
పారిస్ ఒలింపిక్స్ వేదికగా 124 ఏళ్ల రికార్డును తిరగరాస్తూ.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో పతకాలను సొంతం చేసుకొని భారత్‌కు మరచిపోలేని విజయాన్ని అందించింది మను బాకర్. ఈరోజు జరిగిన టీమ్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకాన్ని రెండు రోజుల వ్యవధిలో కలిపి రెండు పతకాలు సాధించి, భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది. పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత తొలి మహిళా షూటర్‌గానూ ఘనతను సొంతం చేసుకుంది. షూటింగ్‌లో దాదాపు 12 ఏళ్ల పతక నిరీక్షణకు తెరదించింది. వెంట్రుక వాసిలో రజతం చేజారింది. అయితేనేం తన ప్రదర్శనతో కోట్ల హృదయాలను పులకించేలా చేసింది.
గత ఆదివారం చటీరోక్స్ షూటింగ్ సెంటర్ వేదికగా జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో మను మూడో స్థానంలో నిలిచి, కాంస్య పతకం సొంతం చేసుకుంది. దీంతో.. షూటింగ్ విభాగంలో తొలి మెడల్ సాధించిన మొదటి మహిళా షూటర్‌గా మను చరిత్ర సృష్టించింది. ఇటీవల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్, మను బాకర్ జోడీ.. దక్షిణ కొరియాతో పోటీ పడగా.. మను బాకర్ జోడి 16 పాయింట్లు సాధిస్తే, దక్షిణ కొరియా ద్వయం(లీ-యెజిన్) 10 పాయింట్లు సాధించింది. మను అప్పటికే వ్యక్తిగత విభాగంలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో కాంస్య పతకం సాధించింది. ఫైనల్‌లో మను బాకర్ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా.. దక్షిణ కొరియా షూటర్లు ఓహ్ యే జిన్ (243.2 పాయింట్లు) స్వర్ణం, కిమ్ యేజే (241.3 పాయింట్లు) రజతం గెలిచారు.
దీంతో స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్‌గా మను బాకర్ చరిత్ర సృష్టించింది.
గతంలో చూసుకుంటే.. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు 1900 ఒలింపిక్స్‌లో బ్రిటీష్-ఇండియన్ అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్ అథ్లెటిక్స్‌లో రెండు రజత పతకాలు సాధించాడు. ఇతడు భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ప్రిచర్డ్ తర్వాత ఏ భారత క్రీడాకారుడు కూడా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించలేదు. ఇప్పుడు ఆ ఘనతను మను సొంతం చేసుకోవడం విశేషం!
ఎవరీ మను బాకర్…
హర్యానాకు చెందిన 22 ఏళ్ల యువతి ఈ మను బాకర్.. ఆమె తండ్రి ఓ మెరైన్ ఇంజినీర్, తల్లి ప్రిన్సిపల్. మనుకి చిన్నప్పటి నుంచే క్రీడలంటే ఎంతో ఆసక్తి ఉండేదిట. తనలోని ఈ అభిరుచిని ముందునుంచి గుర్తించిన తల్లిదండ్రులు.. ఆమెకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. షూటింగ్‌లో తనకు ఎక్కువ మక్కువ ఉండటంతో.. దానిపైనే పూర్తి ఫోకస్ పెట్టింది. 2017లో కేరళలో జరిగిన నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో మను ఏకంగా 9 బంగారు పతకాలను సాధించింది. ఆ తరువాత 2018లో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లోనూ 16 ఏళ్ల వయసులోనే గోల్డ్ మెడల్ గెలుపొందింది. ఇప్పుడు ఒలంపిక్స్‌లోనూ సత్తా చాటి, సరికొత్త చరిత్రకు నాంది పలికింది.
నిజానికి ఫైనల్లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన మను.. నిలకడైన ప్రదర్శన చేసింది. 8 మంది షూటర్ల తుది పోరులో ఏ దశలోనూ టాప్-3లో చోటు కోల్పోలేదు. ఓ దశలో చూస్తే రజత పతక రేసులో నిలిచింది. చివరి షాట్(ఆ షాట్ తర్వాత మూడో స్థానంలో ఉన్నవాళ్లు ఎలిమినేట్ అవుతారు) ముందు వరకు కిమ్ యెజిపై 0.1 పాయింట్ ఆధిక్యంతో రెండో స్థానంలో ఉంది. కానీ ఆఖరి షాట్లో మను 10.3 పాయింట్లు స్కోర్ చేయగా.. కిమ్ 10.5 పాయింట్లు స్కోర్ చేసి స్వర్ణ పోరు(మరో రెండు షాట్లు)కు అర్హత సాధించింది. ముందు నుంచి ఆధిక్యంలో ఉన్న జిన్ యెవోనే తుది విజేతగా నిలిచింది.
