Telugu Cinema

ఆమె గానం పరవశం.. జీవితం స్వరవశం.. వాణీ జయరాం..

వాణీ జయరామ్ (30 నవంబరు 1945 – 4 ఫిబ్రవరి 2023),

పాడటం ఒక కళ. అందులోనూ సినిమాకి పాడటం ప్రత్యేకమైన కళ. తెరమీద కనబడే  దృశ్యానికి, తెరవెనుక కంఠానికి మధ్య బంధం పాలు, పంచదారలా కలిసిపోవాలి, కరిగిపోవాలి. ఈ రెండింటినీ విడదీయలేని అనుభూతి ఆవిష్కృతం కావాలి. ఇంపు, సొంపు, స్పష్టతా, స్వచ్ఛతా గొంతులో గుడి కట్టాలి.

“బ్రోచే వారెవరురా” అని “శంకరాభరణం” లో పాడినా,  “ఆలోకయే శ్రీ బాలకృష్ణం” అని హృదయానికి “శ్రుతిలయలు” నేర్పినా, “మిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మా” అంటూ తన గళాన్ని “సీతాకోకచిలుక”లా శ్రోతల మనోవీధుల్లో ఎగురవేసి, “కురిసేను విరిజల్లులే” అంటూ కమ్మని కంఠంతో కలల “ఘర్షణ” చేసిన వాణీ జయరాం గారికే చెల్లింది.

ఆనతినీయరా హరా (స్వాతికిరణం) లాంటి అద్భుతమైన గీతాలను తెలుగులో ఆలపించారు వాణీ జయరాం గారూ. తెలుగులో పాడిన పాటలు తక్కువే అయినా కూడా మరపురాని పాటలతో శ్రోతలను అలరించారు.

  • ఎన్నెన్నో జన్మలబంధం నీది నాదీ (పూజ)
  • మానస సంచరరే (శంకరాభరణం)
  • సాగర సంగమమే (సీతాకోకచిలుక)
  • శ్రీసూర్య నారాయణా మేలుకో (మంగమ్మగారి మనవడు)
  • ఇన్నిరాసుల యునికి (శృతిలయలు)
  • అందెల రవమిది (స్వర్ణకమలం)
  • ఒక బృందావనం (ఘర్షణ)

అసాధారణమైన ప్రతిభ కలిగి ఉన్నా కూడా, ఆమె నిరాడంబరతకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఆమె గల మాధుర్యానికి హుందాతనానికి ఎంతటి వారైనా పరవశులు కావాల్సిందే. లతా మంగేష్కర్, ఆశాభోంస్లే తర్వాత 1970 నుంచి పదిహేనేండ్ల పాటు అటు ఉత్తరాదిన, ఇటు దక్షిణాదిన ఒకేసారి విపరీతమైన అభిమానం సంపాదించుకున్న గాయని వాణీ జయరాం గారూ.

జననం..

వాణీ జయరాం గారూ 30 నవంబరు 1945 నాడు తమిళనాడులోని వెల్లూరులో శాస్త్రీయ శిక్షణ పొందిన సంగీత విద్వాంసుల తమిళ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి దురైసామి అయ్యంగార్ గారూ, తల్లి పద్మావతి గారూ. వాణీ జయరాం గారి అసలు పేరు కలైవాణీ. వాణీ జయరాం గారూ గత జన్మలో కుమారస్వామికి తేనెతో పూజచేయడం వలన మంచి స్వరంతో పుట్టిందని ఆమెకు జ్యోతిష్కులు కలైవాణీ అనే పేరును సూచించారు. వాళ్ళ అమ్మానాన్నలకు ఆరుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు జన్మించారు. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో వాణీ జయరాం గారూ అయిదవ సంతానం. బిడ్డ పుట్టగానే మాములుగా ఎవరింట్లో అయినా పండుగ వాతావరణం ఉంటుంది. కానీ వాణీ జయరాం గారి జననం అందుకు భిన్నమైంది. తాను వాళ్ళ నాన్న గారికి ఐదో సంతానం. వరుసగా ఐదుగురు అమ్మాయిలే జన్మించిన వాళ్ళ నాన్న గారికి అయిదో సంతానమైనా మగపిల్లాడు అవుతాడని భావించారు. కానీ అమ్మాయి పుట్టడంతో పుత్రికోత్సాహం లేదు. దాంతో ఒకింత నిరాశకు లోనయ్యారు వాళ్ళ నాన్నగారు.

