పేద ప్రజలకు దానధర్మాలు చేసిన కర్ణుడిగా, తెలంగాణ రాబిన్‌హుడ్‌గా, ప్రజా వీరుడుగా తెలుగు ప్రజలకు సుపరిచితుడు, పోరాట యోధుడు పండుగ సాయన్న.
భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలోని ఉద్యమాలు, నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు ఒక సమాంతర చరిత్ర. ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో . లిఖించదగిన వాడు ఆయన.
దొరల ఆగడాలు..
ప్రజలను వెట్టి చాకిరి పేరుతో హింసిస్తూ, అక్రమ పన్నులను వసూలు చేస్తూ, ప్రజల మాన ప్రాణాలను హరిస్తున్న దుర్మార్గుల ఆట కట్టించాడు. నిరంకుశ నిజాం అధికారాలను ప్రశ్నిస్తూ, వారికే సవాళ్ళుగా మారి, తన సొంత పాలన ద్వారా నూతన వ్యవస్థను స్థాపించుకొని, ఒక సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశాడు. కరువు కాలంలో ప్రజలు కష్టపడి పండించిన పంటలను సైతం, స్థానికంగా ఉన్న దొరలు ఏదో ఒక సాకుతో జప్తు చేసేవారు. తమ అనుమతి లేకుండా పంట పొలంలో బావి తవ్వినందుకు సాయన్న తండ్రిని స్థంభానికి కట్టేసి కొట్టారు. ఈ అన్యాయాలను, అవమానాలను చూసిన సాయన్న వారిని ఎదిరించటానికి సాయుదడయ్యాడు. స్నేహితులతో కలిసి సాయుధ దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
చరిత్ర మరిచినా మహావీరుని కథ ఇప్పుడు తెలుసుకుందాం..
1850 సంవత్సర కాలంలో నిజాం రాజుల అరాచక పాలన జరిగేది. జాగిర్దారులు, పటేళ్లు, పట్వారి దొరలు ఆంబోతుల్లా ఊర్ల మీద పడి దోచుకుంటూ, కంటికి కనిపించిన కన్నెపిల్లలను చరబడుతూ, బక్క చిక్కిన ప్రాణాల కంచాలలోని గంజిని కూడా గుంజుకొని వారి ఆర్తనార్థాలను వింటూ వికటట్టహాసం చేస్తున్న రోజులు అవి. ఇది ఏమిటని ఎవరు ప్రశ్నించినా వారిని గడిల్లో వేసి చిత్రహింసలకు గురి చేస్తూ ప్రాణాలు తీసేవారు. గ్రామాల్లో నిజాం రాజుల వికృతాలు విలేయతాండవం చేస్తుండేది. చిత్రహింసలకు గురైన గ్రామాలలో మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని రామాపురం గ్రామం ఒకటి. పేరుకే రామాపురం కాని రావణాసురులు ఏలుతున్న గ్రామం అది. ఓ రోజు జోరుగా వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో ప్రకృతి ఏదో సూచిస్తున్నట్టు ప్రకృతి కనిపిస్తుంది. ఆరోజు ముస్లింల పీర్ల పండగ, హిందువుల విజయదశమి పండుగ. రెండు ఒకే రోజు వచ్చాయి.
ఆ సందర్భంలో ఆ పండుగ వేళ అత్తయ్య, సాయమ్మ దంపతులకు మగ బిడ్డ జన్మించాడు. ఎలుగుబంటిని పిడుగులతో మట్టి పెట్టిన ధీర వనిత అమ్మమ్మకు గుర్తుగా ఆ బిడ్డకు సాయన్న అని పేరు పెట్టారు ఆ దంపతులు. సాయన్న చిన్నప్పటి నుంచే సాహసాలకు మారుపేరు. పెద్ద పెద్ద బండరాలను సైతం అవలీలగా ఎత్తిపడేసేవాడు. తన చిన్నమ్మ చంద్రమ్మ చెప్పే దొరల దౌర్జన్యాలు వింటూ తన రక్తంలో అణువణువు వీరావేశం నింపుకున్నాడు. ఒకరోజు వేటకు వచ్చిన గోల్కొండ పెద్దదొరలు మంది బార్బలంతో అడవిలో మాటేశారు. ఒక్కసారిగా గాండ్రిస్తూ దూసుకొస్తున్న పెద్దపులిని చూసి బెంబేలెత్తిపోయారు. దొరల ప్రాణాలను కాపాడేందుకు అంతయ్య గొడ్డలితో పులి మీదకు దూకాడు. అదే సమయంలో మెరుపు దాడిగా వచ్చిన సాయన్న పులిని వెనుక నుండి వచ్చి ఒకే దెబ్బతో నేలకూల్చాడు. ఆనాటి నుంచి ఆ ప్రాంతంలో ఏ నోట విన్న సాయన్న పేరే.