జస్పాల్ రాణా కోచ్ కాదు..
ఓ మోటివేటర్..
మను పతకం వెనుక వ్యక్తిగత కోచ్ జస్పాల్ రాణాది కీలక పాత్ర అని చెప్పవచ్చు. వీరిద్దరి మధ్యలో వచ్చిన విభేదాలతో రెండేళ్లపాటు మను, జస్పాల్ దూరంగా ఉన్నారు. గతేడాది మళ్లీ కలిసి పారిస్ ఒలింపిక్స్ కోసం సిద్ధమయ్యారు. ఆసియా క్రీడల్లో 4 స్వర్ణాలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో జూనియర్ పసిడి సాధించిన జస్పాల్‌కు షూటింగ్‌పై గొప్ప పట్టు, మంచి అవగాహన ఉంది. 2018 ఆసియా క్రీడలకు ముందు మను కోచ్‌గా జస్పాల్ బాధ్యతలు చేపట్టాడు. మను నైపుణ్యం, ప్రతిభకు అతని అనుభవం తోడవ్వడంతో రిజల్ట్ అద్భుతంగా వచ్చింది. ప్రపంచకప్, ప్రపంచ ఛాంపియన్‌షిప్, కామన్వెల్త్ క్రీడలు.. ఇలా ఆమె పతకాల వేటలో దూసుకెళ్లింది. మనుకు అన్నీ తానై వ్యవహరించిన జస్పాల్‌ను మను తండ్రి సమానుడని, మంచి స్నేహితుడని ఎన్నోసార్లు చెప్పింది.
కానీ టోక్యో ఒలింపిక్స్ సమయంలో వివిధ కారణాలతో వీళ్లు విడిపోయారు. కారణం.. ఆ ఒలింపిక్స్‌లో మను పేలవ ప్రదర్శన చేయడమే. ఆ తర్వాత రెండేళ్లలో ప్రపంచకప్‌లో ఓ కాంస్యం, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం మాత్రమే గెలవగలిగింది. ఇలా అయితే లాభం లేదనుకుని ఆమెనే గత రెండేళ్ల కింద జస్పాల్ దగ్గరికి వెళ్లింది. గతాన్ని మర్చిపోయి తిరిగి పనిచేద్దామని కోరింది. జస్పాల్ కూడా అంగీకరించడంతో మను కెరీర్ మళ్లీ ఊపందుకుంది. ఆమెకు మానసికంగా మోటివేట్ చేసి, ఆట తీరును మరింత మెరుగుపర్చాడు. జస్పాల్‌ను చూస్తే ధైర్యం వస్తుందనే చెప్పే మను తిరిగి పతకాల బాట పట్టింది. ఆమెలో భయాన్ని పూర్తిగా తొలగించి, ప్రశాంతంగా ఉండటాన్ని అతను అలవాటు చేశాడు. తల్లిదండ్రులు ఇంటి దగ్గరే ఉండి మనుకు తోడుగా జస్పాల్‌ను పారిస్ పంపించారంటేనే అతనిపై వాళ్లకున్న నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒలింపిక్స్‌కు సన్నాహకంగా మనుకు జస్పాల్ ఇచ్చిన గొప్ప శిక్షణకు ఫలితమే ఈరోజు చరిత్రలో ఆమె పేరును లిఖించేలా చేసింది.
దేశానికే కాదు వ్యక్తిగతంగానూ మనూకు ఇదో మధుర విజయమనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నో అంచనాలతో మూడేళ్ల కింద టోక్యో ఒలింపిక్స్‌లో మూడు విభాగాల్లో బరిలోకి దిగి, అన్నింట్లోనూ క్వాలిఫికేషన్ దశలోనే నిష్క్రమించి కన్నీళ్లు పెట్టుకున్న ఆ మను.. నేడూ పారిస్ ప్రదర్శనతో తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంది.