ఆగస్టు 15 వచ్చిందంటే చాలు, ప్రతి ఇల్లు, స్కూళ్లు, వీధులు, ప్రభుత్వ కార్యాలయాలు.. ఇలా అడుగడుగునా జాతీయ జెండా రెపరెపలాడుతుంది. అంతటా భారతీయత సంతరించుకుంటుంది. ఎందరో సమరయోధులు
తమ ప్రాణాల్ని పణంగా పెట్టి సాధించుకున్న స్వతంత్ర భారతానికి నేటితో 78 వసంతాలు పూర్తయిన సందర్భంగా.. జాతీయ జెండాకు సంబంధించి ఆసక్తికర అంశాల గురుంచి ఈరోజు తెలుసుకుందాం…
భారతదేశం ఆశయాలకు, ఆదర్శాలకు ప్రతిరూపమే ఈ మువ్వన్నెల జెండా.. స్వతంత్ర జాతి ఉనికి నిదర్శనం.. జాతిశక్తికి ప్రతీక.. ఈ పతాకం..
స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దేశాలన్నింటికీ తమ త చూమ జాతీయ ధర్మాలను సూచించేందుకు విడిగా జాతీయ పతాకాలుంటాయి. ఎన్నో మహత్తర ఆశయాలకు, విజయాలకు సంకేతంగా ఒక త్రివర్ణ పతాకం ఏర్పడింది. నాటి నుంచి నేటి వరకు స్వతంత్ర భరతజాతి ఉనికిని చాటుతూ పయనం సాగిస్తోంది.
ఈ విధంగా ప్రతి దేశం తమ జాతీయ పతాకాన్ని గౌరవించడంలో కొన్ని నియమాలను పాటిస్తుంది. మన దేశం కూడా ఈ విషయంలో జాతి గౌరవ మర్యాదలకు అనుగుణంగానే జాతీయ పతాకాన్ని రూపుదిద్దుకుంది.
ఇకపోతే ‘ఫ్లాగ్ కోడ్ -ఇండియా’ ప్రకారం ప్రతి పౌరుడు పాటించాల్సిన వాటిల్లో కొన్ని..
*ప్రతి పౌరుడు జాతీయ పతాకాన్ని గౌరవించాలి. జాతీయ పతాకాన్ని ఎగురవేయడం, మెల్లిగా దించడం, అభివాదం చేయడం వంటి సాధారణ సంప్రదాయాలను తెలుసుకొని విధిగా పాటించాలి. *జాతీయ పతాకం పట్ల శ్రద్ధను చూపాలి. సందర్భోచితంగా, నిబంధనలను అనుసరించాలి. దానికి ఉపయోగించాల్సిన వస్త్రం విషయంలోనూ నిబంధనలను విధిగా పాటించాలి. ప్రత్యేకించి షాజహాన్‌పూర్ లో ఒక ఫ్యాక్టరీ జాతీయ పతాకాలను చట్టాలకు లోబడి తయారు చేస్తుంది.
*జాతీయ పతాకానికి ప్రతీ వస్త్రం పనికిరాదు. ఇందుకు ప్రత్యేకించి నూలు(పత్తి)ను రాట్నం మీద వడికి, చేతి మగ్గం మీద తయారుచేసిన శుద్ధ ఖద్దరు వస్త్రం కావాలి. ఆపై శాస్త్రీయ పద్ధతిలో రంగులు వేయాలి. తెలుపు రంగు మినహాయించి, మిగతా రెండు రంగులు రసాయనిక పరిశోధనలకు తట్టుకోగలిగేలా ఉండాలి. జెండా వస్త్రానికి కావలసిన రంగులు వేయడం కూడా నాణ్యత నిర్ధారణ సంఘం వారి గుర్తింపు పొందిన పరిశ్రమలలోనే జరుగుతుంది.
*జాతీయ పతాకంలో కనిపించే మూడు రంగుల పట్టీలు సమపరిమాణంలోనే ఉండాలి. పొడవు వెడల్పుల నిష్పత్తి 3:2గా ఉండటం.