ఒంటి చేత్తో బొబ్బిలి పులిని మట్టి కరిపించిన ధీరుడు సాయన్న సాహసాలను చూసి ప్రజలు జయహో సాయన్న అంటూ బ్రహ్మరథం పట్టారు. తల్లిదండ్రులు, చిన్నమ్మ, స్నేహితులు మురిసిపోయారు. అది దొరలకు కంటగింపుగా మారింది. సాయన్న కుటుంబం పై దౌర్జన్యాలను ప్రారంభించారు. కొన్ని ఏళ్లుగా వర్షాలు లేక కరువు ఎదుర్కొంటున్న తినడానికి గింజలు లేకుండా దౌర్జన్యంగా పన్నులు వసూలు చేస్తున్నారు దొరలు. అప్పుడే యుక్త వయసులోకి అడుగుపెడుతున్న సాయన్న స్నేహితుల సహాయంతో తల్లిదండ్రులతో కలిసి ఓ పెద్ద భావిని తవ్వాడు. వర్షం పై ఆధారపడకుండా వ్యవసాయం ప్రారంభించాడు. పంట చేతికి వచ్చేవరకు గోతికాడి నక్కల ఎదురుచూసేవారు దొరలు. అనుమతి లేకుండా భావిని తవ్వినందుకు గడిలో నిర్బంధించి కట్టెకు కట్టేసి తల్లిదండ్రులను చిత్రహింసలు పెడుతుంటే సాయన్న రక్తం సలసలా మరిగింది.
అయినప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పంటి బిగువన దుఃఖాన్ని భరించాడు సాయన్న. చేతగాని సమాజంలో ఒంటరిగా ఏమి చేయలేమని భావించాడు. తల్లిదండ్రులను తీసుకొని మెరుగోని పల్లె గ్రామానికి చేరుకొని ఎవరికి తెలియకుండా జీవించాడు. సాయన్న కుటుంబాన్ని చిత్రహింసలు పెడదామనుకున్న దొరలు పోలీసు ఖాన్ లతో మంతనాలు జరిపించారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన పోలీస్ ఖాన్ లు సాయన్న చిన్నమ్మ చంద్రమ్మను చరబట్టారు. విషయం తెలుసుకున్న సాయన్న హుటాహుటిన పరిగెత్తి కొదమసింహంలా కలియబడ్డాడు. ఇద్దరు ఖాన్ ల పీకలను కోసి చిన్నమ్మను రక్షించి స్నేహితులతో సహా అడవి బాట పట్టాడు. ఆనాటి నుంచి ఆ పర్వతాపురం అడవిలో మైసమ్మతల్లి అమ్మగా అక్కున చేరాడు.
దొరల దౌర్జన్యాలకు చరమగీతం పాడాలని దిశా నిర్దేశం చేసాడు. సాయన్న పై హంతకుడు అనే ముద్ర వేసిన దొరలు.. కనిపిస్తే కాల్చేయమని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. ఓవైపు పోలీసుల వేట కొనసాగుతోంది. మరోవైపు సాయన్న తన పోరాటాన్ని ఇంకో మార్గం వైపు మళ్ళించాడు. తన స్నేహితులతో కలిసి సంపన్నుల ఇళ్లల్లో దోపిడీ చేశాడు. మైసమ్మ సాక్షిగా వేలాదిమంది అనాధాలకు కడుపునిండా భోజనం పెట్టారు. దొరల అల్మరాల్లో దాగి ఉన్న బంగారాన్ని అంతా ఎత్తుకు వచ్చాడు. వేల మంది జంటలకు పుస్తెలు, మెట్టెలు చేయించి, కొత్త బట్టలతో ఆ జంటలకు పెళ్లిళ్లు చేయించాడు. మైసమ్మ సాక్షిగ తను ఇష్టపడిన నరసమ్మను వివాహం చేసుకొని తాను కూడా ఓ ఇంటి వాడయ్యాడు. ఎండిన డొక్కలతో పస్తులున్న పేదవాళ్ళంతా కులమత బేధాలు లేకుండా సహపంక్తి భోజనం చేసేవారు. ఆ కాలంలోనే సామాజిక సమానత్వాన్ని నెలకొల్పిన సంస్కర్త పండుగ సాయన్న. సాయన్న పేరు వింటేనే జమీందారుల పంచలు తడిచిపోయేది.
