ఇది ఫలానా కథానాయకుడి చిత్రం అనే ముందు ఇది ఫలానా దర్శకుడి చిత్రం అని చెప్పగలిగే స్థాయికి చిత్రపరిశ్రమలో దర్శకుడికి అగ్రస్థాయి ప్రజాదరణ తీసుకువచ్చిన దర్శకుడు, దర్శకులకే మార్గ దర్శకుడు “బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి”. ఆయన గొప్ప భావుకుడు. ఆయన ఊహలు ఎప్పుడు ఆకాశంలో విహరిస్తూ ఉండేవి. వేషం చిన్నదా, పెద్దదా అని కాకుండా పాత్ర పరిధి ఎంత ఉన్నా అది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆయన సినిమా చూసిన వారికి ఆ పాత్రధారులు కనిపించరు, పాత్ర మాత్రమే కనిపిస్తుంది. దాంతో ఆ పాత్రకు నిండుదనము వస్తుంది. ఆయన వందేమాతరం, స్వర్గసీమ, బంగారు పాప, మల్లీశ్వరి, భక్తపోతన, యోగివేమన, భాగ్యరేఖ లాంటి అజరామర చిత్రాలను తెరకెక్కించారు. ఆ క్రమంలో ఆయన తెరకెక్కించిన అద్భుతమైన అజరామర చిత్రం “పూజఫలం” (1964).
ఒక మనిషిపై ఇష్టం కలిగినప్పుడు పురుషుడిపై స్త్రీకి అయినా, స్త్రీ పై పురుషుడికి అయినా ఆ ఇష్టం యొక్క తీవ్రత ఒకేలా ఉంటుంది. ఆ ఇష్టానికి ఆ వ్యక్తులు ఇచ్చే రూపం ఏదైనా సరే అందులోని విరహం, బాధ ఒకే స్థాయిలో ఉంటాయి. ఆ ఇష్టాన్ని ప్రేమతో బంధం రూపంలో మార్చుకునే సమయంలో కొన్ని ఆలోచనలు, లెక్కలు వారిని ఆధిపత్యం చెలాయించేలా చేస్తాయి. ఆ సమయంలోనే ప్రేమ మనిషిని తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తూ మనసు గాయానికి కారణమవుతుంది. దాంతో తాత్కాలిక అంధులై తల్లడిల్లుతారు. ఆ గాయాల ప్రభావం జీవితాంతం వారిని వెంటాడుతుంది. వాటినుండి తెరపిన పడడానికి ఒక జీవిత కాలం వెచ్చిస్తారు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు. ఆడపిల్ల చేసిన గాయాన్ని ఆడపిల్లే పూడ్చాలి. అలా పూడ్చగలిగే దేవత ఎదురురావాలి. వస్తే ధన్యత లభించినట్టే. చేసిన పూజలు ఫలించినట్టే. “పూజాఫలం” సినిమా సారాంశం ఇదే.
ప్రముఖ నిర్మాత, దర్శకులు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి తొలిసారి బయట నిర్మాణ సంస్థ పొన్నలూరి బ్రదర్స్ కు భాగ్యరేఖ (1957) తరువాత దగ్గుపాటి లక్ష్మీనారాయణ నిర్మాణ సంస్థ అయిన “శ్రీ శంభు ఫిలిమ్స్” పతాకంపై “పూజాఫలం” తెరకెక్కించారు బొమ్మిరెడ్డి నరసింహ రెడ్డి. మునిపల్లె రాజు రచించిన “పూజారి” నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున ప్రధాన పాత్రధారులుగా నటించిన తెలుగు సాంఘిక చిత్రం పూజాఫలం. డి.వి.నరసరాజు మాటలు వ్రాయగా, ఈ చిత్రానికి సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించారు. 01 జనవరి 1964 నాడు విడుదలైన ఈ చిత్రం కాసులు కురిపించకపోయినా క్లాసికల్ చిత్రంగా పేరుపొంది అజరామర చిత్రంగా నిలిచిపోయింది.
చిత్ర విశేషాలు….
