
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు పరిణామాలు మరింత ఉత్కంఠ పెంచుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సీఎం జగన్ ‘వై నాట్ 175’ నినాదంతో ముందుకు సాగుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి 151 అసెంబ్లీ స్థానాల్లో విజయకేతనం ఎగరవేశారు. అదే ఫార్ములా ఇప్పడూ ఉపయోగిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు.
ఓ పక్క టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును ప్రతిపక్షాలు ఖండిస్తూ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయి. అదే సమయంలో చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోవాలని అధికార పక్షం భావిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఎలాంటి రాజకీయాలు ప్రమేయం లేదని, ఆయన అవినీతి చేయటంతోనే అరెస్ట్ అయ్యారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు జైలులో ఉండటంతో నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు కూడా బ్రేక్ పడింది. ఈ సమయాన్ని వైసీపీ ఉపయోగించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. తమ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకు ముందుకు సాగుతోంది.
ముఖ్యమంత్రి జగన్ రాజకీయాలు ఎన్నికల వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ప్రజాశీర్వాద యాత్ర పేరుతో ప్రజల మద్దతు పెంచుకొనే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఇటీవల ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన హామీలను (నవరత్నాలు) 98 శాతానికి పైగా నెరవేర్చామని ప్రజలకు తెలియజేశారు. ప్రతి గ్రామంలో వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని, ప్రతి ఇంటిలో వారు పొందిన లబ్ధిని చెప్తూ ముందుకు సాగుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కొన్ని కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. వాటికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. జగనన్న సురక్ష కార్యక్రమంలో సుమారు 98 లక్షల సర్టిఫికెట్లను లబ్ధిదారులకు అందజేశారు. అర్హులకు అవసరమైన వివిధ రకాల సర్టిఫికెట్లను జారీ చేశారు. అలాగే ఇప్పుడు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఆరోగ్యపరంగా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి, ఉచితంగా మందులు, పరీక్షలు చేస్తామని సీఎం జగన్ తెలిపారు. గుర్తించిన వారికి మెరుగైన చికిత్సలు అందిస్తామని వెల్లడించారు. విలేజ్ క్లీనిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో చేయూతనిస్తామన్నారు.
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు పాల్గొన్నారు. సీఎం జగన్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు కొన్ని సూచనలు చేశారు. ఈ ఆరు నెలలు చాలా కీలకమని సూచించారు. వచ్చే రెండు నెలల్లో జగనన్న సురక్ష, ‘ఏపీ నీడ్ వైసీపీ’ అంటూ ప్రజల్లోకి వెళ్లాలని చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అవినీతి వ్యవహారాన్ని ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు తెలిపారు.
రానున్న సాధారణ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందడం అసాధ్యం ఏమీ కాదని, కచ్చితంగా 175 సీట్లు గెలుస్తామని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోపక్క టీడీపీ కూడా చంద్రబాబు అరెస్ట్ ద్వారా ప్రజల్లో సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తుంది.
ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉండటంతో తమకు ప్రజల నుంచి సానుభూతి తప్పక లభిస్తుందని టీడీపీ భావిస్తుంది.
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చేపట్టిన పోరును మరింత ఉధృతం చేయాలని టీడీపీ భావిస్తుంది.
ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేస్తున్నారని తెలిసింది.
చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా వివిధ కుల సంఘాల వారు, చర్చీలు, మసీదులు, ఆలయాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు.
ఈ నిరసనలు తమకు కలిసొచ్చేలా కనిపిస్తున్నట్లు ఆ పార్టీ పెద్దలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఓ పక్క ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఎప్పుడూ రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొని ప్రజలు కూడా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తమ గళం విప్పుతున్నారు.
మరి ముఖ్యంగా మహిళలు, యువత ఎక్కువగా నిరసనల్లో పాల్గొంటున్నారు.
నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు మంచి స్పందన లభించింది. ఎక్కడికి వెళ్లిన ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. పార్టీలో ఉన్న కార్యకర్తలకు, నాయకులకు ఆయన మంచి ఉత్సాహాన్ని నింపుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. గతంలో ఉన్న చేపట్టి ఆగిపోయిన అభివృద్ధి పనుల గురించి ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సెల్ఫీ చాలెంజ్‌లు విసురుతున్నారు. టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ప్రస్తావిస్తూ, వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏదంటూ ప్రశ్నిస్తున్నారు. తమ ప్రభుత్వం వస్తే అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు అందిస్తామని హామీ ఇస్తున్నారు.
ముఖ్యంగా జనసేన అధినేత చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్‌కు వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు.
అనంతరం టీడీపీతో కలిసి పనిచేస్తామని సంచలన ప్రకటన చేశారు. 2014 మాదిరిగానే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వం అంటూ పవన్ తెలిపారు.
తమతో పాటు బీజేపీ కూడా కలిసి రావాలని కోరారు. పవన్ చేపట్టిన వారాహి యాత్ర కూడా జనాల్లోకి బాగా వెళ్లింది.
సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ ప్రజల్లోకి వెళ్లేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
గతంతో పోలీస్తే ఇప్పుడు జనసేనకు కూడా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఎక్కువగా యువత జనసేనాని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఇప్పుడు చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కలిసి ప్రజల్లో పట్టు సాధిస్తారో లేదో మరికొన్ని రోజుల్లో తెలియనుంది