ధాన్యపు బస్తాలను దారిలోనే దోపిడీ చేసి పేదలకు పంచిపెట్టేవాడు సాయన్న. సాయన్న అనుచరులలో ఒకరిని లోపరుచుకొని సాయన్న ఉన్న ప్రదేశం తెలుసుకొని చాటుమాటుగా వచ్చి పోలీసులు పట్టుకున్నారు. పదేళ్ల శిక్ష విధించి జైల్లో వేశా రు. పాలమూరు పెద్దమనుషులు, వనపర్తి రాజు రాజరామేశ్వరరావు, గద్వాల రాణి శంకరమ్మలను కలిసి దొరలు, పోలీసుల దౌర్జన్యాలను తెలియజేశారు. పండుగ సాయన్న పేదల మనిషని వివరించారు. వారి చోరువతో రెండేళ్ల శిక్ష మాత్రమే తగ్గించింది ఆ రాకాసి ప్రభుత్వం. కానీ అప్పటి ఎస్పీ స్థాయి అధికారి మోతి మీన్ సాఫ్ సాయన్నను జైల్లోనే అంతమొందించాలని రకరకాల ప్రయత్నాలు చేశాడు. వాటన్నింటినీ తిప్పికొట్టి జైలు గోడలు బద్దలు కొట్టి అనుచరులతో సహా బయటపడ్డాడు సాయన్న. ఎవరు గుర్తుపట్టకూడదని హైదరాబాదు చేరుకొని అక్కడే కూలీ పని చేస్తూ కొంతకాలం అజ్ఞాతంలో గడిపాడు.
సాయన్న మూసి నది ప్రాంతంలోనే ఉన్నాడని పసిగట్టిన పోలీసులు వందల సంఖ్యలో అర్ధరాత్రి వేళ నిద్రిస్తున్న సాయన్నను చుట్టుముట్టారు. ప్రమాదాన్ని పసిగట్టిన సాయన్న క్షణాల్లో తన అనుచరులను అప్రమత్తం చేసి మూసి ప్రవాహంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అనంతరం హైదరాబాదులో పరిచయమైన శివన్న సహాయంతో పాన్గల్ ప్రాంతంలోని మరో విప్లవకారుడు మియా సాబ్ లను కలుసుకున్నాడు. తన దగ్గర ఉన్న గుర్రాలలో కొన్నింటిని మియా సాబ్ సాయన్నకు బహుమతిగా ఇచ్చాడు. శివన్న విన్యాసాలు, శిక్షణలో సాయుధ దలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పర్వతాపురం అడవుల్లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని పరిసర గ్రామాల్లోని యువతకు గెరిల్లా పోరాటాల్లో శిక్షణ ఇచ్చాడు. సాయన్న ఆధ్వర్యంలో ప్రతి ఊరిలో వెలుగుతున్న చైతన్యాన్ని చూసి దొరలకు ముచ్చమటలు పట్టాయి.
