Telugu Featured News

ఉచిత పథకాలను ఎర వేస్తున్న రాజకీయ పార్టీలు

త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీల హామీలు చూస్తే చిట్టీ పాటలాగా కనిపిస్తున్నాయి. తాజాగా ఒకరు మహాలక్ష్మి పేరుతో నెలకు రూ.2500 ఇస్తామంటే, మరొకరు సౌభాగ్య లక్ష్మి పేరుతో రూ.3000 మహిళలకు జీవన భృతి కింద ఇస్తామంటున్నారు. ఒకరు రూ.500కే గ్యాస్ అందచేస్తామంటే మరొకరు రూ.400కే మీ ఇంటికి చేరుస్తూ మంటున్నారు. దీంతో ఉచితాలు, సబ్సిడీలు, సంక్షేమ పథకాల మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉండాల్సిన అవసరముందనే చర్చ మళ్లీ మొదలైంది. అంతేకాకుండా ఉచితాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిల్‌పై ఇటీవలే సుప్రీంకోర్టు వివిధ రాష్ట్రాలతో పాటు ఆర్బీఐ, ఎన్నికల సంఘానికి నోటీసులు పంపింది. మరో 13 రోజుల్లో ఈ పిటిషన్ పై విచారణ జరగనున్నది. ఎన్నికలకు మునుపే దీనిపై తీర్పు వస్తే ఆ ప్రభావం వివిధ పార్టీలపై పడే అవకాశం ఉంటుంది.

ఇటీవల ప్రధాని మోదీ ఓట్ల కోసం ఉచిత పథకాలను అమలు చేయాలనుకోవడం దేశానికి ప్రమాదకరమని హెచ్చరించిన తర్వాత దేశవ్యాప్తంగా ఉచితాలు, సంక్షేమ పథకాలపై చర్చ మొదలైంది. దీంతోపాటు రాబోయే ఎన్నికల నేపథ్యంలో పార్టీలు విడుదల చేస్తున్న మేనిఫెస్టోలతో ఈ చర్చ మరింత ఎక్కువగా జరుగుతున్నది. అయితే అసమానతలను తగ్గించేందుకు ప్రవేశపెట్టే పథకాలు ఉచితాలుగా చూడవద్దని కొన్ని పార్టీలు వాదిస్తుండగా, ప్రభుత్వ నిధులను ఇష్టమొచ్చినట్లు పంచేయడం సరికాదని మరికొందరు ఆర్థిక నిపుణులు అంటున్నారు.

ఇవే కాకుండా మరోవైపు ప్రభుత్వం పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు పన్ను రాయితీలు, రుణమాఫీలు ఇస్తున్నప్పుడు పేదలకు ఇచ్చిన సబ్సిడీలను ఉచిత పథకాలని ఎందుకంటారనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీలు, ప్రతిపక్షాలు సైతం అనేక ఉచిత హామీలను ఇస్తున్నాయి. అయితే ఇందులో ఏవి చట్టబద్ధమైన సంక్షేమ పథకాలు? ఏవి ఉచితాలు? అనేది చెప్పడం చాలా కష్టం. అయితే వ్యక్తి సంక్షేమం పేరిట అమలు చేసే పథకాలు ఆ రాష్ట్ర, దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగించవద్దనే అభిప్రాయం సైతం వ్యక్తమవుతున్నది. ఇక రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయడం కాకుండా.. రైతుకు గిట్టుబాటు ధర, ఎరువులు, వ్యవసాయ యంత్రాలు, వివిధ రకాల సబ్సిడీలకు ఇవ్వడం జరిగితే రైతులకు లబ్ధి చేకూరుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ.. ఓటర్ల ఉచితాలకు, సంక్షేమాలకు లక్ష్మణ రేఖ గీసి, అభివృద్ధిని ఎంచుకునేలా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Show More
Back to top button