Telugu Opinion SpecialsTelugu Politics

పార్టీ సభలు.. అంతా ఓ ట్రాష్

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు సభలు, సమావేశాలు అట్టహాసంగా నిర్వహిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రజలు భారీగానే తరలి వస్తున్నారు. అది కూడా ఎంతలా తరలి వస్తున్నారంటే.. అక్కడ ఉన్న జనాభాని చూసి పార్టీ నాయకులు తమ పార్టీయే కచ్చితంగా గెలుస్తుంది అన్నట్లుగా వస్తున్నారు. అయితే, ఈ జనాభా అంతా నాయకుల మీద అభిమానంతోనే వస్తున్నారా..? లేక పార్టీ నాయకులు ఇచ్చే తాయిలాల కోసం వస్తున్నారా..? ఏది అవునో, ఏది కాదో గత అనుభవాలను పరిశీలిద్దాం పదండి.

అభిమానం 5 శాతమే..!

పార్టీ సభల్లో అత్యధిక జనాభా చూస్తే.. కేవలం 5 శాతం ప్రజలే పార్టీ మీద అభిమానంతో వస్తున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అంతేకాదండోయ్..! వీరిలో రెండు నుంచి మూడు శాతం ఆ పార్టీ కార్యకర్తలు, అధికారులు ఉంటున్నారట. వీరే మిగిలిన 95 శాతం జనాభాని కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వారి ప్రయత్నాలు బెడిసికొట్టి జనాభాను తీసుకుని రాకపోతే కార్యకర్తలు, మండలంలో పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ సభలకు పెద్ద సంఖ్యలో జనాభా హాజరైతే ఆ అధికారులకు, కార్యకర్తలకు, ప్రశంసలతోపాటు తగిన పారితోషకాలు కూడా అందుతున్నాయని వినికిడి.

పైసలు, బిర్యానీయే ముఖ్యం

ఈ హోరాహోరీ సభల్లో 95 శాతం ప్రజలు తమకు రోజువారీ కూలీ, తినడానికి బిర్యానీ, ప్రయాణ ఖర్చులు ఇస్తేనే సభలో హాజరవుతున్నట్లు గతంలో అనేక పర్యాయాలు వీడియోల రూపంలో తేటతెల్లం అయ్యింది. అయినా కూడా పార్టీలు అవేం పట్టించుకోకుండా సభలే ముఖ్యమన్నట్లు ప్రవర్తిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఆ సభలకు వచ్చే వారంతా డబ్బుల కోసం వస్తున్నారు కనుక ఎన్నికలప్పుడు మాత్రం తమకు నచ్చిన అభ్యర్థినే ఎన్నుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి ఉదాహరణగా 2019 ఎన్నికల్లో జనసేన సభలకు పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో గెలుపు దాదాపు ఖాయమని బలంగా అందరూ భావించారు. కానీ ఎవరి అంచనాలకు అందకుండా వైసీపీ అత్యధిక మెజారిటీతో గెలుపొందింది. అంతేకాదు తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే రిపీట్ అయింది.

ఇది నాయకులకు కూడా తెలుసు అయినా కానీ..

సభలకు వచ్చే జానాభాలో చాలా మంది ఎందుకొస్తున్నారో, తమకు ఓటు వేస్తారో, వెయ్యారో అది పార్టీ అధినేతలకు ముందే తెలుసు. కానీ వారు ఎంత ఖర్చు అయినా ఇలా జనాలను తీసుకుని రావడానికి మరో అంతరార్థం ఉంటుంది. అదేంటంటే ప్రజలను పెద్ద మొత్తంలో తీసుకుని రావడం వల్ల ‘మా సభలకు ఎంతమంది వచ్చారో చూడండి’ అని మీడియాల ద్వారానో.. సోషల్ మీడియా ద్వారానో ప్రచారం చేసుకోవడం. తద్వారా మా పార్టీని ఎంతో నమ్మారు కాబట్టే ఇలా ప్రజలు వచ్చారని ఏదో విధంగా రాష్ట్ర ప్రజలను ప్రభావితం చేసి, సైకలాజికల్‌గా ఆ నేతల వైపు ఆలోచించేలా చేయడం వాళ్ల ముఖ్య ఉద్దేశ్యం.

ఆలోచన చేయాలి

రాష్ట్రవ్యాప్తంగా ఇలా సభలు పెడుతున్న నాయకుల భావం ఏంటో అర్థమైంది కదా..!. మరో ముఖ్య విషయం ఈ సభలకు అయ్యే ఖర్చు మొత్తం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నుంచి పరోక్షంగా వసూలు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రజలు దీనిని తప్పకుండా గుర్తించాలి. ఏది ఏమైనప్పటికి వచ్చే ఎన్నికల్లో నిజమైన నాయకుడు ఎవరో గుర్తించి ఓటేసి గెలిపిద్దాం.

Show More
Back to top button