*అత్యున్నత హోదా కలిగిన జాతీయ స్థావరాలు మొదలుకొని సాధారణ జిల్లాస్థాయి నిలయాలవరకు ఎగురవలసిన జాతీయ పతాకాలను ప్రభుత్వం వివిధ పరిమాణాల్లో డిజైన్ చేసి పెట్టింది. అవి 21 అడుగుల పొడవు,14 అడుగుల వెడల్పు గల పెద్ద పరిమాణం మొదలు 6 అంగుళాల పొడవు, 4 అంగుళాల వెడల్పు వరకు ఉంటాయి.
*జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే స్థలం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. అమర్యాదకర, అసభ్య వాతావరణం మధ్యన జెండా ఎగురవేయరాదు.
*సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు అన్ని రోజులలో జెండా ఎగురవచ్చు. ప్రత్యేక సందర్భాల్లో తప్ప రాత్రి సమయాల్లో జెండా ఎగురవేయరాదు.
*జెండాను ఆవిష్కరించేటప్పుడు వేగంగా లాగాలి. కిందకు దించేటప్పుడు నెమ్మదిగా, సవినయంగా దించాలి. ఎటువంటి తొందరపాటును ప్రదర్శించరాదు.
*జెండాను ఆవిష్కరించేవారు నేర చరిత్ర లేనివారై, అంకితభావం కలిగిన వారై ఉండాలి. జెండాను దించేటపుడు సైతం వారి కుడి భుజం వరకు వచ్చి ఆగాలి.
*జెండా ఎక్కడ ఎగురవేసిన కాషాయ రంగు పైకి, ఆకుపచ్చ రంగు కిందకి ఉండేలా చూడాలి. ఎట్టి పరిస్థితిలోనూ జెండా నేలను తాకరాదు. వేదికల మీద జాతీయ పతాకం ఉపన్యాసకుడికి కుడి వైపున పైకి ఉండాలి.
*వాహనాలకైతే ముందుభాగంపై ఎగిరేలా అమర్చాలి. ఊరేగింపులు, కవాతులు చేయవలసిన సందర్భాలలో జాతీయ పతాకంతో ఊరేగింపునకు కుడివైపు నడవాలి.
*చిరిగిపోయిన, రంధ్రాలు పడిన, మరకలు పడి మాసిపోయిన, వెలసిపోయిన, కొలతలు సరిగ్గా లేని జెండాలను అస్సలు వినియోగించరాదు. *శాస్త్రీయంగా తయారుచేసిన శుభ్రమైన పతాకాన్నే వినియోగించాలి. ఇతర పతాకాల కంటే జాతీయ పతాకం ఉన్నతంగా ఎగిరేలా చూడాలి. జాతీయ పతాకంపై పూలు, పూలమాలలు తదితర చిత్రాల చిహ్నాలేమీ అలంకరించకూడదు.
*పాతబడిన జెండాను సైతం ఇతర పనులకు వాడరాదు.
*ప్రభుత్వ లాంఛనాలతో, సైనిక లాంఛనాలతో జరిగే దహనక్రియల సందర్భంలో భౌతికకాయం దేహం మీద, శవపేటిక పైన గౌరవార్థం జాతీయ పతాకాన్ని కప్పవచ్చు. ఆ సమయంలో కాషాయం రంగు తల వైపు ఉండాలి. శవ దహనానికి ముందు పతాకాన్ని తొలగించాలి.
*జాతీయ పతాకంపై ఏమీ రాయకూడదు.
వ్యాపార ప్రకటనలకు జెండాను వినియోగించరాదు. ఎటువంటి ప్రకటనల గుర్తులను అంటించరాదు.
*ఉద్దేశపూర్వకంగా పతాకాన్ని అవమానించడం వంటి చర్యలకు పాల్పడితే ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్ టు నేషనల్ హానర్ యాక్ట్- 1971’ ప్రకారం శిక్షార్హులవుతారు.