దర్శకత్వం : బొమ్మిరెడ్డి నర్సింహారెడ్డి
సంభాషణలు : డి.వి.నరసరాజు
నిర్మాత : దగ్గుపాటి లక్ష్మీనారాయణ చౌదరి
కథ : మునిపల్లె రాజు “పూజారి” నవల
తారాగణం : అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
ఛాయాగ్రహణం : పియు.రాజగోపాల్
నిర్మాణ సంస్థ : శ్రీ సాంబు పిక్చర్స్
నిడివి : 156 నిమిషాలు
విడుదల తేదీ : 01 జనవరి 1964
భాష : తెలుగు
చిత్ర కథ సంక్షిప్తంగా…
మహారాజు బిడ్డ మధు. ఆయన (అక్కినేని) సంపన్న కుటుంబానికి చెందినవాడు. మహా మంచివాడు కూడా. పుట్టగానే తల్లిని కోల్పోయి, కొన్నాళ్ళకు తండ్రిని కోల్పోయి, తాతగారి ఒళ్ళోనే పెరిగిన దౌహిత్రుడు. ఆయన ఆస్తికి కాబోయే వారసుడు. సంగీతంలో దిట్ట. చాలా సున్నిత మనస్కుడు. అతనికి బిడియం ఎక్కువ. ఆడవాళ్ళకు దూరంగా ఉండేవాడు. అందరిలాగే తనకు కూడా మనస్సు నిండా కోరికలు ఉంటాయి. కానీ ధైర్యం చేసి వాటిని బయట పెట్టలేడు. చడీచప్పుడు లేకుండా సాధిస్తాడా అంటే, అదీ లేదు. ఆడపిల్ల కనిపిస్తే ఆమడదూరం నిలుచుంటారు.
సమూహంలో ఉన్నా కూడా తాను నిరంతర ఒంటరి. ఇలాంటి మధు జీవితంలో వరుసగా ముగ్గురు మహిళలు ప్రవేశిస్తారు. అతని మనస్సుతో ఏడాపెడా ఆడేసుకుంటారు. మొదటి యువతి వాసంతి. మధు వాళ్ళింటికి అద్దెకు వచ్చిన బ్యాంకు ఏజెంట్ గారి అమ్మాయి. వాసంతి అతనితో చనువుగా ప్రవర్తించడంతో అతనిలో ప్రణయ భావావేశం మొగ్గలు తొడుగుతుంది. ఎంతో చలాకీగా కలుపుగోలుగా ఉండే వాసంతితో చాలా తొందరగా మధు జీవితంలోని వెలితిని పోగొడుతుంది. తాను వెతుక్కుంటున్న కలల ప్రేయసిని ఆమెనే అని మధు అనుకుంటాడు. కానీ ఇంతలోనే ఆమె తండ్రికి బదిలీ అవ్వటంతో చెప్పపెట్టకుండా అతని జీవితం నుండి, ఆ ఊరు నుండి వెళ్ళిపోతుంది వాసంతి. దాంతో మధు జీవితం అంతా శూన్యం.
అతని చీకటి బ్రతుకులో మళ్ళీ దీపం వెలిగిస్తుంది సీత. తరువాత అతని జీవితంలోకి తన దివాణం వ్యవహారాలు చూసే గుమస్తా కుమార్తె సీత ప్రవేశిస్తుంది. మధు చీకటి బ్రతుకులో మళ్ళీ దీపం వెలిగిస్తుంది సీత. ఆమె మధుకి ఏంతో సన్నిహితమౌతుంది. వారిద్దరి మధ్య అనురాగం చిగురించి పరస్పర ఆరాధనా భావంగా మారుతుంది. కనీసం సీత విషయంలోనైనా మధు తన మనసులో భావాలను చెప్పలేకపోతాడు. దాంతో ఆమెకు కూడా దూరమవుతాడు. ఆ సమయంలో కళాశాల స్నేహితుడు నిత్యానందం ద్వారా విలాసిని నీలనాగిని అతనికి పరిచయమవుతుంది. నీలనాగిని ఒక వేశ్య. ఆ వేశ్య తన బంధుగణంతో మధు జీవితంలోకి ప్రవేశిస్తారు. మగవారికి ఏం కావాలో అది అందజేయడం ఆమెకి వెన్నతో పెట్టిన విద్య.