బాల్యం..

సంగీతం విద్వాంసుల కుటుంబం కావడంతో తల్లి పద్మావతి గారే ఆమెకు సంగీతంలో తొలి పాఠాలు నేర్పారు. తరువాత కడలూరు శ్రీనివాస అయ్యాంగార్ వద్ధ ముత్తుస్వామి దీక్షితులు రచనల్లో ప్రావీణ్యం పొందింది. అటు పిమ్మట శెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, జి.యస్ బాలసుబ్రమణ్యం, ఆర్ఎస్ మణి గార్ల మార్గదర్శకత్వంలో కర్ణాటక సంగీతంలో శిక్షణ ఇవ్వబడింది. వీరి వద్ధ శిష్యరికం చేసిన వాణీ జయరాం గారూ మూడేళ్ళ నాటికే వివిధ రాగాల మధ్య ఉండే బేధాలను అవలీలగా గుర్తుపట్టేవారు. సంగీతం పట్ల వాణీ జయరాం గారికి ఉన్న ఆసక్తిని గమనించిన ఇంట్లోవాళ్ళు కర్ణాటక సంగీతం నేర్చుకోమని ప్రోత్సహించేవారు. కానీ వాళ్ళ నాన్నగారికి సినీ సంగీతం అస్సలు ఇష్టం ఉండేది కాదు. రేడియోలో పాటలు వినే వాణీ జయరాం గారూ, వాళ్ళ నాన్న గారికి వినబడకుండా ఉండేలా రేడియో సౌండ్ తగ్గించేసి వివిధ భారతిలో తనకు ఇష్టమైన పాటలను దొంగచాటుగా వినేవారు.

వాణి జయరాం గారూ రేడియోలో సిలోన్ ఛానెల్‌కు అతుక్కుపోయి హిందీ సినిమా పాటలు ఎంతో ఇష్టంగా వింటుండేవారు. రేడియోలో పదేపదే ప్రసారమయ్యే పాటల ఆర్కెస్ట్రేషన్ మొత్తాన్ని ఆమె కంఠస్థం చేసి తిరిగి పాడేవరకు కూడా నిద్రపోయేవారు కారు. మద్రాసులోని ఆల్ ఇండియా రేడియోలో మొదటిసారి తన 8 సంవత్సరాల వయస్సులో, బహిరంగ ప్రదర్శన ఇచ్చారు వాణీ జయరాం గారూ. వాణీ జయరాం గారూ మద్రాసు యూనివర్సిటీలోని క్వీన్ మేరీస్ కళాశాల విద్యార్థిని. తన విద్యాభ్యాసం పూర్తయిన తరువాత, వాణీ జయరాం గారూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మద్రాసులో ఉద్యోగం చేరారు. ఆ తరువాత 1967వ సంవత్సరంలో వాణీ గారికి హైదరాబాదు లోని కోఠి శాఖకు బదిలీ చేయబడడంతో హైదరాబాదు వచ్చేశారు.

వివాహం..

కళాకారిణులకు వారి జీవన ప్రస్థానంలో వివాహం పెద్ద అవరోధంగా నిలుస్తుంది. కానీ వాణీ జయరాం గారి వైవాహిక జీవితం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. తాను గాయనిగా స్థిరపడడానికి తనకు వివాహం ఎంతో దోహదం చేసింది. సంగీతానికి మద్దతు ఇచ్చే కుటుంబంలో వివాహం చేసుకున్నారు. ఆమె అత్తగారు, పద్మా స్వామినాథన్, సామాజిక కార్యకర్త మరియు కర్ణాటక సంగీత గాయని. తాను సినీ నేపథ్య గాయనిగా ప్రయత్నిస్తానంటే “పెళ్లయ్యాక మీ భర్త ఒప్పుకుంటే ప్రయత్నించుకో” అని వాణీ జయరాం గారి తల్లిదండ్రులు అడ్డుచెప్పారు. 1968 వ సంవత్సరంలో వాణీ గారికి జయరాం గారితో వివాహం అయ్యింది. వివాహం తరువాత వాణీ గారి పేరు భర్త జయరాం గారి పేరుతో కలిపి వాణీ జయరాంగా మారిపోయింది.

ముంబై బ్యాంకు ఉద్యోగి అయిన జయరాం గారికి సంగీతం అంటే వల్లమాలిన అభిమానం. అప్పట్లో జయరాం గారూ పండిట్ రవిశంకర్ గారి వద్ధ సితార్ నేర్చుకునేవారు. భర్త, అత్త గార్ల ప్రోత్సాహంతో అబ్దుల్ రహమాన్ గారి వద్ధ హిందూస్తానీ సంగీతం నేర్చుకున్నారు వాణీ జయరాం గారూ. 1968లో వాణీ జయరాం గారికి వివాహం అయినా పిల్లలు లేరు. అయితే ఆ లోటుని సంగీతమే తీర్చిందని సగర్వంగా చెబుతుండేవారామె. ఇక వాణీ జయరాం గారి భర్త గారూ ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. తాను గాయనిగా ఇంత ఎత్తు ఎదగడానికి తన భర్త జయరాం గారూ అందించిన ప్రోత్సహమే కారణమని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు వాణీ జయరాం గారూ.

సినీ ప్రస్థానం..

వాణీ జయరాం గారి గాన నైపుణ్యాలను తెలుసుకున్న జయరాం గారూ వాణీ గారికి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. వాణీ గారిని పాటియాలా ఘరానాకు చెందిన ఉస్తాద్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ దగ్గర కఠోరమైన శిక్షణ కారణంగా వాణీ జయరాం గారూ తన బ్యాంకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి సంగీతాన్ని తన వృత్తిగా స్వీకరించారు.

హిందీ చిత్రం “గుడ్డీ”లో తొలి అవకాశం..

మొదట్లో వాణీ గారూ టుమ్రీలు, భజనలు, గజళ్ళను ఆలపించేవారు. ఆమె రాగానికి ముగ్ధుడయిన ప్రముఖ సంగీత దర్శకులు వసంతదేశాయ్ మరాఠి భజనలు రికార్డు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సంగీత దర్శకత్వం వహించిన రిషికేష్ ముఖర్జీ “గుడ్డి” 1970 సినిమాలో అనే హిందీ చిత్రంలో వాణీ జయరాం గారికి  అన్ని పాటలు పాడే అవకాశం లభించింది. అందులో “బోలో రే పప్పీ హరా” బహుళ ప్రజాదరణ పొందడమే కాకుండా పేరొందిన తాన్ సేన్ అవార్డులతో పాటు మరో అయిదు అవార్డులను సంపాదించి పెట్టింది. పండిట్ రవిశంకర్ గారూ స్వరపరిచిన హిందీ చిత్రం మీరా (1979) లోని “మేరే తో గిరిధర్ గోపాల్” పాట ఉత్తమ నేపథ్య గాయనిగా వాణీ జయరాం గారూ మొదటి సారి ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు. వీరు మీరా చిత్రం కోసం 12 భజనలను రికార్డ్ చేయగా, అవి అత్యంత ప్రజాదరణ పొందాయి.

దక్షిణాదిలో తొలిసారిగా..

వాణీ జయరాం గారూ 1973లో “స్వప్నం” అనే మలయాళం చిత్రం కోసం సలీల్ చౌదరి గారూ స్వరపరిచిన “సౌరయుధతిల్ విదర్న్నోరు” అనే సోలో పాటను పాడడం ద్వారా మలయాళం భాషలో దక్షిణాదిలో అడుగుపెట్టారు. ఈ పాట వాణీ జయరాం గారికి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చి దక్షిణాదిలో ఆమె ప్రస్థానానికి పురోగతిని అందించింది. యం.కె.అర్జునన్ , జి.దేవరాజన్ , యం.యస్.విశ్వనాథన్, వి.దక్షిణామూర్తి, యం.యస్.బాబురాజ్ , శ్యామ్ , ఏ.టి.ఉమ్మర్ , యం.బి.శ్రీనివాసన్, కె.రాఘవన్, జాన్సన్ , రవీంద్రన్  ఇళయరాజా లాంటి ప్రముఖ మలయాళ స్వరకర్తలందరి సంగీత సారథ్యంలో వాణీ జయరాం గారూ ఎన్నో పాటలు పాదారు. యుద్ధభూమి (1976) చిత్రం కోసం ఆర్.కె.శేఖర్ స్వరపరచిన వాణీ జయరాం గారూ పాడిన “ఆషాడ మాసం” పాట అత్యంత ప్రజాదరణను పొంది అనేక ప్రశంసలను అందుకున్నారు.

తెలుగు చిత్రాలలో కొనసాగిన హవా..

తెలుగులో తొలిసారిగా వాణీ జయరాం గారూ యస్.పి.కోదండపాణి గారూ స్వరాలు సమాకూర్చిన అభిమానవంతులు (1973) చిత్రం కోసం “ఎప్పటివలెకాదురా నా స్వామి” అనే పాట శాస్త్రీయ నృత్య ఆధారిత పాటను ఆలపించారు. తరువాత పూజ (1975) చిత్రానికి వాణీ గారూ పాడిన పాటలు “పూజలు చేయా” మరియు “ఎన్నెన్నో జన్మల బంధం” పాటలు అద్భుతంగా నిలిచి తెలుగులో వారి ప్రస్థానాన్ని సుస్థిరం చేశాయి. ఆమెను తెలుగు చిత్రసీమలో అగ్రస్థానానికి చేర్చాయి. తెలుగు చిత్రాలలో మైలురాయిగా నిలిచిన అద్భుతమైన కళాఖండం శంకరాభరణం (1979). కె.వి.మహదేవన్ సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రం కోసం వాణీ జయరాం గారూ ఐదు పాటలు పాడి తన అశేష ప్రజాదరణను చూరగొనింది.

“మానస సంచరరే” అనే పాటకు సమిష్టిగా రెండవ జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. శంకరాభరణం లోని పాటలకు ఉత్తమ నేపథ్య గాయనిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డును కూడా అందుకున్నారు. వాణీ జయరాం గారూ సుప్రసిద్ధ దర్శకులు కళాతపస్వి కె.విశ్వనాథ్ మరియు సంగీత దర్శకులు కే.వీ.మహదేవన్‌లతో కలిసి పనిచేసిన చిత్రాలలో పాటలు పాడారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ మరియు సంగీత దర్శకులు కే.వీ.మహదేవన్‌ల సారథ్యంలో 1990లో నిర్మించిన “స్వాతి కిరణం”లో వాణీ జయరాం గారూ పాడిన అన్ని పాటలు మంచి ఆదరణ పొందాయి. అందులో “ఆనతినీయరా హరా” అనే పాటకు మూడవసారి జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు.

తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, ఒరియా, గుజరాతి మరాఠీ, బెంగాలీ, భోజ్ పురి తదితర 14 భాషలకు చెందిన సుమారు 8000 పైచిలుకు పాటలను వాణీ జయరాం గారూ ఆలపించారు. పాట ఏ భాషలోనిదైనా సరే ఆమె అవలీలాగా పాడగలదు. అందులోని పట్టును సులభంగా గ్రహించే శక్తి నేర్పు ఆమెకున్నాయి. తెలుగు టీవీ సీరియల్స్ లో కూడా పాడి నంది అవార్డున అందుకున్న సినీ గాయని వాణి జయరాం గారూ. తులసి దాస్, కబీర్, సూర్ దాస్, మీరా, జయదేవ, తుకారాం భజనలు ఆలపించడానికి ఎక్కువగా ఇష్టపడే వాణీ జయరాం గారూ రికార్డింగ్ స్టూడియో కూడా నడిపేవారు. ఆమె అందుకున్న పురస్కారాలు లిస్టు తక్కువేమీ కాదు. “అపూర్వ రాగంగల్” చిత్రంలోని ఏళు స్వరంగళుక్కల్ అనే శాస్త్రీయ గీతానికి 1976లో రాష్ట్రపతి అవార్డు లభించింది.

అపూర్వ రాగంగల్ తో జాతీయ పురస్కారం..

అపూర్వ రాగంగల్ చిత్రంలో ఆమె పాడిన పాటలకు ఉత్తమ నేపథ్య గాయనిగా తన మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. 1980లో శంకరాభరణం చిత్రంలోని “మానస సంచరరే” పాటకు రెండోసారి జాతీయ అవార్డు లభించింది. 1992వ సంవత్సరంలో కె.విశ్వనాథ్ “స్వాతికిరణం” చిత్రంలోని “ఆనతినీయరా హారా” పాటకు మూడోసారి జాతీయ ఉత్తమ గాయనిగా నిలిచింది. ప్రస్తుతం సినిమా పాటలకు దూరంగా ఉండి శాస్త్రీయ సంగీత కచేరిల పైన ఎక్కువ దృష్టి నిలుపుతున్న వాణీ జయరాం గారు ప్రైవేట్ గా “గీతాగోవిందం”, ఆదిశంకరుని “ఆనందలహరి” అనే కేసెట్ను విడుదల చేశారు. వాణీ జయరాం గారూ మంచి గాయని మాత్రమే కాదు, చక్కని చిత్రకారుని కూడాను. వాణిజయరా మొట్టమొదటి కచేరి 1969 లో జరిగింది. మనదేశంలోనే కాకుండా తూర్పు, పశ్చిమ దేశాల్లో కూడా ఆమె కచేరీలు నిర్వహించింది. ముఖ్యంగా యూరప్ లో ఆమె చేసిన కచేరీలకు బ్రహ్మాండమైన స్పందన లభించింది.

లతా మంగేష్కర్‌తో వైరం

ఆ తర్వాత 1979లో విడుదలైన మీరా సినిమా వాణీ జయరాం గారికి, లత మంగేష్కర్ గారికి మధ్య దూరాన్ని మరింత పెంచింది. మీరా చిత్రానికి రవిశంకర్‌ను సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు గుల్జార్ గారూ. ఆ విషయం లతా మంగేష్కర్‌ గారికి నచ్చలేదు. తన సోదరుడిని సంగీత దర్శకునిగా తీసుకోకపోతే తాను ఆ చిత్రంలో పాటలు పాడేది లేదని తేల్చి చెప్పేశారు. దాంతో ఆ చిత్రంలోని పాటలన్నీ వాణీ జయరాం గారితో పాడించారు గుల్జార్. దాంతో వాణీజయరాం, లతా మంగేష్కర్ ల మధ్య వైరం పెరిగింది. కొన్నాళ్ల తర్వాత బాలీవుడ్‌లో రాజకీయాలు చూడలేక మద్రాస్‌కు తిరిగి వచ్చేశారు వాణీ జయరాం గారూ. దక్షిణాదిన గల అన్ని భాషలలో అద్భుతమైన పాటలతో సినీ ప్రేక్షకులను ఊర్రూతలూగించారు.

పురస్కారములు, గౌరవములు..

రాష్ట్ర పురస్కారములు..

1972 సంవత్సరానికి గానూ ఘూంగాట్ అనే చిత్రానికి గుజరాత్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ ఉత్తమ మహిళా నేపథ్య గాయని అవార్డునిచ్చి సత్కరించింది.

అజగే ఉన్నై ఆరాధిక్కిరెన్ అనే చిత్రానికి గానూ 1979 వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మహిళా నేపథ్య గాయని బహుమతిని అందజేసింది.

1979 సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు శంకరాభరణం చిత్రానికి గానూ ఉత్తమ నేపథ్య గాయనిగా నంది అవార్డునిచ్చి సన్మానించారు.

ఒడిశా రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ “దేబ్జాని” చిత్రానికి గానూ 1982లో ఉత్తమ గాయని అవార్డునిచ్చి గౌరవించారు.

ఇతర పురస్కారములు..

1972 సంవత్సరంలో గుడ్డి అనే హిందీ చిత్రంలోని “బోల్ రే పాపి హరా” పాటకు ఉత్తమ చలనచిత్ర నేపథ్య గాయనిగా మియాన్ తాన్సేన్ పురస్కారం లభించింది.

1979 – పండిట్ రవిశంకర్ స్వరాలు సమాకూర్చిన “మీరా” చిత్రంలో వాణి జయరాం గారూ పాడిన “మేరే తో గిరిధర్ గోపాల్” పాటకు ఫిల్మ్ వరల్డ్

(1979) సినీ హెరాల్డ్ (1979) నుండి ఉత్తమ నేపథ్య గాయని పురస్కారం అందుకున్నారు.

1991 – తమిళ చలనచిత్ర సంగీతానికి వాణి జయరాం గారూ చేసిన కృషికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వారు కలైమామణి పురస్కారాన్ని ఇచ్చి సత్కరించారు.

1992 సంవత్సరంలో అతి పిన్న వయస్సులో “సంగీత్ పీత్ సమ్మాన్” పురస్కారం పొందిన వారుగా ప్రసిద్ధి చెందారు.

2004 సంవత్సరానికి గానూ తమిళనాడు ప్రభుత్వం వారు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డునిచ్చి సన్మానించారు.

2005 వ సంవత్సరంలో నాలుగు దక్షిణ భారత భాషలలో నేపథ్య గాయనిగా వాణి జయరాం గారూ చేసిన విశేష కృషికి గుర్తింపుగా “కముకర” పురస్కారం లభించింది.

ముద్ర అకాడమీ, చెన్నై వారు 2006 లో ముద్ర అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారాన్నిచ్చి వాణీ జయరాం గారిని గౌరవించింది. 

2012 సంవత్సరంలో సుబ్రహ్మణ్య భారతి అవార్డును వాణీ జయరాం గారూ అందుకున్నారు.

2014 సంవత్సరానికి గానూ హైదరాబాద్‌లో రేడియో మిర్చి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని వాణీ జయరాం గారూ అందుకున్నారు.

“1983′ చిత్రంలోని ‘ఒలాంజలి కురువి’ పాటకు గానూ 2014లో ఆసియావిజన్ అవార్డ్స్ వారి ఉత్తమ నేపథ్య గాయని పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు.

కన్నదాసన్ కజగం, కోయంబత్తూర్ వారు 2014లో వాణీ జయరాం గారికి కన్నడసన్ అవార్డును బహుకరించారు 

ఉమెన్ అచీవర్స్ అవార్డు వేడుక చెన్నై ద్వారా 2015 సంవత్సరానికి గానూ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును వాణీ జయరాం గారూ అందుకున్నారు.

రెడ్ ఎఫ్ఎమ్ మ్యూజిక్ అవార్డ్స్ వారు 2016 సంవత్సరంలో యేసుదాస్ గారి ద్వారా ఉత్తమ యుగళగీతం పురస్కారాన్ని అందుకున్నారు.

వనిత ఫిల్మ్ అవార్డ్స్ వారి నుండి 2017 సంవత్సరంలో వాణీ జయరాం గారూ ఉత్తమ గాయని పురస్కారాన్ని స్వీకరించారు.

2017 సంవత్సరంలో వాణీ జయరాం గారిని ఘంటసాల జాతీయ అవార్డు వరించింది.

నార్త్ అమెరికన్ ఫిల్మ్ అవార్డ్స్ – న్యూయార్క్ వారు 2017 సంవత్సరానికి గానూ ఉత్తమ మహిళా నేపథ్య గాయని, మలయాళం పురస్కారాన్ని అందజేశారు.

శంకర నేత్రాలయ అందించిన MS సుబ్బులక్ష్మి అవార్డును 27 జనవరి 2018 నాడు వాణీ జయరాం గారిని వరించింది.

ప్రవాసీ ఎక్స్‌ప్రెస్ అవార్డ్స్, సింగపూర, వారు 2018 సంవత్సరానికి గానూ వాణీ జయరాం గారికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డునిచ్చి సత్కరించారు.