నిజాం సర్కార్ తిరుగుబాటు చేస్తున్నాడని ప్రభుత్వానికి విన్నపాలు చేశారు. దొరలు పండుగ సాయన్నను పట్టుకోవడానికి హైదరాబాదు నుంచి ప్రత్యేక బలగాలను రప్పించారు. సాయన్న అనుచరులలో కొందరిని లోపరుచుకొని అడవిలో ఉన్న సాయన్నను వందలాది చుట్టూ ముట్టి దొంగ దెబ్బ తీసి అరెస్టు చేశారు. సాయన్న నమ్మిన బంటుగా ఉన్న మహమ్మద్ ఖాన్ పోలీసులతో చేతులు కలిపాడు. మోసంతో సాయన్నను పట్టించాడు. సాయన్నను విడిచిపెట్టమని అభ్యర్థిస్తూ రాణి శంకరమ్మ నిజాం సర్కార్కు పదివేల జరిమానా కట్టింది. రాణి గారి ఒత్తిడితో నిజాం సర్కార్ మార్ మత్ చోడో అనే లేఖను పాలమూరు మెహతా మీన్ కు పంపింది. అప్పటికే భారీ నజరానాలతో ఆ పోలీసు అధికారిని లోబరుచుకున్నారు దొరలు. ఆ లేలో మార్ తర్వాత చుక్క పెట్టి మత్ చోడో గా మార్చారు. సర్కార్ ఆజ్ఞాలను అమలు చేస్తున్నామంటూ ఆ ప్రజా విప్లవ వీరుని కంఠంని తెగ నరికారు.
మొండాన్ని పాలమూరులోనే ఖననం చేసి, తలను తిరుమల దేవుని గుట్టపై వేశారు. జనం కన్నీరు సముద్రంలో మారింది. సాయన్న తల్లి తన కొడుకు తలను కొంగులో దాచుకొని గుండెలు పగిలేలా ఏడుస్తూ పుట్టింటికి చేరింది. వేలాదిగా తరలివచ్చిన జనం సాక్షిగా మెలివేసిన మీసంతో చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఆ తలకి సమాధి కట్టారు. అనంతరం ప్రజలు ఆగ్రహత్వాలతో దొరలపై తిరగబడ్డారు. ఆ ప్రభంజనాన్ని చూసిన మిహతా మీన్ దొర గుండె ఆగి చనిపోయాడు.
సాయన్నను చంపిన ఆనందంలో పండగ చేసుకుంటున్న దొరల ఇళ్లపై దాడి చేసి తగలబెట్టారు ప్రజలు. ఆ మంటల్లో దొరలు సజీవ దహనం అయ్యారు. ఆనాటి నుండి వేలాదిగా పాలమూరు ప్రజలు ప్రతి సంవత్సరం పండుగ సాయన్న సమాధిని సందర్శిస్తున్నారు. ఆయన వీర గాధలను స్మరించుకుంటున్నారు. పండుగ సాయన్న ఓ పోరాట స్ఫూర్తి, నిరంతర చైతన్య దీప్తి, యువకుల గుండెల్లో విప్లవ జ్యోతి ఇది చరిత్రలో మరుగున పడ్డ కథనం. పేదవాని బ్రతుకులో ఆనందం తెచ్చిన పండుగ సాయన్నగా ఈనాటికీ జానపద పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. వారి హృదయాంతరాలలో కనిపిస్తూనే ఉన్నాయి.
పండగ సాయన్న ముదిరాజ్ కులంలో పుట్టినా కులమతాలకతీతంగా దొరల ఆకృత్యాలపై తిరగబడ్డ ధీరుడు. ముదిరాజు కుల సంఘం వారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో అంగరంగ వైభవంగా పండుగ సాయన్న విగ్రహాన్ని ప్రతిష్టించి నివాళులర్పిస్తున్నారు. చరిత్ర విస్మరించిన ఆ వీరుడి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చి నేటి తరానికి అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 150 ఏళ్ల క్రితమే సమ సమాజ స్థాపన చేసిన ఆ సంస్కర్త విగ్రహాలను గ్రామ గ్రామాన ఏర్పాటు చేసి యువకులకు స్ఫూర్తిని కలిగించాలని ఆకాంక్షిస్తున్నారు. పండుగ సాయన్న వారసులు నేటికీ పాలమూరు జిల్లాలో స్వగ్రామంలోని వ్యవసాయం చేసుకుంటూ బ్రతికేస్తున్నారు.
పేద ప్రజలకు కళ్ళల్లో ఆనందం నింపి దొరల ఆకృత్యాలకు బలైపోయిన ఆ వీరున్ని తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ స్మరిస్తూనే ఉంటారు.