Telugu Special Stories

సమసమాజ స్థాపన కోసం. పాటుపడిన.మహాత్మ జ్యోతి బాఫూలే!

భారతదేశ ఆధునిక యుగ వైతాళికుడు, 

దేశ ప్రప్రథమ సామాజిక తత్వవేత్త, 

గాంధీ కంటే ముందే మహాత్మునిగా పేరు..

కులం పేరుతో తరతరాలుగా అన్నిరకాలుగా అణచివేతలకు, వివక్షకు గురైన బడుగు, బలహీన వర్గాల్లో ఆత్మస్థైర్యం నింపి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు ఫూలే.

సాంఘిక సమానత్వం, సామాజిక న్యాయం అంటూ ఆలోచించి, ప్రబోధించి దళిత వర్గాలను, బలహీన వర్గాలను జాగృతం చేసిన క్రియాశీలి ఆయన. బాలికా విద్యావ్యాప్తికి విశేష కృషి జరిపాడు.

సత్యశోధక్ సమాజ్ స్థాపన చేసి, దీన బంధు పత్రిక ద్వారా జాతిని జాగృతం చేసిన బడుగుజీవుల ఆశాజ్యోతి.. జ్యోతిరావు బా ఫూలే వర్ధంతి ఈ నెల(నవంబర్ 28)సందర్భంగా ఆయన జీవిత చరిత్రను ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం…

నేపథ్యం..

1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో వ్యవసాయ తోట మాలి కులానికి చెందిన కుటుంబంలో జన్మించారు ఫూలే. తండ్రి గోవింద్ రావు. ఈయన పూల వ్యాపారం చేయడంవల్ల వారి ఇంటి పేరు ఫూలేగా మార్పు చెందిందని చ‌రిత్ర‌కారులు చెబుతుంటారు. అతి తక్కువ కాలం పాఠశాలకు వెళ్ళినప్పటికీ ఫూలేకి పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువ. ప్రతిరోజూ నిద్రకుపక్రమించే ముందు లాంతరు వెలుతురులో చదువుకునేవాడు. జ్యోతిరావుకు చిన్ననాటి నుంచే శివాజీ అంటే అభిమానం ఎక్కువ. శివాజీ, జార్జ్‌ వాషింగ్టన్‌ల జీవితచరిత్రలు తనను ప్రభావితం చేయడంవల్ల దేశభక్తి, నాయకత్వ ల‌క్ష‌ణాలు అలవడ్డాయి. 

జ్యోతిరావు ఫూలే తల్లిని చిన్నతనంలోనే కోల్పోయారు. క్రైస్తవ మత బోధకులు ప్రారంభించిన పాఠశాలలో చదువుకున్నారు. తన 13వ ఏటా సావిత్రిబాయితో వివాహం జరిగింది.

జ్యోతిబా తన బ్రాహ్మణ మిత్రుడి పెళ్ళి ఊరేగింపులో పాల్గొన్నప్పుడు జరిగిన అవమానంతో తన జీవితం ఓ మలుపు తిరిగింది. పెద్దవుతూనే సమాజంలోని కుల వివక్షపై సొంత అభిప్రాయాలు ఏర్పరచుకొని మిగిలిన వాళ్ళ కంటే తాము ఉన్నతులమన్న బ్రాహ్మణుల వాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. శూద్రులు, అతిశూద్రులు కలిసి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని జ్యోతిరావు ఫూలే కోరారు.

విద్యావ్యాప్తి..

శతాబ్దాలుగా అణచిపెట్టి ఉన్న కింది కులాల గురించి ఆలోచించిన మొదటి నాయకుడు జ్యోతిరావు ఫూలే. 1791లో థామస్‌ రచించిన ‘మానవ హక్కులు’ పుస్తకం అతడి ఆలోచనలను ప్రభావితం చేసింది. 1848 లో కుల‌వివ‌క్ష‌కు గురైన జ్యోతీరావ్ ఫూలే.. ఆనాటి నుంచి కుల వివ‌క్ష‌కు వ్య‌తిరేకంగా పోరాటం ప్రారంభించారు. పూలే ప్రజల్లో వితంతు పునర్వివాహం గురించి చైతన్యం తీసుకొచ్చారు. 1848లో పుణేలో ‘అంటరాని’ కులాల బాలికల కోసం జ్యోతిబాపూలే ఒక పాఠశాలను స్థాపించాడు. 1851లో మరో రెండు పాఠశాలలను ఏర్పాటు చేశారు. 1855లో రాత్రి బడులు ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. స్త్రీ, పురుషుల మధ్య లింగ వివక్షను బాపూలే విమర్శించారు.

1864 గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించ‌డం ద్వారా వితంతువులైన గర్భిణీల‌కు అండగా నిలిచారు. ఇటువంటి కేంద్రం స్థాపించడం దేశంలోనే మొదటిది కావడం విశేషం. వితంతు పునర్ వివాహాలను సైతం ప్రోత్సహించారు. బాల్య‌వివాహాల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకొచ్చారు. అమెరికా స్వాతంత్య్ర పోరాటం తనను ప్రభావితం చేయడమే కాకుండా మానవత్వపు విలువలెైన స్వేచ్ఛ, సమానత్వం గురించి లోతుగా ఆలోచింపచేసింది.

పూలే స్థాపించిన సత్యశోధక సమాజం.. సత్యం, సమానత్వం అన్న సూత్రాల ఆధారంగా నూతన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ‘సత్యశోధక్ సమాజ్’ అనే సంస్థను జ్యోతిబాపూలే స్థాపించారు. దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాల లాంటి వాళ్ళు అని చాటి చెప్పాడు. హిందూ సమాజంలో అగ్రకులాల వారి బానిసలుగా బతుకుతున్న నిమ్నకులాల వారిలో తమ బానిసత్వం పట్ల సరికొత్త చైతన్యం రగిలించారు. కుల వ్యవస్థను బానిసత్వంగా పరిగణిస్తూ.. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ‘గులాంగిరి’ వంటి ఎన్నో పుస్తకాలు రాశాడు. నిమ్న కులాల వారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెంపొందించే విధంగా జ్యోతిబా ఫూలే కృషి చేశారు. 

భగవంతుడు, భక్తుడికి మధ్య దళారీలుగా పురోహితులు ఉండవద్దని పిలుపునిచ్చింది.

ఆ కాలంలోనే మునిసిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికై ప్రజాప్రతినిధిగా కూడా సేవలందించారు. 

దీనబంధు అనే పత్రికను స్థాపించి బీదల, కార్మికుల సమస్యలను సమాజానికి తెలిసేలా చేశారు. 

భారత రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్‌ అంబేద్కర్..‌ జ్యోతిబా పూలే తన గురువుగా ప్రకటించుకున్నారంటే ఆయన గొప్పదనం ఏంటో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు.

ఆయన కొన్నాళ్లపాటు దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ 1890 నవంబరు 28న కన్నుమూశారు. జీవితాంతం అసమానతలు లేని సమసమాజ స్థాపన కోసం పరితపించిన మహాత్మ జ్యోతిబాపూలే ప్రజల గుండెల్లో ఎల్లప్పుడు నిలిచి ఉంటారు. అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ స్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడుగా గుర్తించుకుంటుంది. 

విద్య వివక్ష, పేదరికం, ఆర్థిక అసమానత్వం నిర్మూలించడానికి ఆయన ఎంతో పాటుపడ్డారు. కుల, మత రహిత సమాజ నిర్మాణానికి ఎనలేని కృషి సలిపారు. సమాజం విద్యాపరంగా ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి అవుతుందని ఫూలే ఆశించారు.

Show More
Back to top button