పి.బి.శ్రీనివాస్ జ్ఞాపకార్థం స్థాపించబడిన PBS పురస్కార్ అవార్డు వాణీ జయరాం గారిని వరించింది.

హైదరాబాద్‌లోని యువకళా వాహిని సంస్థ వారు ఆమెకు 30 జూలై 2014 నాడు ‘ప్రైడ్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్’ అవార్డును ఇచ్చి సత్కరించింది.

2004 సంవత్సరంలో కముకర అవార్డు వాణీ జయరాం గారిని వరించింది.

2007 సంవత్సరంలో సౌత్ ఇండియన్ మీరాపురస్కారం వాణీ జయరాం గారికి లభించింది.

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు

“1983” అనే చిత్రం లోని “ఒలనాజలి కురువి” పాటకు గానూ 2015 సంవత్సరంలో ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు.

60వ సౌత్ ఇండియన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో భాగంగా 2013 సంవత్సరానికి గానూ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్స్ అవార్డును వాణీ జయరాం గారూ స్వీకరించారు.

మీరా అనే హిందీ చిత్రంలోని “మేరే తో గిరిధర్ గోపాల్” పాటకు గానూ 1980 సంవత్సరంలో ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును వాణీ జయరాం గారూ అందుకున్నారు.

జాతీయ చలనచిత్ర పురస్కారాలు..

తమిళం చిత్రం “అపూర్వ రాగంగల్” లో పాడిన పాటలకు గానూ 1975 సంవత్సరంలో ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా వాణీ జయరాం గారూ జాతీయ పురస్కారాన్ని చేజిక్కించుకున్నారు.

శంకరాభరణం తెలుగు 

చిత్రానికి గానూ 1980 సంవత్సరంలో ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.

“స్వాతి కిరణం” చిత్రంలోని “అనతినీయరా హర” అనే పాటకు గానూ 1991 సంవత్సరంలో ఉత్తమ నేపథ్య (తెలుగు) గాయనిగా జాతీయ పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు.

జాతీయ గౌరవాలు

భారతీయ చలనచిత్ర రంగంలో నేపథ్య గాయనిగా చేసిన సేవలకు గానూ వాణీ జయరాం గారిని 2023 సంవత్సరానికి గానూ పద్మ భూషణ్ అవార్డు వరించింది. దురదృష్టావశాత్తు ఆ పురస్కారాన్ని అందుకోకుండానే వారు మరణించారు.

మరణం..

19 భాషలు, 1000కి పైగా సినిమాలు, 20వేలకు పైగా పాటలు. ఇలా సుమారు 5 దశాబ్దాల పాటు తేనె కన్నా తీయనైన స్వరంతో సంగీత ప్రియులను ఓలలాడించిన గొంతు శాశ్వతంగా మూగబోయింది. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాణీ జయరాం గారూ 04 ఫిబ్రవరి 2023 నాడు అనుమానస్పదంగా మృతిచెందారు. చెన్నైలోని నుంగంబాకం ప్రాంతంలో ఒంటరిగా ఉంటున్న వాణీ జయరాం గారిది సహజ మరణం కాదని, ఎవరో హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆమె నుదురు, ముఖంపై గాయాలు ఉండటంతో అనుమానాలు మొదలయ్యాయి.

అయితే ఇంట్లో ఉన్న గ్లాస్ టేబుల్ మీద పడటంతో ఆమెకు బలంగా గాయాలయ్యాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. పోస్టుమార్టం రిపోర్టు బయటికొస్తే గానీ వాణీ జయరాం గారూ ఎలా చనిపోయారు..? కారణాలేంటి..? అనే విషయాలు తేలిపోనున్నాయి. రిపోర్టు కోసం అటు అభిమానులు, ఇటు కుటుంబ సభ్యులు, బంధువులు వేచి చూస్తున్నారు. అనుమానాస్పద మృతిగా చెన్నై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటిని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వాణీ జయరాం గారి మృతిపై అభిమానులు, కుటుంబ సభ్యులకు అనేక అనుమానాలున్నాయి. దీంతో ఈ ఘటన ఓ మిస్టరీగా మారింది.

Back to top button