Telugu Special Stories

అణగారిన వర్గాలకు దిక్సూచి:’బాబు జగ్జీవన్ రామ్’!

52 ఏళ్లపాటు నిర్విరామంగా పార్లమెంటును ఏలిన మహా అనుభవశీలి.. రాజకీయ ఉద్దండులు..

చిన్నతనంలో ఎన్నో అవమానాలు.. చదువుకునేందుకు ఎన్నో ఆంటంకాలు.. 

అంత వివక్షను ఎదుర్కొంటూనే.. 

ఉపప్రధాని స్థాయికి రావడం..

ఆయనలోని అకుంఠిత దీక్ష, పట్టుదల, క్రమశిక్షణకు నిదర్శనాలు అయ్యాయి..

ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని కృషి గావించిన..

సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్‌ రామ్‌..

దళితుల హక్కులను చట్ట రూపంలోకి తీసుకొచ్చిన మహా మేధావి. అటువంటి బాబూజీ జయంతి(ఈ నెల 5న) సందర్భంగా ఆయన జీవిత, రాజకీయ, ఇతర విశేషాలను ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం:

జననం, విద్యాభ్యాసం

1908 ఏప్రిల్‌ 5న బిహార్‌లోని షాబాద్‌ జిల్లాలోని  చాంద్వా గ్రామంలో శోభిరామ్, బసంతిదేవిలకు జన్మించారు జగజ్జీవన్. ఆయన తండ్రి మొదట్లో బ్రిటిష్ ఆర్మీలో పనిచేసేవారు.. ఆ తరువాత కొన్నాళ్ళకు రాజీనామా చేసి, సొంతూర్లో పొలం కొని, అక్కడే కుటుంబంతో సహా స్థిరపడిపోయారు. వీరిది పెద్ద కుటుంబం. వీరిని అంటరాని వారీగా దూరం పెట్టేవాళ్ళు ఊరి జనం.. తన ఆరో ఏట నుంచి స్వగ్రామంలోనీ పాఠశాలలో చేరారు బాబుజీ. అదే సమయంలో ఆయన తండ్రి మరణించారు. అంతటి దుఖ పరిస్థితుల్లోనూ తల్లి పిల్లల్ని పాఠశాలకు పంపగలిగారు బసంతి దేవి.

మెట్రికులేషన్ విద్య చదువుతున్నప్పుడు.. ఆయన  కుల వివక్షను ఎదుర్కొన్నారు. చదువుతున్న పాఠశాలలో నీళ్ళు తాగేందుకు ముస్లింలకు, హిందువులకు అంటూ విడిగా వేర్వేరు నీటి కుండలు ఉండేవి. హిందువుల్లో… అగ్ర కులాలమని చెప్పుకునే పిల్లలు.. దళిత పిల్లలతో కలిసి మంచినీరు పంచుకోవడానికి ఇష్టపడకపోవడంతో.. ఆ స్కూల్ హెడ్ మాస్టారు దళితుల కోసం ప్రత్యేకించి మూడో కుండను ఏర్పాటు చేశారు. కానీ ఈ అవమానాన్ని, అస్పృశ్యతను సహించని బాబూజి మూడో కుండను పెట్టిన ప్రతిసారీ పగలకొట్టేవారట.

ఇన్ని అవమానాల మధ్య కూడా ఆయన చదువును ఎప్పుడు నిర్లక్ష్యం చేసేవారు కాదు..

అలానే ఆ యేడు మెట్రికులేషన్ ఫస్ట్ డివిజన్ లో పాసయ్యారు. 

సంస్కృతంలో ఆయనకున్న నైపుణ్యాన్ని గుర్తుంచిన పండిత్ మదన్ మోహన్ మాల్వియా.. పై చదువుల నిమిత్తం బనారస్ హిందూ యూనివర్సిటీకి ఆహ్వానించారు. కానీ ఇక్కడ కుల వివక్ష ఎక్కువ..

ఎంతలా అంటే ఆయన తినే కంచాన్ని పనివాళ్ళు కడిగేవారు కాదు. పైగా హెయిర్ కట్ కూడా లోకల్ బార్బర్ చేసేవాడు. ఈ అవమానాలు భరించలేక..

ఆయన హాస్టల్ నుంచి బయటకు వచ్చేశారు.

తర్వాత ఇంటర్ పరీక్షలు రాసి, కలకత్తా యూనివర్సిటీలో బీఎస్సీలో చేరారు. 

చదువుతూనే.. కుల వివక్షకు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం మొదలు పెట్టారు. నిజానికి ఆయన చిన్ననాటి నుంచి శాస్త్రవేత్త కావాలనుకున్నారు.. చుట్టూ అల్లుకున్న పరిస్థితులు.. పరిణామాల వల్ల ఆయన ఉద్యమ మార్గంలోకి నడిచారు.

సామాజిక చైతన్యం రగిలించి

అలా జగ్జీవన్‌‌‌‌‌‌‌‌ రామ్‌‌‌‌‌‌‌‌ కలకత్తాలో ఉన్నప్పుడే విల్లింగ్టన్‌‌‌‌‌‌‌‌ స్క్వేర్‌‌‌‌‌‌‌‌లో ముప్పైవేల మంది కార్మికులను కూడగట్టి భారీ ర్యాలీ నిర్వహించారంటే అతిశయోక్తి కాదు. దీంతో సుభాష్ ​చంద్రబోస్‌‌‌‌‌‌‌‌, చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌ ఆజాద్‌‌‌‌‌‌‌‌ వంటి  నాయకులను ఆకర్షించగలిగాడు.

కమ్యూనిస్టు మేనిఫెస్టో, పెట్టుబడిదారీ గ్రంథాలతోపాటు ఇతర సోషలిస్టు పుస్తకాల్ని కూడా అధ్యయనం చేశారు. కులరహిత, వర్గరహిత భావజాలం కలిగిన జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ ను ఇవి ఎంతగానో ప్రభావితం చేశాయి. దీంతో బ్రిటిష్‌‌‌‌‌‌‌‌ వలసవాద సంకెళ్లను తెంపి, దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం సాధించి, సామాజిక సమానత్వాన్ని నిర్మించాలని భావించేవారు.

అలా, 1934లో జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ కలకత్తాలో తొలిసారి అఖిల భారతీయ రవిదాస్‌‌‌‌‌‌‌‌ మహాసభను స్థాపించారు. దళితుల సాంస్కృతిక ‘కులగురు’ అయిన ‘గురు రవిదాస్‌‌‌‌‌‌‌‌’ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అనేక జిల్లాల్లో రవిదాస్‌‌‌‌‌‌‌‌ సమ్మేళనాలను సైతం చేపట్టారు. వ్యవసాయ కార్మిక మహాసభను, ఆలిండియా డిప్రెస్డ్‌‌‌‌‌‌‌‌ క్లాసెస్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ వంటి సంఘాలను నెలకొల్పారు. ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సాంఘిక సంస్కరణల కోసం కృషి చేశారు.

అదే ఏడాది.. బీహార్​లో వచ్చిన భయంకరమైన భూకంపం నేపథ్యంలో.. జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ ప్రజలకు సహాయ, పునరావాస చర్యలను చేపట్టారు. ఆహార సంక్షోభం సంభవించినప్పుడు హరిత విప్లవానికి నాంది పలికాడు.. తద్వారా ఆహారోత్పత్తిని పెంచి, దేశాన్ని సంక్షోభం నుంచి బయట పడేయగలిగాడు. ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రవేశపెట్టి, నిరుపేదల ఆకలి తీర్చేందుకు పరిష్కార మార్గాన్ని కనుగొన్నాడు. ఈ సందర్భంలోనే మొదటిసారిగా ఆయనకు గాంధీజీతో పరిచయం ఏర్పడింది.

1935లో కాన్పూర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన డిప్రెస్డ్‌‌‌‌‌‌‌‌ క్లాసెస్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌కు జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షత వహించగా.. ఆరు సంవత్సరాలు పాటు అధ్యక్షుడిగా ఆయనే కొనసాగారు. ఫలితంగా దేశంలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల హక్కుల అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి సలిపారు.

రాజకీయాల్లోకి

1936లో బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పొత్తుతో అణగారిన వర్గాల సమాఖ్య తరపున బరిలోకి దిగి, 14 మంది అభ్యర్థులను ఆయన గెలిపించాడు. జాతీయ దృక్పథంతో పనిచేస్తూనే దళిత బహుజనోద్ధరణకు పూనుకున్నారాయన.

రాజ్యాంగ రచనకై ఏర్పాటైన ‘రాజ్యాంగ సభ’ సభ్యు నిగా బిహార్‌ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. 1946లో కేంద్రంలో ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వంలో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా పనిచేశాడు. 

1947లో ఏర్పడ్డ ప్రభుత్వంలో కూడా మరోమారు ఇదే శాఖకు మంత్రి అయ్యాడు. 

కార్మికుల కోసం జాతీయ కమీషన్‌ను ఏర్పాటు చేసి జస్టిస్‌ గజేంద్ర ఘట్కర్‌ వంటి ఉద్దండ న్యాయమూర్తిని అధ్యక్షుడిగా నియమించాడు.

1969లో అప్పటి అధికార కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడయ్యారు.

1976లో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ హరిజన మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

1977లో ఇందిరాగాంధీ నియంతృత్వ విధానంతో ఆయన విభేదించారు. అనంతరం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీపై తిరుగుబాటు ప్రకటించి బయటకు వచ్చిన ఆయన ‘ప్రజాస్వామ్య కాంగ్రెస్‌‌(కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌ డెమోక్రసీ)’ అనే నూతన పార్టీకి శ్రీకారం చుట్టారు. తర్వాత దాన్ని జనతా పార్టీలో విలీనం చేశారు. 

కేంద్రంలో మొరార్జీ దేశాయ్‌‌‌‌‌‌‌‌ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో, జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ కేంద్ర రక్షణశాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. 

1979 జనవరిలో డిప్యూటీ ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. 

అప్పట్లో, దామోదరం సంజీవయ్యను ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌ ముఖ్యమంత్రిగా చేయడంలో జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. 

ఇలా వరుసగా 40ఏళ్ళు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై ప్రపంచస్థాయి రికార్డు సృష్టించారు. అదే క్రమంలో వివిధ మంత్రి పదవులను చేపట్టి నవ భారత నిర్మాణంలో ముఖ్యభూమిక పోషించారు. 

ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూ రెన్స్‌ ఫండ్‌ వంటి చట్టాల ద్వారా సామాజిక భద్రతకు బలమైన పునాదులు వేశాడనే చెప్పుకోవాలి. ఫ్యాక్టరీస్‌ చట్టం ద్వారా మహిళలు, బాలలు ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేయడాన్ని నిషేధించాడు. అంతేకాక కార్మికుల పనిగంటలు సైతం ఇన్ని గంటలని నిర్ధారించాడు. అదనపు పనికిగానూ అదనపు వేతనం చెల్లింపులకు శ్రీకారం చుట్టాడు. కాంట్రాక్ట్‌ లేబర్‌ విధానాన్ని సైతం ప్రవేశపెట్టాడు. రైల్వే మంత్రిగా చార్జిల పెంపు భారం పేదవాళ్ళపై పడకుండా నూతన సంస్కరణలు చేపట్టాడు.

స్వాతంత్య్ర పోరాటంలో..

క్విట్‌‌‌‌‌‌‌‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని, పాట్నాలోని ఆయన స్వగృహంలో అరెస్టు అయ్యారు.

1943 అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో బ్రిటీష్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ అణచివేతల్ని ఖండిస్తూ దేశ స్వాతంత్య్ర సాధన కోసం అనేక సభలు, సమావేశాలు, ర్యాలీలను విస్తృతంగా నిర్వహించారు.

1946 ఆగస్టు 30న, భారతదేశంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా బ్రిటీష్‌‌‌‌‌‌‌‌ వైశ్రాయ్ ఆహ్వానించిన పన్నెండుమంది దేశ నాయకుల జాబితాలో జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ ఒకరు.

అదే యేడు, సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌2న ఏర్పాటు చేసిన మధ్యంతర ప్రభుత్వంలో కార్మికశాఖ మంత్రిగా, అణగారిన సామాజికవర్గాలకు ఏకైక ప్రతినిధిగా ఆయన నిలిచారు. మంత్రిమండలిలో అతి పిన్న వయస్కుడైన జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ను అందరూ ‘బేబి మినిస్టర్‌‌‌‌‌‌‌‌’ అని పిలిచేవారట.

33ఏళ్లకు పైగా కేంద్ర కేబినెట్‌‌‌‌‌‌‌‌మంత్రిగా, దేశ ఉప ప్రధానమంత్రిగా డా. బాబూ జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ తీసుకున్న అసంఖ్యాక నిర్ణయాలు దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయనడంలో సందేహం లేదు.

ముఖ్యంగా కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖ మంత్రిగా ఆయన దేశంలోని ఆహార సమస్యల పరిష్కారం కోసం హరిత విప్లవానికి నాంది పలకడం విశేషం! వ్యవసాయ, రక్షణ, ఆరోగ్య, రైల్వేశాఖ మంత్రిగా,  ఉప ప్రధానిగా ఆయన సేవలు అనిర్వచనీయం…

సాహిత్య కృషి

జగ్జీవన్‌రామ్‌ గొప్ప అనుభవమున్న రచయిత అన్న సంగతి చాలామందికి తెలియదు కాబోలు… ఆయన హిందీ, ఆంగ్ల భాషల్లో పలు రచనలు చేశారు.

భారతదేశంలో కులం సవాళ్ళు, జీవన సరళి – వ్యక్తిత్వ వికాసం అను రెండు విశిష్ట గ్రంథాలను రాశారు. గొప్ప వక్త కూడా.. అధ్యయనశీలి. 

అంబేడ్కర్‌ వంటి మేధావి రాజ్యాంగ రచనా సంఘం బాధ్యతలు చేపట్టడంలో తనవంతు భాగస్వామ్యాన్ని కనబరిచారు.

గుర్తింపు

1967లో, ఉజ్జయినిలోని విక్రమ విశ్వవిద్యాలయం… జగ్జీవన్‌రామ్‌కి ‘డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌’ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. 

1968లో కాన్పూర్‌ విశ్వవిద్యాలయం జగ్జీవన్‌రామ్‌ సేవలకు గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. 

ప్రజలు జగ్జీవన్‌రామ్‌ ను ప్రేమగా ‘బాబూజీ’ అని పిలిచేవారు. 

అటువంటి బాబూజీ 1986 జూలై 6న పరమపదించారు. గొప్ప దార్శనికుడు, మహా నాయకుడైన ఆయనకు నివాళి అర్పిద్దాం.

Show More
Back to top button