మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి పొరుగు దేశాల గౌరవ మన్ననలను పొందుతున్న మన దేశంలో అడపాదడపా చోటు చేసుకుంటున్న మత కలహాలు వల్ల దేశఔన్నత్యం చెరుగుపోతుందని అంటున్నారు నిపుణులు. బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం ఏళ్ల తరబడి కొనసాగిన రామజన్న భూమి వివాదానికి సర్వోన్నత న్యాయస్థానం ఉభయతారకమైన పరిష్కారాన్ని చూపించి, రెండు ప్రధాన మతాల మధ్య రావణకాష్టంలా రగులు తున్న కలహానికి చరమగీతం పాడింది.
అయితే, తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభల్ పట్టణం మరో మతవివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ ఊళ్లోని షాహి జామా మసీదు ఉన్నచోట ఒకప్పుడు హరిహర మందిరం ఉండేదని, మొగలాయి చక్రవర్తి బాబర్ ఈ అలయాన్ని కూల్చివేసి, మసీ దును నిర్మించారంటూ దాఖలైన ఫిర్యాదును పురస్కరించుకుని స్థానిక కోర్టు సర్వే చేపట్టవలసిందిగా ఆదేశించింది.
దీంతో కోర్టు పర్యవేక్షణలో సర్వేకు వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకోవడంతో అల్లర్లు చెలరేగి నలుగురు వ్యక్తులు చనిపోయారు. పోలీసు కాల్పుల్లోనే వారు చనిపోయారని స్థానికులు చెబుతుండగా, తాము ప్రాణాలు తీయగలిగే ఆయుధాలను వాడనే లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ అల్లర్ల కారణంగా మీరటకు సమీపంలో ఉండే ఈ జిల్లా కేంద్రంలో ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. రాజకీయ ప్రయోజనాలను ఆశించి రాష్ట్రప్రభుత్వం ఉద్దేశపూర్వ కంగా మత కలహాలను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోందంటూ విపక్షాలు మండిప దుతుండగా, తాజా వివాదంలో తమ ప్రమేయం లేదంటూ ప్రభుత్వంలోని పెద్దలు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే, 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న ప్రార్ధనా స్థలాలను యథాతథంగా ఉండాలని, వాటి భౌతిక స్థితిలో ఎలాంటి మార్పు చేయకూడదని బాబ్రీ మసీదు కూల్చివేతకు ఏడాది ముందు రూపుదాల్చిన ప్రార్ధనా స్థలాల చట్టం 1991 విస్పష్టంగా చెబుతోంది. అయినప్పటికీ మసీదులు ఒకప్పటి హిందూ దేవాలయాలేనంటూ అడపాదడపా పిటిషన్లు దాఖలు కావడం, వాటిని కోర్టులు స్వీకరించి విదారణ చేపట్టడం జరుగుతూనే ఉంది.
అయితే ఇలాంటి కేసులు దాఖలైన సందర్భంగా సుప్రీంకోర్టు చొరవతీసుకుని లోటుపాట్లు లేని విధంగా పటిష్టంగా చట్టాన్ని రూపొందించే విషయంలో ప్రభుత్వానికి మార్గదర్శకత్వం చెయాల్సిన అవసరం ఉంది. భిన్నమతాలు, విభిన్న సంస్కృతులతో ప్రపంచ దేశాలకు ధీటుగా నిలుస్తున్న భారత్‌ను ఈ విధంగా మతకలహాలతో ప్రతిష్టను దిగజార్చకుండా మతశక్తులపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాలి.