Telugu News

ఇప్పటికే అభివృద్ధికాని దేశం..! కారణం మనమేనా?

ఆగస్టు 15 కేవలం ఒక సెలవు రోజు మాత్రమే కాదు. ఎంతో మంది ప్రాణ త్యాగాలకు ప్రతిరూపం. ఈరోజుకు మన భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి సరిగ్గా 77 సంవత్సరాలు. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం మన ముందుతరాల వారు మనకిచ్చిన బహుమతి. బ్రిటిష్ పాలన నుంచి వీరుల త్యాగాల వల్ల స్వాతంత్య్రం పొందిన మన భారతదేశ చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎంతో మంది రాజులు పరిపాలించిన భూమి మన భారతదేశం. తర్వాత బ్రిటిష్ వారు వ్యాపార నిమిత్తం మన దేశానికి వచ్చారు. మెల్లగా వారి అధికారాన్ని విస్తీర్ణం చేశారు. అలా ఇండియా.. వారి చేతుల్లోకి వెళ్లాక దాదాపు 180 సంవత్సరాలు పాలించారు. ఈ సమయంలో ఎన్నో పన్నాగాలు పన్ని భారతీయులను అణచివేశారు.
 
ఇప్పటికీ అభివృద్ధి కాని దేశం
 
మనకు ఆహారం కావాలంటే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే రోజులివి. ఇంత సులువుగా దొరికే ఆహారం స్వాతంత్య్రం రాక ముందు ఒక గమ్యంలా ఉండేది. ఎంతో కష్టపడి పండించిన ధాన్యం నోటి దాకా కాదు.. ఇంటి గడపకు కూడా చేరేది కాదు. భారతదేశంలో భారతీయులను అణచివేసి బానిసలుగా చేశారు బ్రిటిష్ వారు. మన దేశంలో ఉన్న సంపదను వారి పేరున మార్చుకున్నారు. అందులో కోహినూర్ వజ్రం ఒకటి. ఇలా దొరికింది దొరికినట్లు దోచుకోవడం వల్ల ప్రపంచంలో ధనిక దేశాల్లో ఉండాల్సిన ఇండియా పేరు.. ఇప్పటికీ అభివృద్ధి కాని దేశంగా నిలిచింది.
 
భారత్‌కు స్వాతంత్య్రం ఎలా వచ్చింది..?

“స్వరాజ్యం నా జన్మ హక్కు… దాన్ని సాధించి తీరుతాను” అంటూ స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంలో “స్వరాజ్య” వాదాన్ని వినిపించారు జాతీయవాది బాలగంగాధర తిలక్. భారతీయ సంస్కృతిని, చరిత్రను, విలువలను కించపరుస్తున్న బ్రిటిష్ విద్యా వ్యవస్థను తిలక్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనతో పాటు స్వాతంత్య్రం సాధించడానికి మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుఖ్‌దేవ్.. ఇలా ఎంతో మంది స్వాతంత్య్ర యోధులు త్యాగాలు చేసిన భూమి ఇది. చివరకు 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం వచ్చింది. ఇలా సమరయోధులు తమ బాధ్యతను పూర్తి చేశారు. స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తి అయినా.. ఇండియా అనుకున్నంత అభివృద్ధి సాధించలేకపోయినా… ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న దేశంగా భారత్ నిలిచింది.
 
దేశ అభివృద్ధిని మనమే ఆపుతున్నామా..?

భారతీయులంతా ఒక్కటిగా, ఐకమత్యంతో ఉండాలని స్వాతంత్య్ర యోధులు ఎంతో కష్టపడి స్వాతంత్య్రం తీసుకువచ్చారు. కానీ మనం అలా ఉంటున్నామా..? భారతదేశంలో ఇప్పటికీ కుల, మత, ప్రాంతాల పేరుతో అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. అర్ధరాత్రి 12 గంటలకు అమ్మాయి బయట తిరిగినప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అని గాంధీ చెప్పారు. కానీ, ప్రస్తుతం చూసుకుంటే రాత్రి పూట కాదు.. అసలు ఆడవారు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. మానభంగం గురించి రోజుకు ఒక వార్తైనా మనం వింటున్నాం. అంటే, మనకు ఇంకా స్వాతంత్య్రం రాలేదా..? మనమే రానివ్వడం లేదా..? ఎందరో ప్రాణత్యాగ ఫలితమే మన స్వాతంత్య్రం.. దాన్ని అంతే పదిలంగా ఉంచుకుందాం. ఐకమత్యము పెంచుకుంటూ.. దేశాభివృద్ధికి తోడ్పడుదాం. ఒకరిని మరొకరు గౌరవిస్తూ దేశంలో శాంతిభద్రతలు కాపాడుకుందాం. జై హింద్..!

Show More
Back to top button