మధు మనస్సులోని కోరికలన్నిటికీ తాను ఒక ఆకారం కల్పిస్తుంది. దాంతో అతను ఇదే ప్రపంచం అనుకుంటాడు. నీలనాగినిని తన ఆరాధ్య సుందరిగా భ్రమిస్తాడు. కానీ ఆ తరువాత అతడికి జ్ఞానోదయం అవుతుంది. ఆమె నిజస్వరూపాన్ని గ్రహించిన మధు ఆమెని తన్ని తరిమేస్తాడు. నీలనాగినిని ఆడది కాదని, ఆమెకు నీడ మాత్రమేనని తెలుసుకుని మళ్లీ నిర్వేదానికి లోనవుతాడు. అప్పుడు సీత మధును బిడ్డలా అక్కున చేర్చుకుంటుంది. తల్లిలా ఓదరుస్తుంది. వెళ్ళిపోయిందనుకున్న వాసంతి తన ఆప్తమిత్రుడు శ్రీరామ్ భార్యగా కనిపించేసరికి బిత్తరపోతాడు. ఆమె మధులో మరణించిన ఆమె అన్నను చూసుకుంటుందని తెలుసుకుని నిరుత్తరుడవుతారు. అపార్ధాలు తొలగిపోతాయి. సీత, మధులు ఒక్కటవుతారు. సీత చేసిన పూజలకు ఫలప్రాప్తి దక్కుతుంది.
కథకు బీజం…
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. ఆయన తెలుగు సినిమా దర్శక, నిర్మాత. ఆయన మొదట “గృహలక్ష్మి” (1938) చిత్రాన్ని నిర్మించారు. ఆ తరువాత వందేమాతరం (1939), సుమంగళి (1940), దేవత (1941), స్వర్గసీమ (1945), భక్తపోతన (1942), యోగివేమన (1947) మొదలగు చిత్రాలు తన నిర్మాణంలో వచ్చినవే కావడం విశేషం. ఆయన ఎంతో కష్టపడి తీసిన బంగారుపాప (1955) చిత్రం నిరాశపరచింది. దాంతో తీవ్ర నిరాశకు గురైనన తాను వెంటనే సొంత సినిమా తీసే ధైర్యం చేయలేక పోయారు. ఆ దశలో ఆయన దర్శకత్వంలో సినిమా నిర్మించే అవకాశమిమ్మని పొన్నలూరి బ్రదర్స్ ఆయనకు తమ దగ్గరున్న కథ చూపించారు. అంతకంటే మెరుగైన కథ తన దగ్గరే ఉందని “బంగారుపాప” తీయడానికి ముందు తాను తయారు చేసుకుని పక్కన పడేసిన స్క్రిప్ట్ తోనే బి.ఎన్. రెడ్డి 1957 లో “భాగ్యరేఖ” సినిమా తీశాడు.
ఆ విధంగా తమ స్వంత సంస్థ అయిన “వాహినీ” వెలుపల ఆయన తీసిన తొలి చిత్రం అది. “భాగ్యరేఖ” తరువాత బయట నిర్మాతలకు బి.ఎన్.రెడ్డి తీసిన రెండో సినిమా “పూజఫలం”. బయట నిర్మాతలకు ఆయన తీసిన రెండో సినిమాయే కాదు, బయటి నిర్మాతలకు ఆయన తీసిన చివరి చిత్రము కూడా ఇదే. మిత్రులతో జరిగిన ప్రతీ భేటీలోనూ బి.ఎన్.రెడ్డి ఎంతో అపురూపంగా మాట్లాడిన సినిమా ఇది. ఆయన ఎంతో మనసుపడి తీసిన సినిమా. శ్రీ శంభు ఫిలిమ్స్ పతాకం మీద దగ్గుబాటి లక్ష్మీనారాయణ చౌదరి 1964 లో “పూజాఫలం” సినిమా తీశారు. దీనికంటే ముందు 1960 లో ఈ సంస్థ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో “నమ్మినబంటు” సినిమా నిర్మించింది. ఆ సినిమా అఖండ విజయం సాధించింది. ఆ తరువాత నాలుగేళ్ల విరామం తీసుకుని ఆ నిర్మాతలకు వచ్చి తమకు ఒక సినిమా తీసి పెట్టవలసిందిగా బి.ఎన్.రెడ్డిని కోరారు. అలా మొదలైంది ఈ పూజాఫలం సినిమా కథ.
