HEALTH & LIFESTYLE

రెస్టారెంట్‌ ఫుడ్ తింటే “రెస్ట్‌ ఇన్‌ పీస్‌” కావలసిందేనా !

సురక్షిత పోషకాహార లభ్యత ప్రజారోగ్యానికి పునాది. హానికారక బ్యాక్టీరియా, వైరస్‌, పరాన్నజీవులు లేదా ప్రమాదకర రసాయనాలు కలిసిన అసురక్షిత ఆహారం తీసుకొనుట ప్రాణాంతకం కావచ్ఛు. ఇలాంటి అసురక్షిత ఆహారం తినడం వల్ల 200లకు పైగా వ్యాధులు రావచ్చని ఐరాస నివేదికలు హెచ్చరిస్తున్నాయి. కొన్ని హోటల్స్‌, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్స్‌ వడ్డించే రుచికరమైన వంటకాలను తీసుకున్న వెంటనే డయేరియా నుంచి మొదలుకొని క్యాన్సర్‌ వరకు ఏదో ఒక వ్యాధి రావచ్చు. ఇలాంటి విషతుల్య ఆహారం తీసుకున్న పిల్లలు, వృద్ధులు తొందరగా రోగాల బారిన పడడం, తీవ్ర రూపం దాల్చడం, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సహితం పోవడం జరుగుతుందని గమనించాలి. బయటి ఫుడ్‌ తింటే శాశ్వతంగా బయటకే వెళ్ల వచ్చని గుర్తుంచుకోవాలి. రెస్చారెంట్‌ ఫుడ్‌ తిని “రెస్ట్‌ ఇన్‌ పీస్‌” అనిపించుకోవచ్చుని మరిచి పోరాదు. 

ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన అసురక్షిత ఆహార సమస్య :

ఆహార భద్రత, పోషకాలు, ఆహార సురక్ష లాంటి అంశాలకు విడదీయరాని సంబంధం ఉంటుంది. ఐరాస గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట 600 మిలియన్ల(10 మందిలో ఒకరు) మంది బయటి ఆహారం తిని అనారోగ్యాలపాలు కావడంతో పాటు 4.2 లక్షల మంది మరణిస్తున్నట్లు తెలుస్తున్నది.  అసురక్షిత ఆహారం తిన్న తర్వాత వైద్య ఖర్చులకు ప్రతి ఏట 110 బిలియన్‌ డాలర్ల వ్యయం అవుతున్నది. కలుషిత ఆహారం తిన్న ఐదేళ్ల లోపు పిల్లలు 40 శాతం వ్యాధుల బారిన పడడం, 1.25 లక్షల మరణాలు నమోదు కావడం గమనించారు. అసురక్షిత ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధుల వ్యాప్తి జరిగి సాంఘీక ఆర్థిక అభివృద్ధి, ప్రజారోగ్య వ్యవస్థలు దెబ్బతినడంతో దేశ ఆర్థిక స్థితి, టూరిజమ్‌, వాణిజ్యం ప్రభావితం అవుతున్నాయి. 

అసురక్షిత ఆహారంతో 250 రకాల రోగాలు:

 హోటల్స్‌, రెస్టారెంట్లలో అసురక్షిత, కలుషిత, ప్యాకెట్‌ ఫుడ్, నిలువ ఉంచిన, కుళ్లి పోయిన ఆహారం, ప్రమాదకర రసాయనాలు కలిపిన ఆహారం తినడం వల్ల కడుపు నొప్పి, తిమ్మిర్లు, తలనొప్పి, శరీర నొప్పులు, కీళ్ల నొప్పులు,  వాంతులు, విపోచనాలు, జ్వరం, మలంలో రక్తం లేదా నిర్జలీకరణం జరుగవచ్చు. ఫుడ్‌ పాయిజనింగ్‌కు 250 కంటే ఎక్కువ బ్యాక్టీరియా, వైరస్‌, పరాన్నజీవులు కారణం కావచ్చు. 

ఇంటి వంటే అమృతాహారం:

 సురక్షిత ఆహార లభ్యత ఉత్పత్తిదారు, ప్రభుత్వం, వినియోగదారులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరు తినే ముందు ఆలోచించి ముద్దను మింగాలి. ఇంట్లో వండిన అమ్మ/ఆలి వంటలే అమృతాహారమని భావించాలి. బయటి ఆహారం తినడాన్ని నిషేధించాలి లేదా పూర్తిగా తగ్గించాలి. వీధి ఆహారానికి ఆమెడ దూరం జరగాలి. హోటల్స్‌, రెస్టరెంట్ల ఆహారం తీసుకోవడాన్ని కూడా తగ్గించాలి. కలుషిత ఆహారం తిన్న వెంటనే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. బయటి ఆహారం తిని బయటకే శవమై వెళ్లిపోవద్దు. రెస్టరెంట్‌ ఆహారాన్ని లొట్టలేసుకుంటూ తిని ప్రాణాల మీదకు తెచ్చు కోవద్దు. అమ్మ చేతి వంట అమృతంతో సమానం. ఇంట్లో పచ్చడి మెతుకులు తిన్నా ఆరోగ్యమే. బయట ఖరీదైన మాంసాహారం తిన్నా అనుమానమే. 

 వ్యక్తిగత శుభ్రత, పారిశుద్ధ్యం మన ఆరోగ్యానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. పానీ పూరీ, హోటర్‌ పూరి, బజారు మిరపకాయ బజ్జీ, స్ట్రీట్‌ ఫుడ్‌గా మాంసాహారం, రోడ్డు పక్కన టిఫిన్స్‌ తినడం లాంటి అలవాట్లను మానుకోవాలి. బయటి రుచులకు లొంగి మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా పాడు చేసుకోవద్దు. రెస్టారెంట్‌ ఫుడ్‌ తరుచుగా తింటే “రెస్ట్‌ ఇన్‌ పీస్‌” కావచ్చు. 

Show More
Back to top button