Telugu Special Stories

దేశంలో ఉద్యోగ భ్రాంతి నాటకం

బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నాడంట. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న బీజేపీ ప్రభుత్వం దేశంలో కనీసం పదివేల ఉద్యోగాలు కల్పించిందా. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు, కేంద్ర ఉద్యోగ, ఉపాధి కల్పన సంస్థలు, శిక్షణ సంస్థలు నిధులు లేక, జీతాలు లేక వెలవెల పోతున్నాయన్న సంగతి కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? యువతకు కేవలం స్విగ్గిస్, జొమాటో, గో డాడీ, కొరియర్ అండ్ కార్గో, అవుట్ సోర్సింగ్, సెక్యూరిటీ, టెలి కాలర్స్, ఆఫీస్ బాయ్స్, డ్రైవర్, పెట్రోల్ పంపులో ఆపరేటర్ ఉద్యోగాలు తప్ప గవర్నమెంట్‌లో కొలువులు ఎండమావులే అని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి.

ఇక రాష్ట్ర ప్రభుత్వాల ఉపాధి కల్పన మా పరిధిలో లేని అంశం అని ఎప్పుడో చేతులెత్తేశాయి. విశ్వవిద్యాలయాలను పటిష్ట పరచకుండా, సాంకేతిక కళాశాలను అభివృద్ధి పరచకుండా ఉపాధి, శిక్షణ సంస్థలను మెరుగుపరచకుండా ఉపాధి ఎలా లభిస్తుంది. దేశంలో పెరుగుతున్న అధిక ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలు, విభజన రాజకీయాలు, ప్రైవేటీకరణ, ఉత్పాదకత, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం, సమాజంలో సామరస్యత లోపించడం, అభద్రతాభావంపై రాహుల్ గాంధీ, ఇండియా కూటమి పౌర ప్రజాసంఘాలతో కలిసి అసంఘటిత రంగాన్ని సమీకరిస్తుంటే మరోవైపు ఎందుకూ పనికిరాని సనాతన ధర్మం, దేశంపేరు మార్పు అంశాలు ప్రధాన అంశాలుగా మోడీ ముందుకు తీసుకెళ్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

2024 లోక్‌సభ ఎన్నికలకు మరో కొద్ది నెలలు మాత్రమే ఉన్న తరుణంలో గరిష్ట నిరుద్యోగ రేటు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం, జాబ్ మార్కెట్లోకి వస్తున్న కోట్లాది మంది యువతకు ఉద్యోగ లను కల్పించడం వంటివి బీజేపీ సర్కారు ప్రధాన చాలెంజ్‌గా ఉన్నాయి. మరోవైపు నిరుద్యోగాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ ఎక్కువగా ఎత్తి చూపుతుంది. దీన్ని మోదీ ప్రభుత్వ వైఫల్యంగా ప్రతిపక్షాలు ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి. కేంద్రం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానం కార్పొరేట్ల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్లే.. భారత్‌లో నిరుద్యోగం పెరిగిపోతుందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు కార్పొరేటు ఎగవేతదారులకు లబ్ధి చేకూరే విధంగా పన్నెండు లక్షల కోట్లు బ్యాంకు రుణాలు రద్దు చేశారంటే.. ప్రభుత్వాలు ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తున్నాయో అర్థమవుతుందని అంటున్నారు. 

అయితే, మనదేశంలో నిరుద్యోగం పట్ల వివిధ సంస్థలు చేసిన సర్వే రిపోర్టులను ప్రతిపక్షాలు ప్రజల ముందు పెడుతున్నాయి.

ఆ రిపోర్టులలో ఓ రిపోర్టు ఎలా ఉందో.. మనం ఇప్పుడు ఈ క్రింది విధంగా చూడవచ్చు. 

  • సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (CMIE)
  • దేశంలో గతేడాది డిసెంబర్‌లో నమోదైన నిరుద్యోగరేటు 8.30శాతం.
  • పట్టణాల్లో నిరుద్యోగ రేటు 10.09 శాతం. 
  • గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగరేటు 7.44 శాతం.
  • రాష్ట్రాల వారిగా హర్యానాలో అధికంగా 37.4శాతం, రెండవ స్థానంలో రాజస్థాన్ 28.5శాతం. 
  • ఇక ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా చదువుకున్న వారిలో నిరుద్యోగ సమస్య 6.15శాతం ఉన్నట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనప్పటికీ.. దేశంలో నిరుద్యోగం పెరిగి, ప్రజల ఆదాయ వనరులు తరుగుతున్నాయి.

ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రజలకోసం కేంద్రప్రభుత్వం పెట్టిన ఖర్చు, కేటాయింపులు పడిపోతున్నాయి. రైతులు, ఇతర అన్ని తరగతుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.

శతకోటీశ్వరుల అప్పులు రద్దు అవుతున్నాయి.

వేళ్ళ మీద లెక్క పెట్టగలిగిన సంఖ్యలో ఉన్న కుబేరుల సంపద అంతులేకుండా పెరుగుతున్నది ఎవరి మద్దతుతో ఇలా జరుగుతుంది అనే సత్యం ప్రజలు తెలుసుకుంటున్నారు.

రానున్న ఎన్నికల్లో పరిపాలనలో న్యాయం చేసే నాయకులనే ప్రజలు ఎన్నుకుంటారని ఆశిద్దాం.

Show More
Back to top button