“పూజారి” నవలను కథగా…
తెలుగు కథకులలో ప్రముఖులు మునిపల్లె రాజు. ఆయన మునిపల్లె బక్కరాజుగా కూడా ప్రసిద్ధులు. పూజాఫలం సినిమాకు కథ గురించి అన్వేషిస్తున్నప్పుడు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డికి మునుపల్లె రాజు 1952 లో వ్రాసిన చిన్న నవల “పూజారి” గుర్తొచ్చింది. ఆ నవలను సినిమాగా తీసుకురావాలని ఆయన ఆకాంక్ష. తెలుగు రచయిత నవలలు సినిమాగా రావడం అన్నది బహుశా మునిపల్లె రాజు నవల “పూజారి” తోనే మొదలైంది. బి.యన్.రెడ్డి మనసుకుని అమితంగా ఆకర్షించేటంతగా కథానాయకుడు మధు పాత్ర ఎంతో హృద్యంగా ఉంటుంది. కథలో మధు సంపన్నుడు. కానీ గుణంలో అతను కోటేశ్వరుడు.
చదువుకున్న అతనికి సంగీతం మీద ఎంతో మమకారం. మనసు నిండా బోలెడంత మమత నింపుకున్నవాడు. కానీ వాటిని బయట వ్యక్తం చేయడం చేతకానివాడు. చెప్పుకునేందుకు కథానాయకునిగా అన్ని అర్హతలు ఉన్నవాడు. స్వతహాగా బి.యన్.రెడ్డి కూడా ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవారే. అందువలన ఆ పాత్ర ఆయనకు అంతగా నచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే ఈ మధు పాత్రలో ఆయన తనను తాను చూసుకున్నారు. అందుకే మరో ఆలోచన చేయకుండా ఆయన ఈ కథను ఎన్నుకున్నారు. ఈ సినిమాకు రచయితగా డి.వి. నరసరాజును ఎంచుకున్నారు. ఈయన అంతకుముందు బి.యన్.రెడ్డి నిర్మించిన “రాజమకుటం” సినిమాకు రచయితగా పనిచేశారు. మళ్లీ ఈ సినిమా కూడా ఆయననే రచయితగా పెట్టుకున్నారు బి.యన్.రెడ్డి. వీరిద్దరూ కలిసి ఈ చిన్న నవలకు వెండితెర కథను అల్లారు.
నటీనటుల ఎంపిక…
బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి ఒక నిబద్ధత గల దర్శకులు. తారల ఎంపికలో ఎంత మాత్రం రాజీపడేవారు కాదు. ఒక దర్శకుడిగా కథానాయకుడి పాత్రకు నాగేశ్వరరావుకు కళ్ళు కావలసిన భావాలను హృద్యంగా పలికింపగలవు అని ఆయన నిశ్చితాభిప్రాయం. కనుక మధు పాత్రకు ఆయన మొదటి నుండి అక్కినేని నాగేశ్వరావునే అనుకున్నారు. అప్పటికే అక్కినేని అగ్ర కథానాయకులు. బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి దర్శకత్వంలో ఆయన అంతకుముందు ఎన్నడూ పనిచేసిన అనుభవం లేదు. అందువలన ఒకవైపు అక్కినేని కూడా బి.యన్.రెడ్డితో కలిసి పనిచేయాలని తహతహలాడుతున్నారు. నిజానికి అక్కినేనికి శ్రీ శంభు ఫిలింస్ అంటే కోపం ఉంది. వారు అక్కినేని, సావిత్రిల కలయికలో తీసిన “నమ్మినబంటు” సినిమా సినిమా విజయ విహారం చేసినా కూడా “అక్కినేని” కి కొన్ని చేదు జ్ఞాపకాలను మిగిల్చిందా సినిమా.
క్షమాపణలు లేఖలు వ్రాసిచ్చిన నిర్మాతలు…
యార్లగడ్డ వెంకన్న చౌదరి “పూజాఫలం” సినిమా నిర్మాత. ఆయనకు దగ్గుబాటి లక్ష్మీనారాయణ చౌదరి భాగస్వామి. ఆ సినిమాలో రామలక్ష్మణులు అనే ఎడ్లు చేసిన సాహసాలు తెలుగునాట మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రేక్షకుల కరతాల ధ్వనులను అందుకున్నాయి. స్పెయిన్ లోని సెబాస్టియన్ లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో “నమ్మినబంటు” సినిమాను ప్రదర్శించినప్పుడు రామలక్ష్మణులు అనబడే ఆ ఒంగోలు జాతి ఎద్దులు ఆ సినిమాలో అవి చేసిన విన్యాసాల గురించి జనం కథలుగా చెప్పుకున్నారు. వెంకన్న చౌదరి కారంచేడులో పెద్ద కామందు. స్వతహాగా ఆయన వ్యవసాయదారి కావడంతో ఎడ్లకు అమితంగా ప్రాధాన్యతనిచ్చారు.