*జాతీయ పతాకం శిథిలమైనపుడు మూలన పడవేయడం కూడా నేరమే. గౌరవప్రదంగా కాల్చివేయడం ఉత్తమం. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో పతాకావిష్కరణ, అభివందనం అనేవి తప్పకుండా జరపాలి.
◆ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ భవనాలపై భారత జాతీయ పతాకం నిత్యం ఎగురుతూ ఉండాలి. వీరంతా పర్యటనలో భాగంగా ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాతీయ పతాకం దించి ఉంచాలి. ఆ పర్యటనలలో వారి తాత్కాలిక స్థావరాల మీద పతాకాన్ని ప్రతిష్టిస్తారు. తిరిగి హెడ్ క్వార్టర్‌కు బయలుదేరగానే విడిది చేసిన ప్రదేశంలోని పతాకాన్ని దించేస్తారు. దీనర్థం ప్రముఖులు ఎక్కడికి వెళ్లినా జాతీయ పతాకం వారిని అనుసరిస్తూ ఉంటుందన్నమాట. ఇది మన జాతీయ సంప్రదాయం.
*ప్రముఖ వ్యక్తులు మరణించినప్పుడు జాతీయ పతాకాన్ని అవనతం చేయడం, అంటే సగం వరకు దించడం ఆనవాయితీ.
*ఇకపోతే అశోకచక్రం, ధర్మచక్రం.. ఇందులో 24 స్పోక్స్ ఉంటాయి. అశోక చక్రవర్తి కాలంలో తన రాజధాని సారనాథ్ లోని అశోక స్తంభంపై ఈ చక్రాన్ని వేయించాడు. తర్వాతి కాలంలో అశోకచక్రం, మన జాతీయ పతాకంలో చేరింది. తిరిగి 1947 జూలై 22న జాతీయ పతాకంలో పొందుపరిచారు.
ఈ అశోకచక్రం తెల్లని బ్యాక్ గ్రౌండ్ తో, ‘నీలి ఊదా’ రంగులో ఉంటుంది. ప్రఖ్యాత ‘సాండ్ స్టోన్’(ఇసుకరాయి)తో చెక్కిన ‘నాలుగు సింహాల’ చిహ్నం. సారనాథ్ సంగ్రహాలయంలో ఉంది. ఇది అశోక స్తంభం పైభాగాన కనిపిస్తుంది. భారత ప్రభుత్వం దీనిని తన అధికారిక చిహ్నంగా గుర్తించింది.
◆ ఈ అశోకచక్రం, అశోకుడి కాలంలో నిర్మితమైంది. ‘చక్ర’ అనేది సంస్కృత పదం, స్వయంగా తిరుగుతూ, కాలచక్రంలా తన చలనాన్ని పూర్తిచేసి మళ్ళీ తన గమనాన్ని ప్రారంభించేదని అర్థం. ‘గుర్రం’ కచ్చితత్వానికి, ‘ఎద్దు’ కృషికి చిహ్నాలు.
ఈ చక్రంలో గల 24 స్పోక్స్, 24 భావాలను సూచిస్తాయి..
అవి.. ప్రేమ, ధైర్యం, సహనం, శాంతి, కరుణ, మంచి, విశ్వాసం, మృదుస్వభావం, సంయమనం, త్యాగనిరతి, ఆత్మార్పణ, నిజాయతీ, సచ్ఛీలత, న్యాయం, దయ, హుందాతనం, వినమ్రత, దయ, జాలి, దివ్యజ్ఞానం, ఈశ్వర జ్ఞానం, దైవనీతి (దివ్యనీతి), దైవభీతి(దైవభక్తి), దైవంపై ఆశ/ నమ్మకం/ విశ్వాసం.
ఇంకా ఈ 24 స్పోక్స్, 24 గంటలు భారత ప్రగతిని సూచిస్తాయి.