లేదు. అమరావతిని శిధిలం చేయడం వల్ల 2 లక్షల కోట్ల సంపద వృధా అయిందని, దీనివల్ల ఐదేళ్లుగా రాష్ట్రం కోలుకోలేనంతగా శిధిలావస్థకు చేరుకుందని తెలుగుదేశం నాయకులు అంటున్నారు . అన్ని వ్యవస్థలకు పట్టిన చెదను వదిలించుకోవడానికి ప్రజలు తమ ఓటుతో ‘సిద్ధం’గా ఉండాలని టీడీపీ నాయకులు సూచిస్తున్నారు.

Show More
Back to top button