“నమ్మినబంటు” సినిమా విడుదలైన తరువాత రామలక్ష్మణులకు ప్రేక్షకుల నుండి లభించిన ఆదరణ చూసి వెంకన్న చౌదరి ప్రత్యేకంగా వాటికి ప్రచారంలో ఒక వాల్ పోస్టర్ వేయించారు. నటీనటులకన్నా నోరులేని జీవాలే బాగా నటించాయని అందులో వ్రాశారు. దాంతో సహజంగానే ఆ సినిమా నాయకా, నాయికలు అక్కినేని, సావిత్రిలకు బాధ కలిగించింది. అందువలన “పూజాఫలం” సినిమాలో వేయడానికి ముందుగా వాళ్ళిద్దరు ఇష్టపడలేదు. నిర్మాతలు క్షమాపణలు లేఖలు వ్రాసిచ్చాక వారు తమ ఆమోదం తెలియజేశారు.
బి.యన్. సినిమాలో తొలిసారి సావిత్రి…
మధు జీవితాన్ని ప్రభావితం చేసిన ముగ్గురు మహిళల్లో ఒకరైన సీత పాత్ర ధరించినది సావిత్రి. శాంతం, సహనం, ఆత్మాభిమానం అనే మూడు అంశాలు కలగలిసి త్రివేణి సంగమంలా ప్రవహించే ఆ పాత్ర ద్వారా బి.యన్.రెడ్డి సినిమాలో తొలిసారిగా ఆమె ప్రవేశించారు. అంతకుముందెన్నడూ ఆయన సినిమాలో సావిత్రి నటించలేదు. ఆయన దర్శకత్వంలో ఇదే తొలిసారి, ఇదే అఖరు సినిమా కూడా. సీత తండ్రి రామకృష్ణగా గుమ్మడి నటించారు. పెంకితనం, చలాకితనం కలగలిసిన వాసంతి పాత్రకు జమునను ఎంచుకున్నారు. వాసంతి తల్లిదండ్రులుగా హేమలత, వై.వి.రాజు నటించారు. మధు స్నేహితుడు శ్రీరాంగా జగ్గయ్య, మరో మిత్రుడు దైవాధీనంగా పేకేటి శివరాం నటించాడు.
విలాసిని నీలనాగినిగా ఎల్.విజయలక్ష్మి నటించారు. ఆమె తల్లి పాత్రలో ఛాయాదేవి నటించగా, ఆమెకు జతగానిగా మిక్కిలినేని తోడయ్యారు. జమీందారు గారి తమ్ముడు కొడుకు గోవిందయ్య పాత్రలో రమణారెడ్డి నటించగా, అతడి కొడుకు రాజుగా పొట్టి ప్రసాద్ ని తీసుకున్నారు. రాజు రావుబహదూర్ గారి అమ్మాయి రాణిని ప్రేమిస్తుంటాడు. రావుబహదూర్ పాత్రలో రేలంగి నటిస్తే ఆయన కూతురుగా రాజశ్రీ నటించింది. అప్పటివరకు చిన్నచితకా వేషాలలో నటిస్తూ వచ్చిన రాజశ్రీ “పూజాఫలం” సినిమా విడుదలైన 1964 సంవత్సరంలో మొదటిసారి కథానాయికగా “బంగారు తిమ్మరాజు”, “తోటలో పిల్ల కోటలో రాణి” సినిమాల్లో నటించింది. అటు తమిళంలోనూ శ్రీధర్ “కాదలిక్కి నేరమిల్లే” లో కూడా నటించింది.
తెలుగు చిత్రపరిశ్రమ సరిగ్గా ఉపయోగించుకోని అద్భుతమైన కళాకారులలో ప్రసాద్ కూడా ఒకరు. అయనది బెజవాడ. ఆయన రచన సమాఖ్య సభ్యుడు, నాటకాల్లో ఉద్దండపిండం కూడనూ. విజయా పిక్చర్స్ వారి “అప్పు చేసి పప్పుకూడు” సినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టిన ప్రసాద్ కు కొత్తలోనే బి.యన్.రెడ్డి చిత్రంలో అవకాశం దొరికిందని చాలా మురిసిపోయాడు. కానీ ఆ అదృష్టం ఎంతోకాలం నిలవలేదు. మళ్లీ 80 వ దశకంలో జంధ్యాల సినిమాలలో నటించిన దాకా తనకు గుర్తింపురాలేదు.
సాలూరి రాజేశ్వరరావు సంగీతం…
“పూజాఫలం” సినిమాకు సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు. అంతకుముందు బి.యన్.రెడ్డి, సాలూరి రాజేశ్వరరావు కలిసి “మల్లీశ్వరి” సినిమాకు పనిచేశారు. ఆ తరువాత మళ్లీ వారిరువురు కలిసి పనిచేసిన సినిమా “పూజాఫలం”. శ్రీ సాంబు పిక్చర్స్ మొదటి సినిమా “నమ్మినబంటు” కు మొదట సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు. అందులో “చెంగుచెంగునా గంతులు వేయండి”, “తెలతెలవారెను లేవండమ్మా చెలియల్లారా రారండమ్మా”, “పొగరుమోతు పోట్టగిత్తరా ఓరయ్యా” పాటలకు బాణీలు కట్టింది రాజేశ్వరరావే. తెలుగు, తమిళం భాషలలో తెరకెక్కిన “నమ్మినబంటు” (1960) సినిమా కోసం తెలుగులో పాటలన్నీ కోసరాజు రాఘవయ్య వ్రాస్తే, తమిళంలో ఉడుమలై నారాయణ స్వామి వ్రాశారు. తమిళం నిర్మాణంలో ఒక పాట విషయంలో సాలూరికి, ఉడుమలైకి తగాదా వచ్చింది. తమిళనాడులో అప్పట్లో ఉడుమలై నారాయణ స్వామి తిరుగులేని సినిమా కవి. ఆయన ఉడుంపట్టు వల్ల సాలూరి రాజేశ్వరరావు సినిమా నుంచి తప్పుకున్నారు. దాంతో ఈ సినిమాకు మాస్టర్ వేణు సంగీత దర్శకుడు అయ్యారు. లక్ష్మీనారాయణ చౌదరికి మొదటి నుండి కూడా సాలూరి రాజేశ్వరరావు అంటే చాలా ఇష్టం. అందులోనూ బి.యన్.రెడ్డి కలయిక కనుక ఈ సినిమాలో కూడా ఆయననే సంగీత దర్శకునిగా తీసుకున్నారు.
సినారె వ్రాసిన “పగలే వెన్నెల”…
బి.యన్.రెడ్డి ఆస్థానకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి ఈ సినిమాలో కూడా కొన్ని పాటలు వ్రాశారు. మిగతావి పాటలు కొసరాజు రాఘవయ్య, సి.నారాయణరెడ్డి వ్రాశారు. గులేబకావళి కథ (1962) సినిమాతో చిత్రపరిశ్రమకు వచ్చిన సినారె అతి త్వరగా బి.యన్.రెడ్డి సినిమాలకు పాటలు వ్రాయడం ఆయన అదృష్టం. ఆయన “పూజాఫలం” సినిమాలో “పగలే వెన్నెల జగమే ఊయల”, “నిన్నలేని అందమేదో నిదుర లేచెనెందుకో”, “మదనా మనసాయెరా”, “ఎందు దాగి ఉన్నావో బృందా విహారి” అనే నాలుగు పాటలు వ్రాశారు. వీటిల్లో “పగలే వెన్నెల జగమే ఊయల” పాట ఈ నాటికి సంగీత ప్రియులు అపురూపంగా చెప్పుకొని పాడుకునే పాట. గాయని జానకి పాడిన ఎన్నో వేల గీతాలలో 10 ఉత్తమమైన పాటలు ఎంచమంటే అందులోని తప్పనిసరిగా ఉండే పాట “పగలే వెన్నెల”.
“పగలే వెన్నెల” పాటకు సినారె వ్రాసిన మొదట వాక్యాలు “పూజాఫలం” సినిమాలో మనం విన్నవి కావు. “కదిలే ఊహకు కనులుంటే, ఆ కనులకు కూడా మనసుంటే, పగలే వెన్నెల అవుతుంది, ఈ జగమే ఊయల అవుతుంది” అని వ్రాశారు. అది చదివిన బి.యన్.రెడ్డి తనకు నచ్చిన పదాల క్రింద పెన్నుతో గీత గీసుకుంటూ వెళ్లారు. ఆ పదాలను సినారె జాగ్రత్తగా జతకట్టించి అల్లిన పాటనే సినిమాలో మనం విన్న “పగలే వెన్నెల”. ఈ అద్భుతమైన కూర్పుకు, చక్కని మార్పుకు బి.యన్.రెడ్డి కారణం అనేవారు సినారె. “పూజాఫలం” సినిమాలో ప్రతీ పాట బాగున్నాయి. హాస్య జంట ప్రసాద్, రాజశ్రీల మీద వ్రాసిన “ఓ బస్తీ దొరగారూ దిగి వస్తారా మీరు”, “వస్తావు పోతావు నాకోసం వచ్చి కూర్చున్నాడు” పాటలతో సహా అన్ని పాటలు విజయవంతం అయ్యాయి.
హారం విషయంలో పట్టు విడువని బి.యన్…
చిత్రీకరణ విషయానికి వస్తే “పగలే వెన్నెల” పాట మొదట జమునపై, ఆ తరువాత సావిత్తితో సినిమాలో వస్తుంది. జమున “పియానో” వాయిస్తూ పాట పాడుతుంది. చిన్నప్పుడు ఆవిడ సంగీతం నేర్చుకున్నారు. అందులో భాగంగా హార్మోనియం కూడా నేర్చుకున్నారు. “పగలే వెన్నెల” పాటలో పియనో పరికరం మీద వ్రేళ్ళు కడపడం జాగ్రత్తగా గమనిస్తే ఆవిడకు వాయిద్యంలో చాలా సన్నిహిత పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది. హార్మోని బాగా వచ్చినందున పియానో పలికించడం తనకు పెద్ద కష్టం కాలేదు. వీణలో కూడా తనకు చక్కటి ప్రవేశం ఉంది. ఆమె తాళం కూడా అద్భుతంగా పలికించగలరు. ఈ సినిమాలో అక్కినేని వీణా విద్వాంసుడు. వీణా సన్నివేశాలను అద్భుతంగా పలికించింది పరువూర్ గోపాలకృష్ణన్.
ఈ సినిమాలో నాయకుడు శ్రీమంతుడు, సంస్కారవంతుడు, కలాపిపాసి. తన అభిరుచి, కళాదీక్ష ప్రతిభింబించే స్థాయిలో ఒక హారాన్ని కొని తాను ప్రేమిస్తున్న వసంత (జమున) కు బహూకరించాలని అనుకుంటాడు. ఈ సన్నివేశ చిత్రీకరణలో తనకు ఒక మంచి హారం కావాలని బి.యన్.రెడ్డి ముందుగానే నిర్మాతకు చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే నిర్మాత లక్ష్మీనారాయణ చౌదరి ఓకే హారం కొనుక్కుని వచ్చారు. అది బి.యన్.రెడ్డికి నచ్చలేదు. హారం చాలా దండిగా, ఆడంబరంగా ఉంది. కానీ కథానాయకుడి అభిరుచినీ, కళా హృదయాన్ని వ్యక్తీకరించేటట్టు లేదు అన్నారు. ఆ హారం కొనడానికి లక్ష్మీనారాయణ చౌదరి ఎన్ని దుకాణాలు తిరిగారో బి.యన్.రెడ్డికి ఏకరువు పెట్టారు. అయినా కూడా ఆయనతో ఏకీభవించలేకపోయారు.
చేసేదిలేక బి.యన్.రెడ్డిని వెంటబెట్టుకుని లక్ష్మీనారాయణ చౌదరి నగల దుకాణానికి తీసుకెళ్లారు. నగరంలోని పెద్దపెద్ద నగల దుకాణాలు తిరిగి ఒక హారాన్ని ఎంపిక చేశారు. దాని ఖరీదు అప్పట్లోనే రెండువేల రూపాయలు. అంత ఖరీదైన హారం ఎందుకని లక్ష్మీనారాయణ చౌదరిని గునిశారు. అప్పుడు బి.యన్.రెడ్డిని కలుగజేసుకుని ఖరీదు గురించి మీరు ఆలోచించకండి. సినిమాలో ఈ సన్నివేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. దగ్గరగా కూడా చూపించాలి, కనుక తీసుకోండి అన్నారు బి.యన్.రెడ్డి. అయినా కూడా చౌదరి అభ్యంతరం వెల్లుబుచ్చుతుంటే “ఈ నెక్లెస్ నేనే తీసుకుంటాను, మీరు చేస్తున్న ఈ రెండు వేల రూపాయల ఖర్చు నా పద్దుకి వ్రాయించండి” అన్నారు బి.యన్. వస్తువు విషయంలోనే ఈ విధంగా ఉండే బి.ఎన్.రెడ్డి, సినిమా మంచిగా రావడానికి ఎంత పరితపించేవారో మనం అర్థం చేసుకోవచ్చు.
ఛాయాగ్రహకుడిగా యు.రాజగోపాల్…
“మల్లీశ్వరి” సినిమాకు కొండారెడ్డి, ఆది ఇరానీలకు సహాయకులుగా పనిచేసిన యు.రాజగోపాల్ ను ఈ చిత్రానికి ఛాయాగ్రహకుడిగా ఎంచుకున్నారు. మల్లీశ్వరి సినిమాలో మేఘాలు బిరబిరా పరుగులెడుతూ వెళ్లే సన్నివేశాలు, దట్టమైన మబ్బులు కమ్ముకొని వచ్చే సన్నివేశాలు యు.రాజగోపాల్ తీసినవే. అవి నచ్చిన బి.యన్.రెడ్డి ఈ సినిమాలో ఆయనకు ఛాయాగ్రహకుడిగా అవకాశం ఇచ్చారు. దర్శకునిగా ఆయన అభిప్రాయాలు చాలా ఉన్నతంగా ఉండి ఓ పట్టాన సాంకేతిక నిపుణులకు అర్థమయ్యేవి కావు. సినిమాలో “పగలే వెన్నెల” పాటలో జమునను, “శివదీక్షా పరురాలనురా” పాటలో ఎల్.విజయలక్ష్మిని యు.రాజగోపాల్ ఎంతో అందంగా చూపించారు. అలాగే నీలనాగినితో కలిసి కథానాయకుడు మధు దేశమంతా తిరిగి సన్నివేశాలను వచ్చే మాంటేజ్ సన్నివేశంలోచాలా చక్కగా చూపించారు. ఆ మాంటేజ్ సన్నివేశంలో అక్కినేని విజయలక్ష్మి జంట ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. “శివదీక్షా పరురాలనురా” పాటలో జానకి గళం అద్భుతంగా పాడిందో, విజయలక్ష్మి పాదం కూడా అంతే అద్భుతమైన వేగంతో కదిలింది.
కాసులు రాకున్నా “అజరామర చిత్రం” గా మిగిలి..
సొంత నిర్మాణం కాకుండా, వేరే నిర్మాణ సంస్థకు, ఎంతగానో ఇష్టపడి బి.యన్.రెడ్డి తెరకెక్కించిన సినిమా “పూజాఫలం” 01 జనవరి 1964 నాడు కొత్త సంవత్సర కానుకగా విడుదలైంది. సినిమా అద్భుతంగా ఉందన్నారు. మితిమీరిన క్లాసిక్ అన్నారు విమర్శకులు. కథానాయకుడి పాత్ర చిత్రణ మరీ ఉదాత్తంగా ఉన్నదని విమర్శించారు. అజరామర చిత్రంగా “పూజాఫలం” ముద్రపడింది. కానీ డబ్బులు పెద్దగా రాబట్టుకోలేకపోయింది. భారతీయ చిత్రపరిశ్రమలో “ప్రేమ” ఇతివృత్తంతో లెక్కకు మిక్కిలి చలనచిత్రాలు వచ్చాయి. ప్రేమ అనేది చాలా వరకు అందమైన భావన అని, జీవితంలో పొందవలసిన అనుభవం అనే ఆలోచన కలిగించే సినిమాలే అవి.
కానీ “ప్రేమ” కలిగించే అయోమయం గురించి అతిస్పష్టంగా చర్చించిన సినిమాలు చాలా తక్కువే. అమ్మాయి యుక్తవయస్సుకు వచ్చాక, ఆమెను పురుషుల సాంగత్యం నుంచి వేరు చేస్తారు. వయస్సు చేసే మాయ, ఆ వయస్సులో కలిగే తీవ్రమైన ఇష్టాలు, మోహాలు ఎంత అందంగా ఉంటాయో అవి వికటిస్తే అంత ప్రమాదానికీ గురి చేస్తాయి. ఇత్యాది విషయాన్ని బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి తన పూజాఫలంలో అద్భుతంగా చూపించారు. సినిమాలను వ్యాపారాత్మక ధోరణిలో కాకుండా, కళాత్మక ధోరణిలో చూసే దర్శక, నిర్మాత బి.యన్.రెడ్డి జయాపజయాలతో సంబంధం లేకుండానే “పూజాఫలం” సినిమాను ఎంతగానో ప్రేమించారు.